వైఫల్యంలోంచి సాఫల్యం వైపు
జీవితంలో ఆశించిన సుఖాలు లభించవు - ఒక్కొక్కసారి - అదేవిధంగా పలుమార్లు ఆశించని దుఃఖాలూ తారసపడతాయి. ఇది జీవిత లక్షణం. ఈ అనివార్యంశాన్ని తెలివిగా నిర్వహించడంలోనే విజయవంతమైన వ్యక్తిత్వం తేటపడుతుంది.
కొందరు ఊహించని దుర్ఘటనో, నష్టమో జరగగానే తీవ్ర మనస్తాపానికి గురికావడమో, లేదా ప్రపంచం మీద కసి ఏర్పరచుకోవడమో, లేదా దైవాన్ని దూషించడమో చేస్తారు. ఈ విధమైన పరివర్తన, తీవ్రస్పందన సామాన్య మానవులలో కలగడం సహజమే. కానీ ఈ పరిణామాలు ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనాలుకావు.
అలాంటి సంఘటనలోంచే కొందరు సకారాత్మక (Positive) పరిణామాన్ని స్వీకరిస్తారు. దుర్ఘటనలలోంచి వివేక వైరాగ్యాలను పొంది జ్ఞానులుగా, యోగులుగా మారిన వారెందరో!
"ప్రియా ప్రియాలకు (సుఖ దుఃఖాలకు) చలించని ధృఢ మనస్కులకు జ్ఞానులకు నమస్కారము” అని సీతాదేవి అలాంటి మహాత్ములకు అంజలించింది (సుందరకాండ).
కొందరు దుఃఖ సంఘటనల్లోంచి ఎవరి పైనో కసిని ఏర్పరచుకోకుండా, దానిని కరుణగా మార్చుకున్న వారూ ఉన్నారు.
ఒక గొప్ప పారిశ్రామికవేత్త తనకున్న ఏకైక సంతానం మరణించగానే, ఆ దుఃఖంలోంచి యోగిగా మారిన వైనం కూడా ఒక విజయ చరిత్రగా ఉన్నది. ఒక విదేశీ వైజ్ఞానిక శాస్త్రవేత్త తన శరీరం వికలాంగదశలో ఉన్నా, తన మేధస్సుతో అపూర్వ పరిశోధనలు జరిపిన ప్రపంచోపకారిగా మారిన ఘటన నేటికీ సాక్ష్యం.
బలీయమైన ప్రారబ్ధం దుఃఖాన్ని కలిగించినా, బలమైన మనస్సు ప్రయోజనకారునిగా మలచగలదు. ఇదే జీవిత సార్థక్యం.
తన సంతానంపై కేంద్రీకరించిన ప్రేమను, సంతాన నష్టంతో, ప్రపంచమంతా విస్తరింపజేసిన కర్మయోగి - స్వార్థం లేని కీర్తి కాంక్షలేని సేవా కార్యక్రమాలతో ద్రవ్యాన్నీ, శ్రమనీ లోకోపకారానికి ఉపయోగించగలడు.
ఒంటి చక్రంతో కూడుకున్న రథంపై, తొడలు లేని సారథి (అనూరుని)తో కాలగమనాన్ని నడుపుతున్న సూర్యుని వర్ణించిన మన సంస్కృతి - ఏ సహకారమూ లేకున్నా విజయయాత్ర చేయగల ఆదర్శాన్ని చూపించింది.
క్రియాసిద్ధిః సత్యేభవతి
మహతాం నోపకరణే ॥
ఉపకరణాల సహాయం లేకున్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా తమ స్వాత్మ శక్తితోనే క్రియాసిద్ధిని సాధించే వారు మహాత్ములు.
ఏ కారణాలను, ఏ లోపాలను చూపించి - "వాటి వల్లనే మేము వైఫల్యం పొందాము" అని సామాన్యులు చెప్తారో, అవే కారణాలతో, అవే లోపాలతో అద్భుత సాఫల్యాలను సాధిస్తారు మహాత్ములు.
తాము ఎదగకపోవడానికి వ్యక్తులను, సంఘటలను, కారణాలుగా చూపించడం చాలా మందికి సహజం. మన చుట్టూ ఉన్న సమాజంలో అందరికీ అన్నీ ఒకేలా ఉన్నా - వాటిని వినియోగించుకొనే తెలివిమీదనే విజయాలు ఆధారపడి ఉంటాయి.
ఒకడు "దరిద్రం వల్లనే నేను సామాన్యుడిగా మిగిలిపోయాను" అంటాడు. కానీ అదే దరిద్రంలోంచి ఎదిగి, పదిమంది దరిద్రాన్ని పోగొట్టగలుగుతారు మరికొందరు.
మన సాఫల్య వైఫల్యాలకు బాహ్యకారణాల కంటే, మన బుద్ధిశక్తిలోని దృఢత్వ, బలహీనత్వాలే ప్రధానహేతువులు.
శౌర్యంతో దాడిచేసిన విశ్వామిత్రుని విస్తార భౌతిక బలాన్ని, ఒంటరిగా తన స్వాత్మ శక్తితో ఎదుర్కొన్న వసిష్ఠుని మహోన్నత వ్యక్తిత్వం విశ్వామిత్రునికి విస్మయం కలిగించింది.
రాజ్యాది సంపదలు లేకున్నా, అడవిలో విద్యనార్జిస్తూ, బోధిస్తూ ఉన్న ఒక జ్ఞాని - ఒక మహా విస్తార రాజ్య సైన్యాన్నే అణచగలిగాడంటే - స్వాత్మ శక్తి ఎంత గొప్పది! దీనిని గ్రహించిన విశ్వామిత్రుడు జాగృతి చెంది, తన భౌతిక సంపదల కంటే మించిన తపశ్శక్తిని సాధించగలిగాడు.
ప్రేమ, సేవ, వైరాగ్యం, జ్ఞానం, త్యాగం... ఇవి ఇవ్వగలిగే ఆనందం ఏ వైభవమూ ఇవ్వలేదు. ఈ దివ్యగుణాలున్న వారు యశఃకాయులై కలకాలం మిగిలిపోతారు. సార్థక జన్ములౌతారు.
[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, శివతత్త్వసుధానిధి "బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు" రచించిన వ్యాసం]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి