22, జూన్ 2024, శనివారం

జ్ఞానం వైపు...

మన ప్రయాణం జ్ఞానం వైపు...

జ్ఞానం, విజ్ఞానం అనే మాటల పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడని, అతడు సర్వజ్ఞుడని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి.

లోకంలో మానవులను చూస్తే వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తెలివితేటలు ఉన్నట్లు గమనిస్తాం. కాళిదాసులాగా అందరూ కవులు కాకపోవచ్చు. జగదీశ్ చంద్రబోస్లోగా అందరూ శాస్త్రవేత్తలు కాకపోవచ్చు. అరవిందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా అందరూ యోగులు కాకపోవచ్చు కాని- ఎవరి జ్ఞానం వారిదే. వారికున్న జ్ఞానపరిధిలోనే వారి సుఖదుఃఖానుభవాలు ఉంటాయి. జ్ఞానానికి వ్యవహారానికి సంబంధం ఉంది. అంతేకాదు, జ్ఞానానికి మోక్షానికి కూడా సంబంధముంది. కాని వ్యవహార జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. దేనికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన ఫలాలనే ఇస్తుంది.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీత చెబుతుంది. దేని మీద శ్రద్ధ ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానమే దొరుకుతుంది. విద్యార్థుల శ్రద్ధను బట్టి వారికి ఆయా విద్యలను బోధించే విధానం అనాది కాలం నుంచీ ఉంది. కపిలుడు సాంఖ్య విద్యలో, పతంజలి యోగవిద్యలో ఆరితేరినవారు కావడానికి వారి అభిరుచులే కారణం.

పూర్వం శౌనకుడనే ఋషి కుమారుడు అంగీరసుడనే గురువు వద్దకు వెళ్ళాడు. దేన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుందో, దాన్ని చెప్పమని అడుగుతాడు. పర, అపర విద్యలు రెండున్నాయని, వాటిలో పరవిద్య అనగా పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుస్తుందని గురువు చెబుతాడు. శౌనకుడు గురువాజ్ఞను పాటించి బ్రహ్మచర్యాన్ని పాటించి, వివేకాన్ని సాధించి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.
లౌకిక విద్యలన్నీ అపరవిద్యలే. అవి లోక వ్యవహారాల్లో మనల్ని నడిపిస్తాయి. పరావిద్య మనల్ని సాంసారిక జీవితం నుంచి నివృత్తి చేసి యోగమార్గంలో నడిపిస్తుంది.

'నేను శాస్త్రవిద్యలో కుశలుడి'నని చెప్పుకొనే స్థాయికి ఒక శాస్త్రవేత్త ఎలా ఎదగగలుగుతాడో, అట్లే 'నేను నన్ను తెలుసుకున్నాను... పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాను... ఇంక తెలుసుకోవలసింది ఏమీ లేదు' అనే స్థాయికి యోగి అయినవాడు ఎదుగుతాడు. ఎవరే స్థాయికి ఎదగాలన్నా జ్ఞానమే ముఖ్యమైంది. అందుకు మానవుడు నిరంతరం కృషి చేయవలసి వస్తుంది. ఈ కృషినే ఆధ్యాత్మిక భాషలో తపస్సు అంటారు. తపస్సులో మనోనిగ్రహం ఉంది, స్థితప్రజ్ఞ ఉంది, ద్వంద్వ సహిష్ణుత ఉంది. లక్ష్యాన్ని చేరాలన్న కోరిక ఉంది.

కొందరు కోరికల్ని తక్కువగా భావిస్తారు గాని సాధించవలసిన లక్ష్యం తనకు గాని, ఇతరులకు గాని ఉపయోగకరమైంది అయితే తప్పక కోరిక ఆదరణీయమైందే. ఫలాపేక్ష లేకుండా ఒక పని చేయాలనుకోవడం ఉత్తమ ధర్మమని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తాయి. ఇక్కడ సత్సంకల్పం లేకపోతే నిష్కామకర్మ కూడా సాధ్యం కాదు కదా!

మనిషి జ్ఞానం వైపు ప్రయాణించాలి. అప్పుడు అతడికి గమ్యం గోచరిస్తుంది. గమ్యం అనేది జ్ఞానాన్ని అనుసరించే ఉంటుంది- భౌతిక వాదులకైనా, యోగులకైనా.

కామెంట్‌లు లేవు: