ఓ తండ్రి కథ*
🌷🌷🌷
సమయం ఉదయం పదకొండు గంటలు. వీధి తలుపు తీసి బయటికి వచ్చిన పూర్ణిమకు అరుగుపై ఓ వ్యక్తి కూర్చుని ఉండటం కనిపించింది. దాదాపు అరవై ఏళ్ళుంటాయి అతనికి. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడతను. నల్లప్యాంటుపై తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు.
పూర్ణిమ ఎవరు కావాలన్నట్టు చూసింది అతని వైపు.
"మా అబ్బాయి తన స్నేహితుని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. నన్నిక్కడ కూర్చోమని చెప్పాడు."
అలాగే నన్నట్టు తలూపి, లోపలికి వెళ్ళింది పూర్ణిమ.
ఓ గంట తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చూస్తే... ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉండటం కనిపించింది. బయట ఎండ తీవ్రంగా ఉండటంతో అతను చెమటతో తడిసిపోయి ఉన్నాడు. ముఖం వాడిపోయి ఉంది.
" అరె... ఎంతసేపలా ఎండలో కూర్చుంటారు? లోపలికి వచ్చి కూర్చోండి" అంటూ సిటౌట్లో కుర్చీ తెచ్చి వేసింది. ఆయన కూర్చున్నాక త్రాగడానికి నీళ్లు ఇచ్చింది. తర్వాత రస్నా కలిపి ఇచ్చింది.
"ఎందుకమ్మా నీకు ఈ శ్రమ?" అంటూ మొహమాటపడుతూనే తీసుకున్నాడు.
"ఇందులో శ్రమేం లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదా?"
"లేదమ్మా. ఈకాలం పిల్లలు సుకుమారులు కదా.. ఈ ఎండకు కళ్ళు తిరిగి పడిపోయాడేమోనని నాకు ఆందోళనగా ఉంది. "మీ అబ్బాయి సెల్ నెంబర్ మీ దగ్గర లేదా?"
"ఇందులో ఉందమ్మా. నేను చూస్తే కనబడలేదు, నువ్వు చూడు. రాజు అని ఉంటుంది" జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఆమెకిస్తూ అన్నాడు.
ఆమె చూసి "కాంటాక్ట్స్ లో ఏ నంబరూ లేదండీ... అన్నీ ఎరేజ్ అయిపోయినట్లున్నాయి” అంది.
"అజ్ఞానంతో ఏదో ఒకటి నొక్కేస్తుంటాను. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడుతుంటాను" అన్నాడు సిగ్గుపడుతూ.
మీరు ఎక్కడ్నుంచి వచ్చారు" అని అడిగింది పూర్ణిమ.
"ముంబై నుంచి. నన్ను తిరుమల తీసుకెళ్తానని నా బిడ్డ ఇక్కడకు తీసుకొచ్చాడు. తిరుమలలో పనిచేసే తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడట. అతని సెల్ నెంబర్ వీడి దగ్గర లేదు. అందుకే ఇల్లిల్లూ వెతుక్కుంటూ వెళ్ళాడు."
"ఆ స్నేహితుడి పేరు మీకు తెలుసా"?
"తెలుసు. ' వెంకటరమణ' అని చెప్పాడు "
"అవునా? ఆ పేరు గలవాళ్లు చాలా మంది ఉన్నారు ఈ వీధిలో " అంది పూర్ణిమ నవ్వుతూ.
అతను 'అలాగా ' అన్నట్టు చూసాడు ఆమెవైపు.
"మీ అబ్బాయి ముంబై లాంటి పెద్ద సిటీలో ఉంటున్నాడు కాబట్టి ఈ తిరుపతి లాంటి చిన్న టౌన్లో తన స్నేహితుని ఇల్లు తేలికగానే కనుక్కోగలడు లెండి" అంది పూర్ణిమ.
మధ్యాహ్నం రెండు గంటలకు పూర్ణిమ భర్త బాలరాజు ఇంటికి వచ్చాడు.
భార్యతో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే "మీరూ... రాఘవయ్య మేస్టారు కదూ?" అని అడిగాడు బాలరాజు.
"అవును. మీరు?" లేచి నిలబడి అడిగాడు అతను.
"రాజమండ్రి లోని విజ్ఞానదీప్తి హైస్కూల్ లో మీరు నాకు లెక్కల మేస్టారు. రాజమండ్రి లోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా మాథ్స్ లో మీ టీచింగ్ కి మంచి పేరుండేది. నేను బ్యాంక్ లో ఉద్యోగం తెచ్చుకున్నది మీ టీచింగ్ వల్లనే. లోపలికి రండి మేస్టారూ " అని ఇంట్లోకి నడిచాడు బాలరాజు.
తర్వాత భార్యతో "ఆయనకు భోజనం పెట్టావా?" అని అడిగాడు.
"లేదు. ఆయన మీ మేస్టారని నాకు తెలియదు కదండీ! అయితే ఎండకు బాగా వడలిపోతే రస్నా కలిపి ఇచ్చాను "
"వెరీగుడ్! పద... మా ఇద్దరికీ వడ్డించు."
భోజనం చేస్తూ పూర్ణిమ ద్వారా జరిగింది విన్నాడు బాలరాజు.
"మీరు ఆందోళన పడకండి. మీ అబ్బాయి తన స్నేహితుని ఇల్లు కనుక్కోలేక పోవడం వల్ల అతని ఆఫీస్ కు ఫోన్ చేసే ప్రయత్నాల్లో ఉండి ఉండొచ్చు. అవునూ, మీరు ముంబై ఎప్పుడు వెళ్లారు మేస్టారూ" అన్నాడు బాలరాజు రాఘవయ్యతో.
"మా రాజేష్ చదువు పూర్తయిన వెంటనే ముంబయిలో వాడికి ఉద్యోగం దొరికింది. కొన్నాళ్లకు వాడు వాడితో పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అతను మాతో మాట్లాడలేదు. అంతలో నా భార్య మరణించింది. అప్పుడు రాజమండ్రి వచ్చిన రాజు నన్ను తన దగ్గరికి వచ్చెయ్యమన్నాడు. నేను ఇల్లు అమ్మేసి, గత ఆరు నెలలుగా వాళ్ళతోనే ఉంటున్నాను.
"అదే మంచిది. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతారు మీరు? అమ్మగారు లేరన్న విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను."
"నీ పేరేమన్నావు నాయనా?"
"బాలరాజు
"ఆ.. గుర్తొచ్చావు! టెన్త్ మాథ్స్ లో ప్రతి పరీక్షలో నువ్వే ఫస్ట్ వచ్చేవాడివి. మీ అమ్మ ఎలా ఉంది? తండ్రి లేని నిన్ను తనే అన్నీ అయి పెంచింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో వంటలు చేస్తూ.. ఆ వచ్చిన డబ్బులతోనే నిన్ను చదివించిది. నువ్వు ప్రయోజకుడివయ్యాక చాలా సంతోషించి ఉంటుంది.
బాలరాజు ఆశ్చర్యంగా
చూస్తూ" మీకు ఎంత గుర్తు మేస్టారూ. నాకు ఉద్యోగం వచ్చినరోజు అమ్మ ఎంత సంతోషించిందో?! పూర్ణిమతో నా పెళ్లి తనే దగ్గరుండి జరిపించింది. ఇక తను చేయాల్సిందేమీ లేనట్టు వెళ్ళిపోయింది."
"అయ్యో పాపం" అన్నాడు బాధగా రాఘవయ్య.
"అమ్మ పెళ్లిళ్లకు ప్రక్క ఊర్లకు వెళ్లిన రోజుల్లో నాకు భోజనం పెట్టిందెవరో తెలుసా పూర్ణా? మేస్టారి భార్య పార్వతమ్మ. నాకు ఇంకో అమ్మ ఆవిడ! నా పరిస్థితిని గమనించిన మేస్టారు ఓ చీటీలో 'వీడికి అన్నం పెట్టు' అని రాసి నా చేత వాళ్ళింటికి పంపించేవారు. ఆ తర్వాత క్రమంగా చీటీల అవసరం లేకపోయింది. నన్ను చూడగానే ఆవిడ కంచం డైనింగ్ టేబుల్ పై పెట్టేది. నేను ఎంత చేస్తే వీరి ఋణం తీర్చుకోగలను?" కన్నీళ్ళతో అన్నాడు బాలరాజు.
"సహాయం పొందినవాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో దాని గురించి గుర్తుచేసుకోవడం, ప్రస్థావించడం నామోషీగా భావించే రోజులివి. కృతజ్ఞత అన్న పదం కనుమరుగవుతున్న కాలం యిది. చిన్న చిన్న సహాయాల్ని నువ్వు పదే పదే ప్రస్థావించడం నీలోని సంస్కారానికి నిదర్శనం " అన్నాడు రాఘవయ్య.
ఆరోజు సాయంత్రం బ్యాంకు నుంచి ఇంటికి వచ్చిన బాలరాజు రాజేష్ ఇంకా రాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు.
రాఘవయ్య చాలా డీలాపడి ఉండటం చూసి "మీరు అధైర్యపడకండి మేస్టారూ. నా బావమరిది ముంబై లోనే ఉన్నాడు. ఈ ఆదివారం మీ ఇంటికి వెళ్లి మీ కోడలితో మాట్లాడి విషయం కనుక్కురమ్మంటాను. వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తీసుకొమంటాను. అక్కడి అడ్రస్ మీకు తెలుసు కదా?" అని అడిగాడు.
తెలుసన్నట్టు తలూపాడు రాఘవయ్య.
"మీ అబ్బాయి క్షేమంగానే ఉంటాడు. ఈ ఇల్లు కూడా మీ అబ్బాయి ఇల్లే అనుకోండి. మీకిష్టమైనన్ని రోజులు మీరు మాతో ఉండొచ్చు" అన్నాడు బాలరాజు.
ఏదో ఆలోచిస్తూనే తల ఊపాడు రాఘవయ్య.
ఆరోజు రాత్రి రాఘవయ్యతో నెమ్మదిగా చెప్పాడు బాలరాజు-
"మా బావమరిది ఇందాకే ఫోన్ చేసాడు. మీ అబ్బాయి నిన్న ఉదయం ముంబై చేరాడట. ఈరోజు ఉదయం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్లిపోయారట. వాళ్లిద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగానే కనిపించారట. క్రొత్త ఇంటి అడ్రెస్ ఇరుగు పొరుగు వాళ్లెవరికీ ఇవ్వలేదట."
ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవయ్య.
జరిగింది అర్ధంచేసుకోవడానికి కొంతసేపు పట్టింది అతనికి.
తర్వాత భోరున ఏడవసాగాడు. అతన్ని ఎలా సముదాయించాలో అర్ధంకాక బొమ్మల్లా కూర్చుండి పోయారు పూర్ణిమ, బాలరాజు.
"రాజూ. ఇందుకేనా నన్ను ముంబై రమ్మని పిలిచింది? మీ ప్రేమంతా నటనేనా? నీ ప్రేమ నా డబ్బు మీదే అయితే ఆ విషయం రాజమండ్రిలోనే చెప్పివుంటే సంతోషంగా ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేవాణ్ణి కదరా! తండ్రిని వదల్చుకున్న పాపం నీకు అంటకుండా ఉండేది కదరా " అంటూ మళ్ళీ ఏడవసాగాడు రాఘవయ్య.
బాలరాజు ఆయన భుజంపై చేయివేసి" మేష్టారూ!ఏడవకండి, ప్లీజ్!"అన్నాడు అనునయంగా.
"వాడు డబ్బులు తీసుకున్నందుకూ, నన్ను వదుల్చుకున్నందుకూ నేను ఏడవడం లేదు బాలరాజూ, వ్యక్తిగా వాడింత దిగజారిపోయాడే...అన్న బాధతో ఏడుస్తున్నాను" అన్నాడు రాఘవయ్య. తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి "పోనీలే, వాడు క్షేమంగా ఉన్నాడు. అది చాలు నాకు" అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు.
"ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగాయని పేపర్లో ఓ మూల వేస్తేనే బాధపడేదాన్ని. కళ్ళముందే అటువంటి సంఘటన జరుగుతూంటే మనసును కదిలించినట్లు ఉందండీ" అంది పూర్ణిమ భర్తతో.
"ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లితండ్రుల్ని ఇంట్లోంచి తరిమేసే కొడుకులు, కూతురిని బలాత్కారం చేసే తండ్రులు, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసే ఉపాధ్యాయులు, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే అఘాయిత్యం చేసే కామాంధులు....వీళ్ళంతా మనమధ్యే తిరుగుతున్నారు పూర్ణా! ఇప్పుడే ఇలాఉంటే ...మరో ఇరవైఏళ్ళ తర్వాత సమాజం పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది" అన్నాడు, బాలరాజు - మంచంపై పడుకుని నిద్రపోతున్న ఇద్దరు కూతుళ్ళను చూస్తూ.
"సమాజం ఎంత దిగజారినా మనం మంచిని విడువనంత వరకూ, ఆ భగవంతునిపై నమ్మకం వదలనంతవరకూ ఆయన మనల్ని వదలడు. మంచివాళ్ళకు ఆయన యెప్పుడూ మంచే చేస్తాడు"
"మా మేష్టారు చాలా మంచివారు. ఆయనకు భగవంతుడు చేసింది మంచేనంటావా?"
"కొంతవరకూ మంచే చేశాడు. రాజేష్ ఆయన్ని మహారాష్ట్ర లోనే ఏదో ఓ ఊర్లో వదిలేయకుండా, ఆయన భాష తెలిసిన ఈ ఊరిలో, ఆ గోవిందుని పాదాల చెంత, ఆయన శిష్యుని ఇంటిముందే వదలివెళ్ళడం భగవంతుడు చేసిన మంచి కాదా?"
నిజమేనన్నట్టు తలూపాడు బాలరాజు. భార్య మాటలు విన్నాక, ఆ మాటల్లోని అంతరార్థం అర్థమయిన తర్వాత అతని మనసులోని అలజడి తగ్గింది.
"మీ మేష్టారూ, ఆయన భార్యా మంచివారన్నారు కదా, మరి వారి కొడుకు ఎందుకిలా తయారయ్యాడు? మీకు బాల్యం నుంచీ నేర్పించిన మంచితనం అతనికీ నేర్పి ఉంటారు కదా?" అని అడిగింది పూర్ణిమ.
"సత్ సాంగత్యం కంటే చెడు సాంగత్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజేష్ పై భార్య ప్రభావం ఉండి ఉండొచ్చు" "భార్య మాటలకు విలువిచ్చే పురుషుడంటే నాకు గౌరవం. అయితే...తన విచక్షణాజ్ఞానం ఉపయోగించ కుండా భార్య చెప్పిన ప్రతి మాటకూ తలూపే పురుషుడంటే నాకు అసహ్యం."
"జరిగిందేదో మనకు తెలియదు. నిజానిజాలు తెలియకుండా మనం ఎవరినీ విమర్శించకూడదు"
"ఏది ఏమైనా ..సభ్య సమాజం తలదించుకునే విధంగా రాజేష్ ప్రవర్తించాడు. ఇందుకు అతను మూల్యం చెల్లించుకోక తప్పదు. అతన్ని మేష్టారు క్షమించినా భగవంతుడు క్షమించడు" అంది పూర్ణిమ.
* * * * *
దాదాపు ఏడాది తర్వాత-
ఓ సాయంత్రం ఇంటి బయటి అరుగు దగ్గర తచ్చాడుతున్న వ్యక్తిని చూసి "ఎవరు కావాలందీ?" అని అడిగింది పూర్ణిమ.
అతను ఆమె దగ్గరికి వచ్చాడు. తెల్లగా, అందంగా ఉన్నాడతను. గడ్డం పెంచుకుని దీనంగా కనిపిస్తున్నాడు.
"మా నాన్నను ఏడాది క్రితం ఈ అరుగు మీద కూర్చోబెట్టి వెళ్ళాను. మీరు ఆయన్ని చూశారా?" అని అడిగాడు ఆమెని
"మీ పేరు రాజేషా?" అని అడిగింది పూర్ణిమ.
వెంటనే అతని కళ్ళు మెరిశాయి.
"అవును. మీరు ఆయన్ని చూశారా? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?" అని ఆత్రంగా అడిగాడు.
"లోపలికి రండి" అంటూ ఇంట్లోకి దారితీసింది పూర్ణిమ.
అతను సోఫాలో కూర్చున్నాక "ఏడాది క్రితం వదిలిపెట్టి వెళ్ళి, యింత తొందరగా వచ్చేశారే?" అంది వెటకారంగా. '
"వినాశకాలే విపరీత బుద్ది 'అని ఊరికే అన్నారా?"
"ఏమిటండీ, ఆ విపరీత బుద్దులు?"
"ఒకటా, రెండా.. ఎన్నని చెప్పమంటారు అమ్మానాన్నలకు చెప్పకుండా నేను రిషితను పెళ్ళి చేసుకోవడం, విషయం తెలిసి అమ్మ తిట్టితే వాళ్ళతో సంబంధం తెంచేసుకోవడం, అమ్మను వ్యధకు గురి చేసి ఆమె చావుకు కారణం కావడం, అంతటితో ఆగివుంటే బాగుండేది. అమ్మ చావుకబురు విని రాజమండ్రి వచ్చిన నాకు -నాన్న ఇంటిపై కన్ను పడింది. నాన్న ఇల్లు అమ్మి నా దగ్గరికి వచ్చేస్తే... ఎలాగోలా ఆ డబ్బు ఆయన్నుంచి తీసుకొని నా, స్నేహితులతో కలిసి ఎన్నాళ్ళుగానో నేను అనుకుంటున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యవచ్చనుకున్నాను.
అక్కడి నా స్నేహితుల్ని విచారిస్తే, ఇల్లు ముప్పైలక్షలు చేస్తుందని చెప్పారు. నాన్నను ఇల్లు అమ్మి ముంబై వచ్చి మాతో ఉండమని కోరాను. ఆయన అమాయకంగా ఒప్పుకున్నారు. నాన్న మాతో ఉండటానికి రిషితను ఒప్పించేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది. ఆరు నెలల్లో ఆయన్ను త్రిప్పి పంపిస్తానని ఆమెకు మాటిస్తే ఒప్పుకుంది. ఆ ఆరునెలలూ ఆయన్ను చాలా బాగా చూసుకుంటున్నట్లు నటించాము.
తర్వాత ఇల్లు కొనడానికి ముప్పై లక్షలు తక్కువ పడిందని చెబితే...ఆయన తన బ్యాంకు డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ ముప్ఫై లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు నేను వ్యాపారంలో పెట్టాను. ఇక ఆయన్ను వదుల్చుకోవడమే మిగిలింది. అందుకు రిషిత ఓ ప్లాన్ చెప్పింది.
తిరుమల కొండకు తీసుకెళతానని ఆయన్ను తిరుపతికి తీసుకొచ్చి, మీ ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి- నా స్నేహితుణ్ణి వెదకడానికి వెళ్తున్నానని ఆయనకి చెప్పి నేను బయలుదేరి ముంబై వెళ్ళిపోయాను. అంతకు ముందురోజు రాత్రి ట్రెయిన్లో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన సెల్ తీసుకుని మమ్మల్ని ఆయన మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం లేకుండా కాంటాక్ట్స్, మెసేజెస్ అనీ డిలీట్ చేశాను. ముంబై రాగానే ఆయన మళ్ళీ మమ్మల్ని చేరకుండా ఉండేందుకు ఇల్లు ఖాళీ చేసేశాను.
అయితే-మనం చేసిన పాపం మనల్ని తప్పక వెంటాడుతుందని పెద్దలు చెప్పే మాట నా విషయంలో ఋజువైంది. ముప్ఫై లక్షలు తీసుకున్న నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నా భార్య నన్ను వదలి, నన్ను మోసం చేసినవాడితో వెళ్ళిపోయింది. డబ్బునూ, భార్యనూ కోల్పోయిన బాధతో ఉద్యోగానికి న్యాయం చెయ్యలేకపోయాను. ఫలితంగా నా ఉద్యోగం పోయింది. నేను ఒంటరివాడినయ్యాను. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చే మనిషి లేకపోవడం ఎంత నరకమో నాకర్థమైంది. అంతకంటే దారిద్ర్యం ఇంకోటి లేదనిపించింది.
అప్పుడు నాన్న గుర్తొచ్చారు. వెంటనే దొరికిన ట్రెన్ పట్టుకుని ఇక్కడికి చేరాను. నాన్న మంచితనం వల్ల, ఆయన చేసిన మంచిపనుల వల్ల ఆయన ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉంటారన్న నమ్మకంతో వచ్చాను. ఆయనెక్కడ ఉన్నారు? ఆయన కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకుంటేగాని నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పండి, ప్లీజ్."
"మీరు ఆయనకిచ్చిన షాక్ ను ఆయన తట్టుకోలేకపోయారు. మీరు ఆయన్ను ఇక్కడ వదలి వెళ్ళిన వారం రోజులకే మరణించారు" అంది పూర్ణిమ."
రాజేష్ నమ్మలేనట్లు పూర్ణిమ వైపు చూశాడు....
తర్వాత తనలో తానే ఏదో గొణుక్కున్నాడు. తర్వాత లేచి నిలబడి "అమ్మ నగలు ఏ బ్యాంక్ లాకర్లో పెట్టారో మీకేమైనా చెప్పారా?" అని అడిగాడు.
"లాకర్లో లేదు. మీరొస్తే ఇవ్వమని నా చేతికే ఇచ్చారు" అంటూ గదిలోకి వెళ్ళి ఓ బ్యాగు తెచ్చి అతనికిచ్చింది.
బ్యాగు చూసిన అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
గబగబా బ్యాగు తెరచి అందులోని నగలను చూసుకున్నాడు. తర్వాత తన జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి ఆమెకిచ్చి-
"మీకు ఇంకా ఎదైనా గుర్తొస్తే ఈ నంబరుకు ఫోన్ చెయ్యంది" అని చెప్పి బయటికి నడిచాడు.
రాజేష్ వెళ్ళిపోయాక చాలాసేపు సోఫాలోనే కూర్చుండిపోయింది పూర్ణిమ. తర్వాతమేడపైకి వెళ్ళింది.
బాల్కనీలో దాదాపు ముఫైమంది విధ్యార్థుల మధ్య కుర్చీలో కూర్చుని ట్యూషన్స్ చెబుతున్నాడు రాఘవయ్య.
దూరంగా నిలబడి అతన్నే చూస్టూండిపోయింది.
"అతనితో అలా ఎందుకు చెప్పావు పూర్ణా?"
భర్త గొంతు విని ఉలిక్కిపడి తల తిప్పి చూసింది పూర్ణిమ. ఆమె ప్రక్కనే బాలరాజు నిలబడి ఉన్నాడు.
"మీరు విన్నారా?" అని అడిగింది అతన్ని
"ఇంట్లోకి వస్తున్నప్పుడు చివర్లో నీవన్న మాటలు వినిపించాయి. అతనికి ఎదురుపడటం ఇష్టంలేక మేడ పైకి వచ్చేశాను" అన్నాడు బాలరాజు.
రాజేష్ తనతో చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది పూర్ణిమ.
"బాబాయిగారు కొడుకు చేసిన నమ్మక ద్రోహం జీర్ణించుకోలేక బాధపడినా..త్వరగానే కోలుకున్నారు. ఉదయం సాయంత్రం యాభైమంది విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ, విద్య చేతిలో ఉంటే ఏ వయసులోనైనా, ఏ ఊర్లోనైనా బ్రతకవచ్చని నిరూపించారు. మనకు భారం కాకూడదని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ. నాకు శ్రమ ఇవ్వకూడదని వంట మనిషిని ఏర్పాటు చేసుకుని హుందాగా, గౌరవంగా బ్రతుకుతున్నారు.
ఈ సమయంలో రాజేష్ బాబాయిని కలిశాడంటే...రాజేష్ ప్రస్తుత పరిస్తిని చూసి ఆయన కృంగిపోతారు. రాజేష్ ఆయన కాళ్ళమీద పడితే...కరిగిపోయి అతనితో వెళ్ళిపోతాడు. రాజేష్ లోని మార్పు కేవలం నటనే అయితే బాబాయికి గతంలో జిరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది. క్రితంసారి రాజేష్ ఈయనను కనీసం మనుషుల మధ్య వదలి వెళ్ళాడు. ఈసారి ఏ అడవిలోనో, ఎడారిలోనో వదిలేస్తే బాబాయి గతేం కాను?
అందుకే..అతనిలోని మార్పు నిజమో, కాదో పరీక్షించాలనుకున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారని అతనితో చెప్పాను. నా అనుమానం నిజమైంది. తండ్రి చనిపోయాడని తెలిశాక...అతను ఏడవలేదు, సరికదా..కళ్ళనుంచి ఓ నీటిచుక్క కూడా రాల్చలేదు. అసలు...తండ్రి మరణించాడని తెలిసినప్పుడు ఓ కొడుకులో వ్యక్తమయ్యే బాధకి సంబంధించిన ఒక్క స్పందన కూడా అతడిలో కనిపించలేదు నాకు.
పైగా 'తల్లి నగల గురించి తండ్రి ఏమైనా చెప్పాడా?' అని నన్నడిగాడు. అప్పుడర్థమైంది ...అతను ఎందుకు వచ్చాడో? వెంటనే బీరువాలోని వాళ్ళమ్మ నగలు తీసి అతనికి ఇచ్చేశాను." "ఇచ్చేశావా?" అశ్చర్యంగా అడిగాడు బాలరాజు.
"నీకివ్వాలని మేష్టారు ఎంతో శ్రమ తీసుకుని రాజమండ్రి నుంచి తెచ్చారు. రేపు ఆ నగలు చూపించమని అడిగితే ఏం చేస్తావు?" అని అడిగాడు మళ్ళీ.
"నాకు ఇచ్చేశారు కాబట్టి ఇక ఆయన అడగరు. ఆయన సంస్కారం గురించి నాకు తెలుసు. కాని, చట్టపరంగా అవి చెందవలసినది రాజేష్ కే. అన్నీ కోల్పోయానన్న అతని మాట నిజమైతే ...అతను నిలదొక్కుకునేంతవరకూ ఆ నగలు ఉపయోగపడతాయి."
భార్యవైపు విస్మయంతో చూస్తూండిపోయాడు బాలరాజు.
ఆమెలో ఆవిష్కృతమైన అద్భుతమైన విశ్లేషణకీ, ఆమెలోని వ్యక్తిత్వానికీ ముగ్దుడయ్యడు అతను.
"నాకు ఏ నగలూ అక్కరలేదండీ, బాబాయిగారు మన ఇంట్లో ఉంటే చాలు. గతించిన మా నాన్నను ఆయనలో చూసుకుంటున్నాను. నాకు మా అమ్మానాన్న, మీకు మీ అమ్మానాన్నా లేరు కాబట్టి పెద్దవాళ్ళ విలువ మనకు తెలుసు. వాళ్ళు ఉంటే ఇల్లు ఎంత నిండుగా ఉంటుందో, మనం వాళ్ళనుంచి ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో, బాబాయితో గడిపిన ఈ కొద్దినెలల్లో తెలిసింది. ఆయన ఇంటినుంచి వెళ్ళిపోతే నేను చాలా కోల్పోయినదాన్నవుతాను. అయితే తండ్రీకొడుకుల్ని ముఖాముఖీ కలవనీయకుండా తప్పు చేశానన్న భావన నాలో ఉంది. నేను చేసింది తప్పే అని మీకు అనిపిస్తే...రాజేష్ కు కాల్ చేసి పిలిపించండి" అంది పూర్ణిమ -రాజేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ని బాలరాజుకిచ్చి.
"కడుపున పుట్టినవాళ్ళు కాదు బిడ్డలు..కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్ళే బిడ్డలూ అనేది మా అమ్మ. ఆ మాట నిజమైతే ఆయనకు ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వదులుకోలేని ఈ బంధం ఉన్నప్పుడు వదుల్చుకున్న ఆ రక్త సంబంధం అవసరం లేదు" అంటూ ఆ విజిటింగ్ కార్డ్ ని ముక్కలు ముక్కలుగా చించేసాడు బాలరాజు.
🌷🌷🌷 🌹🌹🌹 🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి