18, మే 2024, శనివారం

భరద్వాజమహర్షికథ

 #వేదములయొక్కకథ #వేదపురుషవర్ణన #వేదశాఖలవివరం


#భరద్వాజమహర్షికథ


ఒకప్పుడు వేదాల్ని సంపూర్ణంగా అధ్యయం చేయదల్చుకున్నాడు భరద్వాజ మహర్షి, అతడు బ్రహ్మచర్యను అవలంభించి ముమ్మారు చతుర్ముఖ బ్రహ్మ వరం చేత దీర్ఘాయుష్షును పొందాడు. నాలుగు యుగాలూ అయిదువేలసార్లు తిరిగితే బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. భరద్వాజ మహర్షి అటువంటి బ్రహ్మ దినాలు మూడు జరిగినా గురువు దగ్గర వేదాధ్యయనం చేయడానికి చాలలేదు. బ్రహ్మ గురించి నిష్టాగరిష్ఠతతో తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కారం గావించి విషయం తెలుసుకుని “భరద్వాజా! వేదం నాకే పూర్తిగా తెలియదు. నీకు వేదరాశిని చూపిస్తాను. చూడు!" అని చెబుతూ కోటి సూర్యుల కాంతితో పోటీపడి వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అనేక వేదరాశులను చూపించాడు. అది చూసిన భరద్వాజుడు భయభ్రాంతుడై “ఆహా! ఏమిటిది? నేను ఇంతకాలం అధ్యయనం చేసింది ఇందులో అణుమాత్రం కూడా లేదే! మరి అటువంటిది ఈ వేదాలన్నీ అధ్యయనం చేయడం ఎన్ని బ్రహ్మకల్పాలకైనా సాధ్యపడుతుందా?” అని అనుకున్నాడు. భరద్వాజ మహర్షి బ్రహ్మకు నమస్కరిస్తూ “తండ్రీ! ఈ వేదశాస్త్రాలను తిలకించిన నాకు మతిపోయినంతైంది. అందుచేత నాకెంత కావాలో మీరే నిర్ణయించండి?” అని అన్నాడు. అపుడు బ్రహ్మ, అనంతానంతమైన ఆ వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి

అతనికి ఇచ్చి "భరద్వాజా! ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!” అని వరాన్ని ప్రసాదించాడు. ఇంకా ఆ మూడు పిడికిళ్ళ వేదాన్ని అధ్యయనం చేయడం ఇంతవరకూ పూర్తికాలేదు.


 అందుచే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తూ వ్యాసుడి రూపంలో అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. వాటిని తన ప్రియ శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులనే వారికి ఒక్కొక్కరికి ఒక్కో వేదం చొప్పున తెలిపారు. వ్యాసమహర్షి దగ్గర వారు, ఒక కల్పాంతం వరకూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటిది అల్పాయుష్కులైన మీరిద్దరూ నాలుగు వేదాలను పూర్తిగా అధ్యయనం చేసామని అనుకోవడం ఎంతో అహంకారంతో కూడుకున్నది! వేదం అంతా అధ్యయనం చేయడం ఏ ఒక్కరివల్లా అయ్యే పనికాదు. గనుకనే వ్యాసుడు దాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. 


#ఋగ్వేదము   ఋగ్వేదాన్ని తన ప్రియశిష్యుడైన పైలుడికి బోధించి "ఋక్కులు చాలా మహిమాన్వితాలు ఈ ఋగ్వేదాన్ని ముందుగా ధ్యానించాలి" అని చెప్పాడు. అప్పుడు పైలుడు “గురుదేవా! ఈ ఋక్కుల్ని ఎలా ధ్యానించాలో మీరే తెలపండి!” అని వేడుకున్నాడు. “నాయనా! విను. ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం. దీని గోత్రం ఆత్రేయస, గాయత్రీ ఛందము, దీనికి బ్రహ్మ అధిదేవత. దీని వర్ణంఎరుపును, తామరాకుల వంటి కళ్ళు, మధురమైన కంఠం, ఉంగరాల జుట్టు, చంద్రవంక లాంటి మీసకట్టు, రెండు మూరల కొలతగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ఊహించి ధ్యానించు. ఇందులో చర్చ, శ్రావకం, చర్చకం, శ్రవణీయపారం, క్రమపారం, జట, రథక్రమం, దండక్రమం అనే అష్టభాగాలున్నాయి. ఆ క్రమానుసారమే దాన్ని జాగ్రత్తగా పారాయణం చేయాలి. ఇక అశ్వలాయని, సాంఖ్యాయని, శాకలా, భాష్కలా, మాండుకేయులనే అయిదు శాఖలు ఈ వేదానికున్నాయి” అని పైలుడికి ఋగ్వేదం గురించి వివరించాడు.


#యజుర్వేదము

 ఆ తర్వాత తన రెండవ ప్రియశిష్యుడు వైశంపాయనునికి యజుర్వేదం బోధించి, దాని లక్షణాల గురించి ఇలా చెప్పసాగాడు. “నాయనా! ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. దీనికి గోత్రం భరద్వాజస, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. చేతిలో కపాలాన్ని ధరించి సన్నగా ఉండి, అయిదు మూరల పొడవున్న తామ్రవర్ణదేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. దీనికి ఎనభై అయిదు శాఖలున్నా ప్రస్తుతం పద్దెనిమిది శాఖలు మాత్రమే మిగిలున్నాయి. ఈ వేదం యజ్ఞ యాగాదుల గురించి వివరంగా చెబుతోంది. దీనికి మూలం మంత్ర బ్రాహ్మణ సంహిత. దీనికి ఛందస్సు భాషా, ప్రతిపదము, అనుపదము, మీమాంస, న్యాయం, ధర్మం, తర్కం అనే ఎనిమిది ఉపాంగాలు. దీనికి శిక్ష, కల్పము, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం అనే ఆరు అంగాలున్నాయి” ఇంత విస్తారంగల ఈ యజుర్వేదాన్ని వైశంపాయనునికి వివరించి చెప్పాడు. 


#సామవేదము

మూడవ ప్రియ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని గురించి ఇలా ఉపదేశించాడు. “గంధర్వం సామవేదానికి ఉపవేదం. దీనికి అధిదేవత విష్ణువు. జగతీ ఛందస్సు, గోత్రం కాశ్యప. మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రం, దండము ధరించి, ఆరు మూరల పొడవుగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి. ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారెవ్వరూ లేరు”అని చెప్పాడు.

#అధర్వణవేదము

 నాల్గవ ప్రియ శిష్యుడైన సుమంతుడికి అధర్వణ వేదం బోధించి "అస్త్రరూపం అధర్వణ వేదానికి ఉపవేదం. గోత్రం బైజానకము. అధిదేవత ఇంద్రుడు. త్రిష్ఠుప్ ఛందస్సు, ఈ వేదానికి తీక్షణమైన ఆకారం, నల్లని రంగుగల కామరూపుడు, ఏకపత్నీవ్రతుడు, ఏడు మూరల పొడవుగల దేహంగల వాడు వేదపురుషుడు. ఈ వేదానికి శాఖలు తొమ్మిది, కల్పాలు అయిదు ఉన్నాయి. మన భరతభూమిలో అన్ని వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయగల అతిరధులెందరో ఉండేవారు. అందుచేతనే ఈ వేదాలన్నీ ఇప్పటికీ నిలిచివున్నాయి.


గురుచరిత్ర నుండి :-

తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


Post:- సనాతన ధర్మం

Facebook:- 


కామెంట్‌లు లేవు: