2, సెప్టెంబర్ 2024, సోమవారం

*శ్రీ కంచి పరమాచార్య వైభవం.71*

 *శ్రీ కంచి పరమాచార్య వైభవం.71*


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*


 🌸 *శుక్రవారం, 2 ఏప్రిల్ 2021 - కంచి శ్రీ మఠం*🌸


శ్రీ మహాత్రిపురసుందరీ సమేత శ్రీచంద్రమౌళీశ్వర పూజ అనేది శంకర భగవత్పాదుల చేత స్థాపించబడిన పీఠాలను అధిరోహించిన పీఠాధిపతుల ప్రథమ మరియు ముఖ్యమైన ధర్మం. ఎట్టి పరిస్థితుల్లో అయినా మూడు కాలాల్లో ఈ పూజ జరిగి తీరవలసినదే. ఈ పూజలో చెప్పుకోదగ్గ విషయం పీఠాధిపతుల ఓపిక. గంటల తరబడి సాగే ఈ పూజలో వారు మౌనంగా ఉంటారు. కేవలం సంజ్ఞలతో సంవాదం. పూజ జరుగుతున్నంత సేపు ఒకే ఆసనంలో అటు ఇటు కదలకుండా నిశ్చలమైన మనస్సుతో, మూర్తీభవించిన ప్రసన్నతయై ఉంటారు. 


కంచి కామకోటి పీఠంలో శుక్రవారం జరిగే మూడవ కాలం పూజ విశేషమైనది. రోజూ కేవలం మొదటి కాలం పూజలో మాత్రమే అభిషేకం ఉంటుంది స్వామి వారికి. శుక్రవారం నాటి సాయంత్రం మాత్రం మూడవ కాలం పూజలో స్వామి వారికి అమ్మవారికి మళ్లీ అభిషేకం చేస్తారు. ఆ పూజ చూడటానికి రెండు కళ్ళు చాలవు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 


నిన్నటి సాయంత్రం అందరం చంద్రమౌళీశ్వర పూజ జరిగే చోట భక్తులు కూర్చుని వీక్షించే ప్రదేశంలో కూర్చుని ఉన్నాం. సమయం దాదాపు రాత్రి తొమ్మిది గంటలు. వచ్చిన వారిలో డెబ్భై ఏళ్ళ పైబడిన వారి నుండి రెండేళ్ల పసి పాపలు కూడా ఉన్నారు. ఎంతో ఆతృతగా వర్షం కోసం ఎదురుచూసే రైతుకి ఊరట కలిగించటానికి కురిసిన తొలకరిలాగా మా ఎదురుచూపులకు ప్రతిఫలమా అన్నట్టు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు చంద్రమౌళీశ్వర పూజా మండపంలోకి అడుగు పెట్టారు. వస్తూనే అందరి మీద ఒకసారి కృపా దృష్టి ప్రసరించి చల్లని చిరునవ్వే పలకరింపుగా ఆసనం మీద కూర్చున్నారు. 


తెర పడింది. అలంకార మండపంలో ఉన్న అయ్యవారిని, అమ్మవారిని అభిషేకం కోసం పానవట్టం మీదకి బదలాయించే క్రతువు చూడకూడదు. అందుకే తెర అడ్డు. తెర తీసేసరికి మహాత్రిపురసుందరి, చంద్రమౌళీశ్వరుడు పానవట్టం మీద అభిషేకానికి సిద్ధంగా ఆసీనులయ్యారు. స్వామి వారు సంకల్పం, ప్రాణాయామం మొదలైనవి చేసి, ఎప్పుడూ నేను చూసి ఎరుగని పని ఒకటి చేశారు. ఒకసారి తల పైకెత్తి గోడ గడియారం కేసి చూశారు. ఎంతసేపైనా చాలా ఓపికగా పూజ చేసే స్వామి వారు ఇవ్వాళ ఇలా సమయం చూడటం ఆశ్చర్యంగా అనిపించింది. మనసు పలువిధాలుగా ఆలోచించ సాగింది. ఎంత నడయాడే పరబ్రహ్మము అయినా శరీర ఉపాధి ఉంది కనుక శరీరం అలసిందా? పొద్దున్న నుంచీ ఎంత మంది ఆర్తి విని వారికి సలహా ఇచ్చుంటారు. ఎంత మందితో మాట్లాడి అలసి ఉంటారో. ఇలా వచ్చిన ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పూజ మీద దృష్టి పెట్టాను. జలాభిషేకం జరిగింది. ఇక ఆ పైన జరిగేది క్షీరాభిషేకం. అక్కడి వరకే అందరికీ చూసే అనుమతి ఉంది. ఆ పైన జరిగే ఫలోదకాలతో అభిషేకం, నారికేళ జలాభిషేకం, చందనాభిషేకం మొదలైనవి ఏకాంతంగా తెర వేసేసాక జరుగుతాయి. 


అందరం క్షీరాభిషేకం చూద్దాము అని వేచి చూస్తున్న వేళ ఎన్నడూ లేని విధంగా తెర పడింది. అయ్యో! క్షీరాభిషేకం చూసే అవకాశం ఇలా అయిపోయింది అనిపించింది. కొంత సేపు తర్వాత చందనాభిషేకం అయ్యాక ఇచ్చే హారతి చూపించటానికి తెర తీశారు. అందరం హారతి కళ్ళారా దర్శించి నమస్కారం పెట్టాక మళ్లీ తెర పడింది. 


ఈ సారి తెర తీసేసరికి అమ్మవారు, అయ్యవారు స్వామి వారి చేత నిండుగా అలంకరింపబడి బంగారు ఊయలలోని సింహాసనం మీద అధిష్టించి పూజలు అందుకోటానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి వారు మళ్లీ గోడ గడియారం కేసి చూసారు. నాలో మళ్లీ అలజడి. ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి వారికి? అందరి ఇబ్బందులు తీర్చేవారికి ఇబ్బంది ఉంటుందనుకోవటం మూర్ఖత్వం అయినా మనసు అలానే ఆలోచించింది ఆ క్షణం.


లేలేత బిల్వ దళాలను జాగ్రత్తగా చంద్రమౌళీశ్వరుడి పాదాల మీద పడేలా అర్చన చేస్తున్నారు స్వామి వారు. మళ్లీ ధూప దీప నైవేద్యాలు సమర్పించటానికి తెర వెయ్యబోతున్నారు. స్వామి వారు అక్కడున్న పరిచారకుడికి ఏదో సంజ్ఞ చేశారు. లోపల నుంచి పెద్ద తట్ట నిండా అరటిపళ్ళు తీసుకొని రాబడ్డాయి. తెర పడింది. కూర్చున్న భక్తులందరికీ రెండు చొప్పున అరటి పళ్ళు పంచ బడ్డాయి. ఇది కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం.


ఈ సారి తెర తీసేసరికి అమ్మవారికి, అయ్యవారికి నక్షత్ర హారతి ఇస్తున్నారు స్వామి వారు. ఆ పిదప పంచ హారతి, శేష హారతి, నంది హారతి, సింహ హారతి. ఇది అయిన తర్వాత మంగళ హారతి. మంగళ హారతి ఇచ్చే తీరు చూడాలి అస్సలు. అమ్మవారి, అయ్యవారి చుట్టూ చిన్న చిన్న వృత్తాలలో హారతి తిప్పుతుంటే మనకి వారిరువురి అలంకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హారతి తర్వాత ఇక తెర పడదు. వేద స్వస్తి, ఛత్ర, చామర సమర్పణ, శ్రీ కామాక్షి చూర్ణికా స్తోత్ర పఠనంతో ఆ కాలం పూజ ముగిసింది. 


స్వామి వారు సత్య దండం చేతికి ఎత్తుకుని మెల్లగా లేచి అమ్మవారికి, అయ్యవారికి ప్రదక్షిణంగా వేదిక దిగటానికి సిద్ధపడ్డారు. ఇది అయ్యేసరికి సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఆ సమయంలో కూడా ఓపికగా అక్కడున్న వారితో చిరు సంభాషణలు జరిపారు. అందరినీ ప్రసాదం (భోజనం) చేయాల్సిందిగా చెప్పినట్టు మెల్లగా భిక్ష చేసే గది వైపు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయారు స్వామి వారు.


భోజనాలు చేసే గదిలోకి మామూలుగా మేము వెళ్లి వేచి ఉంటే స్వామి వారి భిక్ష అయ్యాక, వేద పండితుల భోజనం అయ్యాక అమృతతుల్యమైన ఆ ప్రసాదం మాకు వడ్డించబడేది. దీనికి షుమారు ఒక పావు గంట పట్టేది. కానీ నిన్న అక్కడికి వెళ్లేసరికి పదార్థాలు అప్పటికే చేరవేసి ఉన్నాయి. ఇంక అందరం కూర్చుని వడ్డించుకొని తినటమే తరువాయి. అప్పటికి నా మట్టి బుర్రకి అర్థం అయింది. స్వామి వారు గడియారం కేసి చూసింది ఆయన బిడ్డలమైన మా ఆకలి గుర్తొచ్చి. అంతే కానీ ఆయనకి ఇబ్బంది కలిగి కాదు. ఆయన పూజించే మహాత్రిపురసుందరికి ఆయనకి అభేదం అని చెప్పకనే చెప్పారు. కన్నతల్లిలాగా తన బిడ్డల ఆకలిని పసిగట్టి అరటి పళ్ళు పంచేలా నువ్వు చేసినప్పుడు కూడా గడియారం చూడటంలో అంతరార్థం అప్పటికి అర్థం అవ్వలేదు. కాదు, అర్థం అవ్వనివ్వలేదు.


--- పరమాచార్య పాదరేణువు


*జయజయ శంకర హరహర శంకర*

కామెంట్‌లు లేవు: