24, జూన్ 2021, గురువారం

పాటలీకుసుమప్రియా

 773. 🔱🙏 పాటలీకుసుమప్రియా 🙏🔱


ఎనిమిది అక్షరాల నామం. ఈనామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *పాటలీకుసుమప్రియాయై నమః* అని చెప్పాలి.

పాటలీ కుసుమ = పాటలీ పుష్పమునందు, 

ప్రియా = ప్రీతికలది.

అమ్మవారు సృష్టి స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో లభించే పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టమే ! ' తీపి పదార్థాలంటే ఇష్టమైనా - మళ్ళీ ఆ తీపి పదార్థాల్లో ప్రత్యేకించి కొన్ని తీపి పదార్థాలంటే - మరీ ఇష్టం ఉంటూ ఉండటం సహజం. అలాగే పువ్వులన్నీ ఇష్టమే అయినా, సంపెంగ, మందార, దాడి మీ పుష్పాలలాగానే, 'పాటలీకుసుమం' అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇందుకు కారణం ఉంది.

ఈ తెలుపు ఎఱుపుల సమ్మిశ్ర వర్ణాన్ని 'పాటలవర్ణం' అంటారు. వాత్సల్యానికి, ప్రేమకు, ఆర్ద్రతకు, ఆప్యాయతకు చిహ్నమైన, సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది. అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంత ఇష్టం. హృదయంలోని ప్రేమను సూచించడానికి సంకేతించబడిన గులాబీ పువ్వు కూడా ఈ రంగులోనే ఉంటుంది. (Rose is for Love).

*పాటలీ కుసుమము* అనకుండా 'కుసుమ' అన్నా కూడా పాటలీ కుసుమమనే అర్థం చెప్పడం కూడా ఉంది. ఈ అర్థంలోనే హృదయాన్ని 'కుసుమపురం' అంటారు. అందరిలోని పాటలీ కుసుమ' వర్ణంలో ఉండే హృదయమే అమ్మవారికి ఇష్టమైన నివాసం కాబట్టి - అమ్మవారిని పాటలీ కుసుమప్రియా' అని అన్నారు.

అయ్యవారికి బిల్వవృక్షం ఇష్టమైతే - అమ్మవారికి పాటల వృక్షం ఇష్టమన్నమాట! పాటలీ కుసుమమునందు ప్రీతి కలది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం పాటలీకుసుమప్రియాయై నమః 🙏

🌷శ్రీ మాత్రే నమః 🌷

కామెంట్‌లు లేవు: