*29.09.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*9.16 (పదహారవ శ్లోకము)*
*ఏకో నారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా|*
*సంహృత్య కాలకలయా కల్పాంత ఇదమీశ్వరః॥12559॥*
*9.17 (పదిహేడవ శ్లోకము)*
*ఏక ఏవాద్వితీయోఽభూదాత్మాధారోఽఖిలాశ్రయః|*
*కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు|*
*సత్త్వాదిష్వాదిపురుషః ప్రధానపురుషేశ్వరః॥12560॥*
*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*పరావరాణాం పరమ ఆస్తే కైవల్యసంజ్ఞితః|*
*కేవలానుభవానందసందోహో నిరుపాధికః॥12561॥*
*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికామ్|*
*సంక్షోభయన్ సృజత్యాదౌ తయా సూత్రమరిందమ॥12562॥*
*9.20 (ఇరువదియవ శ్లోకము)*
*తామాహుస్త్రిగుణవ్యక్తిం సృజంతీం విశ్వతోముఖమ్|*
*యస్మిన్ ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్॥12563॥*
సర్వాంతర్యామియు, సర్వశక్తిమంతుడు ఐన భగవంతుడు కల్పప్రారంభమున ఎవ్వరి సహాయమూ లేకుండా తన సంకల్ప ప్రభావమున రచింపబడిన జగత్తును కల్పాంతమున (ప్రళయకాలమున) తన కాలశక్తి ద్వారా ఉపసంహరించును. తనలో లీనమొనర్చుకొనును. పిమ్మట సజాతీయ విజాతీయ స్వగతభేదము లేకుండా ఒంటరిగనే ఉండిపోవును. అన్నింటికిని అధిష్ఠానము, ఆశ్రయము అతడు. అతనికెట్టి ఆధారముగాని, ఆశ్రయముగాని లేవు. అతడు ప్రకృతి పురుషులకు నియామకుడు. కార్యకారణాత్మకమైన జగత్తునకు ఆదికారణుడైన ఆ పరమాత్మ తన శక్తియైన కాలప్రభావమున సత్త్వరజస్తమోగుణాత్మకములైన సర్వశక్తులను సామ్యావస్థలో నుంచును. తాను స్వయముగా కేవలుడై అద్వితీయ రూపముతో విరాజిల్లును. ఆ స్వామి కేవలము అనుభవైకవేద్యుడు. ఆనందఘనుడు. ఎట్టి ఉపాధులతోడను ఆయనకు సంబంధము లేదు. కేవలము తన కాలశక్తిద్వారా త్రిగుణాత్మకమైన మాయను క్షోభిల్లజేయును. దానినుండి ముందుగా ప్రధాన సూత్రమైన మహత్తత్త్వమును రచించెను. క్రియాశక్తిరూపమైన ఈ మహత్తత్త్వమే త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క మొదటి అభివ్యక్తి అనగా ప్రకటరూపము. ఇదియే అన్నివిధములగు సృష్టికి మూలకారణము. దానియందు ఈ విశ్వమంతయును సూత్రమునందు వస్త్రమువలె ఓతప్రోతమై యుండును. దానివలననే జీవుడు జననమరణ చక్రములో పరిభ్రమించుచుండును.
*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*యథోర్ణనాభిర్హృదయాదూర్ణాం సంతత్య వక్త్రతః|*
*తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః॥12564॥*
సాలెపురుగు తననుండి వెలువడిన దారముద్వారా గూడును అల్లుకొని అందే విహరించును. మఱల దానినే గ్రసించును. అట్లే పరమేశ్వరుడు ఈ జగత్తును తన నుండియే ఉత్పన్నము చేయును, జీవుల రూపములో అందు విహరించును. పిమ్మట దానిని తనలోనే లీనమొనర్చుకొనును.
*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*యత్ర యత్ర మనో దేహీ ధారయేత్సకలం ధియా|*
*స్నేహాద్ద్వేషాద్భయాద్వాపి యాతి తత్తత్స్వరూపతామ్॥12565॥*
యదుమహారాజా! ఏ ప్రాణియైనను ప్రేమతోగాని, ద్వేషముతోగాని, భయముతోగాని, నిశ్చయాత్మకబుద్ధితో ఏ వస్తువుపై తన మనస్సును ఏకాగ్రతతో లగ్నముచేయునో, ఆ ప్రాణికి ఆ వస్తు స్వరూపమే ప్రాప్తమగును. ఆ వస్తువుయొక్క గుణమే ప్రాప్తించును.
*9.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*కీటః పేశస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః|*
*యాతి తత్సాత్మతాం రాజన్ పూర్వరూపమసంత్యజన్॥12566॥*
మహారాజా! భ్రమరము ఒక పురుగును తీసికొనివచ్చి, గోడరంధ్రములో తానున్న ప్రదేశమున ఉంచి, పదేపదే ఝంకారము చేయుచుండును. ఆ భ్రమరమునకు భయపడి కీటకము సర్వదా ఆ భ్రమరమునే ధ్యానించుచుండును. తత్ప్రభావమున ఆ కీటకము తన పూర్వశరీరమును త్యజింపకయే ఆ భ్రమరరూపమును పొందును. అట్లే మానవుడు సంతతము పరమాత్మను భక్తితో చింతించుచున్నచో అతను క్రమముగా ఆ పరమాత్మ రూపమునే పొందును. నేను భ్రమరమునుండి ఈ స్ఫూర్తిని పొందితిని.
*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః|*
*స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో॥12567॥*
రాజా! ఈ విధముగా నేను ఈ ఇరువది నాలుగు మంది గురువుల నుండి ఉపదేశములను పొందితిని. నేను ఈ దేహముద్వారా పొందిన ఉపదేశములను తెలిపెదను వినుము.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి