23, జూన్ 2024, ఆదివారం

శాసన సభ్యులు - సుపరిపాలన 7*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 7*


సభ్యులకు నమస్కారములు.


ఇప్పటివరకు చట్టాలు, శాసన సభ, శాసన సభ్యులు గురించి క్లుప్తంగా విశదీకరించడం జరిగినది. ఇన్ని అంశాలకు మూలము *ప్రజాస్వామ్యం*.  

మనదేశంలో జన్వరి 26, 1950  న రాజ్యాంగము అమలులోకి వచ్చి భారతదేశం   స్వతంత్ర, సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నది. ప్రజల చేత, ప్రజల కోరకు, ప్రజలే ఎన్నుకునే విధానాన్నే ప్రజాస్వామ్యంగా నిర్వచించారు. 


ప్రజాస్వామ్యంలో పాలానాధికారాల అధికారము అప్పజెప్పుటకు  చట్ట సభలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కీలక పాత్ర వహిస్తారు.  చట్ట సభ్యుల అభ్యర్థిత్వానికి ప్రజలు ముఖ్యము, అత్యంత అవసరము. ఆలాగే ప్రజల నియోజక వర్గ  పాలనా నిర్వహణకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ముఖ్యపాత్ర పోషిస్తారు.  ఒకరిపై  ఇంకొకరు  ఆధారపడి ఉంటారు *కావున ప్రజలు మరియు చట్ట సభ్యుల మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది*. 


రాజ్యాంగము, ప్రజాస్వామ్యం, చట్టసభల క్రమంలోనే *రాజకీయాలు* అను పదమును విశ్లేషించుదాము. పూర్వ కాలంలో తమ తమ ప్రాంతాల పాలనకై ఆ ప్రాంత ప్రముఖులు *కొందరు* ముందుకు వచ్చే వారు.  ఆ రాజ్య (ప్రాంత) కార్యకలాపాలు నిర్వహించే వారు కనుక వారు రాజకీయ నాయకులుగా (POLITICIANS) గా పిలువ బడేవారు.  POLITICS అను ఆంగ్ల పదానికి నిఘంటు అర్థము *పాలనా సంబంధమైన సామూహిక నిర్ణయాలు  మరియు కార్యకలాపాలు*. ఇంకొక మాటలో చెప్పాలంటే *పరిపాలన*. కాలక్రమేణా రాజ్య నిర్వహణకు సంబందించిన కార్యక్రమాలే రాజకీయాలు. 


ప్రస్తుత అధునాతన కాలంలో ప్రజాస్వామ్య పద్ధతికి లోబడి అనేక రాజకీయ సంస్థలు (PARTIES) వెలసి, ఆ పార్టీల నాయకులందరు కూడా రాజకీయ నాయకులు (POLITICIANS) గా చెలామణి అవుతున్నారు. 


వాస్తవానికి *రాజకీయం* అను పదము *పరిపాలనకు* సంబంధించినది. కాని ఈ మధ్య కాలంలో జనాలు ఆ పదానికి వింత వింత పోకడలతో  ఆ పదాన్ని  భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ పదానికి అనుచిత, అసంగతమైన, హాస్యాస్పదమైన ధోరణిలో ప్రయోగిస్తున్నారు. ఉదాహరణకు...వాడి రాజకీయమే వేరు, అంత రాజకీయం మనకు రాదు ఇత్యాది.


*పరిణితి చెందిన రాజకీయవేత్తలను Statesman గా వ్యవహరిస్తూ ఉంటారు.* 


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: