వేదాలపై దాడి:
మీడియా చెప్పేవన్నీ సత్యాలేనా? సత్యాలేనని మనలో చాలా మంది విశ్వసిస్తుంటారు. వారు పొరపడుతున్నారని చెప్పక తప్పదు. ఆరోగ్యానికి హానికరమైన ఆహారాల ఉత్పత్తిదారులు తమ వ్యాపార లబ్ధికి మీడియాను ఉపయోగించుకోవడం కద్దు. మానవులకు మోనోసోడియం గ్లటమేట్ (అజనమోటో ఉప్పు) హానికరమైనది కాదని ఇటీవల పుంఖాను పుంఖంగా వెలువడిన వ్యాసాలే ఇందుకొక ఉదాహరణ. జంతువుల రక్షణకు ఏదైనా చట్టాన్ని చేసినప్పుడు మీడియా పాక్షికత మరింత స్పష్టంగా కన్పిస్తుంది.
సొర చేపల వేటపై నిషేధాన్ని విధించినప్పుడు ఆ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాసాలు వెలువడ్డాయి. ఒక విదేశీ షార్క్ ఫిన్ ట్రావలర్ కంపెనీ ప్రజాసంబంధాల విభాగమే ఆ వ్యాసాలకు మూల కర్త అని తేలింది. అదే విధంగా ఇటీవల మహారాష్ట్రలో పశువుల వధపై నిషేధం విధించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. మాంసాన్ని చట్ట విరుద్ధంగా ఎగుమతిచేసే వ్యాపారులు, చట్ట విరుద్ధ కబేళాల యజమానులు, రవాణాదారులు మొదలైనవారు ఎందరో ఈ నిషేధాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ‘లౌకికవాదులు’ అనబడే వింత మనుషులు కొంతమంది వారికి తోడయ్యారు. తమకు ప్రచారం లభిస్తుందనుకుంటే ఈ ‘లౌకిక వాదులు’ ఏ అంశం పైన అయినా ఆందోళనకు దిగుతారు.
చిత్రమేమిటంటే గోవధ విషయంపైన మాత్రమే వీరు లౌకికవాదులు : ఏ జంతువునైనా రక్షించడానికి ఎవరైనా ఎటువంటి ప్రయత్నం చేసినా వారిపై ఈ లౌకికవాదులు ‘హిందువులు’ అనే ముద్ర వేస్తారు. వారి వాదనలు: (అ) తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ప్రతి ఒక్కరినీ అనుమతించాలి; (ఆ) హిందువులు సదా గొడ్డు మాంసాన్ని తింటారు. వేదాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ రెండో వాదనలోని నిజానిజాలను నిశితంగా పరిశీలించడమే ఈ వ్యాస లక్ష్యం.
హిందువులు గొడ్డుమాంసాన్ని తింటారని, బ్రాహ్మణులు యజ్ఞాలు, మత సంబంధ కర్మకాండల్లో జంతువులను చంపుతారని పలువురు పండితులు రాశారు. ఈ ‘పండితులు’ తమ వాదనలను సమర్థించుకోవడానికి వేద సాహిత్యానికి పాశ్చాత్య విద్వజ్ఞులు చేసిన అనువాదాల నుంచి సందర్భ శుద్ధి లేకుండా ఉటంకింపులు చేస్తుంటారు. ప్రాచీన మత గ్రంథాలకు వారు చెప్పుతున్న భాష్యాలను ఎవరూ ప్రశ్నించడం లేదు. వేదాలకు మధ్యయుగాలలో మహీధరుడు, ఉవతుడు, సాయనుడు రాసిన భాష్యాలు, వేదాల పేరిట వామ మార్గీయులు, తాంత్రికులు ప్రచారం చేసిన భావాల ఆధారంగా ఈ ‘పండితులు’ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సంస్కృత భాష, ఈ పుణ్య భూమి పురాతన ప్రజల గురించి సమగ్ర అవగాహన లేని పాశ్చాత్య పండితులు వేదాలను అనువదించే పేరిట మధ్యయుగాల మహా పండితుల భాష్యాలకూ తప్పుడు అర్థాలు చెప్పారు. వేదాలపై ఈ దాడుల విషయమై శ్రీవర్ధమాన్ పరివార్, అఖిల భారతీయ కృషి గో సేవా సంఘ్‌లు లోతైన పరిశోధన చేసాయి. ఆ పరిశోధనా ఫలితాలు కొన్నిటిని వివరిస్తాను.
గౌర్మే మాతా వృషభః పితామే దివం షర్మ జగతి మే పతిష్ఠాః’ (ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి. ఈ నెండూ నాకు స్వర్గాన్ని, భూలోక సౌఖ్యాలను ప్రసాదించాయి. ఆవు నా జీవితానికి వెన్నెముక’). వేదాల ప్రకారం చేసే యజ్ఞాలలో జంతు బలులు చాలా సామాన్యమనే ఆరో పణను మొదట చూద్దాం. యజ్ఞ అనే పదం ‘యజ్’ అనే ధాతువు నుంచి వచ్చింది. ‘యజ్’కు మూడు అర్థాలు ఉన్నాయి. అవి: దేవపూజ (చుట్టూ ఉన్న ప్రాణులు, ప్రకృతి పట్ల సరిగా వ్యవహరించడం దైవా న్ని పూజించడం, తల్లితండ్రులు, పూర్వీకులను గౌరవించడం, పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడం మొదలైనవి); సంఘటికారణ్ (ఐక్యత), దాన్ (దాన ధర్మాలు). ఇవి మానవుల ప్రాథమిక విధులు. వేదాలలోనే కాక, ప్రాచీన భారతీయ సాహిత్యమంతటా యజ్ఞంకు ప్రాధాన్యమిచ్చారు. యజ్ఞానికి, జంతువులను చంపడానికి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి నిరుక్తం (యాస్కుడు రాసిన వైదికపదాల వివరణ గ్రంథం)లో యజ్ఞ అంటే అధ్వర అనే అర్థం ఉంది. ధ్వరం అంటే హింస. కనుక యజ్ఞంలో హింస నిషిద్ధం. మరింత స్పష్టంగా చెప్పాలంటే భౌతిక, మానసిక, వాక్ పూర్వక హింస యజ్ఞంలో పూర్తి గా నిషిద్ధం. వేదాలలోని చాలా మంత్రాలలో యజ్ఞ అని సూచించే అర్థంలోనే అధ్వరం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది.
మరి అశ్వమేధ, నరమేధ, అజమేధ, గో మేధ యజ్ఞాల విషయమేమిటని మన గోమాంస ప్రియులు, గొడ్డు మాంస ఎగుమతిదారులు, లౌకిక వాదులు ప్రశ్నిస్తారు. మేధ అంటే అంటే చంపడమని, వేదాలు నరమేధం (మానవులను హతమార్చడం) గురించి కూడా ప్రస్తావిస్తున్నాయని వారు అంటారు. మేధ అనేపదానికి చంపడం అనే అర్థం చేసుకోవల్సిన అవసరం లేదు. మేధ(తెలివి)తో చేసిన పనిని ఆ పదం తెలియజేస్తుంది. యజ్ఞాలు అధర్వ లేదా అహింసాత్మకమైనవి అయితే మేధను హింసగా భావించడమేమిటి? తెలివైన వ్యక్తినిమేధావి అంటారు. చాలామంది బాలలకు మేధ అని నామకరణం చేసారు కదా. మరి వారు హింసాపరులు లేదా తెలివైన వారని అర్థమా? రాజ్యం లేదా సామ్రాజ్యం యశస్సు, ప్రజలశ్రేయస్సుకు చేసే యజ్ఞాన్ని అశ్వమేధ యజ్ఞం అంటారు. ఆహారాన్ని స్వచ్ఛంగా, ఇంద్రియాలను అదుపులో ఉంచడానికి, సూర్యకాంతిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి, ధరిత్రిని కాలుష్య రహితంగా ఉంచడానికి గోమేధ యజ్ఞం చేస్తారు. గౌ అంటే భూమి అని కూడా అర్థం. భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి చేసే యజ్ఞం గో మేధ యజ్ఞం.
వేదాలలో నిర్దేశించిన విధంగా చనిపోయిన వ్యక్తి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించడాన్ని నరమేధ యజ్ఞం అంటారు. అజ అంటే ధాన్యం అని అర్థం. వ్యవసాయక దిగుబడులను పెంపొందించడానికి చేసే యజ్ఞాన్ని అజమేధ యజ్ఞం అంటారు.
యజుర్వేదంలోని 24.29 మంత్రం ‘హస్తిన ఆలంభతే’ అంటుంది. అంటే దానర్థం ఏనుగులను బలి ఇవ్వడమా? ఆలంభ అనే పదం లాభ అనే ధాతువు నుంచి వచ్చింది. దీనర్థం బలి లేదా హతమార్చడం అనికాదు. లాభ అంటే సంపాదించడం లేదా గడించడం అని అర్థం. హస్తిన అంటే ఏనుగు అనే కాక చాలా లోతైన అర్థం ఉంది. ఈ మంత్రంలోని హస్తినను ఏనుగు అని చెప్పుకుంటే దానర్థం రాజ్యరక్షణకు రాజు ఏనుగులను సమకూర్చుకోవాలని. ఆలంభ అనే పదాన్ని సంపాదించడం లేదా గడించడం అనే అర్థంలో చాలాచోట్ల వాడారు. వేద మంత్రాలను సరిగా అర్థం చేసుకోకుండా ఆ పవిత్ర గ్రంథాలపై దాడి చేయడం సరికాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి