23, జూన్ 2024, ఆదివారం

మరణాన్ని జయించగలడా

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 




మనిషి మరణాన్ని జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు సుఖభోగాలతోనే గడపాలనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదలి అక్రమ సంపాదనతో అపర కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప 'పరోపకార మిదమ్ శరీరమ్' అనే ఆర్యోక్తిని ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు. శరీరంతో సుదీర్ఘకాలం జీవిస్తూ, స్వార్థానికి పెద్దపీట వేసేకన్నా, ఆదిశంకరుల్లా అల్పాయుష్షుతో జీవించినా జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరంతో చిరంజీవిగా ఉండిపోవచ్చు.


ఈ లోకంలోకి అనునిత్యం లక్షలమంది వస్తూ, మరికొన్ని లక్షలమంది నిష్క్రమిస్తున్నారు. కానీ, కాల చరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్లు మనం గ్రహించాలి. అర్థవంతంగా జీవించడమే సార్థకత.

అర్ధవంతమైన జీవితమంటే కోట్లాది రూపాయల ధనం కన్నా విలువైన ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రతి మనిషీ తనకొక వ్యాపకం పెట్టుకుంటాడు. అది వృత్తి, లలితకళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు.ఉద్యోగమూ కావచ్చు. అందులో అంకితభావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజ్ఞకు గుర్తింపు లభిస్తాయి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థుల చదువు విషయమూ అంతే. ఏ రంగాన్నికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి.

కామెంట్‌లు లేవు: