29, సెప్టెంబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*423వ నామ మంత్రము* 29.9.2021


*ఓం ద్విజబృంద నిషేవితాయై నమః*


ఉపనయన సంస్కారం గలిగి, ద్విజులు అనిపించుకునే వారిచే త్రికాలసంధ్యలయందును సంధ్యా స్వరూపిణిగా ఆరాధింపబడే పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ద్విజబృంద నిషేవితా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ద్విజబృంద నిషేవితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి వారిని అనునిత్యం వారి వెంట ఉంటూ, సర్వకాల సర్వావస్థలయందును కరుణా కటాక్షవీక్షణములతో సకల శుభములను అనుగ్రహించును.


ద్విజులు అనగా ఉపనయన సంస్కారము గలవారు. అనగా పుట్టుట ప్రథమ జన్మమయితే, ఉపనయన సంస్కారముతో గాయత్రీ ఆరాధనార్హత కలిగియుండుట ద్వితీయ జన్మము ఏర్పడుతుంది. ఈ ఉపనయన సంస్కారము ఉన్నవారు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులు. బ్రాహ్మణులు బ్రహ్మదేవుని ముఖమునుండియు, క్షత్రియులు బ్రహ్మదేవుని బాహువుల నుండియు, వైశ్యులు బ్రహ్మదేవుని ఊరువులనుండియు జన్మించినవారై ఉపనయన సంస్కారార్హత కలిగి ద్విజులయారు. ఈ మూడు వర్ణములవారు త్రికాలములయందు ఆ పరమేశ్వరిని గాయత్రీ స్వరూపిణిగా (ప్రాతః సంధ్యలో గాయత్రిగాను, మధ్యాహ్న సంధ్యలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను) సంధ్యావందనమునందు ఆరాధించుదురు. గనుకనే అమ్మవారు *ద్విజబృంద నిషేవితా* యని అనబడినది.


ఇంకను చెప్పవలెనంటే అండజములు అనగా పాములు, బల్లులు, పక్షులు, చేపలు కూడా ద్విజులే కాబట్టి వీటిచేతకూడా అమ్మవారు పూజింపబడుచున్నదని ఈ నామ మంత్రము వలన భావించవచ్చును.


రేణుకా పురాణమునందు సంధ్యాదేవి (ప్రాతః కాల సంధ్యయందు గాయత్రీదేవి, మధ్యాహ్నకాల సంధ్యయందు సావిత్రీదేవి, సాయంకాల సంధ్యయందు సరస్వతీ దేవి) దేవతలచేత, ద్విజులచేత, మహాత్ములచేత సర్వకాల సర్వావస్థలయందును పూజింపబడును అని గలదు.  


వ్యాహృతి, సంధ్య, ద్విజబృంద నిషేవిత అను మూడు నామ మంత్రములను జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థగా అన్వయించుకోవచ్చును. అది ఎలాగ? అంటే వ్యాహృతి యనగా మాటలాడుట జాగ్రదావస్థయందు జరుగును. అందుచే వ్యాహృతి జాగ్రదావస్థగా అన్వయించ గలము. సంధ్యా అను శబ్దము స్వప్నమును తెలియజేయును. ఇది జాగ్రదావస్థకును సుషుప్త్యవస్థకును సంధికాలమున పుట్టును గనుక సంధ్యయగును. అలాగే సంధ్య అను శబ్దము వ్యాసులవారి సూత్రముల ప్రకారము, సంధ్య అనగా స్వప్నపరమైనదిగా చెప్పవచ్చును. ఇక సుషుప్తి యందు సకల జీవులును నిద్రయందు ఒడలెరుగని స్థితిలో ఉండుదురు. సుషుప్తియందు జీవులు పరబ్రహ్మయందు లయమయి ఉన్నారని కూడా భావించవచ్చును.


త్రికాల సంధ్యలయందు సంధ్యావందనము అనేది ద్విజులకు (బ్రహ్మక్షత్రియవైశ్యులకు) వేదవిహిత కర్మాచరణముగా చెప్పబడినది. త్రికాల సంధ్యలయందు పరమేశ్వరి సంధ్యాదేవిగా ద్విజసమూహములచే ఆరాధింపబడుచున్నది గనుక ఆ తల్లి *ద్విజబృంద నిషేవితా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ద్విజబృంద నిషేవితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: