29, మే 2023, సోమవారం

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు



బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు       

            (ఒక వాస్తవ గాథ)

               ➖➖➖✍️



అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు.


బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని తబ్బిబ్బులు పడుతున్నారు.


ఇంతట్లో ఒకతను బస్సు టైర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.

పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.

ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు

వెళ్లేవాళ్ళే. 


ఒక చేతిన పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలిని టికెట్టు తీసుకోమని కండక్టర్ అడగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.


బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది. వానాకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో..?


అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా!"


ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!


కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన సీటు వద్దకు వచ్చి కూర్చున్నాడు.


బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కునుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపితే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్న తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది? ఆమెకు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు..?

ఒంటరిగా ఉన్న ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే..?


ఇంతలో ముసలామె దిగే ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .


కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.


బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. 

కండక్టర్ అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.


అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.


"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు?" అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్  ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి! బస్సును నడపండి!" అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కి

ఆదేశాలు ఇచ్చారు.


"నాయనా! నీ పేరేంటి?" అని కండక్టర్ని అడిగింది ముసలామె.


"అవ్వా! నా పేరుతో నీకేమి పని?.. నా పేరు మహాదూ వేంగుర్లే కర్.”


"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా?"


"మాల్‌ వన్." అన్నాడు కండక్టర్ .


"నీకు సంతానం ఎంత మంది?"


"ఇద్దరు" అన్నాడు కండక్టర్ .


ఇంతట్లో ముసలవ్వ ఇంటిని(పూరి గుడిసె ను) చేరుకున్నారు. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.


ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది. ఆమెకు దగ్గరి బంధువులు అనేవాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!


ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది.  భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.


ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా, వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను. కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌' బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరిట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేల

రూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మల

కోసం వాడుకోండి. నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను." అని

అంది. 


సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.


ఇదేంటి సమస్య? ఈ మహాదు

వేంగుర్లే కర్ ఎవరు? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ దగ్గర  సెలవు తీసుకొని

వెళ్లి పోయారు.                 


రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ కన్నుమూసింది.


ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్ని పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్, కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.


ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కానుక కండక్టర్ కి అన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. 


ముసలవ్వ తన పేరట వీలునామా వ్రాసిన విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది విన్న సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.


మహాదూ వేంగుర్లే కర్     పిలిచిన తారీఖున ఆఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.


అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. 


అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.


ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయంతో ఆమె ఇంత విలువైన సంపదను తన

పేరట వ్రాయటం అతడికి మతి

పోయినట్లు అయింది.!



అక్కడ సమీపం లో   పిల్లల గోల

వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా?" అని అడిగాడు

కండక్టర్.


"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా హైస్కూల్ నడుస్తోంది." అని

చెప్పాడు సర్పంచ్ . 


"ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి

నిమిత్తం తమ భూమిలోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.


"ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ ముందుకు రావటం లేదు." అని జవాబిచ్చాడు సర్పంచ్.


వెంటనే కండక్టర్ తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ - "ఇదిగో సర్పంచ్ గారూ పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకోండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన బంగారం తీసుకోండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరిట బడికి ఒకదివ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి. మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి." 


గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరి జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.


కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. 


ఊరి జనం అతడిని కొంత దూరం

వెంబడించింది.


చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదే

ఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.


మనం జీవితంలో ఒకరికి చేసిన

చిన్న, పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.


మనిషి మనిషి కి  మధ్య  మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు ఒకరికొకరం పంపుకుందాం!!✍️

Forwarded as recvd.

.

కామెంట్‌లు లేవు: