మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు..*
*(పదునాలుగవ రోజు)*
శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి, కొంతకాలం సాధన చేసిన అనంతరం, చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేట గ్రామంలో "బాలబ్రహ్మం" గారి వద్ద ఉపదేశం పొంది..తిరిగి స్వగ్రామం ఎర్రబల్లె చేరారు..అక్కడనుంచి మాలకొండ కు వెళ్లి, అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు..
శ్రీ స్వామివారి తల్లి, సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు..తమ బిడ్డ ఇక ఏవిధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేటతెల్లంగా అవగతం అయింది..మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు..కేవలం కొద్దిగా బియ్యం, అందులో కొద్దిగా పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు..అదికూడా తాను సాధన నుంచి లేచిన తరువాతే..శ్రీ స్వామివారు ఆహారం తిన్నా..తినకుండా వున్నా..తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం, పెసరపప్పు ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు..అలా ఎన్నాళ్ళు జరగాలి అని వారు అనుకోలేదు..ఎంతకాలం పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా..అంతకాలం పాటు తాము ఈ ఆహారపదార్ధాలు సమకూర్చాలని నిశ్చయం చేసుకున్నారు..
ఇక..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి?..ఒకరోజుతో తీరిపోయే విషయం కాదు..ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు..కానీ అక్కడ ఆయన తపోసాధన లో వున్నంతకాలం..తాము ఇక్కడనుండి పంపాలి..ఎలా?..ఆరోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు..సైకిల్ మీద..తప్పిందా..ఇక కాలి నడకే..ఎర్రబల్లె నుంచి, వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి..మొగలిచెర్ల గ్రామం మీదుగా మాలకొండ చేరాలి..
శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే..సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనను అనుగమించింది..ఆ దంపతులు ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి, లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బైలుదేరాడు..రాముడు వారించినా...అన్నగారి సేవే పరమార్ధం అని చెప్పాడు..ఆవిధంగానే నడచుకున్నాడు.. అదే విధంగా..శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా..తల్లికి సోదరులకు అభయం ఇచ్చాడు.."అన్నయ్య కు వస్తువులు చేర్చే బాధ్యత నాది.." అప్పుడు పద్మయ్య వయసు కేవలం పదహారు మాత్రమే!..
ప్రతి ఇరవై రోజులకూ ఎర్రబల్లె లో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ..(ఒక్కొక్కసారి సైకిల్ ఉండేది కాదు..కాలి నడకే శరణ్యం) వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురుచూస్తూ వుండేవాడు..శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకొని పద్మయ్య ను చూసి నవ్వేవారు..ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తాను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది..అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్య తో గడిపేవారు..కానీ పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది..
ఒకరోజు..పద్మయ్య మాలకొండకు వచ్చి, శ్రీ స్వామివారి రాకకోసం పార్వతీదేవి మఠం వద్ద ఎదురుచూస్తూ వున్నాడు.. ఇంతలో శ్రీధరరావు గారు కూడా అక్కడికి వచ్చారు..ఇరవై ఏళ్లు కూడా లేని ఈ యువకుడెవరా అని శ్రీధరరావు గారు ఆలోచించి..ఆమాటే అడిగేశారు.. తాను ఫలానా అని, ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అనీ..స్వామివారికి తమ ఇంటినుంచి వెచ్చాలు తీసుకొచ్చి ఇస్తూవుంటాననీ చెప్పాడు..శ్రీధరరావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు..ఆనాటి నుండి..పద్మయ్య కు మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారిల్లు ఒక మజిలీగా మారిపోయింది..ప్రభావతి గారు కూడా పద్మయ్య ను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు..
పద్మయ్య ది నిస్వార్థ సేవ..శ్రీ స్వామివారిని అన్నయ్య గా కాదు..సాక్షాత్ దైవస్వరూపంగానే కొలిచాడు.. శ్రీ స్వామివారు సిద్ధిపొంది నేటికి దాదాపుగా 42 ఏళ్ళు అవుతోంది..పద్మయ్యనాయుడి మదిలో నేటికీ అదే దైవభావం..
"నేనే కోరికలు కోరలేదు..కానీ ఈరోజు నేను ఈమాత్రపు స్థితిలో ఉన్నానంటే..ఆయన ఆశీర్వాదమే కారణం "అంటూ ఉంటారు..శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా..పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు..శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి..అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబసమేతంగా మొగలిచెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి, శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లడం పద్మయ్య పెట్టుకున్న నియమం..
శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచీ ఈ క్షణం వరకూ తరిస్తున్న ధన్యజీవి పద్మయ్య నాయుడు..
శ్రీ స్వామివారి ఆశ్రమ సన్నాహాలు..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి