17, జూన్ 2023, శనివారం

*నరక ద్వారాలు*

            *నరక ద్వారాలు*

                ➖➖➖✍️


*‘ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారాలు మూడున్నాయి. అవి కామం, క్రోధం, లోభం.*


*కాబట్టి, బుద్ధిమంతుడైన మనిషి వాటిని త్యజించాలి’ అని ఉపదేశించాడు గీతాచార్యుడు.*


*క్రోధం తమ జీవితాలనే నాశనం చేయగలదన్న సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా, అసంబద్ధ రీతిలో పరిణమించిన క్రోధం విధ్వంసకారకమై అనేక చిక్కులనే తెచ్చిపెడుతుంది. క్రోధం అన్నది మన అంతర్గత వ్యవస్థలో విషాన్ని సృష్టించి మన శరీరం, మనసు, చైతన్యాన్ని సర్వనాశనం చేస్తుంది.*


*‘క్రోధానికి మూల కారణం కామం’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. ఇంద్రియ భోగాలను ఆస్వాదించే మన ప్రయత్నాలు చికాకు, అంతరాయాలతో కూడుకున్నప్పుడు క్రోధం ఏర్పడుతుంది. ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలూ క్రోధ కారకాలవుతుంటాయి.*


*అంతర్జాతీయ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు, తమ శ్రీమద్భాగవత పురాణ భాష్య రచనల్లో ఈ విధంగా ప్రస్తావించారు.. ‘ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని పొందాలని భావించేవారు క్రోధానికి ఎన్నడూ వశులు కాకూడదు. ఎందుకంటే, క్రోధంతో ప్రేరేపితులైనవారు ఇతరుల భయానికి కారణమవుతారు’ అని స్పష్టం చేశారు.*


*క్రోధాన్ని నియంత్రించే మార్గాలున్నాయి. అందులో ఒకటి క్షమించటం. ‘క్రోధం నుంచి విముక్తి పొందాలంటే, క్షమించటం ఎలాగో తెలుసుకోవాలంటారు’ శ్రీల ప్రభుపాదులు.*


*మరొక సందర్భంలో ఆయన క్రోధాన్ని గురించి వివరిస్తూ, ‘శారీరక వేగంలో క్రోధం కూడా ఒకటి. ఉదాహరణకు, మనం ఎవరి కారణంగానైనా అవమానానికి గురైతే సహజంగానే కోపం వస్తుంది. అయితే, ఆ సందర్భంలో మనం ‘సర్లే! అతనేదో మూర్ఖంగా అలా మాట్లాడాడు. అతని వల్ల నా నిగ్రహాన్ని ఎందుకు కోల్పోవాలి?’ వంటి భావనతో క్రోధమనే వేగాన్ని నియంత్రించగలం’ అని తెలిపారు.*


*క్రోధాన్ని నియంత్రించే రెండో మార్గం కర్మ సిద్ధాంతం. ఏదైనా కార్యసాధనలో మన ప్రయత్నాలన్నీ చెల్లాచెదురైనప్పుడు గానీ, ఎవరైనా మనతో అమర్యాదగా నడుచుకున్నప్పుడు గానీ మన కర్మ ఫలాలను కూడా పరిగణించుకొని ఒకసారి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన బాధలకు కారణం మన గత కర్మల ఫలితమేనని భావించినపుడు ఇతరులపై క్రోధాన్ని ప్రదర్శించం.*


*క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలంటే భగవద్గీత బోధనలను ఆచరించాలి. ప్రతి ఒక్కరూ మనసా, వాచా, కర్మణా సకలవిధాలా తపస్సును ఆచరించే విధానాన్ని అభ్యసించాలి.*


*ఇందుకు‘తపో దివ్యం’ ఒక మార్గం. ఒక మానవునిగా జీవిస్తూ, జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలనుకుంటే శాస్త్ర ఆదేశాలను (భగవద్గీత) తప్పక ఆచరించాలి.*


*‘మన దైనందిన కార్యకలాపాల్లో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి, ప్రతి విషయాన్ని గంభీరంగా స్వీకరించినట్లయితే, అసలు జీవించటమే అత్యంత కష్టతరమైపోతుంది’ అంటారు ప్రభుపాదులవారు.*


*లోకంలో సమయ సందర్భోచితంగా క్రోధాన్ని ఉపయోగించే విధానాలూ లేకపోలేదు. అదే కర్తవ్య నిబద్ధతతో ధర్మావలంబనకు ఉపయుక్తమయ్యే క్రోధం. ఇందుకు హనుమంతుడినే ఒక గొప్ప నిదర్శనంగా వివరిస్తారు ప్రభుపాదుల వారు…*


*క్రోధాన్ని నిర్మూలించలేకున్నా, దాన్ని సరైన రీతిలో ఉపయోగించవచ్చు. క్రోధంతో హనుమంతుడు లంకా దహనమే గావించినా, శ్రీరాముడి పరమభక్తుడిగా ఆయన ఆరాధ్యనీయులే. అంటే, హనుమ తన క్రోధాన్ని సరైన రీతిలో ఉపయోగించారని అర్థం.*


*చివరగా, ‘మనసును శూన్యం గావించాలనే ప్రయత్నం కృత్రిమమైనది. అదెంతో సమయం నిలువదు. అలాకాక, నిత్యం శ్రీకృష్ణుడినే స్మరిస్తూ, ఆయనను మరింత గొప్పగా ఎలా సేవించాలన్న తలంపుతోనే మనసు సహజంగా నిలకడగా ఉంటుంది’ అంటారు ప్రభుపాదులు.* 9440652774 హరే కృష్ణ!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

కామెంట్‌లు లేవు: