*మోక్ష మార్గాలు...(రెండవ భాగం)*
*భక్తి మార్గము...*
నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి. వాటిలోంచి నామ రూపాలను తీసేస్తే మాయ తొలగి, మిగిలిన అస్తి భాతి ప్రియం లేదా సత్ చిత్ ఆనందము అనే మూడు గుణాలు కలిగిన వస్తువు కేవల బ్రహ్మము. అది మిగిలిపోతుంది.
సగుణోపాసన చేయడానికి నామరూపాలు కలిగిన భగవంతుడిని ఆధారంగా స్వీకరిస్తాము. భక్తిమార్గంలో ప్రయాణించడానికి నామ రూపాత్మ కమైన ఆలంబన కావాలి. భక్తి మార్గం లో కూడా ప్రపంచానికి సంబంధించిన నామ రూపాలను మాయ అని గ్రహించాలి. భగవంతునికి సంబంధించిన నామరూపాలు ను భక్తికి ఆధారంగా స్వీకరించి ఆ మార్గంలో ముందుకు సాగాలి.
జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం కొద్దిగా సులువు. ఉపాసించుకోవడానికి ఒక ఆకారం అంటూ ఉంటుంది. కొల్లలు కొల్లాలుగా పురాణ కథలుంటాయి. భక్తి మార్గం లో ఇదే సులువైన విషయము. ఈ కారణం వల్లనే ఆదిశంకరులు భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తూ అసంఖ్యాకంగా స్తోత్రాలు రచించాడు. జ్ఞాన మార్గం అందరికీ వీలు కాదని ఆయనే చాలాచోట్ల చెప్పాడు.
జ్ఞాన మార్గం తో పోలిక చెప్పినప్పుడు మాత్రమే భక్తి మార్గం సులభము అని చెప్పాలి. భక్తి మార్గం లో ఉన్న కష్టాలు అందులోనూ ఉన్నాయి. భక్తి మార్గము అంటే మన రక్షణ మన అవసరాలు అన్నింటిని భగవంతుడి మీద వదిలిపెట్టి ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టి జీవితం గడుపు కోవాలి. ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి అందరూ కూడా ప్రాణాలు పోతున్నా దేవుడి మీదే భారం వేసి భక్తి మార్గం వదలకుండా మొండిగా కూర్చున్నారు.
ఇక్కడ ఒక సరదా కథ చెప్పు కోవాలి. వైకుంఠం లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఒకరోజు హడావిడి గా లేచి భూలోకం వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడట. లక్ష్మీదేవి, ఆయన ఆయుధాలు, గరుత్మంతుడు మొదలైన వాళ్లంతా తొందరపడి వెంట పరిగెత్తారు. కాస్త దూరం వెళ్లి విష్ణుమూర్తి ఆగిపోయి తాపీగా వెనకకు తిరిగి రావడం మొదలు పెట్టాడట. ఏమిటి స్వామీ అని అడిగితే నా భక్తుడిని దుర్మార్గుడైన పొరుగు వాడు ఒకటే కొడుతున్నాడు. నా భక్తుడు నారాయణ గోవిందా వాసుదేవా రక్షించు అని అరుస్తుంటే నేను కూడా తొందరపడ్డాను. నేను భూలోకం చేరే లోపల నా భక్తుడికి నమ్మకం పోయి వాడే సొంతంగా ఆ పక్కింటి వాడిని తిరగేసి కొట్టడం మొదలుపెట్టాడు. ఇంక మనం పోవడం దేనికని నేను వెనక్కు వస్తున్నాను అన్నాడట.
చాలా భాగం సంసార పక్షం భక్తులు ఇట్లా నే ఉంటారు. ప్రహ్లాదుడు అంబరీషుడు బలి చక్రవర్తి వాళ్ళ లాగా పూర్తి నమ్మకం భగవంతుని మీద ఎవరూ పెట్టుకోరు. పురుష ప్రయత్నం మీద ఒక కాలు, భక్తి మీద ఒక కాలు పెట్టుకొని ఉంటాము. తీరా పూర్తి నమ్మకం భగవంతుడి మీద పెట్టి పురుష ప్రయత్నం పూర్తిగా విడిచిపెట్టిన తరవాత ఆయన రక్షిస్తాడో రక్షించడో అప్పుడాయన రక్షించకపోతే కొంప మునుగు తుంది కదా అని సందేహం పీకుతుంటుంది. ఆ సందేహం ఉన్నంత కాలం ఆయన రాడు. ఇదే భక్తి మార్గం లో ఉన్న పెద్ద తలనొప్పి.
*పవని నాగ ప్రదీప్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి