29, సెప్టెంబర్ 2021, బుధవారం

2021లో సింధూనది పుష్కరములు🙏🌹*

 *🌹🙏శ్రీప్లవనామ సంవత్సరము 2021లో సింధూనది పుష్కరములు🙏🌹*


సింధూ నది పుష్కరము

శ్రీప్లవ నామ సంవత్సర దక్షిణాయన శరదృతువు కార్తిక మాస బహుళ పక్ష విదియ శనివారం అనగా 20.11.2021న రోహిణి నక్షత్ర 3వ పాదం వృషభ రాశి శివయోగం తైతుల కరణం సింహలగ్న సమయంలో దైవ గురువు బృహస్పతి అంటే గురుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర 3వ పాదములో 50% బలంతో సమ స్థితిలో బాల్య అవస్థలో అడుగుపెట్టనున్నారు. ఆ క్రమంలో ఆరోజు రాత్రి అయినది కనుక రెండవ రోజు అయిన నవంబర్21,2021 ఆదివారం సూర్యోదయం నుంచి డిసెంబర్2 వరకు అంటే 12 రోజులపాటు సింధూ నదికి పుష్కరాలు జరగనున్నవి.ఋగ్వేదం అనేక నదులను వివరిస్తుంది. వాటిలో "సింధు" అనే పేరు ఉంది. ఋగ్వేదములో "సింధు"ను ప్రస్తుత సింధునది అని భావిస్తారు. ఇది దాని వచనంలో 176 సార్లు, శ్లోకాలలో 94 సార్లు ధృవీకరించబడింది. చాలా తరచుగా "నది" సాధారణ అర్థంలో ఉపయోగించబడుతుంది. ఋగ్వేదంలో, ముఖ్యంగా తరువాతి శ్లోకాలలో, సింధు నదిని సూచించడానికి ఈ పదానికి అర్ధం ఇరుకైనది, ఉదా. నాడిస్తుతి సూక్తా శ్లోకంలో పేర్కొన్న నదులలో సింధునది ప్రస్తావన ఉంది. ఋగ్వేద శ్లోకాలు బ్రహ్మాపుత్ర మినహా అందులో పేర్కొన్న అన్ని నదులకు స్త్రీ లింగాన్ని వర్తిస్తాయి.కానీ సింధూ నది మాత్రం పుంలింగాన్ని సూచిస్తుంది. అదే ఆశ్చర్యం ఏ నదికి లేని ప్రత్యేకత. అది ఒక్క సింధూ నదికి మాత్రమే ఉంది.

సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లద్దాక్ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్ లోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల 

మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు.

సింధూ నది కశ్మీర్ లోయలో ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్ లోయాలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరిస్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోనే మార్గ్ లో ఉద్భవించిన ఒక వాగును కశ్మీరీలు సింధ్ గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్ భాగ్ వద్ద జీలం నదిలో కలుస్తోంది. రెండు నదు కలిసే సంగమం కావడంతో యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధునదీ లద్దాక్ మీదుగా పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.

ఆచరణ విధానం:

మూడుమార్లు నదిలో మునిగి, అనంతరం రెండుచేతులతో నదీజలాలను తీసుకొని 18 మార్లు తర్పణములుగ తిరిగి ఆనదిలోనే వదలవలెను

తర్పణం

1) ఓం సంధ్యాం తర్పయామి 

2) ఓం గాయత్రీం తర్పయామి

3) ఓం బ్రాహ్మీం తర్పయామి

4)ఓం నిమృజీం తర్పయామి

5) ఓం ఆదిత్యం తర్పయామి

6) ఓం సోమం తర్పయామి

7) ఓం అంగారకం తర్పయామి

8) ఓం బుధం తర్పయామి

9) ఓం బృహస్పతిం తర్పయామి

10) ఓం శుక్రం తర్పయామి

11) ఓం శనిం తర్పయామి

12) ఓం రాహుం తర్పయామి

13) ఓం కేతుం తర్పయామి

14) ఓం యమం తర్పయామి

15) ఓం సర్వదేవతాన్ తర్పయామి

16) ఓం సకలపితృదేవతాన్ తర్పయామి

17) ఓం సర్వఋషీన్ తర్పయామి 

18) ఓం సర్వభూతాని తర్పయామి 


శ్లో !! నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా !

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ !!

భాగిరధి భొగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ !

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే !!

స్నాన కాల పఠె న్నిత్యం మహా పాతక నాశనం|| 


స్నానం తరువాత ప్రార్ధనా శ్లోకాలను చదువుతూ, ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖముగా కుడి చేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి , తీరానికి చేరి బట్టలని పిండుకోవాలి.

తరువాత పొడి బట్టలు కట్టుకొని తమ సంప్రదాయానుసారం విభూతి వంటి వాటిని ధరించి సంధ్యా వందనాదులు చేసుకోవాలి. తరువాత నదీ తీరాన గాని దేవాలయాన గాని దైవమును అర్చించాలి

మొదటి రోజు నారాయణనుడి అర్చన జప తర్పనాదులతో ప్రారంభించి

రెండోరోజు భాస్కర.

మూడురోజు మహాలక్ష్మి.

నాలుగో రొజు గణేష.

ఐదవ రోజు శ్రీకృష్ణ.

ఆరవ రోజు సరస్వతీ.

ఏడవ రోజు పార్వతీ.

ఎనిమిదవ రోజు మహేశ్వర.

తొమ్మిదవ రోజు అనంత.

పదవ రోజు నృసింహ

పదకొండవ రోజు వామన

పన్నెండవ రోజు రామచంద్రుడు

ఇలా 12 రోజులు 12 దేవతలను అర్చించి 12రోజులు 12 రకాల దానాదులు ఇవ్వాలి అలా చెయటం పుష్కర వ్రతంగా పిలుస్తారు ఇది ఉత్తమమైనది..

అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్రాద్దం నిర్వహించి పిత్రుదేవతలకు తర్పణాదులు ఇవ్వాలి

మొదటి రోజు హిరణ్యశ్రాద్ధం

తొమ్మిదవ రోజు అన్నశ్రాద్దం

పన్నెండవ రోజు ఆమ శ్రాద్దం..తప్పనిసరి 


పుష్కర సమయంలో నదీస్నానమే కాక పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా ముఖ్యం. 

పుష్కర సమయంలో చేయవసిన దానాదులు :

తేది దైవం పేరు - దానములు/పూజలు

21.11.2021(మొదటి రోజు) నారాయణ - ధాన్యము,రజితము,సువర్ణము, భూమి 


22.11.2021(రెండవ రోజు) భాస్కర - వస్త్రము,లవణము,గోవు,రత్నము. 


23.11.2021(మూడవ రోజు) మహాలక్ష్మి - బెల్లము,కూరలు,వాహనము, గొవు, అశ్వం, పండ్లు

24.11.2021(నాలుగవ రోజు) గణపతి - నేయి,నువ్వులు,తేనె,పాలు,వెన్న,నూనె,పానకం 


25.11.2021(ఐదవ రోజు) శ్రీకృష్ణ - ధాన్యము,బండి,గేదె,ఎద్దు,నాగలి 


26.11.2021(ఆరవ రోజు) సరస్వతి - కస్తూరి,గంధపుచెక్క,కర్పూరము, ఓషదులు, సుంగంద ద్రవ్యాలు 


27.11.2021(ఏడవ రోజు) పార్వతి - గృహము,ఆసనము,శయ్య(మంచము), పల్లకి, ఊయల 


28.11.2021(ఎనిమిదవ రోజు) పరమేశ్వరుడు- కందమూలములు,అల్లము,పుష్పమూలము, వెన్న 


29.11.2021(తొమ్మిదవ రోజు) అనంత - కన్య,పఱుపు,చాప(శయన వస్తువులు), దేవతా విగ్రహాలు, సాలగ్రామాలు,

30.11.2021(పదవ రోజు) నరసింహ - దుర్గ,లక్ష్మి,దేవి పూజ,వెండి, బంగారం, పూలు,ముత్యాలు, పురాణాలు 


1.12.2021(పదకొండవ రోజు) వామన - కంబళి,సరస్వతి,యజ్నోపవీతము,వస్త్రము,తాంబూలము, గ్రంథాలు 


2.12.2021(పన్నెండవ రోజు) శ్రీరామ - దశ,షోడశ మహాదానములలో అన్నిటిని దానం ఇవ్వవచ్చును


ఈ విధంగా పుష్కర వ్రతం దానాదులు ఆచరించటం అనంతకోటి పుణ్యఫలితాలను కలిగిస్తాయి.

కామెంట్‌లు లేవు: