3, సెప్టెంబర్ 2024, మంగళవారం

మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

 #మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

నక్క తోక తొక్కినవాడు

శ్రావణ శుద్ధ సప్తమి రోజు ఆచార్య దేవరాతుని ఇంట్లో సీమంతోన్నయనము . రాజ పురోహితుడు మొదలుకొని , రాజధానిలోని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ దయ చేసినారు . ఆశ్రమవాసులలో ముఖ్యులను మాత్రము పిలిచినారు . వారిలో కూడా అతి ముఖ్యులు ఉద్ధాలకుడు , వైశంపాయనుడు . 

సంస్కారము సకాలములో నెరవేరింది . రాజభవనపు వైణికుడు పురోహితుల మంత్రముతో పాటు వీణావాదనము గావించినాడు . సామగానమయినది . ఋక్కులను పఠించి బ్రాహ్మణులు దంపతులను దీవించినారు . బయటినుండీ ఎవరో వచ్చినట్టూ , వారి సన్నిధి తమకెంతో ప్రీతి పాత్రమైనట్టూ అందరికీ అదేదో భావన . ఎవరొచ్చినారు ? ఏమిటీ అని వివరాలడిగితే ఎవరూ చెప్పలేరు . అలాగని , తమకు స్పష్టముగా అనుభవమైన భావనను ఎవరూ కాదనలేరు . 

కర్మాంతములో బ్రహ్మణాశీర్వాదము జరుగుతుండగా బ్రాహ్మణ ముత్తైదువలు స్వరమెత్తి పాటలు పాడినారు . కొత్త చీరకట్టుకొని పెళ్ళికూతురి కళతో మెరుస్తున్న ఆలంబినీ దేవికీ , గర్భ దీక్షతో ప్రకాశిస్తున్న ఆచార్యునికీ హారతి యెత్తి , దిష్టి తీసి మనస్ఫూర్తిగా దీవెనలందించినారు . అంతా సాంగముగా నడిచింది . అతిథులంతా భోజన తాంబూలాది ఉపచారముల నన్నిటినీ స్వీకరించి తమ ఇళ్ళకు మరలినారు . 

దేవరాతునికి యజ్ఞేశ్వరుడు చెప్పినది జ్ఞాపకము ఉంది. సీమంతోన్నయనము కానీ అని వేచియున్నాడు . ఈ దినము వరకూ , ఈ కర్మ ముగియు వరకూ గర్భములో నున్న వాడి పైన తనకు అధికారము లేదు . సీమంతమయినాక గర్భస్థ జీవుడు తన వంశానికి చేరి తన వాడయ్యాడు . ఆ తరువాతనే తాను అడగ దలచుకొన్నదంతా అడిగే అధికారము తనకి వస్తుంది . అంతవరకూ తాను ఆ జీవుడిని మాట్లాడించుటకు కూడా లేదు . 

" ఇప్పుడు ఆ జీవుడు తన కొడుకైనాడు , నేను వాడిని మాట్లాడించేదా , లేక వాడే నన్ను మాట్లాడించవలెనా ? మాలో ఎవరు జ్ఞాన వృద్ధులో వారిని ఇతరులు మాట్లాడించవలెను . ఈ వ్యవస్థ తెలిసేదెలాగు ? పిండము చిన్నదయినంత మాత్రాన , అందులో ఉన్నవాడు చిన్నవాడు అనుట యెలా ? దేహ దృష్టితో అలాగ అనవచ్చునేమో కానీ , దేహములో, దేహముకాని ఇంకొకడు ఉండగా , ఈ చిన్నా పెద్దా తారతమ్యము తెలిసేదెలా ? ఎవరు తెలుపగలరు ? " అని ఆచార్యునికి ఈ దినము కూడా పెద్ద ఆలోచన . 

దానితోపాటూ ఇంకో యోచన . కొడుకు అంటే ’ మాత్రా శిష్యుడు’ . ఉపనయనము అయ్యే వరకు వాడికి తల్లే గురువు . కాబట్టి , తల్లినుండి ఏమేమి నేర్వవలెనో అవన్నీ నేర్వాలంటే ఆమె వాడికి బ్రహ్మవిద్యను కూడా నేర్పవలెను . ఇంతవరకూ తాను భార్యను కర్మ కాండలో తనకు కావలసినట్లు మలచు కొన్నాడే తప్ప బ్రహ్మ విద్యను ఆమెకు చెప్పించ లేదు . బ్రహ్మవిద్య అంటే అదొక కొత్త అనుభవము . దానిని నేర్చితే ఆమె సంసారానికి అయోగ్యురాలవుతుందని తనకు బెదురు . ఇప్పుడిక , ఆ బెదురు వల్ల ముందరి తరము కుంఠితమవుతుందంటే అది న్యాయము కాదు . జరగ వలసిన దంతా జరిగియే తీరవలెను . దీనికి విశ్వమంతా కట్టుబడియే యున్నది . ఈ విశ్వములో ఏదైనా ఒక మూలలో ఏదైనా ఒకటి మంచో , చెడో జరిగితే , అది విశ్వమునంతా వ్యాపించును . ఒక పాత్రలో నీరు తీసుకొని , దానిలో ఒక ముద్ద చెక్కెర గానీ , ఉప్పుగానీ వేస్తే అది కరగి నీరంతా వ్యాపిస్తుంది . అది ఎక్కువగా ఉంటే నీటికి తన రుచిని ఇస్తుంది . అదలా చేయుటకు చాలినంత లేకున్నా , నీటి రుచిని కొంచమైనా మార్చును . అదే విధముగా , వ్యక్తి వ్యక్తి యొక్క కార్య కలాపములన్నీ కూడా విశ్వ వ్యవహారమును రూపించును అను నమ్మకము ఉన్న ఆచార్యుడు , పుత్రుడు గర్భములో ఉండగానే తల్లి వాడికి శిక్షణను ప్రారంభించ వలెను అనుదాన్ని ఎలా మరవగలడు ? దాన్ని ఎలా తిరస్కరించగలడు ? 

అదీకాక , సాక్షాత్తూ యజ్ఞేశ్వరుడే చెప్పినాడు కదా , " దేవ , ఋషి , పితరులు ఆ జీవుడు మరలా భూమిలో పుట్టుటకు నిన్ను ఎంచుకున్నారు " అని ! అలాంటపుడు తాను ఎలా నడచుకొనవలెను ! అది చాలదన్నట్టు , " ఇపుడు గర్భములో పుట్టబోయే కొడుకు మీ వంశమును మాత్రమే కాదు , లోకాన్నే ఉద్ధరించును " అన్నపుడు , తాను ఆ శిశువు శిక్షణను ఎటుల కుంఠితము చేయగలడు ? ఇక తప్పదు , తల్లియే బిడ్డకు శిక్షణ నిచ్చుటకు కావలసిన సామర్థ్యమును తల్లికి కల్పించి ఇవ్వవలెను . లేకున్న , తాను కర్తవ్య లోపము చేసినవాడవుతాడు . అది సర్వథా కూడదు . " 

" ఈ విషయము సరే , మరి నా భయము లేదా , సంశయము తీరుటెలా ? గర్భమున నున్న జీవుడితో మాట్లాడువరకూ సంశయము తీరదు . కాబట్టి , ఇప్పటికి , సంశయమే లేనప్పుడు ఎలా నడచుకొనెదనో , అలా నడచుకొనవలెను . మొత్తానికి , ఎవరో విశ్వోద్ధారము చేయుటకు సామర్థ్యమున్న జీవుడు మా కడుపున పుట్టబోతున్నాడు . వాడు పుట్టి పెరిగిన తరువాత అతడి సామర్థ్యములో ఏ లోపమూ కనబడకుండా చూసుకొను భారము నాది . ఇప్పుడు తానేమి లోపము చేసిననూ అది ముందు ముందు వాడి సామర్థ్యమును కుంఠితము చేయవచ్చు . కాబట్టి , నేను దీనిని నా పత్ని ద్వారా నెరవేర్చవలెను . నెరవేర్చుట మాత్రమే కాదు , ఆ కార్యము మొత్తము సంతృప్తిగా జరుగునట్లు సర్వభారమును వహించవలెను . "

" సరే , అట్లే , ఆ జీవుడు వచ్చినపుడు మాట్లాడుటకు మొదట నేను పిలవరాదు . వాడే వచ్చి మాట్లాడించనీ . ఔను , అదే మంచిది , జ్ఞాన వృద్ధులు ఎవరో తెలియనపుడు ఇంకేమి చేయవలెను ? యజ్ఞేశ్వరుని మాటల వలన , వాడే జ్ఞాన వృద్ధుడు యని అనిపిస్తున్ననూ , అది నేరుగా ధృవము కాలేదు . కాబట్టి , వాడే వచ్చువరకూ వేచియుండవలెను . వాడు వచ్చినపుడు , నీకు తల్లివలన ఏమేమి , ఎటువంటి శిక్షణ కావలెను ? అని వాడినే అడగవచ్చును . విశ్వోద్ధారము చేయుటకు వచ్చువాడికి ఆత్మోద్ధారపు దారి తెలియకుండునా ? ఒకటయితేనే కదా ఇంకోటి అయ్యేది ? " 

ఆ దినమంతా వచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుచున్ననూ బ్రాహ్మణ భోజన సమయములోను , భోజనోత్తర తాంబూల సేవన వేళ లోను , అనుక్షణమూ అతడికి అదే యోచన . ఏమైతేనేమి , అందరూ వెళ్ళిపోయినాక , సాయంత్రము వేళకి తప్పో ఒప్పో ,ఒక నిర్ధారణకు వచ్చి , మనసు తేలికైనది . 

ఇంకేమి చీకట్లు ముసుర బోతున్నాయి , దేవరాతుడు స్నానానికి లేవవలెను , అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆచార్యుని పిలుస్తూ లోపలికి వచ్చినాడు . అప్పటికే తేలిక మనసుతో ఉన్న ఆచార్యుడు తనను పిలిచిన గొంతు ఎవ్వరిదో , వచ్చినదెవరో వెంటనే గుర్తించి , " దయ చేయండి , బుడిలులు మరలా వచ్చి నన్ను పావనము చేసినారు " అని లేచి అభిముఖముగా వచ్చినాడు . వచ్చిన వాడు బుడిలుడు . రాజ పురోహితుడు భార్గవుని దగ్గర బంధువు . అధ్యయన , అధ్యాపనములలో పేరు ప్రతిష్టలు పొందినవాడైననూ , రాజాశ్రయము వద్దని , అంతంత మాత్రముగా ఉన్నా , ఏదో ఉన్నంతలో గుట్టుగా ఉన్నవాడు . అయినా , బ్రాహ్మణ మండలములో సర్వుల గౌరవానికీ పాత్రుడైనవాడతడు . 

బుడిలుడు , " దేవరాతా, నిజం చెప్పు , నువ్వు నక్క తోక తొక్కి వచ్చినవాడివా కాదా ? " అంటూ లోపలికి వచ్చినాడు . 

దేవరాతుడు అతనికి పాదోదకమునిచ్చి , పిలుచుకొని పోయి నడిమింట్లో వేత్రాసనముపై కూర్చోబెట్టి , " మీ మాట నిజమే అయిఉండాలి , కాకుంటే మీరు మరలా వచ్చేవారా ? " అని నవ్వాడు . 

" నేనెందుకు మళ్ళీ వచ్చినానో తెలుసా ? నేను ఈ వేళకే స్నానము చేసి ముక్కు పట్టుకొని కూర్చొని ఉండవలసినది . కానీ , నిన్ను చూచి , నీకొక సంగతి చెప్పి ఇంటికి వెళదామని వచ్చినాను . అప్పుడే చెప్పి ఉండవచ్చు గదా అంటావేమో , అది అలాగ పదిమందిలో చెప్పే మాట కాదు . అదొక రహస్యము కూడా, అందుకే చెప్పలేదు . ఈ దినము నువ్వు దర్భాసనము మీద కూర్చొనియున్నపుడు నేను నిన్ను చూస్తూ ఉన్నవాడిని , అటులే ఊరికే చూస్తూ ఉండాలా లేదా ? ఊహూ , ఊరికే ఉండకుండా కర్మ జరుగుతున్నపుడు సంయమము చేసినాను . లేదంటే , ఏదో ఒక ప్రబలమైన శక్తి నాతో సంయమము చేయించినది అంటావా , సరే అటులే అనుకుందాం . ఎవరో ఒక మహా తపస్వి ఇక్కడికి వచ్చినాడు . నీ తండ్రి , తాతలు అందరూ అతని వెనకాలే చేతులు కట్టుకొని , శిష్యులు గురువుగారి వెనకాల ఎలాగ వస్తారో , అలాగ వస్తున్నారు . ఇదేమిటా అని నేను ఆశ్చర్య పడుతున్నాను . అప్పుడే ఆ వచ్చినవాడి తేజస్సు చూసి , ఇంతటి తేజస్విని నేను ఇంతవరకూ చూసి యుండలేదే అనుకొంటూ లేచి నిలుచున్నాను . మీ తండ్రి గారిని చూసి , " వీరెవరు ? " అంటున్నాను . ’ దేవతలూ , ఋషులూ ఇతడిని లోకోద్ధారమునకై పంపించినారు . మా అదృష్టము . మా ఇంటిలో పుడతాడు . మా దేవరాతుని అదృష్టమే అదృష్టము " అని మాయమైనారు . నేనూ సరేనని తలాడించినాను . అప్పటినుండీ నీకు ఈ సంగతి చెప్పాలని కాచుకొనియున్నాను . సమయము దొరకక , వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాను . నీకు చెప్పిన తరువాతే స్నానానికి వెళదామని వచ్చినాను . ముఖ్యముగా నీ కొడుకు తండ్రికే కాదు , తాత ముత్తాతలకూ కీర్తి తెచ్చువాడు అవుతాడు . అతిపిత , అతి పితామహుడు ( తండ్రినే కాదు , తాత ముత్తాతలనూ మించువాడు ) అవుతాడు . అందులో సందేహము లేదు . ఇప్పుడు చెప్పు , నువ్వు నక్క తోక తొక్కినావా లేదా ? తండ్రిని మించిన తనయుడవబోయే వాడిని ఎత్తుకొనే నువ్వు భాగ్యవంతుడివా కాదా ? " 

" బుడిలుల వంటి మహనీయుల ఆశీర్వాదము వలన అలాగయిన , అది ఆశీర్వాదపు మహత్యము కాదా ? " 

" నీ మహత్యాన్ని నాతో పంచుకోవాలనున్నావా , బాగుంది , సరే , నేనిక వెళ్ళి రానా ? " 

దేవరాతుడు బుడిలునికి నమస్కారము చేసి , తన భార్యను పిలచి , ఆమె చేత కూడా నమస్కారము చేయించినాడు . అతని ఆశీర్వాదమును ఇద్దరూ పొందినారు . బుడిలుడు బయలుదేరాడు .

దేవరాతుడు " మాట " అన్నాడు . 

బయలుదేరిన బుడిలుడు నిలచి , " త్వరగా ముగించు , ఇంకా నేను వెళ్ళి , స్నానము , సంధ్యావందనము , అగ్ని హోత్రమూ చేయవలెను " అన్నాడు . 

" అటులే , బ్రాహ్మణ సమాజములో జ్ఞానము చేతనే కదా వృద్ధత్వము ? " 

" దానిలో సందేహమా ? బ్రాహ్మణులలో జ్ఞాన వృద్ధులకు అగ్ర తాంబూలము . క్షత్రియులలో పరాక్రమము . వైశ్యులలో ఐశ్వర్యము . ఇతరులలో వయో వృద్ధత్వము " 

" సరే , ఒకవేళ మీరు చెప్పినట్లే తండ్రిని మించువాడొకడు , తండ్రి ఎదురుగా వచ్చినాడనుకుందాం . అప్పుడు తండ్రి అతనికి నమస్కారమెలా చేస్తాడు ? తండ్రి యైనందువలన పెద్దవాడిని కదా , మరి సత్కారము చేయుటెలా ? " 

" అటువంటి సమయము వస్తే కొడుకు దేహముతో నమస్కారము చేయవలెను , తండ్రి మనస్సుతో నమస్కారము చేయవలెను . "

" ఓహో , సరే , నాకిది అర్థమే అయి ఉండలేదు " 

" ఇకమీదట అంతా అర్థమవుతుంది . మీ ఇంటిలో నైతే ఇలాగే జరగబోతున్నది . నేనిక వస్తా ... పొద్దు వాలేపోయింది ..." అని బుడిలుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు . దేవరాతుడు అతడిని వీడ్కొలిపి తాను కూడా స్నానానికి వెళ్ళినాడు .

కామెంట్‌లు లేవు: