*🙏జై శ్రీమన్నారాయణ 🙏* 22.06.2024,
బాల్యంలో ఆడే ఆటల్లో పరమపద సోపానం (వైకుంఠ పాళి) ఒకటి. మొదటి గడినుంచి ప్రారంభమయ్యే ఆట క్రమంగా ముందుకు సాగుతుంది. ఒక్కొక్కసారి నిచ్చెనలు ఎక్కి పైకి ఎగబాకడం మరోసారి పాము బారిన పడి కిందికి దిగజారడం క్రీడలో భాగం. అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు విజయ లక్ష్యం సాధిస్తే విజేత అవుతారు. అదేవిధంగా జీవితం ఒక క్రీడ, సుదీర్ఘ జీవితకాలం ఒక మైదానంలో క్రీడా స్పూర్తితో ఆడాలి... పోరాడి గెలవాలి. అదే జీవిత వైకుంఠపాళి ఆట.
ఒక్క విజయం సిద్ధిస్తే ఆట ఆగిపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. జీవితంలో అనేక విజయాలు, మరెన్నో పరాజయాలు తటస్థించి ఆశ నిరాశలకు గురిచేస్తాయి. ఇక నేను సాధించలేను ఓడిపోయాను అనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆశాభావం అవసరం.
పసివయసులో ఎదుగుదల కఠోర పరిశ్రమ. పొట్టను
నేలకు ఆనించి ముందుకు పాకడం, మోకాళ్లమీద చేతుల సహాయంతో సాగడం, కూర్చోవడం, నిలబడటం, తడబాటు అడుగుల నడక, క్రమంగా పరుగు... ఇవన్నీ మన కాళ్లమీద మనం నిలవాలనే లక్ష్యంగా సాగే సాధనా ప్రక్రియలు. జీవితంలో ప్రతి సన్నివేశం మనల్ని భయపెడుతుంది. పరీక్షిస్తుంది. నిలిచి గెలవగలమా అనే సందేహం కలుగుతుంది. ధైర్యాన్ని నింపుకొని సముచిత నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభించినా మధ్యలో వదిలేవారు బలహీన మానవులు వారే పరాజితులని భర్తృహరి పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకే లక్ష్యంతో సాగితే... విజయమాల వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తములని కీర్తించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి