23, మే 2024, గురువారం

పిడికిట తలంబ్రాల

 ---ఓం నమో వేంకటేశాయ---

         పిడికిట తలంబ్రాల 

 

అన్నమయ్య రాసినన్ని పెళ్ళిపాటలు మరే వాగ్గేయకారుడు రాయలేదు.ఆ కాలం నాటి పెళ్ళిళ్ళలోని ఆచార వ్యవహారాలు, పెళ్ళితంతు,పెళ్ళిపీటల మీద వధూవరుల దొంగ చూపులు,ముసిముసి నవ్వులు,ముచ్చటలు అన్నీ అక్షర బద్దం చేశాడు అన్నమయ్య!

అన్నమయ్య పెళ్ళి పాటలలో తొలి తాంబూలం 'పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు' పాటకే ఇవ్వాలి.


పెళ్ళి మాటలు ,నిశ్చయ తాంబూలం, పెళ్ళికి వచ్చిన పెద్దలు వేసే అక్షతలతో సహితం వదలకుండా రాసాడు అన్నమయ్య! పెళ్ళికి వచ్చిన వారందరూ ఎంతో ముచ్చటగా చూసే సన్నివేశం తలంబ్రాలు.వధూవరులిద్దరూ వారి జీవితాలలో అడుగు పెట్టేముందు ఆ ఇద్దరిలో సహజంగా ఉండే బెరుకు పోగొట్టేటందుకు జరిపించే ప్రక్రియే అక్షతారోపణము.దీనినే వాడుకలో 'తలంబ్రాలు' అని పిలుస్తాము.శాస్త్రం ఈ తలంబ్రాల విశిష్టతను వర్ణించింది.

అన్నమయ్య ఆ విశిష్టతను కాసేపు పక్కన పెట్టి అప్పటి వధువు మానసిక స్థితిని వర్ణిస్తున్నాడు.


'పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత

పెడమరలి నవ్వీనె పెండ్లికూతురు '


పెళ్ళి పీటల మీద

కూర్చున్నప్పటినుండీ సిగ్గుతో తలదించుకుని కూర్చున్న పెళ్ళికూతురు తలంబ్రాలు పోసుకునే వేళకు మాత్రం ముఖాన్ని పక్కకు తిప్పుకుని దోరగా నవ్వుకుంటోందట!తన మగనితో తొలి సాన్నిహిత్యమిది.మగడు తాను ఎదురెదురుగా మధ్యలో అడ్డుతెరలేకుండా

కూర్చుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ సన్నిహితంగా మెలిగే తొలి అవకాశం! ఎద-తనువు పులకిస్తుంటే తన పురుషుడిని  దగ్గరగా చూడబోతున్నాననే ఆతురత.పులకింతలు దొంతరలై తరుముకొస్తుంటే అవి కేరింతల వెల్లువలవుతాయేమో అనే ఆతురతతో కొద్దిగా పక్కగా తిరిగి నవ్వుకుంటోందట తల్లి.


'పేరుకల జవరాలే పెండ్లికూతురు పెద్ద

పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు 

పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు

పేరుపుచ్చ సిగ్గుపడీ పెండ్లికూతురు'


ఇక్కడ పెళ్ళి కూతురు ఆ దేశపు మహారాజు కూతురు.ఆమె ఎంతో పేరున్న పడతి.ఆమే ఓ పులుకడిగిన ముత్యం! దానికి తోడు పెద్ద పేరుల(పేరు అంటే ముత్యము అని అర్ధముంది) దండలను మెడనిండా ధరించింది.ఇంకా తలంబ్రాలను చేతికివ్వలేదు. మధ్యమధ్యలో పేరంటాళ్ళు నీమెగుడి పేరేమిటమ్మా అని మేలమాడుతున్నారట. మగనిపేరు చెప్పటానికి సిగ్గు పడుతోందట తల్లి!


'పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతురు నేడె

పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు '


సాధారణంగా పెళ్ళిళ్ళలలో మహిళలు ఎక్కువగా చీరలు మారుస్తుంటారని అంటుంటాం. పెళ్ళికూతురు తన పెట్టెలో ఉన్న చీరలన్నీ కట్టేసిందట!

అంటే అన్నమయ్యనాటికే ఈ అలవాటు ఉందన్నమాట!!

ఆ పెళ్ళికూతురు ఎక్కడుంది?


'గట్టిగ వేంకటపతి కౌగిటను వడి

వెట్టిన నిధానమైన పెండ్లికూతురు '


ఈ పెండ్లికూతురు వేంకటపతి కౌగిట ఒదిగిన నిధి అట.

అమ్మ ఎవరన్నది ఒక్క మాటలో తేల్చేశాడు! వేంకటేశుని హృదయంలో నెలవైన సంపదల మూలమైన లక్ష్మీదేవే ఈ తల్లి అని చెప్పాడు.

ఆతల్లి చేతనున్న తలంబ్రాల ను శరస్సున ధరించిన శ్రీనివాసుడు మనలనందరను రక్షించు గాక!!!


రేపు మరో సంకీర్తనంతో .........  

మీ... రెడ్డప్ప ధవేజి

కామెంట్‌లు లేవు: