ॐ శంకర జయంతి ప్రత్యేకం
( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
భాగం 10/10
9. మహావాక్య చతుష్టయము
(నాలుగు మహా వాక్యాలు)
నాలుగు వేదాలకి సంబంధించి, నాలుగు ఉపనిషత్తులనూ కలుపుకొని, అద్వైతానికి సంబంధించి, నాలుగు మహావాక్యాలు శంకరభగవత్పాదులు వెలికి తీశారు. అవి
1."ప్రజ్ఞానం బ్రహ్మ"
{ఋగ్వేదము, ఐతరేయోపనిషత్తు, లక్షణ(విధి) వాక్యము}
దీని భావము
"సర్వమును తెలియు ప్రజ్ఞయే బ్రహ్మము"
వివరణ
అ) పురుషుడు ఏ చైతన్యముతోనైతే,
- చూచుటకు యోగ్యమైన ఈ రూపాదికమును చూచుచున్నాడో,
- శబ్దములను వినుచున్నాడో,
- గంధమును ఆఘ్రాణించుచున్నాడో,
- శబ్ద సమూహమును ఉచ్చరించుచు వ్యవహరించుచున్నాడో,
- రుచులను ఎఱుగుచున్నాడో,
ఆ చైతన్యమే "ప్రజ్ఞానము" అని చెప్పబడుచున్నది.
"యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ I
స్వాద్వస్వాదూ విజానాతి తత్ప్రజ్ఞానముదీరితమ్ ॥"
ఆ) బ్రహ్మదేవునియందును,
దేవేంద్రాది దేవతలయందును,
మనుష్యులందును,
అశ్వము గోవు మొదలగువానియందునుగల ఒక్కటియగు చైతన్యమే బ్రహ్మమవుతుంది.
ఆ కారణాలవల్ల నా దేహమందు గల ప్రజ్ఞానము కూడా బ్రహ్మమే అవుతుంది.
"చతుర్ముఖేన్ద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు I
చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి॥"
2."అహం బ్రహ్మాఽస్మి"
{ యజుర్వేదము, బృహదారణ్యకోపనిషత్తు, అనుభవ వాక్యము}
దీని భావము
"నేను బ్రహ్మమైతిని"
వివరణ
అ) పరిచ్ఛిన్నత్వములేని పరమాత్మ ఈ మాయాకల్పితమైన జగత్తునందు,
జ్ఞానసంపాదమునకు యోగ్యమైనట్టి వేదాంత శ్రవణాద్యనుష్ఠానవంతమగు ఈ మనుష్య శరీరమందు
బుద్ధికి సాక్షిగా నిర్వికారముగా ప్రకాశించుచుండి, (లక్షణావృత్తిచేత) "అహం" అనెడి పదంచే "నేను" అని చెప్పబడుచున్నాడు.
"పరిపూర్ణః పరాత్మాఽస్మిన్ దేహే విద్యాధికారిణి I
బుద్ధేస్సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే॥"
ఆ) స్వాభావికముగా అపరిచ్ఛిన్నుడగు పూర్వోక్తపరమాత్మ ఈ మహావాక్యమందు బ్రహ్మమనెడి పదముచేత లక్షణావృత్తిచే చెప్పబడుచున్నాడు.
"అస్మి" "ఇతి" అనే పదం ఏకత్వాన్ని(జీవ బ్రహ్మైక్యాన్ని) తెలిపేదవుతుంది.
అందుచేత నేను బ్రహ్మమునే అగుచున్నాను.
"స్వతః పూర్ణః పరాత్మాఽత్ర బ్రహ్మశబ్దేన వర్ణితః I
అస్మీత్యైక్యపరామర్శస్తేన బ్రహ్మ భవామ్యహమ్ ॥"
3."తత్త్వమసి"
{సామవేదము, ఛాందోగ్యోపనిషత్తు, ఉపదేశవాక్యము}
దీని భావము
"నీవు ఆ పరబ్రహ్మము అయితివి"
వివరము
అ) సృష్టికి పూర్వము నామరూపములు లేనిదియు,
రెండవది లేనట్టిదియు,
ఏకమునగు ఏ సద్వస్తువు ప్రతిపాదింపబడి యున్నదో,
ఆ సద్వస్తువునకు ఇప్పుడును(సృష్ట్యుత్తరకా మందును) విచారదృష్టిచే అట్టి స్వభావమే "సత్" (అది) అనే పదముచేత, (లక్షణావృత్తిచే) చెప్పబడుచున్నది.
"ఏకమేవాద్వితీయం సన్నామరూపవివర్జితమ్ I
సృష్టేః పురాఽధునాఽప్యస్య తాదృక్త్వం తదితీర్యతే॥"
ఆ) ముముక్షువుయొక్క స్థూలాది శరీరత్రయమునకంటె విలక్షణమగు సద్వస్తువు ఈ మహావాక్యమునందు "నీవు" అనే శబ్దంచేత చెప్పబడుతోంది.
"ఐతి"వనెడి పదముచేత ఐక్యము కనబడుతోంది.
ఆ "తత్త్వం" పదార్థాలయొక్క ఏకత్వము ముముక్షువులచే అనుభవింపబడునుగాక!
"శ్రోతుర్దేహేన్ద్రియాతీతం వస్త్వత్ర త్వం పదేరితమమ్ i
ఏకతా గ్రాహ్యతేఽసీతి తదైక్యమనుభూయతామ్ ॥"
4."అయమాత్మా బ్రహ్మ"
{అథర్వణవేదము, మాండూక్యోపనిషత్తు, సాక్షాత్కార వాక్యము}
దీని భావము
"ఈ జీవాత్మయే పరబ్రహ్మము"
వివరణ
అ) "అయం" = "ఈ" అనే పదంచేత ఆత్మకు స్వప్రకాశత్వము అపరోక్షత్వము యుక్తిపూర్వముగ చెప్పబడింది.
అహంకారము మొదలు స్థూలదేహము వరకూ గల ప్రపంచంకంటె (అధిష్ఠాన సాక్షిత్వములచేత) వేరుగా ఉండడంచేత అయ్యది "ప్రత్యగాత్మ" అని చెప్పబడుతోంది.
"స్వప్రకాశాపరోక్షత్వమయమిత్యుక్తితో మతమ్ I
అహంకారాది దేహాన్తాత్ప్రత్యగాత్మేతి గీయతె"
ఆ) కనబడుచుండే సకల జగత్తునకు అధిష్ఠానరూపము బ్రహ్మ శబ్దంచేత చెప్పబడుతోంది.
ఆ బ్రహ్మము స్వయం ప్రకాశమానుడగు ప్రత్యగాత్మయే స్వరూపంగా గలది అవుతుంది.
(అనగా ప్రత్యగాత్మయే బ్రహ్మమనడం)
"దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్త్వమీర్యతే I
బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకమ్ ॥
*శంకరజయంతి సందర్భంగా,
పది రోజులుగా మనం తెలుసుకొంటున్న విషయాలు, దీనితో పూర్తయ్యాయి.
జయజయ శంకర హరహర శంకర
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి