2, సెప్టెంబర్ 2024, సోమవారం

02.09.2024. సోమవారం

 *జై శ్రీరాం..🚩🚩 శుభోదయం🌷🌅*


02.09.2024. సోమవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు శ్రావణ మాస బహుళ పక్ష *అమావాస్య* తిథి ఈరోజు పూర్తిగా, *మఖ* నక్షత్రం రా.12.20 వరకూ తదుపరి *పూర్వఫల్గుని* నక్షత్రం, *శివం* యోగం సా.06.20 వరకూ తదుపరి *సిద్దం* యోగం, *చతుష్పాద* కరణం సా.06.30 వరకూ తదుపరి *నాగవ* కరణం ఉంటాయి.

*సూర్య రాశి* : సింహ రాశి లో ( పూర్వఫల్గుని నక్షత్రం లో)

*చంద్ర రాశి* : సింహ రాశి లో

*నక్షత్ర వర్జ్యం*: ఉ.11.04 నుండి మ.12.50 వరకూ.

*అమృత కాలం*: రా.09.41 నుండి రా.11.27 వరకూ

 

( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.06.02

*సూర్యాస్తమయం*: సా.06.29

*చంద్రోదయం* : లేదు

*చంద్రాస్తమయం*: సా.06.13

*అభిజిత్ ముహూర్తం*: ప.11.51 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: మ.12.40 నుండి మ.01.30 వరకూ మరలా మ.03.10 నుండి మ.03.59 వరకూ

*రాహు కాలం*: ఉ.07.36 నుండి ఉ.09.09 వరకూ

*గుళిక కాలం*: మ.01.49 నుండి మ.03.22 వరకూ

*యమగండం* : ఉ.10.42 నుండి మ.12.16 వరకూ.


ఈరోజు *సోమవతీ అమావాస్య, ఆమా సోమవార వ్రతం*. అమావాస్య తిథి సోమవారం వచ్చిన రోజును సోమవతీ అమావాస్య అని పిలుస్తారు. శివ పురాణం ప్రకారం శివుడిని పూజించడానికి సోమవతీ అమావాస్య చాలా పవిత్రమైన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి,శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమ జాతక చక్రంలో చంద్ర గ్రహ దోషాలు ఉన్నవారు, వాటిని అధిగమించడానికి ఈరోజు చంద్ర గ్రహ శాంతులు చేయించుకుంటారు.


ప్రతి అమావాస్య రోజు పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలం. అంతేకాకుండా కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం.


ఒరిస్సా రాష్ట్రం లో ఈ రోజు *సప్త పూరీ అమావాస్య* గా పండుగ జరుపుకుంటారు. ముఖ్యం గా పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయం లో, అలం చండి దేవాలయం లో వేదోక్త ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ రోజు *సప్త పూరీ తడ* అనే ప్రత్యేక తీపి వంటకాన్ని జగన్నాథ దేవాలయం నుండి జగన్నాథుడు పంపే ప్రత్యేక బహుమతి గా అలం చండి దేవాలయానికి భక్తులు పంపుతారు.


ఈరోజు *పోలావ్రతం*. దీనినే *పోలాంబ వ్రతం అనీ, పోలాల అమావాస్య* అని కూడా పిలుస్తారు.ఈ వ్రతాన్ని సంతానం లేని స్త్రీలు,తరచూ గర్భస్రావం అవుతున్న వారు త్వరగా దోషాలు తొలగి సంతానం కలగాలని కోరుకుంటూ ఆచరిస్తారు. పోలేరమ్మ తల్లి,పోచమ్మ తల్లి లేదా పొలాంబ దేవత గా పిలవబడే గ్రామదేవతలు,తమ సంతానాన్ని కాపాడి కష్టకాలం లో రక్షించే శక్తులుగా భక్తులు భావిస్తారు.వివాహిత స్త్రీలు తమ సంతాన ఆయురారోగ్యాలు కోసం ఈరోజు ఈవ్రతం ఆచరించి కందదుంప ను బ్రాహ్మణులకు దానం చేస్తారు.


ఈరోజు *పిఠోరి అమావాస్య*. ఈరోజు భక్తులు దుర్గాదేవి ని పూజిస్తారు. పిఠ్ అంటే ధాన్యపు పిండి అని అర్థం. ఈరోజు వివాహిత తల్లులు తమ పిల్లల ఆయురారోగ్యాలు కోసం,ఉన్నతి కోసం బియ్యపు పిండి తో 64 దేవతల ప్రతిమలను తయారుచేసి, దుర్గాదేవిని, అష్టమాతృకలను, సప్తమాతృకలను పూజించి ప్రత్యేక ఆహార పదార్థాలను నివేదన చేస్తారు.


ఈరోజు *కుశ గ్రహణం*.ప్రతి హిందూ మత కార్యక్రమాలలో తప్పనిసరిగా వాడే దర్భలను సేకరించడానికి ప్రత్యేకమైన రోజు.


వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు *అన్వాధానం*. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి, రేపు ఉదయం *ఇష్ఠి* రోజు యజ్ఞం చేస్తారు.


ఈరోజు *అయిదవ శ్రావణ సోమవార వ్రతం*. భక్తులు ఈరోజంతా పగటిపూట ఉపవాసం ఉండి,108 బిల్వాలతో,రుద్రాభిషేకంతో శివుడిని పూజించి, నక్తకాలం లో (సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ,నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత కానీ)భోజనం చేస్తారు.


ఈరోజు *అయిదవ శివ ముష్ఠీ వ్రతం* .వివాహిత స్త్రీలు,తమ పెండ్లి అయిన మొదటి అయిదు సంవత్సరాలు, శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటి పూట భోజనం చేసి,శివుడిని బిల్వపత్రాలతో పూజించి ఒక్కో సోమవారం రోజున ఒక్కో ధాన్యంతో ప్రసాదం నివేదిస్తారు. అయిదవ సోమవారం రోజున బార్లీ గింజలు తో చేసిన పదార్థాలను నివేదన చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తలు మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని నమ్మకం.


కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు *అగ్ని సావర్ణీక మన్వాది* శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు *రుద్ర సావర్ణీక మన్వాది*. ప్రతి మన్వాది రోజున పితృ దేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం.


ఈరోజు *వృషభోత్సవం*. వ్యవసాయదారులు తమ ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు.


శివ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్:6281604881

కామెంట్‌లు లేవు: