🌹 *ఓం నమో వేంకటేశాయ*🌹
*తిరుమల సర్వస్వం*…🙏
"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"
అనగా - "విశ్వంలో తిరుమలకు సమానమైన పుణ్యక్షేత్రం లేదనీ, గతంలోగానీ - వర్తమానంలోగానీ - భవిష్యత్తులోగానీ శ్రీవేంకటేశ్వరునితో సరితూగ గల దేవుడు లేడని, ఉండబోడని" అర్థం.
అటువంటి దైవం నివసించే "బంగారుమేడ" నిర్మాణవైశిష్ఠ్యం గురించి మనం తెలుసుకో బోతున్నాం. శ్రీవారి ఆలయానికి మరోపేరే *బంగారు మేడ*.
*శ్రీవారి ఆలయ నిర్మాణ వైశిష్ఠ్యం*
----------------------------------------
సప్తగిరులు, అంటే *శేషాచలం, గరుడాచలం, వేంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం* అనే *ఏడుకొండల* శిఖరశ్రేణుల మధ్య కొలువైన శ్రీవారి ఆలయం, మూడు ప్రాకారాలు - మూడు ప్రదక్షిణ మార్గాలతో విరాజిల్లుతోంది. అయితే, కేవలం *వైకుంఠ ఏకాదశి - ద్వాదశి పర్వదినాల్లో మాత్రం తెరిచివుంచే వైకుంఠద్వారంతో కలుపుకుంటే, నాలుగు ప్రాకారాలు, నాలుగు ప్రదక్షిణ మార్గాలుగా చెప్పుకోవచ్చు. *ప్రాకారము* అంటే *'కుడ్యము' లేదా 'గోడ'.*
అ ప్రాకారాలు వరుసగా -
1. మొదటి ప్రాకారము లేదా *మహా ప్రాకారము*
2. రెండవ ప్రాకారము లేదా *సంపంగి ప్రాకారము*
3. మూడవ ప్రాకారము లేదా *విమాన ప్రాకారము*
4. నాలుగవ ప్రాకారము లేదా *వైకుంఠ ప్రాకారము*
ప్రతి ప్రాకారాన్ని చుట్టి ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు.
ఒకటవ ప్రాకారానికి చుట్టూ, దేవాలయానికి బాహ్యంగా ఉన్న ప్రదక్షిణ మార్గాన్ని *మహా ప్రదక్షిణమార్గం*,
మొదటి మరియు మరియు రెండవ ప్రాకరాల మధ్యభాగాన్ని *సంపంగి ప్రదక్షిణ మార్గం*,
రెండవ మరియు మూడవ ప్రాకారాల మధ్యభాగాన్ని *విమాన ప్రదక్షిణమార్గం,*
మూడవ మరియు నాల్గవ ప్రాకారాల మధ్యభాగాన్ని *వైకుంఠ ప్రదక్షిణమార్గం* - గా పిలుస్తారు.
మొదటి మూడు ప్రదక్షిణ మార్గాలూ మనకు సుపరిచితమే గానీ, మహద్భాగ్యంగా చెప్పుకోబడే, వైకుంఠప్రదక్షిణ మార్గం చూడగలగటం మాత్రం అత్యంత అరుదుగా, శ్రీవారి సంపూర్ణ కటాక్షంతో మాత్రమే జరుగుతుంది.
ఈ ప్రాకారాలు మరియు ప్రదక్షిణమార్గాల గురించి వీలైనంత వివరంగా తెలుసుకుందాం...
*మహా ప్రదక్షిణమార్గం*
--------------------------------
ప్రధానాలయం చుట్టూ సుమారు ఇరవై అడుగుల ఎత్తు, 1350 అడుగుల చుట్టుకొలతతో గంభీరంగా కానవస్తున్న దీర్ఘచతురస్ర ప్రాకారం చుట్టూ బాహ్యంగా ఉండే ప్రదక్షిణ మార్గాన్ని *మహాప్రదక్షిణమార్గం* గా పిలుస్తారు. ఈ మార్గం లోనే నాలుగు మాడవీధులు ఉన్నాయి.
ఈ ప్రాకారం ప్రదక్షిణ పూర్తిచేస్తే మనం - ఆలయాన్నీ, ఆలయం వెనుకభాగంలో ఉండే ప్రేక్షక గ్యాలరీలను, లడ్డూ కౌంటర్లనూ, ఆదివరాహస్వామి ఆలయాన్నీ, స్వామిపుష్కరిణినీ - ఓ మారు చుట్టినట్లే. అంటే, ఈ మహాప్రాకారాన్ని చుట్టి ఉండే, విశాలమైన తూర్పు-దక్షిణ-పడమర-ఉత్తర మాడవీధుల్లో, సవ్యదిశగా సంచరిస్తా మన్నమాట. స్వామివారి ఊరేగింపులన్నీ ఈ
మాడవీధుల్లోనే జరుగుతాయి.
ఈ వీధులన్నీ ఒక్కప్పుడు చాలా ఇరుకుగా ఉండేవి. అయితే, కాలం గడుస్తున్నకొద్దీ, వీటిని వెడల్పుగా, అధునాతనంగా - శ్రీవారి ఉత్సవరథాలు నిరాటంకంగా తిరగటానికి, ప్రేక్షకులు గ్యాలరీలలో సౌకర్యవంతంగా కూర్చొని తిలకించడానికి వీలుగా తీర్చిదిద్దారు. అయితే, ఈ విస్తరణ కార్యక్రమం వల్ల ఆ వీధుల్లో ఒకప్పుడు ఉండేటటువంటి - శిల్పకళ ఉట్టిపడే అనేక మంటపాలు, కట్టడాలు కనుమరుగయ్యాయి. ఈ మధ్యకాలం వరకూ కూడా, ఆలయానికి ఎదురుగా, చాలా సందడిగా ఉండే "వెయ్యికాళ్ళ మంటపం" మనకు సుపరిచితమే. ఇప్పుడది కాలగర్భంలో కలిసిపోయింది. దాని కథా - కమామిషు మరోసారి తెలుసుకుందాం.
ఈ నాల్గు మాడవీధుల కలయికతో ఏర్పడే చతుర్భుజి కి ఆగ్నేయమూలలో స్వామివారి మందిరం కొలువై ఉంటుంది.
ఈ *మహాప్రదక్షిణమార్గం* లేదా 'మాడవీధుల' లో ఉండే విశేషాల్ని ఇప్పుడు పరికిద్దాం -
ఆలయ మొదటిప్రాకారం లేదా మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ, ఆలయానికి తూర్పుగా *మహాద్వారం*, దానికి ఎదురుగా, ఆలయానికి వెలుపల *గొల్లమంటపం* ఉంటాయి. ఈ మంటపం గురించి కూడా మరోసారి ముచ్చటించు కుందాం.
*తూర్పు మాడవీధి* లో, మహాద్వారానికీ - గొల్లమంటపానికి మధ్య నుంచి దక్షిణదిశగా వెళితే, మాడవీధి చివరగా, ప్రాచీనమైన పాత సహస్రదీపాలంకరణ సేవ మంటపం వస్తుంది. సాధారణ సమయాల్లో ఈ మంటపం మూయబడి ఉంటుంది. సహస్రదీపాలంకరణ సేవను ప్రస్తుతం దానికి ఎడం ప్రక్కనే ఉన్న విశాలమైన మంటపంలో జరుపుతున్నారు. ఆ పాతమండపం వెనుక, ఎత్తైన ప్రదేశంలో హాథీరాంబాబా మఠం ఉంటుంది.
తూర్పుమాడవీధి చివరినుంచి కుడిప్రక్కకు తిరిగి, *దక్షిణమాడవీధి* లో ప్రవేశించి తిన్నగా వెళితే, మొదటగా ఎడం ప్రక్కన "సుపథం" మార్గం కనపడుతుంది. అది దాటగానే, సంపంగి వృక్షాలనీడలో తిరుమలనంబి ఆలయం, దాని తరువాత క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి వెళ్ళే ఓవర్ బ్రిడ్జి కనపడతాయి.
దక్షీణమాడవీధిలో చివరగా ఉండే అనంతాళ్వార్ తోట ప్రవేశమార్గం మీదుగా కుడిప్రక్కకు తిరిగితే *పడమర మాడవీధి* లోకి ప్రవేశిస్తాము. వెంటనే మనకు "చిన్నజియ్యంగారిమఠం", "గోవిందనిలయం" అనబడే అర్చకుల క్వార్టర్సు కనబడతాయి. అంటే ఇప్పుడు మనం సరిగ్గా ఆలయం వెనుకవైపు ఉన్నామన్నమాట.
ఆ వీధిలో తిన్నగా వెళ్ళి మరలా కుడి ప్రక్కకు తిరిగి *ఉత్తరమాడవీధి* లోకి ప్రవేశించగానే, వరుసగా - లక్ష్మీనరశింహస్వామి ఆలయం (ఈయన భోగనరశింహుడు. యోగనరశింహుడు విమాన ప్రదక్షిణంలో ఉంటారు), వైఖానస అర్చకనిలయం, స్వామిపుష్కరిణి, ఆదివరాహస్వామి ఆలయం, వ్యాసరాజ ఆహ్నీకమండపం, దాని ప్రక్కనే కోనేటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం, వాటికి ఎదురుగా వైఖానస ఆగమశాస్త్రానికి మూలపురుషుడైన విఖనసమహర్షి ఆలయం, ప్రక్కనే రాధాగోపాల ఆలయం, దాన్ని ఆనుకుని చదువులతల్లి సరస్వతికే గురువైన హయగ్రీవుని ఆలయం కనపడతాయి.
అవి దాటి మళ్ళా కుడిప్రక్కకు తిరిగి *తూర్పు మాడవీధి* లోకి ప్రవేశించి తిన్నగా వెళితే మనకు కుడిప్రక్కగా ఆలయ మహాద్వారం వస్తుంది. అంటే, మనం మహాప్రదక్షిణ పూర్తి చేసుకుని, బయలుదేరిన చోటికే తిరిగి చేరుకున్నా మన్నమాట. ఈ ప్రదక్షిణ మార్గంలో, ఆదివవరాహుని ఆలయం, స్వామిపుష్కరిణి, వ్యాసరాజమంటపం, ఆంజనేయుని ఆలయం, ప్రధానాలయం తప్ప మిగిలినవన్నీ మనకు ఎడం ప్రక్కనే ఉంటాయి.
తూర్పు మాడవీధిని మినహాయిస్తే, మిగిలిన మూడు మాడవీధుల ప్రాంతమంతా, ఇరువైపులా, విశాలమైన ప్రేక్షక గ్యాలరీలు ఉంటాయి. బ్రహ్మోత్సవసమయంలో ఈ గ్యాలరీలన్నీ, స్వామివారి వాహనసేవలను చూడటానికి వేచిఉండే లక్షలాది భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి. ఈ మాడవీధులను అనుసంధానిస్తూ, స్వామివారి భక్తాగ్రేసరులైన హాథీరామ్ బాబా, తిరుమలనంబి, అనంతాళ్వార్, తరిగొండ వెంగమాంబ గార్ల స్మృతి చిహ్నాలు ఉన్నాయి. ఆయా సందర్భాలలో వాటి గురించి తెలుసుకుందాం.
*మహాద్వారం*
------------------------------
మహాప్రాకారాన్ని అనుసంధానిస్తూ ఉన్న ద్వారమే *మహాద్వారం.* ఇదే ఆలయం యొక్క *ప్రవేశ ద్వారం.* ఇది తప్ప ఆలయం లోనికి ప్రవేశించటానికి, బయటకు నిష్క్రమించడానికి వేరే మార్గంలేదు. దీనికే "పడికావలి", "సింహద్వారం", "ముఖద్వారం", తమిళంలో "పెరియ తిరువాశల్ (పెద్దవాకిలి)" - అంటూ అనేక పేర్లు ఉన్నాయి. ఈ పెద్దవాకిలికి ఇత్తడిరేకు తాపడం చేయబడిన కారణంగా, దీన్ని "ఇత్తడివాకిలి" అనికూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించే భక్తులు ఒకటవ వైకుంఠం క్యూ, లేదా రెండవ వైకుంఠం ద్వారా మాత్రమే వచ్చి, ముందుగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన నిరంతరం ప్రవహించే నీటితో పాద ప్రక్షాళన చేసుకొని, 'మహాద్వారం' గుండా ఆలయంలోకి ప్రవేశించాలి. ఈ మార్గానికి ఇరుప్రక్కలా అత్యద్భుత శిల్పకళతో అలరారుతూ, సమాంతరంగా ఉండే రెండు రాతిద్వారాలు ఉన్నాయి. బయటి వైపు ద్వారానికి రెండు పెద్ద చెక్కవాకిళ్ళు (తలుపులు) అమర్చబడి ఉన్నాయి. ఉత్తరంవైపు ఉన్న పెద్దవాకిలి నందుండే చిన్న తలుపులో నుంచి, మహాద్వారం మూసిఉండే సమయంలో ఆలయసిబ్బంది రాకపోకలు సాగిస్తారు.
*మహాద్వారం గోపురం* లేదా *మహారాజగోపురం*
----------------------------
మహాద్వారం పైభాగాన - శిల్పకళా చాతుర్యం ఉట్టి పడుతూ, యాభై అడుగుల ఎత్తుతో, ఐదు అంతస్తులతో, శ్వేతవర్ణంతో, సప్త కలశాలతో శోభితమైన *రాజగోపురం* లేదా *మహాద్వారగోపురం* విరాజిల్లుతూ ఉంటుంది. ఉత్సవసమయాల్లో పుష్పాలంకృతమై, విద్యుద్దీపాల కాంతిలో మరింత శోభాయమానంగా ఉంటుంది. 13 వ శతాబ్ధంలో ప్రారంభమైన ఈ రాజగోపుర నిర్మాణం, తరువాతి కాలంలో అంచెలంచెలుగా పూర్తైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
*శంఖనిధి - పద్మనిధి*
------------------------------
పాదప్రక్షాళన చేసుకోగానే, ఆలయ మహాద్వారానికి ఇరువైపులా దిగువభాగంలో, సుమారు రెండు అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరు శ్రీవారి సంపదను సంరక్షించే దేవతలు. ఆనందనిలయుని అంతులేని ఆస్తుల్ని అమరులే రక్షించాలి గానీ, అల్పమానవుల్ల అవుతుందా?
ఇతిహాసాల ప్రకారం, ఒకానొకప్పుడు కుబేరుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి శంఖనిధి, పద్మనిధి, పుష్పకవిమానాలను వరాలుగా పొందాడు. శ్రీవారికి, పద్మావతీ పరిణయ సందర్భంలో తాను అప్పుగా ఇచ్చిన 14 లక్షల బంగారు నాణాల్ని వడ్డీతో సహా తిరిగి తీసుకునే నిమిత్తం, కుబేరుడే ఆ బ్రహ్మదత్త దేవతలను శ్రీవారి సంపదలకు కాపుంచాడని భక్తుల విశ్వాసం.
ఇందులో - ఎడమవైపు, అంటే దక్షిణదిక్కులో ఉండే రక్షకదేవతయైన *శంఖనిధి* రెండు చేతుల్లో రెండు శంఖాలు ఉంటాయి. మందిరంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ దేవతను స్ప్రుశించి నమస్కరించుకోవచ్చు. కుడి వైపున ఉండే దేవత *పద్మనిధి* రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. క్యూ నిబంధన కారణంగా, దేవాలయం లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ దేవతను స్ప్రశించగలం.
ఈ నిధిదేవతల పాదాలవద్ద, ఆరంగుళాల ఎత్తుగల, నమస్కారభంగిమలో ఉన్న విజయనగర రాజైన అచ్యుతరాయలు విగ్రహాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ విగ్రహాల్ని ఆ రాజే ప్రతిష్ఠించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆగమశాస్త్రనుసారం, ఈ నిధిదేవతలను ఆలయ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయడం సాంప్రదాయం.
*అనంతాళ్వార్ గడ్డపార (గునపం)*
------------------------------------
పడికావలి దాటగానే, దేవాలయంలోకి వెళ్తుంటే, ద్వారానికి ఉత్తరంవైపు పై భాగంలో, ఓ 'గునపం' లేదా 'గడ్డపార' గోడకు వ్రేలాడదీయబడి ఉంటుంది. ఇది సుమారు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనది. దీనికి సంబంధించి, అత్యంత ఆసక్తికరమైన కథను శ్రీవారి మహాభక్తుడు *అనంతాళ్వార్* చరిత్రలో వివరంగా తెలుసుకుందాం. సాక్షాత్తూ శ్రీవారి గడ్డాన్ని గాయపరిచి, ఆ గాయం ఎల్లవేళలా పచ్చకర్పూరంతో అలంకరించి ఉండబడడానికి కారణమైన గునపాన్ని - ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు, బయటకు నిష్క్రమించేటప్పుడు తప్పక దర్శించుకుందాం.
అసంకల్పితంగానే మనమిప్పుడు ఆలయంలోనికి, అంటే రెండవ ప్రదక్షిణ మార్గమైన *సంపంగి ప్రదక్షిణ మార్గం* లోనికి ప్రవేశించి, దేవదేవుని దర్శనం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాం !!!
----------------------------------------
సంపంగి ప్రదక్షిణమార్గంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి మీద ఎనలేని భక్తితో కట్టించిన అనేక మండపాలు, వారివారి కాంశ్యప్రతిమలు - మరెన్నో దర్శించదగ్గ ప్రదేశాలున్నాయి. ప్రతిమండపం, ప్రతి ప్రతిమ మనను చరిత్ర లోతుల్లోకి తీసుకొని పోతుంది. ఆ విశేషాలన్నింటినీ మరొకసారి.. తెలుసుకుందాం !!!
*గోవిందా! గోవిందా!!*
*గోవిందా!!!*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🌷 *సేకరణ*🌷
🌹🌷🚩🚩🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి