29, సెప్టెంబర్ 2021, బుధవారం

కంఠ చామీకర న్యాయం

 భగవంతుని గూర్చి ప్రతివారు వెతుకుతున్నారు.  కానీ చాలామంది భగవంతుడు బాహ్యంగా ఎక్కడో వున్నాడని, గుడులు గోపురాలు, క్షేత్రాలు అని ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నారు.  ఎన్నోరకాల యజ్ఞ యాగాది క్రతువులు, నోములు, వ్రతాలూ చేస్తున్నారు.  ఆలా చేస్తే వారు చేసిన సత్కర్మలకు తగిన పుణ్యఫలం లభిస్తుంది కానీ భగవంతుడు మాత్రం దొరకడు ఎందుకంటె భగవంతుడు బాహ్యంలో లేఁడు.  మరి భగవంతుని వెతకటం ఎక్కడ, మోక్షం పొందటం యెట్లా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ విషయాన్నీ ప్రభోదించే కంఠ చామీకర న్యాయం గూర్చి తెలుసుకుందాం. 

కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు. ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.  మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.  “అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -

    సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.

ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.

అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. 

దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. 

మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.

సాధ్యవస్తువు అనగా కృషితో సాధించే వస్తువు.  ఆ కృషి ఎలాంటిదైనా కావచ్చు, భజన, కీర్తన, స్మరణ, యజ్ఞ యాగాది క్రతువులే కావచ్చు.  ఆలా సాధన వలన లభించేదానిని సాద్య వస్తువు అంటారు. 

సిద్ధవస్తువు అంటే వున్నవస్తువే కాకపొతే అది ఉన్నదన్న జ్ఞానం లేకపోతె దాని ఉనికిని తెలుసుకోలేము. ఒక చిన్న ఉదాహారణ మీరు మార్కెట్టుకు వెళ్లి ఏదో ఒక వస్తువు కొన్నారనుకోండి. తీరా డబ్బులు ఇవ్వాలనుకుంటే మీ జేబులో పర్సుకనపడలేదు.  అప్పుడు ఏమిచేస్తారు మీరు కొన్న వస్తువును వాపసు ఇస్తారా.  కానీ మీకు ఒక అలవాటు వుంది ఒకటి లేక రెండు వందల రూపాయలను మీరు మీ నడుము వద్ద వున్న ప్యాంటు జేబులో పెట్టుకుంటారు.  కానీ మీకు సమయానికి ఆ విషయం జ్ఞ్యాపకానికి రాలేదు.  కొంత ఆలోచించిన తరువాత జ్ఞ్యాపకానికి వచ్చింది అప్పుడు వెంటనే మీరు వాపసు ఇచ్చిన వస్తువుని దాని ధరచెల్లించి తిరిగి తెచ్చుకుంటారు. ఇలా మీ వద్ద వున్న వస్తువును మీరు తెలుసుకొనలేక పోవటం అజ్ఞ్యానం అదే తెలుసుకోవటం జ్ఞ్యానం.  మీలో వున్నపరమాత్మను (బ్రహ్మ)  తెలుసుకోలేక పోవటం పరమాత్మకు సంబందించిన అజ్ఞ్యానం అదే తెలుసుకోవటం పరమాత్మా (బ్రహ్మ) జ్ఞ్యానం ఇలా జ్ఞ్యానం పొందిన మానవుడే బ్రహ్మ జ్ఞ్యాని.  ఇలా చెప్పటం చాలా తేలిక కానీ ఆ జ్ఞ్యానం పొందటం మాత్రము కేవలం కఠోర తప్పస్సుచేయటం వలననే సాధ్యం. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 






కామెంట్‌లు లేవు: