24, జూన్ 2021, గురువారం

ఏరువాక పౌర్ణమి

 *శుభోదయం! నమస్కారం!!*


🙏🙏


*ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలతో..*


*పర్వ విశిష్టత సమాచారం*



🌕🌧️🌏🐾🎊🌏🌧️🚩💐

                  


నేడు ఏరువాక పౌర్ణమి. భుక్తినిచ్చే రైతన్నలకు తొలి పండుగ. రైతు అందరివాడు. అంటే ఈపండుగ మనందరిదీ. వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా రైతులు జరుపుకునే పండుగే ఏరువాక పౌర్ణమి. ఈనాటి తిథి వివరణకు సంబంధించి వృషభ పూజ, హల ప్రవాహ వంటి పదాలు ఉన్నాయి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

         

పంచ భూతాత్మక మైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం! భూమిని భూమాతగా కొలుస్తాం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ' ఏరువాక ' అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని అర్థం.

             

వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

           

నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను 'సీతాయజ్ఞం' అని సంస్కృతంలో 'ఉద్వృషభ యజ్ఞం' అని, కన్నడంలో 'కారణి పబ్సం' అని జరుపుకుంటారు.

               

వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా పిలుస్తున్నారు. అధర్వణవేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుడిని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.

         

విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం’, ‘బీజవాపన మంగళ దివసం’,‘వాహణ పుణ్ణాహ మంగళమ్‌’.,‘కర్షణ పుణ్యాహ మంగళమ్‌.’ అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు.

              

శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఐతిహ్యం. హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుస్తుంది.


ఏరువాక పున్నమి శుభాకాంక్షలతో..


🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️🎛️

కామెంట్‌లు లేవు: