23, మే 2024, గురువారం

వైశాఖ పురాణం - 15 16

: వైశాఖ పురాణం - 15


15వ అధ్యాయము - అశూన్య శయనవ్రతము


నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను.


అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును?


శ్రావణమాసమున శుద్దవిదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమీయవలెను. బంగారు/వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.


తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము అను మాసములందు శ్రీహరిని/రుక్మిణీ సహితముగ యెఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ యందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.


మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ, హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను, శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణప్రతిమను మార్గశీర్షాదిమాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.


లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన


శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ


అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై యున్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.


ఈ వ్రతమును, భార్యలేని పురుషుడును, విధవాస్త్రీయును, దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన యనుగ్రహమునంది జనులందరును ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై యుందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.


శ్రుతకీర్తి మహారాజు మహామునీ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.


వైశాఖపురాణం 15వ అధ్యాయం సమాప్తం.


ఓం నమో నారాయణాయ *వైశాఖ_పురాణం__16_వ_అధ్యాయము*


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


*యముని_పరాజయము*


అప్పుడు నారద మహర్షి యమలోకము నకు వెళ్లెను. యమలోక స్థితిని జూచెను.. యమధర్మరాజా..! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుట మాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను.


 నారద మహర్షీ..! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖ వ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో, దండన భయముననో తప్పక వైశాఖ మాస వ్రతమును, ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణు లోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవరును లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలె నుంటిని. నాకు యిట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును.. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసిన దేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమ దండమును ధరించి భీకరులగు యేబది కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజు నెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తి హీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును, దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రము నిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును, విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చి యుండెను. మూర్తములు, అమూర్తములు నగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపము కల, ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖ దుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వ రజ స్తమో గుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువు లోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోని వారు క్షణమైన తీరిక యుండని యితడిక్కడి కెందులకు వచ్చెను. తల వంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోని వారు విస్మయ పడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాప పుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలో నున్న భూతములు, దేవతలు ఆశ్చర్య పడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను.. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవము నందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టి వేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాప పరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా యని సభలోని వారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పని నిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము..? నీవెందులకు వచ్చితివి..? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు 'అయ్యో' అని అతి దీనముగ బలికెను.


#వైశాఖ_పురాణం పదహారవ అధ్యాయము సంపూర్ణము...

కామెంట్‌లు లేవు: