10, జూన్ 2024, సోమవారం

పోతన సన్నివేశ చిత్రణము!



పోతన సన్నివేశ చిత్రణము! 

శ్రీ హరి భక్తరక్షణాపరాయత!


సుందర సురుచిర ఘట్టముల నావిష్కరించుటలో పోతన మొనగాడు. ప్రతిఘట్టమున కొన్ని సుందర దృశ్యములుండును.వానినిపాఠకుని మనో పటమున మరపురాని మనోజ్ఙ వర్ణరంజిత చిత్రాలుగా మలచుట ఆతని కవిత లోని ప్రత్యేకత!


       గజేంద్రమోక్షమున భక్తపరాధీనుడైనహరి,గజరాజు మొరవిని వైకుంఠమునుండి పరుగుపరుగున వచ్చుదృశ్యమును పోతన వర్ణంచిన తీరు నాన్యతో దర్శనీయము.

"తనవెంటంసిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్,/ వానివెన్కను బక్షీంద్రుడు,వానిపొంతను ధనుఃకౌమోదకీశంఖచ/

క్రనికాయంబును,నారదుండు,ధ్వజనీకాంతుండురావచ్చిరొ/

య్యన వైకుంఠపురంబునన్ గలుగువారాబాలగోపాలమున్;//

చివరకు వైకుంఠపురంలోని పిలాపెద్దా అంతా హరివెనుక కదిలారు.


మంచిసుందరదృశ్యము.దీనిని 


వినువీధిలో నిలచి దేవతలు చూచుచూ ఆజగద్బాంధవునకు మ్రొక్కులిడు చున్నారట!

పరిశీలిపుడు.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్,సురారాతిజీ/

వన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహృ/

ద్వనవర్తిష్ణు, సహిష్ణు,భక్తజనబృంద ప్రాభవాలంకరి

ష్ణు,నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్,


ఒకరితో నొకరు ఇలాచెప్పుకుంటుంన్నారు.


"చనుదెంచెన్హరి,యల్లవాడె!  హరిపజ్జంగంటిరే లక్ష్మి,శం/

ఖనినాదంబదె!చక్రమల్లదె ,భుజంగధ్వంసియున్ వాడె,చ/

య్యన నేతెంచెనటంచు వేల్పులు నమోనారాయణాయే/

తి! నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్;


ఆయాకాశమేమో? ఆదేవతలేమో? మ్రొక్కులిడుటేమో మనమెన్నడు చూచినవారముగాకపోయినా చదువరుల మనోకుడ్యములమీద ఆచిత్రమంతయు మద్రబడునట్లు వర్ణించినాడు పోతనమహాకవి.


 ఇదీ ఆకవికలము జేసిన వర్ణనా మాయా మహేంద్రజాలము


.ఆచిత్రములను జూచుటకు మన నయనములుగాని,సులోచనములుగానిపనికిరావు.ఆలోచనా లోచనాలతో అంతరంగమున పరికింప వలసియుండును.ప్రయత్నింపుడు.ఫలితము మీచెంతనే! ఇట్టి మనోహర కవితా నిర్మాణచాతుర్యముగల పోతనమహాకవీంద్రునకు వినమ్రాంజలులర్పించుచు,

                      స్వస్తి!

🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: