కలవారి కోడలు
సంపాదన:చెన్నాప్రగడ పద్మావతి, పెదరావూరు
కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలోపోసి.
అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న
కాళ్ళకు నీళ్లిచ్చి కన్నీరునింపె.
♦
"ఎందుకో కన్నీరు ఏమికష్టమ్ము?
తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు,
ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము,
మీ అత్త మా మలకు చెప్పిరావమ్మ"
"కుర్చీపీటమీద కూర్చున్న అత్త,
మా అన్నలొచ్చారు మముబంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీమామ నడుగు!"
"పట్టెమంచముమీద పడుకున్నమామ,
మా అన్నలొచ్చారు మముబంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీబావనడుగు!"
"భారతము చదివేటి భావ, పెదబావ,
మా అన్నలొచ్చారు మముబంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీ అక్కనడుగు"
"వంటచేసేతల్లి, ఓ అక్కగారూ,
మా అన్నలొచ్చారు మముబంపుతారా?"
"నేనెరుగ నేనెరుగ, నీభర్తనడుగు"
♦
"రచ్చలోవెలిగేటి రాజేంద్రభోగి,
మా అన్నలొచ్చారు మముబంపుతార?"
"పెట్టుకో సొమ్ములూ, కట్టుకో చీర,
పోయిరా సుఖముగా పుట్టినింటికిని."
1960 దశకంలో రెండో తరగతి తెలుగు వాచకంలో ఈ గేయం పాఠ్యాంశంగా ఉండేది. అప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది ఈ గేయం చూస్తే. అప్పట్లో మనము బట్టీ పట్టి అభినయిస్తూ చెప్పేవాళ్ళం. చందమామ సంచికలో ఓసారి ప్రచురించిన గేయం ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి