🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 79*
అంతవరకూ నాలుగుదిక్కులా శత్రు సైన్యాలను ఎదిరించి పోరాడుతున్న మగధ సైన్యాలలో ఏదో తిరగబాటు జరిగినట్లు కోట లోపలినుంచే మాగధులపై మాగధులే వెనకనుంచి దాడి చేశారు.
అప్పటివరకూ జరిగిన యుద్ధంలో అటు నందులకి అనుకూలురైన సైనికులూ, ఇటు పర్వతక అనుకూలురైన సైన్యాలూ దాదాపుగా నాశనమయ్యాక ... లోపల నుంచి వెనకదాడి చేసిన మాగధులు మిగిలిన నందానుకూల సైన్యాన్ని ఊచకోత కోస్తూ దారిచేస్తూ "జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌములకు... జయ... జయ..." అంటూ పెద్దపెట్టున జయ జయ ధ్వనాలు చెయ్యసాగారు.
అంతవరకూ అసాధ్యమనిపించిన మార్గం శులభసాధ్యమై చంద్రగుప్తుని సేనలు అన్ని మార్గాలలో నుంచీ కోటలోనికి జోరబడ్డాయి. కానీ అప్పటికే నందానుకూలులందరూ నశించి పోవడం చేత చంద్రుని సేనాసమూహాలను ప్రతిఘటించే వారే లేకపోయారు. భద్రభట, బాగురాయణాది ముఖ్యులంతా ఓటమిని అంగీకరిస్తూ శ్వేత పతాకాలు ధరించి చంద్రుని సేనలకు స్వాగతం పలికారు.
అప్పటివరకూ బీరాలు పలుకుతూ అహంకారంతో ప్రవర్తించిన నందులు ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యేసరికి జీవసిద్ధిని ఆశ్రయించడానికి పరుగులు తీశారు. చంద్రగుప్తుడు అశ్వారూడుడై వాళ్ళని వెంబడించాడు.
నందులు ఎనమండ్రుగురిని మార్గమధ్యంలోనే ప్రతిఘటించాడు చంద్రగుప్తుడు. తన కన్న తండ్రికి నందులు చేసిన ద్రోహాన్ని గుర్తుకు తెచ్చుకొని వీరావేశంతో విజృంభించిన చంద్రగుప్తుడు నందులను వెంటాడి, వేటాడి యాగశాల వద్ద ఒక్కొక్క వ్రేటుకి ఒక్కొక్క నందుడి తలనరికి వేశాడు.
ఎనమండ్రుగురు నందుల శిరస్సులూ బంతుల్లా ఎగురుతూ వెళ్లి హోమాగ్రిలో పడి భగభగ మాడి మసైపోతుంటే .... ఆనాటి మహానందుల వారి కల్పిత అగ్ని ప్రమాద మరణానికి ప్రతీకారం తీర్చుకున్న చంద్రగుప్తుడు సంబరంతో చిందులు త్రొక్కుతూ ... "అమ్మా... పగ తీర్చుకున్నాను... తండ్రిగారి దుర్మరణానికి కారకులైన దుష్టనందుల మీద పగతీర్చుకున్నాను. తల్లీ... పగతీర్చుకున్నాను...." అంటూ ఆనందంతో పోలికేకలు పెట్టాడు.
సరిగ్గా అప్పుడే అక్కడికి పరిగెత్తుకువచ్చిన రాక్షసమాత్యుడు హోమగుండంలో కాలి పెటపెట లాడుతూ కపాలమోక్షమవుతున్న నందుల శిరస్సుల ద్వంస దృశ్యాన్ని చూస్తూ మ్రాన్పడిపోయాడు.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి