17, జూన్ 2023, శనివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 93*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 93*


శకటాలుడు ఆ లేఖ చదవడం ముగించగానే.... 


"జయహో.... చంద్రగుప్త రాజేంద్రా.... జయహో.... జయహో...." 


"జయహో.... మౌర్య సామ్రాజ్యాధినేతా.... జయహో.... జయహో....." 


సభాసదుల నినాదాలతో సభాభవనం యావత్తు హోరెత్తిపోయింది. కొద్దిక్షణాలపాటు సభికుల ఉత్సాహాన్ని నినాదాల రూపంలో కొనసాగినిచ్చి, పరోక్షంగా వారందరి మద్దతునూ చంద్రునికి కూడబెట్టిన చాణక్యుడు చెయ్యెత్తి వారిని వారిస్తూ... 


"తమ ఉత్సాహపూరిత నినాదాలతోటే చంద్రగుప్త మౌర్యునికి తమ మద్దతు తెలిపిన సభాసదులకూ, యావత్తు మగధ రాజ్య ప్రజానీకానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఈ కథలో... కొంత భాగం మీలో చాలామందికి తెలుసు. మరి కొంత చాలామందికి తెలియదు... 'ధర్మో రక్షతి రక్షితః'... కానీ మగధలో నందుల దుష్టపాలనలో ధర్మం నశించింది. అది మీ అందరికీ తెలుసు. ఇచట మరల ధర్మ ప్రతిష్టాపన నిమిత్తమే... నందులను శిక్షించవలసి వచ్చింది. దుష్ట శిక్షణ సందర్భంలో వారిని అంటిపెట్టుకుని వున్న కొందరు శిష్టులు కూడా బలి అవుతారు. అది సహజం. నేపాళ ప్రభువు పర్వతకుడు, వారి సోదరుడు వైరోచనుడు మంచివారైనా దుష్టనందుల సావాసం చేసిన కారణంగా శిక్షించబడ్డారు... ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే....?  


'చాణక్యుడు ప్రతిజ్ఞ చేశాడు, దానికోసమే నందులను హతమార్చడానికి కుట్రచేశాడు' అని ఇంకా కొందరు భావిస్తున్నారు. కుట్రj చేసింది నేనా ? మహానందుల వారి మీద నవనందులా ? ఆనాడు ధర్మసంస్థాపనార్థం శ్రీ కృష్ణభగవానుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని జరిపించాడు. నేను అంతటి వాడిని కాదు. ధర్మరక్షణకు కట్టుబడిన సామాన్య బ్రాహ్మణుడిని... ధర్మం మహానందుల వారి పక్షాన ఉంది. అందుకే ధర్మపరిరక్షణార్థం, మీ మహారాజుల వారి ఆశయాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ప్రయత్నించాను తప్ప, నాకు విరోధులంటూ ఎవ్వరూ లేరు. నిజం నాకు తెలుసు. నా ఒక్కడికీ తెలిస్తే చాలదు. మగధ ప్రజలందరికీ తెలియాలి. యీ మహాసభలో సామంతరాజులున్నారు, సచివులున్నారు, పురప్రముఖులున్నారు, విదేశీ పర్యటకులున్నారు, చరిత్రకారులున్నారు. సత్యం ఏమిటో వారందరికీ తెలియాలి. అందరూ ఆమోదిస్తేనే... మగధ సామ్రాజ్యానికి చంద్రగుప్తుడే నిజమైన వారసుడని అందరూ అంగీకరిస్తేనే... అతడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు... రండి... మహానందుల వారి లేఖానుసారం చంద్రగుప్తుని గుర్తింపు చిహ్నాలను పరీక్షించండి... ఇదిగో, మహానందుల వారి నామాంకితమైన రాజముద్రిక. దీన్ని పరిశీలించండి... నిజాన్ని నిగ్గు తేల్చండి... సందేహాలకు, సంశయాలకు తావులేకుండా సత్యాన్ని ప్రకటించండి...." అని ప్రకటించాడు చాణక్యుడు ఉద్విగ్న గంభీర స్వరంతో. 


చాణక్యుని ఆహ్వానాన్ని అనుసరించి కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి మహానందుల వారి లేఖనుసారం చంద్రగుప్తుని గుర్తింపు చిహ్నాలనూ, రాజముద్రికనూ పరిశీలించి పరీక్షించి ఆమోద సూచకంగా తలలుపారు. 


"సత్యమేవ జయతే... ధర్మమేవ జయతే... మగధ సామ్రాజ్యానికి యీ చంద్రగుప్త మౌర్యుడే అసలైన వారసుడు. మగధ సింహాసనాన్ని అధిష్టించగల అర్హత మురాపుత్రుడు చంద్రగుప్తునికి మాత్రమే ఉన్నది" అంటూ ధర్మమూర్తుల ప్రకటన వెలువడగానే సభాస్థలియావత్తూ కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది. 


"మీ అందరి ఆమోదంతో... మీ అందరి అభీష్టానుసారం... 'మురా - మహానందుల' వారి అనుంగుపుత్రుడు చంద్రగుప్తుడు మగధ రాజ్యాధీషుడుగా ఇప్పుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు... నేటినుంచీ ఇది 'మౌర్య సామ్రాజ్యం'గా గుర్తింపు పొందనున్నది.... కుమారా ... చంద్రగుప్తా... ! రా... మౌర్య సింహాసనాన్ని అధిష్టించు..." అని ఆహ్వానించాడు చాణక్యుడు సభికుల హర్షాతిరేకాలు వెల్లువెత్తుతుండగా. 


రాజపురోహితులు వేదమంత్రాలు పఠిస్తూ 

పూర్ణ కలశంతో ముందు నడవగా, వైతాళికులు స్తోత్రపాఠాలతో గానం చేస్తుండగా, సుందరాంగనలు సుగంధపరిమళభరిత పుష్పాలను వెదజల్లుతుండగా, శకటాలుడు, భద్రభటుడు, బాగురాయణుడు, డింగరాత్తుడు తదితర మంత్రి, సేనానులు వెనకగా నడవగా... 


సభాసదుల యావన్మందీ మహోత్సాహంతో జయ జయ ధ్వనులు సలుపుతుండగా... 


చంద్రగుప్తుడు మందగమనంతో ముందుకు నడిచి, ముకుళిత హస్తద్వయంతో యావన్మందికీ వినయాంజలులు సమర్పించి... వేదమంత్రోచ్చాటనల నడుమ సింహాసనాన్ని అధిష్టించాడు. రాజపురోహితుడు మౌర్యుని శిరస్సుపై వజ్రవైడూర్య మణిమయ విరాజితమైన స్వర్ణమకుటాన్ని అలంకరించాడు. దివినుంచి దేవతలు సైతం పుష్ప వర్షం కురిపిస్తున్నారా అన్న చందాన నలువైపులనుంచీ చంద్రునిపై పుష్పవృష్టి కురిసింది. 


"జయహో... మౌర్య సామ్రాజ్యస్థాపనాధీశా... ! చంద్రగుప్త మౌర్య రాజేంద్రా... ! జయహో .... జయహో..." అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జయజయధ్వనులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ సభ ఆసాంతం వరకూ ...

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: