22, జూన్ 2024, శనివారం

ఏరువాక పౌర్ణమి

 🌹 ఏరువాక పౌర్ణమి🌹


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


భారతీయ సంస్కృతికి , జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం.  దానికి తొలి పనిముట్టు నాగలి , ముఖ్యవనరు వర్షం.  ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ *'కృషిపూర్ణిమ'*. దీనికే *హలపూర్ణిమ,* *ఏరువాక పున్నమి* అనే పేర్లున్నాయి. *'ఏరు'* అంటే నాగలి అని , *'ఏరువాక'*  అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం , నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం *జ్యేష్ఠ పూర్ణిమ* పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం *జ్యేష్ఠ* అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు *జ్యేష్ఠపూర్ణిమ*. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు *(మంచు , ఎరువు , సూక్ష్మధాతువులు)* పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల *జ్యేష్ఠపూర్ణిమనాడు* ఈ పర్వదినాన్ని జరుపుతారు.


వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద , భూమి , పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి , పసుపు , కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు , కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని *(కొన్ని ప్రాంతాల్లో పులగం)* వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు , ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి , పశువులను , బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం *(ఎరువుగా మారిన పశువుల పేడ)* పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.


ఉత్తర భారతదేశంలో దీన్ని *'ఉద్‌వృషభయజ్ఞం'* అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 


రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ *'అనడుత్సవం'* అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ *(నాగలిపూజ)* , మేదినీ ఉత్సవం *(భూమి పూజ)* , వృషభ సౌభాగ్యం *(పశువుల పూజ)* మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ *'కృషిపూర్ణిమ'* ప్రసక్తి ఉంది. 🙏


🌺ఏరువాక పౌర్ణమి🌺


జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం. 

విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం. ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి. పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృ తి), అయ్యవారిని(భూమి) అర్చించాలి.

వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది. ప్రకృతిని కాపాడుకోవడమే


సేకరణ

కామెంట్‌లు లేవు: