2, సెప్టెంబర్ 2024, సోమవారం

దేవాలయాలు - పూజలు 29*

 *దేవాలయాలు - పూజలు 29*


సభ్యులకు నమస్కారములు.


దేవాలయాలలో  సాయం సంధ్యలలో మామూలుగా దీపారాధన, హారతి, దైవ స్తుతి, అర్చనలు,  తీర్థ ప్రసాదాలు, శఠగోప్యం, భక్తులకు ఆశీర్వచనముల తదుపరి *మంగళ నీరాజనము, మంత్ర పుష్పం, ఛత్రం, చామరం, నృత్యం, వాయిద్యం, సంగీతం, కీర్తనం* ఇంతే కాకుండా రాత్రి సేవలలో భాగంగా *అనంత భోగాశయ్యాసనం, పర్యజ్కాసనం, పవళింపు* సేవలతో ఆ దినపు భగవత్ పూజా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

1) *మంగళ నీరాజనం* :- మంగళం యొక్క సాధారణ అర్థము *శుభము*. విశేష అర్థము *దీపము*.  దీపము *అగ్నిని* సూచిస్తుంది  నీరాజనము  = నీటితో ప్రోక్షణ = చిలకరించుట. హారతి ఇస్తూ జలమును దీపము =  అగ్ని చుట్టూ నీటిని చిలకరిస్తారు. దీపము = అగ్ని వలన సర్వ దోషాలు, అశుభాలు ప్రతిహత (భస్మ) మవుతాయి. నీటిని చిలకరించడం వలన వలయాకారమైన చట్రము ఏర్పడి పవిత్రత అక్కడ పరివేష్టింప బడి ఉంటుంది. అంతరార్థం మంగళ నీరాజనం వలన దోషాలు నివారింపబడి, చేకూరిన పవిత్రత వలన అక్కడ ఉపస్థితులైన సర్వులకు శుభం కలుగుతుంది.

2) *మంత్ర పుష్పం*:- దేవాలయాలలో పూజలలో అంతర్భాగంగా మంత్ర పుష్ప పఠనం ఉంటుంది. *భగవంతుడు సర్వాంతర్యామి (సర్వత్రా ఉన్నాడని) అని మంత్ర పుష్పం తెలియజేస్తున్నది*.


మంత్ర పుష్పం  వేదాంతర్గతమైనది. తైత్తిరీయ ఉపనిషద్ లో  మంత్ర పుష్ప వివరణ కనిపిస్తుంది. *మననాత్  త్రాయాతే ఇతి మంత్ర:*.  అర్థం :- మననం చేసే కొద్దీ రక్షించేది మంత్రం.  షోడశోపచారాలలో  మంత్ర పుష్పం ఒక అంగం. మంత్ర పుష్పం రెండు భాగములు. ఇందులో పూర్వార్ధం మొదటిది.  *ఓం సహాస్ర శీర్ష* తో ప్రారంభమై *సముద్ద్రేంతం విశ్వ సంభవ* తో ముగుస్తుంది. రెండవది ఉత్తరార్ధం *పద్మకోశ  ప్రతికాశ* తో ప్రారంభమై *సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి* తో ముగుస్తుంది. 


పూజాదికాలతో పరిచయమున్న అధిక సంప్రదాయ వాదులందరికీ కంఠోపాఠంగా ఉంటుంది.  *మంత్ర పుష్ప ప్రధాన ఆంతర్యము భగవంతుడు మనకిచ్చిన జ్ఞానేంద్రియాలు కృతజ్ఞతా పూర్వకంగా మనస్సనే పుష్పంతో భగవంతుని కీర్తిస్తాము*

ఆ స్వామి తత్వాన్ని అంగీకరిస్తూ, ఆవిభూతిలో మనల్ని భాగస్వాములను చేసినందులకు కృతజ్ఞతా పూర్వకముగా పుష్పాన్ని , అదే *మన్త్రపుష్పాన్ని* సమర్పిస్తాము. రెండవది *భగవంతుడు సర్వాంతర్యామి* అని మనలో కూడా ఉన్న భగవత్తత్వాన్ని వృద్ధి చేసుకుంటాము.


*భక్తి అంటే పువ్వులతో పూజచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం "మాత్రమే కాదు".  భగవంతుని ఉనికిని అనుభవ సిద్ధము చేసుకుని అతనిని ఎప్పుడు మరువక, ఎల్ల వేళలా  అతనికి సాధన మాత్రులై అతని ఆజ్ఞానుసారము నడుచుకోవడం. అట్టి భక్తి స్థిరపడాలంటే, భక్తి కథలను వినడం, భగవంతుని స్మరిస్తూ ఉండడం, భగవన్నామాలను సంకీర్తించడం ఎంతో తోడ్పడతాయి. ఆలా చేయడం వలన భగవంతుని గూర్చిన విస్మృతి కలుగదు. భక్తుడు "మాయలో"  పడకుండా ఎప్పుడు "చేతనా స్థితిలో" ఉంటాడు*. 


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: