17, జూన్ 2023, శనివారం

మండు వేసవి*

 *అహో! మండు వేసవి*


ఉ.

వేసవి దీర్ఘమయ్యె వినువీధుల చండపరాక్రమమ్ముతో 

దూసిన కాంతిఖడ్గమున దూకుడు జూపుచు భాస్కరుండు తా 

మీసము ద్రిప్పగా నడలు మేదిని యెల్లను తల్లడిల్లగా

నూసుల నుస్సురస్సురను నూర్పులె క్రాలెను మానవాళికిన్ 1


చ.

పవళులు దీర్ఘమయ్యె నిశిభామలు సన్నవడెన్ మహోష్ణతన్ 

ధవళత సూర్యతేజమున దర్పము జూపుచు హుంకరించగా 

సవతులు కాంతి యుష్ణములు సఖ్యత గూడక పోరుసల్పుచున్ 

నవనవలాడు భూసతిని నాశము జేయుచు వేధసేసెడిన్ 2


ఉ.

వేసవితాపమున్ వడలి పీడితుడైన నిశాచరుండు తా 

దూషిత తేజుడై నిలువ తోరపువెన్నెల లుప్తమైసనన్ 

ఊసుల డోలలూగెడి నవోఢల మోముల కల్వదేనెలన్ 

ప్రాశన జేయు భర్తృమధుపమ్ములు జిక్కెను మోడ్చుబూవులన్ 3


ఉ.

జాజులు మల్లెలున్ విరిసి సందడి జేయగ నింతికొప్పులన్ 

మోజులు మొల్కలెత్తినను మోహముతో దరిజేర రారుగా 

రాజసమొల్కు భర్తలు విరాగులవోలె దహించు వేడిమిన్ 

తేజము వీడు వీరులయి దీనవిలోకనపూరనేత్రులై 4


ఉ.

వేసవి సాగదీయబడి వృష్టినొసంగెడి కాలమాగెనో...

వేసవి వేడిమెక్కువయి వృష్టినొసంగెడి నీర మింకెనో...

వేసవిగాడ్పులుల్లముల భీతిజనింపగ ధాటి జూపెనో...

వేసవి పేరు జెప్పగనె భీతివడంకెను భూతజాలముల్ 5


చ.

శిశిరమునందు రాలు ఛదశీకరబృందమువోలె రాలుచున్ 

విసవిస పోవుచున్నయవి వేసవి వేడికి ప్రాణికోటులున్ 

పశుపతి యుగ్రుడై నిలువ భాసిలు నేత్రము పోల్కి సూర్యుడున్ 

శషభిష జేయుచుండె భువిసత్తను మృగ్యము జేయజూడగన్ 6

(సత్త=ఉనికి;  ఈ పద్యములో *శషసప్రాస* గ్రహించబడినది)


కం.

ఎక్కడ ఋతుపవనమ్ముల

వెక్కడ దాగెనొ కదలక హృదయము మండన్ 

దిక్కులు మొయిలులు క్రమ్మగ 

నిక్కక రాగదె కురియగ నీరము భువిపై 7


కం.

కప్పలు బెకబెకలాడగ 

చప్పున వర్షమ్ము కురియ సాగుమ మొయిలీ! 

ఇప్పటికిప్పుడు వేసవి 

గొప్పను వీడుచు దొలగగ కూర్మిని రావే! 8

*శ్రీశర్మద* 

8333844664


గ్రీష్మభయంకరాకృతిని

ఊష్మప్రవృధ్ధని ఓర్వనిప్రజన్

భీష్మసమగ్రదాహబహు

శూష్మతరాకృతియొప్పెపద్యముల్!!🙏🙏

కామెంట్‌లు లేవు: