*శ్రీ ఆది శంకారాచార్య చరిత్రము.*
*1 వ భాగము*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*రచన : శ్రీ యర్రా ప్రగడ వెంకట సూర్యనారాయణ మూర్తిగారు*
*సదాశివ సమారంభాం*
*శంకరాచార్య మధ్యమామ్*
*అస్మదాచార్య పర్యంతామ్
*వందే గురు పరంపరామ్.*
కాలడి కేరళ ప్రాంతము
అది ఒకమనోహర దృశ్యం. చూడముచ్చట గొలిపే కొబ్బరి తోపులు ఒక వంక, విమలజల ధారలతో జల జలపారే జల పాతాలొక వంక, కన్నుల పండువై విందు గొల్పగా, విప్ర వర్యుల వేదఘోషలతో ఆ గిరిసానువులు మార్మ్రోగు తాయి. హాయినిచ్చే పైరు గాలి విహరించే ఆ వనం నందనోద్యానవనాన్నిమరపిస్తుంది. సముద్ర తరంగాల తాకిడికి రక్షణయో అన్నట్లు పడమటి కొండల అండ. పరమ పావనమని పేరు గన్న వృషాచలమచ్చటే ఉంది. పూర్ణానది కూడా అక్కడే ప్రవహిస్తుంది. దేశాన్ని పాలించే రాజుపేరు రాజశేఖరుడు. ధార్మికుడైన ఆ రాజు పాలనలో ప్రజలు అన్నివిధాలా సుఖసంతోష ములతో ఉండేవారు.
ఒకనాడు రాజుగారి కలలో పరమేశ్వరుడు కనిపించి తాను వెలసిన జ్యోతిర్లింగ స్థలంచూపించి అక్కడ ఆలయం కట్టించమని ఆదేశించాడు. రాజు పరమానంద భరితుడై గొప్ప శివాలయాన్ని అచట నిర్మించి నిత్యదీప ధూప నైవేద్యాది కైంకర్యాలుచిరస్థాయిగా ఉండే ఏర్పాట్లు చేసి ఆ గుడిని సుప్రభమనే పేరుతో సేవించు చుండేవాడు. జగదీశ్వరుని అనుగ్రహ ప్రభావంతో ఎటు చూచినా నూరు మైళ్ళ పర్యంతం ఆ ప్రాంతం సర్వసంపదలతో తులతూగుతుండేది.
దగ్గరలోనే ఉన్నది కాలడి అనే అగ్రహారం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం అనే ఆరు వైదిక కర్మలకూ ఆలవాలం ఆ పేటలోని భూసురగృహాలు. బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులందరూ వేదవాక్కులతో ముప్పిరిగొన్న భక్తితో విశ్వేశ్వరుణ్ణి భజించే నంబూద్రి శాఖవారు.ఆంధ్ర ప్రాంతమైన గోదావరీ మండలము లోని పిఠాపుర సమీపంలో హంసవరము నందుండి వెడలిన వంశం అట్లు విలసిల్లినదని పెద్దలు పలుకుదురు.
*శివగురుని జననము:*
కాలడి అగ్రహారంలో ఎన్నదగిన మేటి విద్యాధి రాజు అనే పేరుగల బ్రాహ్మణుడు. ఆకుటుంబం వారు శివ భక్తులు. ఎంత సంపదలున్నా వారికి సంతానము లేక ఎన్నో వ్రతములు తపములు చేశారు. తుదకు వారి పూజలు ఫలించి చక్కటి పుత్రుడు కలుగగా శివగురుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకొంటు న్నారు. దినదిన ప్రవర్ధ మానుడగు చున్న ఆ బాలునికి ఉపనయనము చేయు వయస్సు వచ్చింది. యోగ్య మగు ముహూర్తం నిర్ణయించి యధావిధిగా ద్విజకర్మ చేశారు. పిమ్మట విద్యా భ్యాసం కోసం సద్గురువుల కప్పగించారు.
*శివగురుని విద్యాభ్యాసము:*
పూర్వం గురువుల కడ విద్య నేర్వాలన్న, ఎన్నో నియమాలను పాటించాలి. బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలి. త్రికాలముల యందు సంధ్యావందనం, అగ్ని హోత్రం చేయాలి. కౌపీన ధారి కావాలి. గురువును పరమదైవంగా భావించాలి. మధుకరవృత్తి నవలంబించి తాను తెచ్చినది గురువుకు సమర్పించి గురువు తినగా మిగిలినది తినాలి. చాప మీదనే పరుండాలి. పుష్పం ముట్ట రాదు. అద్దం చూడ రాదు. తాంబూలం సేవించ కూడదు. ఇలాంటి కఠోర నియమాలు పాటిస్తూ శివగురుడు కుశాగ్రబుద్ధి కాబట్టి స్వల్పకాలంలోనే వేద వేదాంగాలు కంఠగతం చేసి కొన్నాడు. ఒకనాడు ప్రశాంత సమయం చూచి గురువు శివగురువును ఆప్యాయంగా పిలిచాడు. శివగురువుతో 'బిడ్డా! నీ చదువు పూర్తి అయ్యింది. ఇంటికి పోయి గృహస్థ ఆశ్రమం చేపట్టు' అన్నాడు. ఆ పలుకులు శివగురువు నకు ములుకులుగా తోచినవి. ఆందోళన, భయము, దుఃఖము పుట్టుకొచ్చినవి.అయినా ధైర్యం తెచ్చుకొని గురువు గారితో ఇట్లా విన్నవించు కొన్నాడు:
'గురుదేవా! రోతను పుట్టించే సంసారకూపము లోనికి పొమ్మంటున్నారు. సంసారం ముముక్షువులకు అడ్డం కదా! తీవ్రవిరాగి అయినవానికి గృహస్థ ఆశ్రమం ఎందుకు? నేరుగా సన్న్యాసాశ్రమం లోనికి పోవచ్చు గదా! ఎందరెందరో అలా వెళ్ళిన వారున్నారు కదా! ఈ దీనుని కరుణించి గురుసేవాభాగ్యం కలుగ జేయండి. నన్ను ఇంటికి పంపకండి' అని వేడుకొన్నాడు. కాని గురువు కరుణించ లేదు.మౌనమే వహించాడు. లేక లేక కలిగిన కుమారుడు. తల్లిదండ్రులకు బిడ్డను చూడాలని ఉంటుంది కదా! మంచిరోజు చూచుకొని తండ్రి విద్యాధి రాజు గురువుల ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. అడుగకనే గురువుగారు శివగురుని విద్యాభ్యాసం పూర్తయిందని, కొడుకును తీసికొని వెళ్ళి వివాహము చేయమని సెలవిచ్చారు. అందుకు విద్యాధిరాజు చాలా సంతోషించి, గురుకట్నం సమర్పించి శివగురువును తోడ్కొని ఇంటికి బయలు దేరాడు. చేసేది లేక విధి బలీయ మని నిశ్చయించు కొన్నాడు శివగురువు.
ఇంటికి చేరడానికి కొన్ని రోజులు పట్టింది. చూడవచ్చిన బంధుజను లతో ఇల్లు పండగలా అందరూ ఆనందంలో గడిపారు. తండ్రికి అందరి ఎదుటా కొడుకు నేర్చిన విద్యలను ప్రశ్నించాలని కోరిక పుట్టింది. అన్ని శాస్త్రాల మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. శివగురువు తడబడకుండా చెప్పిన జవాబులకు అంతా సంతోషించి పిల్లవాని మేధను కొనియాడారు.
*శివగురువు వివాహము:*
ఎనలేని ధనధాన్య కనకవస్తు వాహన సంపత్తి, నలుదెసల వ్యాపించిన విద్యావికాస వైభవము. వరుడు విశిష్టుడైన యోగ్యుడు. కన్యాదాతలు తహతహలాడుతూ స్వయంగానో మధ్యవర్తుల ద్వారానో వర్త మానాలు పంపుతున్నారు.
కట్నాలు ఒకరినిమించి ఒకరు వెయ్యి, రెండు వేలు, మూడు వేలు అంటూ విద్యాధిరాజుకు ఇవ్వ జూపుతున్నారు వరుని తండ్రికి కట్నాలతో నిమిత్తం లేదని తెలియక. ఆయన చూచేవి ఆచార సంపత్తి, గౌరవమర్యాదలు, సద్గుణ గణాలు. నూరేళ్ళ పంటకు కావలసినది అనుకూలదాంపత్యం. చివరికి ‘నా కుమార్తె ఆర్యాంబను మీ కుమారుడైన శివగురునకు ఇచ్చి వివాహం చేయాలని ఉంది. దయయుంచి నా కోరికను మన్నించండి' అని అడిగిన మఖపండితునితో వియ్యమంద నిశ్చయించిన విద్యాధిరాజు ఒక షరతు పెట్టాడు. అది వివాహం తన ఇంటనే జరగాలని. మఖ పండితుడు ఒప్పుకోక తప్ప లేదు.
దైవజ్ఞులు శుభకరమైనముహూర్తం నిర్ణయించారు. తగినంత వ్యవధి ఉండడంతో ఇరు వైపులా సందడికి లోటు లేదు.బంధువులకు, స్నేహితులకూ శుభలేఖలు వ్రాయించి పంపుకొన్నారు. రకరకాల మంగళవాద్యకారులను కుదుర్చుకొన్నారు. ఆకాశాన్నంటే పందిళ్ళు వేశారు. వాటికి పచ్చని మామిడి తోరణాలు, స్తంభాలకు రంభాఫల వృక్షాలుకట్టారు. పలురకాల అలంకారాలతో కల్యాణ మంటపం చూడ ముచ్చటగా తయారైనది. వివాహం చాలా వైభవంగా జరిగింది. శివగురుడు గృహస్థుడయ్యాడు. ఆర్యాంబ అతనికి సహధర్మచారిణి అయినది. పతివ్రతలకు మించిన వ్రత మాచరిస్తూ ఆర్యాంబ పతికి తలలో నాలుకగా మసలుతూ అత్తమామ లకు బాసటగా ఉండి పేరు తెచ్చుకొంటోంది.
కొంతకాలానికి విద్యాధి రాజ దంపతులు పెద్దవారై పుణ్య లోకాలకు ప్రయాణమై ఇల్లు, వాకిలి, ధాన్యాది సంపత్తి యావత్తు కొడుకు చేతిలోను, కోడలి చేతిలోనుపెట్టి వెళ్ళిపో యారు. స్వధర్మానుష్ఠానం చేస్తూ అతిథి అభ్యాగతు లను గౌరవిస్తూ బీదసాద లను కనిపెడుతూ పండితులతో పండిత గోష్ఠులతో జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ శివగురు దంపతులు చీకూ చింతా లేని గార్హస్థజీవనాన్నిసాగిస్తున్నారు. ఆర్యాంబకు చిన్న పిల్లలంటే ముద్దు. ఇరుగు పొరుగు వారి చిన్ని పిల్లలను మచ్చిక చేసికొని సరదా తీర్చుకొనేది. తలలు దువ్వి బొట్టు పెట్టి, ఆడపిల్ల అయితే కాటుకలు అద్ది జడలు వేసేది.
వాళ్ళకోసం చేసిన తినుబండారాలను అందించేది. దానితో సంతోషంగా పిలవ కుండానే వచ్చే వారు పిల్లలు. మరీ చిన్నపిల్ల లైతే ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలతో జోకొట్టేది. ఒకప్పుడు పసిపాప ఏం చేసినా ఏడ్పు మానకుండా ఉంటే ఆ పాప తల్లి పరుగు పరుగున వచ్చి ఆదుకొనేది. అట్టి భాగ్యం తనకు లేకపోయిందే అని మనస్సు చివుక్కుమనేది. తన దగ్గఱకు వచ్చిన పాపలకే కాక ఊళ్ళోని పిల్లలందరికీ మహా ఔదార్యంతో ఆవుపాలు అందేలా ఏర్పాటు చేసింది ఆర్యాంబ. పండుగలకు ఆ పిల్లలందరికీ కావలసిన చొక్కాలూ, లాగులూ, ఆడపిల్లకు పరికిణీలు, జాకెట్లు తయారు చేయించి స్వయానా తానే వారికి తొడిగి మురిసి పోయేది. ఇంత చేసినా పిల్లలు ఏదో సమయంలో తమ తమ ఇళ్ళకు తుఱ్ఱుమని పారి పోయేవారు.అంతే కదా! ఎంతయినా ఎవరి పిల్లలు ఎవరికి అవుతారు? ఈ సత్యం ఆర్యాంబకు క్రమేణా తెలిసివస్తూ మనసులో దిగులు ఆరంభమయ్యింది.
*శ్రీ ఆది శంకరాచార్యచరిత్ర 1 వ భాగము సమాప్తము*
🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి