🍀32.
రామాయణం...
ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...
వాల్మీకి రామాయణం:
32 వ భాగం:
➖➖➖✍️
అప్పుడు దశరథుడు " కైకా! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది. సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది" అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.
“రామా! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుంద”ని వశిష్ఠుడు అన్నాడు.
తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు.
కొంతసేపటికి దశరథుడు తేరుకొని
"సుమంత్రా! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు" అని అన్నాడు.
తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.
అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అంది… "అమ్మా సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడే."
అప్పుడు సీతమ్మ… "మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను.
న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా ||
వీణో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు" అన్నది.
తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అంది… "నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు.
రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||
లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో!" అంది.
రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు
'రామా! రామా!' అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ‘ఆగు ఆగు’ అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు.
"నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు" అన్నాడు దశరథుడు.
రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.
అప్పుడు రాముడు… “సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు" అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది.
“మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది” అని అందరూ రాముడి వెంట బయలుదేరారు.
కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీతీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు.
రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. “సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయిని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను” అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు "ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకోలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా" అన్నాడు.
"అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా" అని కౌసల్య అంది.
అప్పుడు దశరథుడు “పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్యా" అని మళ్ళి మూర్చపోయాడు.
అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి
"వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు" అన్నాడు.
అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి "ఏడి రాముడు ఏడి రాముడు" అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు.
రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయి.
రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కొక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ రథం దిగి అయోధ్యా నగరానికి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు....
ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |
దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||
ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు" అని వేడుకున్నాడు.
తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒకఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.
తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |
నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||
రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో(ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన(తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు...
రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా" అన్నాడు.
గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |
అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |
పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||
అప్పుడు రాముడు "గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు" అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా....
కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |
శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||
యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |
తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||
“నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను?" అన్నాడు లక్ష్మణుడు.
మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు.
అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, 'నేను ఏమి చెయ్యను అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు.. "నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి
నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు" అన్నాడు.
అప్పుడు సుమంత్రుడు "రామా! నేనూ మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను" అన్నాడు.
“నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి" అన్నాడు.
వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.
తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |
లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||
అప్పుడు రాముడు గుహుడిని పిలిచి "గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా" అన్నాడు.
అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు.
మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు.
అప్పుడు రాముడు “నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను" అన్నాడు.
తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి "ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్క" అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు.
అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.
అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి "లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో" అన్నాడు.
రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు "అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు.
న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |
ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||
నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములను వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా" అన్నాడు.
“లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు" అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.
మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకొని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు.
అప్పుడు రాముడు “మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటె జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము" అన్నాడు.
భారద్వాజుడు ఇలా అన్నాడు…
“ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూటపర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చేరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షిఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి" అని అన్నాడు.
భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు.
లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలోవాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.9440652774.✍️
రేపు... 33వ భాగం...
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి