29, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం

 *28.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరిందమ|*


*లోకాననుచరన్నేతాన్ లోకతత్త్వవివిత్సయా॥12552॥*


*9.10 (పదియవ శ్లోకము)*


*వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి|*


*ఏక ఏవ చరేత్తస్మాత్కుమార్యా ఇవ కంకణః॥12553॥*


శత్రుసూదనా! యదుమహారాజా! ఆ సమయమున నేను లోకుల తీరుతెన్నులను పరిశీలించుటకై అటునిటు సంచరించుచు అచటికి చేరితిని. ఆ కన్యవృత్తాంతము నుండి నేను గ్రహించిన విషయమిది - "సమస్య ఏర్పడినప్పుడు సమయస్ఫూర్తితో దానినుంఢి బయటపడవలెను. పెక్కుమంది కూడినచోట కలహము తప్పక జరిగి తీరును. ఇద్దరున్నచో వ్యర్థ ప్రసంగములు చోటుచేసికొనును. అందువలన ఆ కన్యయొక్క చేతి గాజువలె ఒక్కడే సంచరించుట ఉత్తమము.


*9.11 (పదకొండవ శ్లోకము)*


*మన ఏకత్ర సంయుంజ్యాజ్జితశ్వాసో జితాసనః|*


*వైరాగ్యాభ్యాసయోగేన ధ్రియమాణమతంద్రితః॥12554॥*


*9.12 (పండ్రెండవ శ్లోకము)*


*యస్మిన్ మనో లబ్ధపదం యదేతచ్ఛనైః శనైర్ముంచతి కర్మరేణూన్|*


*సత్త్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణముపైత్యనింధనమ్॥12555॥*


*9.13 (పదమూడవ శ్లోకము)*


*తదైవమాత్మన్యవరుద్ధచిత్తో న వేద కించిద్బహిరంతరం వా|*


*యథేషుకారో నృపతిం వ్రజంతమిషౌ గతాత్మా న దదర్శ పార్శ్వే॥12556॥*


యదుమహారాజా! స్థిరమైన ఆసనముపై కూర్చుండి ప్రాణాయామముద్వారా శ్వాసక్రియను అదుపుచేయవలెను. అభ్యాస వైరాగ్యములద్వారా మనస్సును వశపరచుకొని, దానిని లక్ష్యముపై స్థిరముగా నిలుపవలెను. ఆనంద స్వరూపుడైన పరమాత్మయందు మనస్సు స్థిరముగా నిలచినప్పుడు క్రమక్రమముగా కర్మవాసనల రేణువులు తొలగిపోవును. సత్త్వగుణము వృద్ధియగును. రజస్తమోగుణముల వృత్తులు అణగారి ఇంధనము లేని అగ్నివలె మనస్సు ప్రశాంతమగును. ఈ విధముగా చిత్తమును పరమాత్మయందు స్థిరముగా నిలిపినప్పుడు బాహ్యాభ్యంతరముల పదార్థముల జోలియే పట్టదు. నేనొక బాణమును సిద్ధపరచువానిని చూచితిని. అతడు తన పనియందే చిత్తమును నిలిపియుండుటవలన ఆ ప్రక్కనుండి ఒకరాజు తన సైన్యముతో వెళ్ళిపోవుచున్నను అతడు గమనింపలేకుండెను. సాధకుడు ఏకాగ్రచిత్తుడై కార్యమునందు నిమగ్నుడై యుండవలయునని, ఈ బాణకారుని వృత్తాంతము మనకు బోధపరచుచున్నది.


*9.14 (పదునాలుగవ శ్లోకము)*


*ఏకచార్యనికేతః స్యాదప్రమత్తో గుహాశయః|*


*అలక్ష్యమాణ ఆచారైర్మునిరేకోఽల్పభాషణః॥12557॥*


*9.15 (పదునైదవ శ్లోకము)*


*గృహారంభోఽతి దుఃఖాయ విఫలశ్చాధ్రువాత్మనః|*


*సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే॥12558॥*


మునీశ్వరుడు ఒంటరిగనే జీవింపవలెను. తన చుట్టును ఎట్టి గుంపును చేర్చుకొనరాదు. తన నివాసస్థానముపై మమకారము లేకుండా జాగరూకుడై యుండవలెను. ఆచార వ్యవహారములద్వారా తన యునికిని ఎవ్వరికిని తెలియనీయరాదు. మితభాషియై యుండవలెను. అనిత్యమైన ఈ శరీరము కొరకు శ్రమపడి, గృహనిర్మాణము చేయుట వ్యర్థము. సర్పము ఇతర ప్రాణులు నిర్మించిన పుట్టలలో చేరుచు హాయిగా నివసించును. అట్లే మునీశ్వరులు గుహలలో నివసింపవలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: