24, జూన్ 2024, సోమవారం

దీపారాధన

 హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. దేవుడిని ఆరాధించే సమయంలో 

'దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే' 

అనే శ్లోకాన్ని చదువుతూ ఆశీస్సులు కోరుకుంటారు. అయితే.. చాలా మందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఏ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు? అనే విషయాలు తెలియదు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.మనలో కొంత మంది దేవుడికి పూజ చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి, నూనెతో దీపారాధన చేస్తుంటారు. మరి కొంతమంది పూజ గదిలో, దేవాలయంలో.. ఆవాలు, నువ్వులు, ఆముదం వంటి రకరకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తుంటారు. అయితే.. మనం ఒక్కో రకమైన నూనెను ఉపయోగించడం వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఏ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ?

ఆవు నెయ్యితో :

ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో.. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయని అంటున్నారు. ఆవు నెయ్యితో అన్ని దేవతలకూ దీపారాధన చేయవచ్చు. ఈ నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట. అలాగే గాలిలోని సూక్ష్మక్రిములు నశిస్తాయని తెలియజేస్తున్నారు. దీపం నుంచి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుందట.నువ్వుల నూనెతో:

నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయట. అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే చాలా మంది ఆవాలు లేదా నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారని పండితులు తెలియజేస్తున్నారు.

పంచదీప నూనెతో:

ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి, శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మనలోని చెడు ఆలోచనలు దూరమవుతాయట. అలాగే అనారోగ్యం, పేదరికాలను మన దరి చేరనివ్వదని అంటున్నారు. పంచదీప నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు.

కీర్తి, ప్రతిష్టలు, సిరిసంపదలు పొందాలనుకునే వారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిదట.హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.రాహు, కేతు గ్రహాల ప్రభావం పడకుండా ఉండటానికి మునగ నూనెతో దీపం వెలిగించండి.

దీపారాధన ఎలా చేసినా కూడా.. స్వచ్ఛమైన మనసుతో, సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు: