23, మే 2024, గురువారం

_బుద్ధ పూర్ణిమ_

 *_బుద్ధ పూర్ణిమ_*


*బుద్ధుని జీవితంలో ప్రాముఖ్యత వహించిన వైశాఖ పౌర్ణమి*


ఆలోచనాపరులు , మానవ జాతి నాయకులు , జంతు జాలం , వృక్ష జాతి , ఖనిజ సంపద...ఈ నాలుగు జాతులు భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తాయి. అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో మహా వైశాఖిగా , తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగానూ ప్రసిద్ధిగాంచింది.

 

వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. 

ఈరోజున ఏ ఆధ్యాత్మిక సాధనలు చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. 

గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది.

మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది.


బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. 

కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. 

మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. 

వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. 

తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు.


గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది.

బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు.

 దీనిని గమనించి బేతవన విహారదాత అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. 

అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు.


శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. 

తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. 

అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు.

 గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు...

అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు.


వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ

ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది.

బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది.

ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు.

హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది.


రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. 

రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు.


నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి,

అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. 

దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. 

అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే *‘వట సావిత్రి’* మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం ఛాయవే అని అంటారు.


               *_🍁శుభమస్తు.🍁_*

 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

కామెంట్‌లు లేవు: