10, జూన్ 2024, సోమవారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 10/11

 ॐ 

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


X. హనుమంతుడు - గొప్ప విశ్లేషకుడు - విచారణాధికారి 


    విభీషణుడు రావణుని కొలువునుండి శ్రీరాముని శరణుగోరుతూ వచ్చాడు. అతడన్న మాటలు సుగ్రీవుడు రామునకు నివేదించాడు. 

    రాముడు ఆ విషయాలపై మిత్రులుగా అక్కడవారి అభిప్రాయాలనడిగాడు. 

    అంగదుడు, శరభుడు, జాంబవంతుడు, మైందుడు వారివారి అభిప్రాయాలను చెప్పారు. 

    ఆ అభిప్రాయాలపై విశ్లేషణ చేస్తూ, హనుమంతుడు తన అభిప్రాయంతో సమర్పించిన అద్భుతమైన నివేదిక గమనించాలి. 


హనుమ శ్రీరామునితో 


   "రామా! నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి. సర్వసమర్థుడవు. వాక్చతురుడవు. నేను 


*వాక్చాతుర్యమును ప్రకటించుటకుగానీ, 

*మంత్రులతో పోటీపడిగానీ, 

*బుద్ధిమంతుడనని స్వాభిమానంతోగానీ, 

*ఏ విధమైన ప్రయోజనము ఆశించిగానీ, పలకడంలేదు. 


    ప్రస్తుతము కార్యంయొక్క ప్రాముఖ్యమును దృష్టిలో ఉంచుకొని, యదార్థములను పలుకుచున్నాను" 


                - అని తన వాఙ్మూలము ఇచ్చి, ఈ విధంగా పలికాడు. 


1.(అంగదుడు పలికిన) "గుణదోషములను పరీక్షించుట" 


    దానికి ఇది సరియైన సమయంకాదు. ఎవరినైనను రాజకార్యములయందు నియోగింపనిదే వారి సామర్థ్యమును తెలుసుకొనుటకు వీలుకాదు. క్రొత్తవారికి కార్యభారము అప్పగించుటయు సరికాదు.


2.(శరభుడు పేర్కొన్న) "గూఢచర్యం" 


  దూరప్రదేశమునందున్న శత్రువుల వృత్తాంతములను తెలిసికొనుటకు గూఢచారులచే విచారణ చేయించుట యుక్తముగానీ, సమీపములో మన కనులముందు ఉండి తన వృత్తాంతము స్పష్టంగా తెలుపుచున్నవాని విషయమున గూఢచర్యం సాధ్యపడదు మరియు ఆ గూఢచర్యం ఇక్కడ అవుసరం లేదు. 


3.(జాంబవంతుడు చెప్పిన) "దేశకాలానుగుణము కాదు" 


    విభీషణుడు వచ్చుటకు వాస్తవంగా ఇదే తగిన స్థానమూ సమయమూ. 

    అతడు నీచుడైన రావణుని నుండి పురుషోత్తముడైన నీ యొధ్దకు వచ్చినాడు. 

    అంతకుముందు అతడు రావణునిలోని దోషాలనీ, నీలోని సుగుణాలనూ వివేచనతో గుర్తించాడు. 

    రావణుని దుర్మార్గములనూ, నీ పరాక్రమ వైభవాలనూ ఎరిగియున్నాడు, 

    కనుక అతడు ఇచ్చటికి రావడం అన్నివిధాలా సమంజసమే! 

    ఇది అతని బుద్ధి కుశలతకు నిదర్శనము, 


4.(మైందుడు సూచించిన) "ప్రశ్నించుట" 


    అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధంగా ప్రశ్నిస్తే, బుద్ధిమంతుడైన ఆ వ్యక్తి ఆ మాటలు శంకిస్తాడు. అంతేగాక తనను గూర్చి తెలిసియు, వారట్లు ప్రశ్నించుచున్నారని గ్రహించినప్పుడు ఆ సత్పురుషుని మనస్సు చివుక్కు మంటుంది. 

    అంతట సహాయపడుటకై వచ్చిన అతడు విముఖుడవుతాడు. 

    ఆ కారణాన ఒక మంచి మిత్రుని కోల్పోవటం జరుగుతుంది. 


    అంతేకాక తగినంత సమయంతో సంభాషించిన పిమ్మట, భిన్నభిన్న స్వరములతో కూడిన అతని మాటలలోని తడబాటునుబట్టి అతని సదభిప్రాయాలైనా దురభిప్రాయాలైనా గ్రహింపవచ్చును. 


    కానీ, క్షణకాల సంభాషణలో అతనియొక్క భావములను పసిగట్టుట అశక్యం, 


విశ్లేషణతో గూడిన సిఫార్సుల నివేదిక 


*మాటలలోఎట్టి దుష్టభావమూ కనబడడంలేదు. 

*మోసలక్షణమూ కనబడడంలేదు. 

*ముఖం ప్రసన్నంగా ఉంది. 

*కపటబుద్ధి ఉన్నవాడు ఎట్టి శంక (తడబాటు) లేకుండా స్వస్థచిత్తుడై సమీపానికి రాడు. 

 

    కనుక ఇతనియెడ సందేహపడవలసిన పనియేలేదు. 


    ఎవ్వరైనా తన మనో భావాలను ప్రయత్నపూర్వకంగా కప్పిపుచ్చుకోడానికి పూనుకున్నా అవి దాగవు. మానవుల అంతర్గత భావాలు వారి ముఖమునందలి కవళికలలో బయటపడే తీరును. 


*నీ కార్యదక్షతా, రావణుని మిథ్యాప్రవర్తనా ఇతడు పరికించి చూచాడు. 

*నీవు వాలిని వధించి, సుగ్రీవుని పట్టాభిషిక్తునిజేసిన విషయాలనెఱిగియున్నాడు. 

    కావున నిన్ను శరణుజొచ్చినచో తనకు రాజ్యలాభము కలుగుతుందని ఇచటికి వచ్చియుండవచ్చు. 


సిఫార్సు 


    ఈ విషయములను దృష్టిలో ఉంచుకొని ఇతనికి ఆశ్రయమిచ్చుట సముచితమని నా అభిప్రాయము. 


అంతిమ నిర్ణయం 


    ఇకమీది కార్యాన్ని నీకు నచ్చిన రీతిగా ఆచరింపుము. 


    ఈ విధంగా విషయాన్ని విశ్లేషించి నివేదించిన హనుమంతుడు బుద్ధిమతాం వరిష్ఠుడు కదా! 


స్ఫూర్తి 


    విచారణకి సంబంధించి మనకి ఈ విషయంద్వారా బోధపడేది 


* పరీక్ష ( Observe by Test ),  

* గూఢచర్యం (Through a Spy), 

* దేశకాల నిర్ణయం ( Place and Time Jurisdiction ), 

 * ప్రశ్నించడం ( Interrogation ) 

  - అనే నాలుగూ, వాస్తవాలు వెలికి తీయడానికి మార్గాలు. 

    ఆ పైన వాటి విశ్లేషణ (Analysis). 


    హనుమవంటి విచారణాధికారులూ, శ్రీరాముని వంటి పాలకులూ ఉంటే, నిర్ణయాలు ఎంత న్యాయబద్ధంగా ఉంటాయో కదా! 


                        కొనసాగింపు 

                   

               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్                  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: