*‘‘తండ్రి బ్రతికుండగా పెద్దలను అర్చించకూడదా?‘‘*
శ్రీక్రోధి పితృపక్షోత్సవ ప్రచారం 14 !!!
పితృదేవతాపంచాంగం
==========================
అక్టోబర్ 3, 2024 దౌహిత్రమహాలయం
=============================
దీనికి సమాధానం గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు స్పష్టంగా చెప్పారు.
మహాభారతంలో వ్యాసమహర్షి చెప్పిన చిత్రమైన వాస్తవం తెలుసుకుందాం.
నాగకన్య ఉలూపి గంగానది ఒడ్డున అర్జునుడిని వదిలిన తరువాత ఆయన మణిపురం చేరుకున్నాడు. అక్కడ చిత్రాంగదను చూశాడు. ఆమెను భార్యగా చేసుకోవాలని అనుకుని ఆమె తండ్రి అయిన మహారాజు చిత్రవాహనుడిని పిల్లనివ్వమని అడిగాడు. దానికి ఆయన తన వంశంలోని పూర్వీకుల్లో ఒకరికి సంతానం లేకపోతే ఈశ్వరుని కోసం తపస్సు చేయగా సంతోషించిన ఈశ్వరుడు ఇకపై తమ వంశంలో ప్రతీ ఒక్కరికీ తప్పని సరిగా ఒక బిడ్డ జన్మిస్తుందని వరం ఇచ్చారని చెబుతాడు. అప్పటి నుంచీ తన వంశంలో ప్రతి ఒక్కరికీ ఒక మగసంతానం కలుగుతూ వచ్చిందని అయితే తనకు మాత్రమే ఆడసంతానం కలిగిందని అంటాడు. ఆమే ఈ చిత్రాంగద అని, తన వంశం నిలవాల్సింది చిత్రాంగద వల్లేనని, కనుక ఆమెను కావలిస్తే ఓలి ఇచ్చి (కన్యాశుల్కం) పెళ్లి చేసుకోమని అంటాడు. కన్యాశుల్కం ఏమిటి అంటే ఆమెకు ఒకే ఒక సంతానం కలుగుతుందని ఆ మగబిడ్డను పుట్టగానే తనకు దత్తత ఇవ్వాలని షరతు విధిస్తాడు. దీనికి అర్జునుడు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకుని మూడు సంవత్సరాలు కాపురం చేస్తాడు. ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాక అతడిని చిత్రవాహనునికి అప్పగించి యాత్రలలో ముందుకు కదులుతాడు.
ఇది వ్యాసుడు జరిగింది జరిగినట్లు చెప్పాడు. కేవలం 1-235వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచీ 28వ శ్లోకం వరకూ అంటే 12 శ్లోకాల్లో చిత్రాంగద చరిత్ర వ్యాసుడు చెబుతాడు. కానీ ఇది అతి ప్రధానమైన ఘట్టం. భారతదేశంలో దత్తతస్వీకారం గురించి అనేక విషయాలు ఈ చరిత్ర చెబుతుంది.
వ్యాసుడు చెప్పింది తెలుసుకున్నాక అర్జునుడు భార్యను ఓలిచ్చి పెళ్లి చేసుకున్నాడనేది స్పష్టం అవుతుంది. (ఏతత్ శుల్కం భవత్వస్యాః కులకృజ్జాయతామిహ। ఏతేన సమయేనేమాం ప్రతిగృహ్ణీష్వ పాండవ॥ 1-235-27 ) ఓలిగా కొడుకుని ఇచ్చాడు. అందులో సందేహం ఏముంది? బార్టర్ సిస్టంలో కొడుకుని అమ్మి ఆలిని కొనుక్కున్నాడు. ఇవి ఏమాత్రం దాపరికం లేకుండా వ్యాసుడే చెప్పాడు.
నిజానికి శుల్కం అని అనడంలో కొంత హాస్యం వాడినా ఇది హిందూ ధర్మసమ్మతమే.
చిత్రవాహనుడి దగ్గరకు అర్జునుడు వెళ్లగానే ముందుగా నీవెవరు అని అర్జునుడిని ప్రశ్నించాడు. అర్జునుడు తన వివరాలు స్వయంగా తానే చెప్పుకున్నాడు. ఇది విన్నతరువాత చిత్రవాహనుడు మధురమైన స్వరంతో మాట్లాడాడని వ్యాసుడు చెప్పాడు. ఇక్కడ చిత్రవాహనుడు ఎందుకు సంతోషించాడంటే ఇన్నాళ్లూ తాను ఇల్లరికం వచ్చే అల్లుడి కోసం ఎదురు చూస్తున్నాడు. నిజానికి ఇల్లరికం వెళ్లినా వంశం అల్లుడిదే ఉంటుంది. కానీ తన కూతురికి ఒకే ఒక బిడ్డపుడుతుందని తెలిసీ ఆ బిడ్డకూడా తనకే దత్తత ఇచ్చే అల్లుడు కావాలని కోరుకుంటున్నాడు. రాజరికాల్లో ఇటువంటి షరతుకు అంగీకరించి కనీసం నిర్భాగ్యరాజు కూడా రాడు. అలాంటిది అర్జునుడంత వాడు పిల్లను చేసుకుంటానని ఎదురొచ్చి అడిగితే ఆయన పరమానందంతో కొంచెం హాస్యంగా శుల్కం అని ఉపయోగించాడు. ఇందులోని హాస్యం తెలియాలంటే కన్యాదానం అంటే ఏమిటో తెలియాలి.
ఏ దానం చేసేటప్పుడైనా హైందవ ధర్మంలో ‘‘ఇదం తుభ్యం, న మమ‘‘ అంటారు. అంటే బంగారం ఇచ్చినా చెప్పులు ఇచ్చినా ‘‘ఇవి ఇక నీవి, నావి కావు‘‘ అని ఇస్తారు. కానీ కూతురుని ఇచ్చేటప్పుడు ‘‘ ఇదం తుభ్యం, ....‘‘ అని మాత్రమే అంటారు. ఇక్కడ ఇచ్చిన డాష్ లో ప్రాంతాన్ని బట్టీ పదం ఉంచుతారు. కొంత మంది అంతే అనే తెలుగు పదాన్ని చేరుస్తారు. ఎందుకంటే పురోహితులు అలవాటులో పొరపాటున ‘‘న మమ‘‘ అని కూడా అనేస్తారని విద్యనేర్సే గురువులు దోషం రాకుండా ఏదో ఒక పదం ఉంచుతారు.
కూతురిని దానం చేసేటప్పడు ఎందుకు ‘‘ఇది ఇక నీది‘‘ అని మాత్రమే అంటారు? ‘‘నాది కాదు‘‘ అని అనరు? అంటే? అదే హైందవ ధర్మం.
కుమార్తెను దానం చేసినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికిపోదు. ఈమెను ధర్మఅర్థకామాలలో నీ సహచరిగా అనుభవించే హక్కు ఇచ్చినా కుమార్తెగా తమ హక్కును మాత్రం వుంచేసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైంది. ఈ హక్కు నుంచే మగసంతానం లేని కన్యాదాతలు (పెండ్లికూతురు తండ్రి) ఆమెకు పుట్టబోయే మగపిల్లవాడిమీద హక్కు కలిగి ఉంటారు. దీన్ని కన్యాదానంలో ఉన్న దౌహిత్రలాభంగా హైందవంలో వ్యవహరిస్తారు. అంటే తన కుమార్తెకు పుట్టే మగపిల్లవాడు పుట్టింటి సొత్తన్నమాట. మగపిల్లలు లేనివారు తమకు కావాలి అంటే కాదనే అధికారం ఏ కోర్టుకూ లేదు. ఈ ధర్మం అర్జునుడికి తెలుసు కనుక చిత్రవాహనుడి కోరిక అసమంజసంగా భావించలేదు.
భార్య కోసం వెళితే వాళ్ల వంశం నిలిపేవాడిగా మారాడు. పిల్లను ఇవ్వను అంటే ఐదునిమిషాల్లో యుద్ధం చేసి ఆమెను తీసుకుపోగలిగే వాడు. కానీ పిల్లను ఇవ్వను అని చిత్రవాహనుడు అనలేదు. పైగా ధర్మబద్ధమైన కోరిక కోరాడు. ఆపైన పుట్టబోయే కుమారుడిని కన్యాశుల్కంగా ఇచ్చి పెళ్లాన్ని కొనుక్కోమని హాస్యమాడాడు. దీంతో అర్జునుడికి ఈ ఒప్పందం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి అర్జునుడు చేసింది ఫ్యూచర్ ట్రేడింగ్ వంటిది. అంటే అప్పటికి భూమి మీద లేనిది ముందస్తుగా ఇచ్చి భార్యను కొనుక్కుని, సంసారం చేసి బిడ్డను కని బిడ్డను దాఖలు చేశాడు. అంటే బిడ్డ పుట్టకుండానే అమ్మేశాడు. అంటే రాబోయే ఆస్తిని లీన్ ఇచ్చాడన్నమాట. ఆ డబ్బుతో పెళ్లాన్ని కొనుక్కున్నాడు. నిజానికి ఆమెకు మరొకడు పుట్టడని తెలిసీ పుట్టిన ఒక్కగానొక్క కొడుకును కూడా అర్జునుడు ‘‘త్యాగం‘‘ చేశాడు. ఆదిలోనే తమ వంశానికి మరో బిడ్డ పుట్టడు అని చిత్రవాహనుడు కూడా అనేశాడు. కనుక చిత్రాంగదను మరోసారి కూడవలసిన అవసరం కూడా అర్జునుడికి లేదు.
ఎందుకంటే హైందవంలో భార్యా సంగమమైనా కామంతో చేసేది కాదు. కేవలం బిడ్డల కోసం చేసేది. కనుక ఇంక బిడ్డలు చిత్రాంగదకు పుట్టే అవకాశం లేదని తెలిసి ఆమెను అర్జునుడు వదిలేస్తాడు.
అంతేకాక, బిడ్డలు పుట్టిన భార్యకు పిల్లల పోషణే ప్రధానం. కనుక తనకు భార్య అవసరం కన్నా తన బిడ్డకు తల్లే అవసరం కనుక వారినిద్దరినీ మామకు అప్పగిస్తాడు.
దత్తత స్వీకారంలో ఇక్కడ గమనించాల్సిన ముఖ్యవిషయం కూడా ఉంది. అది పుట్టిన కుర్రాడికి పేరు తాతే పెట్టడం. ఆ సంగతి ఇక్కడ వ్యాసుడు చెప్పడు. కానీ అర్జునుడు తన కుమారునికి పేరు పెట్టలేదు అని నామకరణ సమాచారం చెప్పకుండా వ్యాసుడు ఈ సమాచారం చెప్పాడు. ఎందుకంటే దీనికి ముందు అధ్యాయంలో ఉలూపికి కొడుకు పుడితే అతనికి పేరు అర్జునుడు పెట్టాడు. ఇది చాలా ముఖ్యంగా గమనించదగిన అంశం.
భార్య గర్భవతి అయిన నాటి నుంచీ పిండం పుట్టి పెరిగి జన్మించి పెరిగి తిరిగి మట్టిలో కలిసే లోపల కనీసం 16 సంస్కారాలు జరగాల్సి ఉంటుంది. వీటిలో వివాహ సమయంలో స్నాతకం వరకూ తనకుమారునికి తండ్రే అన్ని సంస్కారాలూ చేయాలి. ఇవి తండ్రికున్న హక్కులు. కానీ వీటిని నేడు కోర్టులు కూడా పట్టించుకోవు.
బిడ్డలను డబ్బుసంపాదనకు ముడిసరుకుగా భావించే భార్యవైపు పుట్టింటి వారుకూడా ఇందులోని హక్కుల హరణం చేస్తుంటారు. అన్నిటికీ మించి పిల్లాడికి నామకరణం నుంచీ ఉపనయనం వరకూ ఎవరు చేస్తారో వారే హైందవ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి అవుతారని న్యాయనిర్మాతలు కూడా గమనించడం లేదు. అర్జునుడు తనకు పుట్టిన పిల్లాడికి పేరు పెట్టకపోవడం వెనకాల ఇన్ని హైందవ ధర్మ కారణాలు ఉన్నాయి. ఇవన్నీ హైందవ దత్తత స్వీకారంలో ఉన్నవే.
ఈ వృత్తాంతం మహా భారతంలోనే చాలా ప్రధానమైంది. ఇక్కడే చర్చించాల్సిన మరో సామెత కూడా ఉంది. బావమరుదులు లేని ఇంటినుంచీ కుమార్తెను తెచ్చుకోరాదని పూర్వం ఎందుకు చెప్పేవారు అంటే ఇందుకే చెప్పేవారు. కానీ ఇది నేడు తిరగబడింది.
నాన్న నాన్న, నాన్న తాత, నాన్న ముత్తాలకు నాన్న స్వయంగా పిండతర్పణాదులు ఇచ్చి అర్చించడం అందరికీ తెలుసు. ఇది ఎప్పుడు చేసినా చేయకపోయినా పెద్దల పక్షంలో తప్పనిసరిగా చేయాలి. అయితే మహాలయ అమావాస్య తరువాత వచ్చే ఆశ్వీజ ప్రతిపత్తిథికి మరో విశేషం ఉంది. దీన్ని మాతామహార్చన దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రోజున అమ్మనాన్న, అమ్ముమ్మలకు ప్రత్యేక అర్చన చేయాలి. దీన్ని బట్టీ పెద్దలకు అర్చన చేయడంలో కొడుకు పుత్రులకు ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కుమార్తె కుమారులకు కూడా ఉందని అంతా తెలుసుకోవాలి. ఈ విధంగా కుమార్తెలకు పుట్టిన కొడుకులకూ కొన్ని బాధ్యతలు శాస్త్రాలు విధించాయి. ముఖ్యంగా ఎవరికైతే మగసంతానం లేదో వారి మనుమలకు ఇది చాలా పెద్ద బాధ్యత. నేడు కుటుంబనియంత్రణ ఆపరేషన్ల కారణంగా కొంత మంది కుమార్తెలు పుట్టిన తరువాత కుమారులు లేని వారు అవుతున్నారు. దీని వల్ల వారు మరణానంతరం పిండతర్పణాలు లేని వారు అవుతున్నారు. ఫలితంగా అభ్రాతృకలు అనే అన్నతమ్ములు లేని పిల్లలను చేసుకొన్నవారికి పితృదోషాలు సంక్రమిస్తున్నాయి. అంటే పిల్లనిచ్చిన మామగారికి పిండతర్పణాలు లేకపోవడం వలన ఆమెను చేసుకున్న ఇల్లు అథోగతి పాలు అవుతోంది. ఇలా కాకుండా ఉండడానికి శాస్త్రాలు దౌహిత్రార్చన పేరుతో అమ్ముమ్మ తాతలకు పిండతర్పణాదులు చేయిస్తుంది. దుహిత అంటే కుమార్తె. దౌహిత్రుడు అంటే కుమార్తె కొడుకు. ఇతనికి ఈ బాధ్యతలు శాస్త్రాలు అప్పగించాయి. అల్లుడు కడు స్వతంత్రుడు కనుక అతడికి బాధ్యతలు ఇవ్వకుండా అతని కుమారుడికి ఈ బాధ్యతలు ఇచ్చారన్నమాట. ఈ బాధ్యత నెరవేర్చడానికి తండ్రి బ్రతికి ఉన్నాడా? లేదా అనే సంశయం అక్కర్లేదని కొందరి అభిప్రాయం. కనుకనే కొన్ని ప్రాంతాల్లో తండ్రి బ్రతికి ఉన్నా మాతామహార్చనలు చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. బ్రాహ్మణులు సైతం తమ అమ్మనాన్నలకు తన తండ్రి బ్రతికి ఉండగానే తిలతర్పణాలు, పిండతర్పణాదులు చేసే అలవాటు ఉంది. వీరు మహాలయాల్లోనే దీన్ని చేస్తారు. నిజానికి ఇలా చేయాలి కూడా. ఎందుకంటే కుమార్తెకు పుట్టే కొడుకుల మీద తాతగారికి హక్కు ఉంది. ఇది కన్యాదానం నుంచీ వస్తుంది. ఏ వస్తువు దానం చేసినా ఇది నాది కాదు ఇకపై అది నీదే అని అంటారు. భూమి దానం చేసినప్పుడు క్రయవిక్రయ ఋణగ్రహణాది సమస్త హక్కులూ ఇచ్చేసి ఇక నాది కాదు అంటారు. అలాగే బంగారం. అలాగే ఆవులు. అలాగే వెండి వంటి ఇతర వస్తువులు. అయితే కుమార్తెను దానం చేసినప్పుడు ఆమెను సంతోషపెడుతూ వివాహాశ్రమ ధర్మం అనుష్ఠించమని అంత వరకే అప్పగిస్తారు. ఆమె మీద తనకున్న కుమార్తె హక్కులు వదులుకోరు. ఆ కారణం చేత ఆమెకు పుట్టే కుమారుడు తాతగారి హక్కు అవుతాడు. దీన్నే దౌహిత్ర లాభం అంటారు. ఏ దానం చేసినా లాభం చూసుకోరు. కానీ కన్యాదానంలో లాభం చూసుకొని చేస్తారు. ముఖ్యంగా కుమారులు లేని వారు ఆమెకు పుట్టే కుమారుల లాభం కోసం కన్యాదానం చేస్తారు. కనుకనే నేడు నాన్నవైపు తాతలకు నానమ్మలకు తర్పణాలు వదిలాక, అందరూ అమ్మవైపు ఆరుగురికీ తర్పణాలు వదులుతారు. ఇదే దౌహిత్రలాభం.
ఇది కుమారులు కలుగని వారికి చాలా ముఖ్యం. ఇలా చేయకుంటే నష్టం అమ్ముమ్మలకు కాదు. వారి పిల్లను చేసుకున్న వంశం కూడా నిర్వంశం అయ్యే ప్రమాదం ఉంది. ఇది చాలా తీవ్రమైంది. కనుక ఏ అమ్ముమ్మలకు మగసంతానం లేదో వారి దౌహిత్రులు తప్పని సరిగా ఆశ్వీజ ప్రతిపత్తిథి అనే పాడ్యమినాడు అమ్ముమ్మ తాతలకు పిండదాన, తర్పణాదులు చేయాలి.
==========================
=================================
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారి ఆదేశాల ప్రకారం పితృదేవతాపక్షోత్సవాల ప్రచారం ప్రారంభిస్తున్నాము. పితృదోషాలున్న వారికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేయమని గురుదేవులు ఆదేశించారు. ఎవరికైతే పితరుల శాపాలున్నాయో వారు గయకు వెళ్ళలేరు. పెద్దలకు పిండప్రదానాదులు చేయలేరు. తిలతర్పణాలు చేయలేరు. కనీసం ఈ వ్యాసాలు కూడా చదువలేరని గరుడపురాణం స్పష్టంగా చెబుతోంది. అందుచేత మహాపురాణాల నుంచీ సేకరించిన ఈ సమాచారాలు ప్రచారం చేయమని వీటిని చదివినా, చూసినా, ప్రచారం చేసినా, ఇతరులకు ఫర్వార్డు చేసినా వారికి పితృశాపాలు తొలగుతాయని ఆదేశించారు. ఈ కారణం చేత మహాపురాణాల నుంచీ పితరుల మాహాత్మ్యం తెలిపే సమాచారాలు ప్రతీరోజు అక్టోబర్ 3 వరకూ ప్రచురిస్తాము. అది నేటి నుంచీ ప్రారంభిస్తున్నాము. వీటిని శ్రద్ధగా చదివినా పెద్దలు సంతోషించే విధంగా మహాపురాణాది వేదవేదాంతవిద్యలు తమకు అందించడం జరుగుతోంది.
శ్రీక్రోధి నామ సంవత్సరంలో మహావిశేషాలున్నాయి. మహాపర్వదినమైన గజచ్ఛాయయోగంలో పిండప్రదానం చేస్తే పెద్దలు మహానందభరితులు అవుతారు. ప్రతీ ఏడాది ఒక గజచ్ఛాయ వస్తే చాలు మహద్భాగ్యం అనుకుంటారు. ఎదురుచూస్తారు. అయితే ఈసారి రెండు గజచ్ఛాయలు వస్తున్నాయి. మొదటిది సెప్టెంబర్ 30న వస్తే, అక్టోబర్ 2న అమావాస్యనాడు అమాగజచ్ఛాయ వస్తోంది. ఇంతకు మించిన మహత్తరమైన రోజు మరలా మరలా రావడం కష్టం. ఈ ఏడాది పితరులకు ఇష్టమైన మఘా నక్షత్రం రెండు రోజులు ఉంటోంది. ముందుగా సెప్టెంబర్ 29న ప్రవేశించి 30వ తారీఖున మనకు గజచ్ఛాయా యోగాన్ని ప్రసాదిస్తోంది. పితరులకు అత్యంత ఇష్టమైన భరణి రెండురోజులు ఉంటోంది. అయితే మధ్యాహ్నం సెప్టెంబర్ 21న ఉంటోంది కనుక అందరూ భరణీ అర్చనను చేసుకోవాలి. ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే మరునాడు కూడా చేసుకోవచ్చు. అయితే అది ప్రశస్తమైనది కాదు. కానీ సూర్యోదయాత్తు 6.17 వరకూ ఉంది కనుక మంచిదే.
సెప్టెంబర్ 18 నుంచీ మొదలు: ప్రతిపత్తిథి మహాలయపక్షాలు ప్రారంభమయ్యే రోజు.
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పౌర్ణమి 18వ తేదీని ఉదయమే వెళిపోయి కృష్ణపక్ష పాడ్యమి వచ్చేసింది కనుక, మధ్యాహ్నకాలం ముఖ్యమైంది కనుక 18 నుంచీ మహాలయాలు మొదలు అవుతాయి.
చేయగలిగిన వారు ప్రతి రోజూ తిల తర్పణాది హిరణ్యశ్రాద్ధాదులు చేయాలి. ఇలా చేయలేని వారు తమ తల్లితండ్రులు ఏ తిథిన పోయారో ఆతిథులు వచ్చిరోజున కూడా పిండప్రదానాదులు చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రతి రోజూ చేయాలనే చెబుతోంది. ఇలా చేయలేము కనుక ప్రతిరోజూ గోసేవ చేసుకోవాలి. ముఖ్యంగా అకాలమృత్యువులు పొందినవారు, కరోనాది కాలంలో శాస్త్రీయంగా కర్మాదులు లేనివారు తప్పక గోసేవ చేసుకోవాలి. ఎవరి ఇంటిలో తాగుబోతులు, తిరుగుబోతులు, విద్యావ్యాపారఉద్యోగాలు లేవో, పిల్లలు నిష్ప్రయోజకలయ్యారో, సంతానం కలుగడం లేదో, వివాహాలు కలుగడం లేదో, అప్పుల బాధతో అవస్థల పాలవుతున్నారో వారంతా ఈ పితృదేవతలను ప్రీతి చేసుకోవడానికి కులమతలింగభేదం లేకుండా గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరగా ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవాలి.
సెప్టెంబర్ 18 మొదటి రోజు:
మహాలయపక్షాల్లో ప్రతీ రోజూ కనీసం తిల తర్పణాలు విడిచి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి నమస్కరించుకోవాలి. ఇలా 16 రోజులూ చేయలేనివారు (ఈసారి తిథుల హెచ్చుతగ్గులవల్ల ఒకరోజు ఎక్కువ వచ్చింది. ) కనీసం తమ తల్లితండ్రులు చనిపోయిన తిథి వచ్చిన రోజుల్లో చేయాలి. మొదటి నుంచీ చేయలేకపోయిన వారు కనీసం పంచమి నుంచీ అయినా చేయాలి.
సెప్టెంబర్ 21 వ తేదీ భరణీ నక్షత్రం చాలా విశేషమని చెబుతారు.
సెప్టెంబర్ 22 పంచమి విశేషమైన రోజు.
సెప్టెంబర్ 24వ తేదీ వ్యతీపాతయోగం షణ్ణవతి
సెప్టెంబర్ 25 మధ్యాష్టమి బుధాష్టమి (సూర్యసావర్ణిక మన్వాది) షణ్ణవతి,
సెప్టెంబర్ 29వ తేదీ మఘానక్షత్రం పితరులకు ఇష్టమైనది. ఇది ముఖ్యమైందే.
సెప్టెంబర్ 30వ తేదీ మఘానక్షత్రం పితరులకు ఇష్టమైనది. ఇది ముఖ్యమైందే. మఘ త్రయోదశి కలిసివచ్చాయి. మహాపుణ్యకాలం. కలియుగాది. గజచ్ఛాయ.
అక్టోబర్ 1 శస్త్రాది హత మహాలయం
అక్టోబర్ 2 సర్వేషాం అమావాస్య అమాగజచ్ఛాయ.
అక్టోబర్ 3 దౌహిత్రమహాలయం
వీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
వీర మరణం పొందిన వారికి అక్టోబర్ 29న ద్వాదశినాడు చేయాలి.
అంటే సైన్యంలో మరణించిన వారు, పోలీసులు, అగ్నిమాపకదళాలు, జలమార్గ సంరక్షణలో విధులు నిర్వహిస్తూ మరణించినవారి తృప్తికోసం ద్వాదశినాడు గోసేవ చేయాలి. లేదా అమావాస్య నాడు కూడా గోసేవచేయవచ్చు. నిజానికి వీరమరణం ద్వారా ఎప్పుడో వీరు అతీతులు అయ్యారు. వారికి చేసినందువల్ల చేసిన వారికి తల్లితండ్రులకు చేసినదాని కన్నా పుణ్యం లభిస్తుందని చేస్తారు. వారు వీరులు కనుక వారికి ఈ రెండురోజుల్లో మన కృతజ్ఞతగా చేయాలి. వీరులు అంటే సైనికులు, పోలీసులు, అగ్నిమాపక దళాలలో విధినిర్వహణలో చనిపోయినవారు, స్త్రీలు పిల్లలు వృద్ధులు రక్షించమని కోరితే వారి ప్రాణాలు కాపాడబోతూ చనిపోయినవారు, ఆవులను, బ్రాహ్మణులను కాపాడబోతూ చనిపోయిన వారు. ఇటువంటి శాస్త్రసమ్మతమైన వీరత్వాలు ప్రదర్శించి అమరులైన వారు ఈ జాబితాలోకి వస్తారు.
చతుర్దశి అక్టోబర్ 1 నాడు ఎవరికి చేయాలి?
కరోనా వంటి కారణాలతో అకాలమృత్యువుపొందినవారు, ఎవరైతే అర్థాంతరమృత్యువు పొందారో, వారికి వారు చనిపోయిన తిథిలో పితృపక్షంలో చేయరాదని ఒక ప్రమాణం. అంటే ఆత్మహత్య కాకుండా కర్మాగారంలో, బస్సుల్లో, రైళ్ళలో అగ్నిప్రమాదంలో చనిపోయినవారు, ప్రమాదంలో నీటిలో చనిపోయినవారు, ఎవరి చేతనైనా హత్యకు గురైనవారు, దొంగల చేతిలో చనిపోయినవారు, సామూహిక మారణహోమాల్లో చనిపోయినవారు, పాముకాటు, కొమ్ములపోటుతో, చిరుత వంటి క్రూరజంతువుల వలన చనిపోయినవారు..... ఇటువంటి ఆత్మహత్యేతర కారణాల వల్ల హఠాత్తుగా చనిపోయినవారికి కేవలం చతుర్దశీ తిథి నాడు మాత్రమే చేయాలి. వారు చనిపోయిన తిథిలో చేయరాదు.
ఆత్మహత్యలు చేసుకున్నవారికి:
ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అకస్మాత్తుగా చనిపోయినవారితో చేయవచ్చని కొన్ని గరుడాది పురాణాలు చెబుతున్నాయి. కనుక ఆత్మహత్యలు చేసుకున్న వారికి కూడా చతుర్దశి మంచిదే. పరమేశ్వరుని దయ కలుగాలని ప్రార్థించి వారికి కూడా చేయవచ్చు. నిజానికి ఆత్మహత్య చేసుకున్నవారికి పిండోదకార్హత లేదు. అయితే వారికి మాని వేసినా ప్రమాదమే కనుక నోటితో లేదని చెప్పే బదులు చేతితో చేయడమే. ముట్టేది ముడుతుంది.
అమావాస్య అక్టోబర్ 2 నాడు అందరికీ:
అమావాస్య అందరిదీ. ముందు పదిహేను రోజుల్లో వివిధ కారణాల వల్ల చేయలేకపోయిన వారికి అమావాస్యనాడు చెయవచ్చు.సందేహములు కలవారు తమ ఇంటి బ్రాహ్మణుల సూచనల మేరకు చేయవచ్చు.
చనిపోయిన తిథి తెలియకపోతే అమావాస్య నాడు గోసేవ చేయాలి.
====================================
శ్రీక్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము
3 సెప్టెంబర్ 24
మంగళవారం
మంగళవారం తాతముత్తాతలు, అమ్మానాన్నలను అర్చించి వారి ఆశీర్వాదం తీసుకుంటే సర్వవిజయాలు సొంతం అవుతాయి. కనుక అన్నిరకాలుగా విజయాలు కావాలనుకునే వారు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు ప్రతి మంగళవారం మేత వేయాలి.
పాడ్యమి పూర్తిగా ఉంది
ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.
ఎంతకాలానికీ పెళ్ళి కాకపోవడం పెద్దల శాపమే. తమను తృణీకరిస్తున్న వంశం అప్రయోజనమని పెద్దలు ఆగ్రహించి పెళ్ళిళ్ళు పచ్చతోరణాలు లేకుండా చేస్తారు. కనుక పెద్దలను నిర్లక్ష్యం చేయకుండా మనసులోని కోరికలు కోరుకొని ఆవును సేవిస్తే వారు సంతోషించి సమస్త కోరికలూ తీరుస్తారు.
అందమైన భార్య, చెప్పిన మాట వినే భార్య, బహుపుత్రసంతానం, ఇల్లు కావాలనుకునే వారు ప్రతీ పాడ్యమి నాడూ పెద్దల గోత్రనామాలు తలచుకొని ఆవుకు గ్రాసం వేసి నమస్కరించుకోవాలి. శుక్ల పక్షం కన్నా పెద్దలకు కృష్ణపక్షం చాలా ప్రీతికరం. రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తాయి. కనుక పాడ్యమినాడు పెద్దలను తలచుకొని మీకు దగ్గరలోని గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి. ఆడవారు ఈ రోజున గోసేవ చేస్తే అందమైన భర్తలభిస్తాడు.
పూర్వఫల్గుణీ నక్షత్రం రాత్రి 2.29 వరకూ ఉంది.
పాపనాశనం కావాలనుకునే వారు పుబ్బలో పెద్దలను అర్చించాలి. అలాగే సౌభాగ్యం కూడా పుబ్బ వల్ల కలుగుతుంది.
కనుక ఈ రోజు పెద్దలను అర్చిస్తే ఈ ఫలాలు వస్తాయి. అంతేకాక ఎవరికైన పైన చెప్పిన కోరికలు ఉంటే అవి ఏ వారం ఇస్తే ఆ వారం పెద్దలను అర్చించాలి. అలాగే తిథి, నక్షత్రం కూడా.
స్వామి అనంతానంద భారతి
అనంతసాహితి ఆశ్రమం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి