29, మే 2023, సోమవారం

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 74*


. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

. ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 74*


'ఈ పావురం ఎవరిది ... ఎక్కడి నుంచి వచ్చింది ... ?' అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు చంద్రుడు. 


చాణక్యుడు పావురాన్ని దోసిట్లోకి తీసుకుని దాన్ని వాత్సల్యంగా చుంబిస్తూ "చంద్రా ..! కాలం కలిసి వస్తే అన్ని శుభాలే ఎదురవుతుంటాయి.." అన్నాడు. 


చంద్రుడు మరింత ఆశ్చర్యంతో "ఎదురొచ్చిన శుభం ఏమిటి, ఆర్యా...?" అని అడిగాడు. 


చాణక్యుడు పావురం రెక్కచాటు నుంచి చిన్న లేఖా పత్రాన్ని తీసి చంద్రుని మీదికి విసురుతూ "నువ్వే చూడు..." అన్నాడు. చంద్రుడు ఆ పత్రాన్ని మడత విప్పి సందేశాన్ని చదువుకుని ఆనందంతో "గురుదేవా ! తమకి పుత్రికోదయమయ్యింది" అని చెప్పాడు. 


చాణక్యుడు ముసిముసిగా నవ్వుతూ "ఆ కాశీ పురాధీశ్వరి నా ఇంట అవతరించిందన్నమాట. సంతోషం" అంటే గబగబా చేతి వేళ్ళమీద గణికం, గ్రహస్థానాలు, గతులు లెక్కించి "శుభం ... మదీయ పుత్రిక నామదేయం ... అన్నపూర్ణ..." అంటూ అప్పుడే అప్పడికక్కడే ఏ ఆర్బాటాలూ లేకుండా తన కుమార్తెకి 'అన్నపూర్ణ' అని నామకరణం చేశాడు చాణక్యుడు. 


చంద్రగుప్తుడికి ఆ శుభవార్త ఎంత సంతోషాన్ని కలిగించిందో, అంత విచారాన్ని కలిగించింది. అతడు బాధతో తలదించుకుంటూ "గురుదేవా... ! నావల్ల కదా తమరు యీ సంతోష సమయంలో భార్యపుత్రికలకు దూరంగా వుండిపోయారు" అన్నాడు వేదనతో. 


చాణక్యుడు వాత్సల్యంగా అతని భుజం తట్టి "చంద్రా ! మమతలూ.. మమకారాలూ మానవ సహజం వాటికి స్పందించడం, సుఖదుఃఖాలను అనుభవించడం మానవ నైజం. నేనూ వాటికేమీ అతీతుడ్ని కాను... కానీ, వీటన్నిటికంటే ముఖ్యమైనది ధర్మం... ధర్మపరిరక్షణామార్గంలో మమతానురాగాలను పాటించకూడదని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించాడు. కనుక దూరంగా వున్న వాళ్ల గురించి విచారించడం మాని స్వ ధర్మాచరణకు తలోగ్గినవాడే నా దృష్టిలో మనిషి. నేనే ఆ మార్గాన్నే అనుసరిస్తున్నాను" చెప్పాడు భావోద్వేగంతో. చాణక్యుని ధర్మాచరణ దృక్పధానికి చేతులు జోడించి నమస్కరించాడు చంద్రగుప్తుడు. 


ఇక చంద్రగుప్తునికి వివాహ ముహూర్తం నిశ్చయమైంది. పాంచాల భూపతి పురుషోత్తముడు సపరివార సమేతంగా వెంటరాగా చంద్రుని తోడ్కోని సింహపురానికి చేరుకున్నాడు చాణక్యుడు. నగర పొలిమేరలలోనే సింహాపురాధీశ్వరుడు విజయవర్మ వియ్యాలవారికి రాజోచిత లాంఛనాలతో స్వాగత సత్కారాలు జరిగాడు. 


పండితులు నిర్ణయించిన శుభముహూర్తానికి విజయవర్మ తన రాజ్యంతో సహా తన కుమార్తె శాంతవతిని చంద్రగుప్తునికి సాలంకృత కన్యాదానం మొనరించాడు. 'దేవ దుంధుబులు మ్రోగుతున్నాయా' అన్నట్లు మంగళతూర్యనాదాలు మిన్నుముట్టాయి. 


ఇరుపక్షాల వారికీ ఏకైక పెద్ద దిక్కుగా నిలిచి చాణక్యుడు అంతటా తానే అయి ఆ శుభకార్యాన్ని కన్నుల పండువుగా జరిపించాడు. వివాహానంతరం చంద్రగుప్తుడు, శాంతవతితో కలిసి సింహపురి సింహాసనం మీద పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, నూతన వధూవరులకు కానుకగా తన పాంచాల రాజ్యాన్ని వేద మంత్రయుక్తంగా సమర్పించాడు. 


"సింహపుర, పాంచాల రాజేంద్రుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రగుప్త మౌర్యుల వారికీ... జై ..." అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: