*_𝕝𝕝 ॐ 𝕝𝕝 22/06/2024 - శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం / నెత్రోత్సవం 𝕝𝕝 卐 𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*జగన్నాథ జ్యేష్ఠాభిషేకం జగన్నాథ వార్షిక స్నానం*
~~~~~
*పరాయ పరరూపాయ పరంపారాయ తే నమః.*
*పరంపరాపరివ్యాప్త పరతత్త్వపరాయ తే.*
సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా, లక్ష్మీదేవి సుభద్రాదేవిగా, ఆదిశేషుడు బలభద్రునిగా - దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం.
*అలౌకికీ సా ప్రతిమా లౌకికీతి ప్రకాశితా*
అలౌకికమైన దివ్యమూర్తులే లౌకికమైన దారుమూర్తులుగా ప్రకాశిస్తున్నాయి - అని పురాణవాక్కు.
ఏ క్షేత్రంలోనైనా మూలవిరాట్టుకు నిత్యాభిషేకమో, వారాభిషేకమో నిర్వహిస్తుంటారు. పూరీ జగన్నాథుని ఆలయం సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. పూరీలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రమే ఏడాదికొక్కరోజు మాత్రమే అభిషేకం చేస్తారు.
*_ప్రతీ ఏటా జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథునికి నిర్వహించే అభిషేకాన్నే దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు._*
ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరీలోని మూలవిరాట్టులు దారుతో చేసినవి. అంటే వేప చెక్కతో మలచిన శిల్పాలు. దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి గనుక, నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి, ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికే అభిషేకం చేస్తారు. దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు.
అయితే…..
జ్యేష్ఠపూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాదమస్తకం పవిత్రజలాలతో అభిషేకం చేస్తారు. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నానవేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు.
ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తాం. ఆ నేపథ్యంలోనే పూరీ జగన్నాథునికి కూడా 108 కలశాలతో జ్యేష్ఠపూర్ణిమ అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే వినియోగిస్తారు. స్నానవేదికపై ముగ్గురు దేవతలతో పాటు సుదర్శనుణ్ణి కూడా ప్రతిష్టిస్తారు. అనంతరం జగన్నాథునికి 35 కలశాలు, బలరాముడికి 33 కలశాలు, సుభద్రకు 22 కలశాలు, సుదర్శనుడికి 18 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు. అభిషేకం పూర్తైన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపజేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు.
స్నానపూర్ణిమ ఉత్సవం పూర్తైన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు. అందుకు కారణమేమిటీ అంటే నీళ్లలో బాగా తడిసిపోవడంతో స్వామివారికి జలుబూ, జ్వరం వస్తాయని అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజులపాటు చీకటి మందిరంలోనే ఉంచి ప్రత్యేక సపర్యలు చేస్తారు. నిత్యం సమర్పించే నైవేద్యాలు కాకుండా జలుబు నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసిన వంటకాలనే నివేదన చేస్తారు. ఈ పదిహేను రోజులూ భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు. అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే పట్టచిత్రా అంటారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజున చీకటిగదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్టిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు.
ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది. మొత్తం మీద జ్యేష్ఠ పౌర్ణమి నుంచి పక్షం రోజులపాటు స్వామివారు దర్శనమివ్వరు.
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జై జగన్నాథ 𝕝𝕝 卐 𝕝𝕝_*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
🚩 *_స్వస్తి_* 🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి