9, జూన్ 2024, ఆదివారం

మోక్ష సాధనకు సంగీతం

 మోక్ష సాధనకు సంగీతం సోపానం - 06వ భాగం

ఇక మీరాబాయి మొదలైన వారి గురించి చెప్పాలంటే పెద్ద సముద్రం.

ఒకమారు మీరాబాయి తన్మయురాలై పాడుతూ ఉంటె అందరూ వింటూ ఉన్నారు. ఆ మధ్యలో ఒక సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఈవిడ పాడుతూ తన్మయంలోకి వెళుతూ ఉంటె "రాగ్ సే గావో, తాన్ సే గావో" అని గోడ మీద వ్రాసి వెళ్ళిపోయాడట. ఆవిడ చూసి అయ్యో అనుకుంది. తరవాత ఒక చిన్న పిల్లవాడు వచ్చి అది చెరిపేసి "ప్రేమ్ సే గావో శ్రద్ధా సే గావో" అని వ్రాసి వెళ్ళాడు. ఆ వచ్చింది కృష్ణపరమాత్మ. ఆ ప్రేమతో పాడుకునేప్పుడు భగవదానుభూతితో, అలా పాడుకోవడం అనేది ఈ మహాత్ములలో కనపడుతూ ఉంటుంది.

తెలుగులో వాగ్గేయకారుల్లో మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గురించి చెప్పుకోవాలి. ఆయన ఆధ్యాత్మరామాయణంపై కీర్తనలు రచించారు. క్షేత్రయ్య పదసాహిత్యం, ఎంత శృంగార భావాలో కానీ అవన్నీ కూడా కృష్ణపరమాత్మతో అనుబంధం పెట్టి చక్కగా చూపిస్తారు. అష్టవిధ నాయికా లక్షణాలు ఇత్యాదులు తెలియాలి. జయదేవుడి గీతగోవిందం కానీ, క్షేత్రయ్య పదసాహిత్యం కానీ పైపైన చూసేవాళ్ళు అదేదో అశ్లీలము అని భావిస్తూ ఉంటారు కానీ అశ్లీలము కాదు, శృంగారము, అది చాలా ఉత్కృష్టం. భావం తెలియాలి, అది గ్రహించితే అన్నమయ్య కూడా శృంగార కీర్తనలు ఎందుకు రచించారో తెలుస్తుంది. పరమయోగులే, విరక్తులే వాళ్ళు ఎందుకు ఇలా వ్రాసారు అని ఆలోచించాలి. వాళ్ళు చూస్తున్న భూమిక వేరు. భరతుడు నాట్యశాస్త్రంలో అష్టవిధనాయికల లక్షణాలు చెప్తాడు, వీటిని ఆధారం చేసుకొని వారి రచనలు ఉన్నాయి. ఒక శాస్త్రబద్ధతతో, సాధనతో రచించారు కనుక ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క శిల్పం.

అష్టవిధనాయికల్లో ఖండిత నాయిక, పోషిత భర్త్రుక ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే different emotions ని ఇక్కడ అష్టవిధనాయికలుగా చూపించారు. ఈ different emotions తో ఒకే భగవంతుడిని పట్టుకోవడం అనేది ఏదయితే ఉందో దాన్ని వీళ్ళు ఈ కీర్తనలలో చూపిస్తారు. మన సత్యభామని కూడా ఖండిత నాయికగా చూపించారు, ఇది తీస్కుని సిద్ధేంద్రయోగి కూచిపూడి సంప్రదాయంలో భామాకలాపం ఇత్యాదులు రచించాడు. నిజంగా భాగవతంలో మాత్రం సత్యభామ రుక్మిణీదేవి లాగే పతివ్రత, సౌమ్యురాలు. అంతేకానీ ఆవిడ అలగడాలు, కాలితో కిరీటం తన్నడాలు ఇవన్నీ తరవాత వారు సృష్టించినవి. వాటిని ప్రమాణాలుగా తీసుకోకూడదు.

మనిషిలో వస్తున్న రకరకాల emotions ని తీసుకున్నారు. ఈ emotions ఎన్ని వస్తున్నా నీలోపల ఉన్న ఈశ్వరుడి చుట్టూ అవి తిరగాలి. అందుకు అవన్నిటికీ నాయకుడు ఎవరు అంటే అయితే కృష్ణుడు లేదంటే రాముడు. భగవంతుడిని ఎప్పుడయితే నాయకుడిగా పెట్టారో దాని వలన ధీరోదాత్తత వచ్చి మన కళలు భక్తి, ధర్మంతో నిండి గొప్పవి అయ్యాయి.

రామదాసు గారి గురించి చూస్తే ఎంత గొప్ప రచనలు చేసాడు. భజన సంప్రదాయంలో ఆయన చూపినన్ని భావాలు, పైగా భగవదనుగ్రహంతో ఎన్నెన్ని అద్భుతాలు సాధించవచ్చో చూపించారు. ఒకసారి రాముడికి వైభోగం చేసి ఆ వంటలు అందరికీ వడ్డించడం కోసం ఏర్పాటు చేసాడు. ఆ వంటలు మండుతున్న సమయంలో ఆయన కొడుకు ఆ అరుగు మీద నడుస్తూ సలసల కాగుతున్న బాణలిలో పడి ఇంచుమించు మృతప్రాయుడయ్యాడు. ఈయన ఒక గానంలో లీనమయ్యాక తెలిసింది పిల్లవాడికి ఇలా అయింది అని, వెంటనే పిల్లాడిని ఎత్తుకుని రాముడు ముందర పెట్టి "కోదండరామా! కోదండరామా! కోట్యర్కధామా!" అని ఆలాపన చేస్తే వెంటనే పిల్లవాడు తిరిగ బ్రతికాడు. వాళ్ళకి ఎలాంటి శక్తి అంటే, స్వరానికి, అక్షరానికి శక్తి ఉంటుంది, దానికి వీరి తపస్సు కలపడం వలన ఆ శక్తిని జాగృతపరచగలిగారు. అప్పుడు రాగం ఏమైంది? మంత్రం అయింది! మంత్రోపాసనతో చేయగలిగినది రాగంతో చేసారు.

ఇది కాకుండా రామదాసు కీర్తనలలో అనేక సందేశాలు ఉంటాయి. ఎంత విన్నపం, ఎంత ఆర్తి కనపడతాయో!

కొంతమంది వారు అనుకున్నది దొరకకపోతే దేవుడినే మార్చేయడం మనం చూస్తూ ఉన్నాం, మతమార్పిడులు దానివలననే వస్తున్నాయి. అంటే వాడు దేవుడిని వ్యాపార దృష్టితో చూస్తున్నాడు కనుక మార్పిడి అనేది వచ్చింది. కానీ మన సంస్కృతిలో ఆ లక్షణాలు లేవు.

"పాలన్ముంచుము నీట ముంచుము ఇది నీకే భారము" అనాలంట ఎంత దమ్ము ఉండాలి? అంతేకాని నేనెప్పుడూ విష్ణుసహస్రం చదివేవాడిని కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాక మానేసాను అన్నాడట, అంటే, అంత విష్ణువు నీ బంటా? నువ్వు చెప్పినట్లు చేయడానికి! భగవంతుడు ఎటువంటి వాడు? అందుకు ఆయన నుండి ఇటువంటివి ఆశించే భక్తిని చాలా అసహ్యంగా తీసేసారు మన సంస్కృతిలో.

పైగా భారతీయ సంస్కృతిలో నీకు మంచి జరుగుతుంది ఇది చేస్తే అంటూ ఆశ చూపించి పిలవరు, అలా అని మంచి జరగదు అని కాదు, మంచి జరుగుతుంది కానీ నువ్వు అనుకునే మంచి కాదు, ఆయనకి తెలుసు నీకేది మంచిదో, అది మనకి తెలిస్తే నిబ్బరంగా ఉండవచ్చు. నిజంగా రామదాసు స్థానంలో సామాన్యులు ఉంటే ఈపాటికి మూడో నాలుగో మతాలు మారి ఉండేవాళ్ళు. రామదాసు జీవితం చూస్తే, ఏమి సుఖపడ్డాడు? గుడి కట్టాడు, జైలులో పెట్టారు అతనిని.

కామెంట్‌లు లేవు: