మరణంలో స్మరణ
మహిమ
➖➖➖✍️
"పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండే వాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు."
ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసు కొనిపోవడానికి నిశ్చయించు కొన్నారు.
గురువుగారి దగ్గరకు వెళ్ళి...
“గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు".
వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.
ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులతో… “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు.
అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని *మాలవాడ*' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు.
ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ' అనే పదం మాత్రమే వినిపించింది.
ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.
*ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి.*
అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది.
అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు.
ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.
ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు.
అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి.
ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూపనికిరానిఅప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు.
*మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేకకాలం గడపసాగాడు.*
ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.
అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.
ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!
రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు. రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడ…
*కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.*
మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.
'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.
ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.
మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:
*జన్మదుఃఖం జరాదుఃఖం -జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.*
"పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక."
ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:
*మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః*
'తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త!' - అని చాటాడు.
ఇది విన్నరాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు…
*ఆశయా బధ్యతే లోకే - కర్మణాబహుచింతయా ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.*
అని చాటింపు వేశాడు.
"ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు."
ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.
మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు:
“ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాదు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”
తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.
అప్పుడు రాజు : “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్నిచేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.
తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.
అప్పుడు ఆ జీవన్ముక్తుడు : “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.
“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను"- అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.
రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.
ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించ సాగాడు. ఇలా కొంతకాలంగడిచింది.
దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.
“ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.
అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు…
“ఓ బ్రహ్మదేవా! ఏంచెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”
బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే…
మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.ఆచోటుదేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..
మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు.
అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.
*అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేక పోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.*
ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.
"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు…
"ఓబ్రహ్మదేవా మీకుతెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు *మాలపల్లె* అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది.
భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా!
కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”
అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.
*మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది*.
కాబట్టిఅంత్యకాలంలోభగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తున్నది.
*నామస్మరణే సులభోపాయం. ఆనామ స్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గంచూసుకొందుంగాక!*
పవిత్రాత్మ స్వరూపులారా!
శ్రీ భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ 8-6 శ్లోకంలో ఇలా …సెలవిచ్చారు :
శ్రీ భగవానువాచ :
*యం యం వాపి స్మరణ్ భావంత్యజ త్యంతే కళేబరం, తంతమే వైతి కవున్తేయ సదా తద్భావ భావి తః*! (08-06)
భావం : "అర్జునా! ఎవడు మరణకాలంలో ఏయే భావంతో వుంటూ దేహాన్ని వదులుతాడో, ఆభావం యొక్క స్మరణచేత కలిగిన సంస్కారం కలిగి ఉండడం చేత, ఆయా రూపాన్నే పొందుతున్నాడు."
భగవద్భక్తులైన వారంతా వారి వారి జీవితాల్లో సదా దైవనామ స్మరణ ను అలవాటు చేసుకొని, అంత్యకాలంలో కూడా ఆ దైవ నామాన్ని తలుస్తూ, ఆదైవాన్నే పొందెదరుగాక!✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి