3. " మహా దర్శనము "--- మూడవ భాగము-- త్రేతాగ్నులు
3. త్రేతాగ్నులు
దేవరాతునికి భార్యతో మాట్లాడుటకు ఆ పగలంతా అవకాశమే కలుగలేదు . భార్గవుడు వెళ్ళిన తరువాత , స్నానము , సంధ్య , అగ్నిహోత్రములు , రాత్రి భోజనము ... ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ , ఇంక దేనికీ సమయమే దొరక్కుండా అయింది .
ఆలంబినీ దేవి కూడా , పెనిమిటి స్నానాదులకు సర్వమూ సిద్ధము చేస్తూ ఆతడు తనకేదో చెబుతాడు అన్నది పూర్తిగా మరచేపోయింది . స్నానానికి నీరు అందించినపుడు గుర్తొచ్చింది . కానీ రుద్రము చెప్పుకుంటూ స్నానము చేస్తున్న భర్తను అడుగుటెలాగా అని ఊరికే ఉండిపోయింది . మరలా అగ్నిహోత్రమయిన తర్వాత , భోజనానికి ముందు భర్తకు గుర్తు చేసింది . అతడు , " మధ్యాహ్నము సమయమే దొరకలేదు , ఈ రాత్రి నిద్ర పోవుటకు వేగిరము వచ్చేయి , అంతా చెబుతాను " అని తన భోజనమును ముగించుకొని వెళ్ళినాడు . ఆమె మడితోనే అగ్నులకు మూఢములనిచ్చి ( పేడతో చేసిన ఎండిన ఉండలు ) వారి పరిచర్యలను ముగించుకొని తన భోజనము అయిందనిపించుకొని , పాలు తోడు పెట్టి , తాంబూలము తీసుకొని వడి వడిగా శయ్యా గృహమును చేరినది . శయ్యాగృహానికి ఆనుకొనే నడిమిల్లు , అక్కడే దేవరాతుడు తనను చూచుటకు వచ్చే గృహస్థులను ఆహ్వానించి కూర్చోబెట్టేది , ఉదయం పూట తన దగ్గరున్న పదహారు మంది శిష్యులకు పాఠ ప్రవచనములను చెప్పేది . ఇలాగ , పొద్దునా సాయంత్రమూ తనవంతు పని తాను చేసిన తర్వాత నడిమిల్లు , పెద్ద మనుషుల ఇంటి ఇంతుల వలె నిర్లిప్తమౌతుండినది . ఒక్కొక్క రోజు దేవరాతుడు రాత్రి భోజనమైన పిదప అక్కడున్న వేత్రాసనములలో సుఖంగా కూర్చొని తన పాటికి తాను ఆలోచనలలో మునిగిపోయేవాడు .
శయ్యాగృహానికి మరలిన పడతి , మూలలో ఒక ఆసనములో కూర్చొని , పైకి వస్తున్న చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కాంతుని చూడలేదు . అతడు కూడా అన్యమనస్కుడై యుండి భార్య అటుగా వెళ్ళడము గమనించలేదు . అదీకాక , నడిమింట్లో ఉన్న చిరు దీపము అక్కడున్న దాని నంతటినీ తెచ్చి కన్నులకు పట్టించ గలంత ప్రకాశముగా కూడా లేదు .
ఆమె , భర్త శయ్యాగృహములో ఉన్నాడనుకొన్నది , అతని శయ్య శూన్యముగా ఉండుటను చూసి వెనక్కు తిరిగి చూసింది . అప్పుడు , మూలకూర్చున్న భర్తను చూసి , తాను వచ్చినది సూచించుటకు చిన్నగా దగ్గింది . ఆ దగ్గు , భర్త గమనాన్ని ఆమె వైపుకు మరల్చింది . అతడు తిరిగి చూసి , " నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, అందుకే ఈ ఉదయిస్తున్న చంద్రుడి సొగసు చూస్తూ కూచున్నాను . ఇప్పుడు చూడు , ఈ చంద్రుడు ఎర్రగా పగడపు రాశి వలె ఉన్నాడు . వీడే ఇంక కొంత సేపైతే ఇంకా పైకి వచ్చి వెండి వర్ణానికి వస్తాడు . అదెందుకో మనసులోకి వచ్చింది . నీ గర్భములోనున్న శిశువు కూడా ఇలాంటివాడే . పుట్టినపుడు దుర్బలమైన శిశువుగా ఉండి , పెరిగి పెద్దయినాక ఏమవుతాడోనని సంశయ పడుతున్నాను " అన్నాడు .
" మన కడుపున పుట్టేవాడు మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు ? కాబట్టి మీరు ఆ సంశయాన్ని వదలండి "
" నాకిక సంశయమేదీ లేదు . నాకన్నా ప్రబలుడగు పుత్రుడు పుట్టుటలో నాకే సందేహమూ లేదు . అయితే , పుత్రుడు బ్రహ్మ పరాయణుడై కర్మత్యాగము చేసి , కర్మ భ్రష్టుడైతే ఏమి చేయుట ? అదొకటే సంశయము "
" మధ్యాహ్నము మీ స్నేహితులు ఏదో చెప్పినట్లుంది ? "
" నువ్వు నిలుచున్నావు , నేను కూర్చున్నాను . ఈ మాటలు ఇక్కడ వద్దు , అదంతా విస్తారంగా చెపుతాను పదవే , " అని దేవరాతుడు భార్యతో పాటూ శయ్యాగృహానికి వచ్చినాడు . అక్కడ ఆకులు వక్కలు వేసుకుంటూ మళ్ళీ మాటలు మొదలయ్యాయి . భార్గవుడు తన సంశయ నివారణ కోసము అన్నదంతా చెప్పి , " చూడు , ఆలంబీ , నిన్న రాత్రి చూసినది ఎందుకో భీతి గొలుపుతున్నది . వచ్చి నీ గర్భాన్ని చేరినవాడు శ్వేత వస్త్ర ధారి యైననూ నా మనస్సుకు అతడు సన్యాసి అయి ఉండవచ్చును అనిపించినది . కాబట్టి నీ గర్భములో పుట్టువాడు సన్యాసియయితే ఏమి గతి అని దిగులు . " అన్నాడు
ఆమె , నోటిలో తాంబూలము ఉన్నదని కూడా మరచి గొల్లున నవ్వింది . నోటిలోని ఎర్రటి తాంబూలపు ద్రవము చింది ఉండాలి . దేవరాతుడు ఉత్తరీయము పైన పడిన ఎర్రటి చుక్కలను భార్యకు ఆ చీకటిరాత్రి ముసినవ్వుతో చూపించాడు . ఆమె నమస్కారము చేసి ," అగ్నిహోత్రములో నిప్పు రవ్వలు ఎగసినట్లైంది . తప్పు మన్నించవలెను " అని దానిని తుడిచింది .
" ఇది ముఖ్యముగా నీ రాజ్యము . ఇక్కడ నువ్వేమి చేసినా చేయించుకోవలసినదే " అధికారము కోల్పోయినవాడిలా అన్నాడు భర్త .
" కావాలని చేసి ఉంటే మీ ఆక్షేపణ సరిగ్గానే ఉండేది . కానీ ఇది హఠాత్తుగా జరిగింది . అదీగాక , దానికి కారణము మీరే . దేనికీ భయపడని మీరు , ’ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు , వాడు సన్యాసియే అవుతాడు ’ అంటూ దిగులు పడుతుంటే నాకు నవ్వు వచ్చింది . ఏమైతేనేమి , మీ కోపము నమస్కారము తో సరి . సరే , ఒకవేళ పుట్టే బిడ్డ ఆడపిల్లయితే ? "
" ఇందుకే మిమ్మల్ని , ఆడవారు , అయోగ్యులు అనేది . పుంసవనము అయిన పిమ్మట ఆడపిల్ల ఎలాగవుతుంది ? నీ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు . ఆ విషయములో ఆవగింజంత కూడా అనుమానము లేదు . సంస్కారమునకు బలము లేదా ? మీ ఆడవారు , తల తీసి ముందు పెట్టినా నమ్మరు , దూడ ఎదురుగ్గా నిలుచున్నా , దీనికి మూడే కాళ్ళేమో అని సందేహపడే జాతి . అదంతా సరి కాదు , సంస్కార విహితమైనది జరిపినాక , గర్భస్థమైన పిండము మగపిల్లవాడే అవుతాడు . అంతే కాదు , నాకన్నా ప్రబలుడు కూడా అవుతాడు . నా సందేహమల్లా , వాడు ఒకవేళ కర్మ త్యాగము చేసి సన్యాసియయితే ఎలాగా అని మాత్రమే . "
" కర్మలలో , సంస్కారములలో ఇంత శ్రద్ధ ఉన్నవారు , కొడుకు సన్యాసి కాకుండా మీరొక హోమాన్ని చేయండి "
" అది అంత సులభము కాదు . అయినా , ఆలంబీ , నువ్వు చెప్పేది నిజము . నాకు యజ్ఞవల్క్యుడు--అంటే కొత్త యజ్ఞములను నేర్పించువాడు అని బిరుదు . సన్యాసి కాకుండా చేయుటకు ఒక యజ్ఞమును రచించవచ్చు . కానీ , సన్యాసమంటే ఏమిటనుకున్నావు ? కర్మఠ బ్రాహ్మణుల సంస్కృతీ సర్వస్వపు గోపుర కలశమది . కానీ అక్కడ చెప్పినది కర్మ త్యాగము . దాన్ని నా మనసు ఒప్పుకోదు . అలాగని స్వతంత్రించి ఏమైనా చేద్దామా అంటే , సన్యాసము అనేది శాస్త్రము ఒప్పుకున్నదే , నిషిద్ధమేమీ కాదు . నా ధర్మ సంకటము అక్కడే . "
" అలాగైతే నేను చెప్పినట్టు చేయండి , వాడికి గర్భ పంచమములోనే ఉపనయనము చేయండి . ఒక వేదమైనా సాంగముగా అధ్యయనము చేయగానే సమావర్తనము చేయించి పెళ్ళి చేసెయ్యండి . మీ కొడుకైన తర్వాత , వాడు ధర్మాన్ని మీరడు . గృహస్థుడై పడిఉంటాడు . "
దేవరాతుడు అది సాధ్యము కాదని తల అడ్డముగా ఊపుతూ అన్నాడు , " ఒక వేదము చదవగానే అయిపోయిందనుకున్నావా ? నీ గర్భములో ఉన్నవాడు స్వంతముగా వేరొక వేదాన్నే పొందగలవాడు కావలెను . అదీ కాక , ఆలంబీ , యజ్ఞేశ్వరుడి వలె , .....నా మాట జాగ్రత్తగా విను , కర్మ కాండ , బ్రహ్మ కాండలు రెండింటిలోనూ ఉపపాద్యుడైన యజ్ఞేశ్వరుడి వలె జాత వేదుడు కాకపోయినా అతడికి సమానముగా సర్వజ్ఞ కల్పుడు కావలెను . అంతటి కొడుకును పొందలేకపోతే నేను యజ్ఞవల్క్యుడనై ఏమి సార్థకత ? అలాగని , ఏదో నోటిమాటగా బ్రహ్మవాది యగుట హితము కూడా కాదు . ఆడిన మాట , అనుభవపు బలముతో శృతియంతటి దృఢమతి కావలెను . అలాగ కావలెనంటే , పరిపూర్ణమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవలెను . అంటే , దానికి కర్మ త్యాగము ఒకటే గతి . నా సందిగ్ధము అర్థమైందా ? నేను చెప్పుతున్నది అదే . అలాగయినప్పుడు , నేను ’ కర్మ శౌండ శౌండీరుడు ’ అని పొందిన ఈ ప్రసిద్ధి , ఈ ప్రఖ్యాతి , నాతోనే ముగిసిపోతుంది . అదే నా దిగులు . ఇప్పుడు నా దిగులు ఎటువంటిదో , దాని రూపమేదో చూచినావా ? అర్థమైందా ? "
ఆలంబిని దీర్ఘంగా నిట్టూర్చింది . పొడినవ్వు నవ్వుతూ అంది , " మీ దిగులు అర్థమైంది . అయితే , ఇది కూడా , ఆడ పిల్లలను కన్న వారి దిగులు వంటిదే , ఏనాటికైనా కూతురిని మగని వెంట పంపించియే తీరవలెను , ఇంటిలోనే ఉంచుకొనుటకు లేదు , అని ఆలోచించినట్లే . పోనివ్వండి , కన్యాదానము చేయునపుడు ’ ఈమెకు పుట్టు కొడుకు మన ఇద్దరికీ కొడుకు కానీ , ద్వాముష్యాయణుడు కానీ ’ అని సంకల్పము చేసినట్లే , మీ కొడుకు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండ రెండింటిలోనూ నైపుణ్యమును పొందువాడు అగునట్లు చేయండి ."
" కర్మ త్యాగము చేసే ’ విద్వత్తు యొక్క సన్యాసపు ’ అర్థము నీకింకా పూర్తిగా విశదము కాలేదు. దానివలన , నీకు తోచిన ఉపాయమును సూచిస్తున్నావు . కానిమ్ము , దీనికి దేవతా శరణము తప్ప వేరే ఏ దారీ లేనట్లుంది . దేవుడు ఎలాగు చేస్తే అలాగే అవుతుంది . నాకేమో ఇది భారీ శల్యమైపోయింది " అని అతడు పెద్ద నిట్టూర్పు వదిలాడు .
నిట్టూర్పులాగానే దేహముకూడా దీర్ఘముగా శయ్యను పరచుకుంది . కాలాతీతమవుతున్నదని గమనించి ఇద్దరూ త్వరగా నిద్ర పోవలెనని దుప్పటిని పైకి లాగుకున్నారు . కానీ నిద్రాదేవి అనుగ్రహము ఒకరికైతే ఇంకొకరికి కాలేదు .
అతడు ఇంకొంచము సేపు ఎటూకాని ఆలోచనలతో పెనుగులాడి , చివరికి కేవలము ఆయాసముతో మాత్రము వచ్చు నిశ్చేష్టారూపమైన మగతలోని జారిపోయాడు .
సుమారు ఒక జాము గడచి ఉంటుంది . ఇద్దరూ చల్లటి నిద్రలో మునిగియున్నారు . లోకవ్యాపారమంతా మరపు వచ్చింది . అపుడతడికి ఒక కల . కలలో ముగ్గురు బ్రాహ్మణులు వచ్చినారు . ఒకరికన్నా ఒకరు తేజస్వులు . ముఖమును చూడగానే వారు ఎవరన్నది తెలుసుకొనుటకు వీలు కాకున్ననూ , మనసుకు , బాగా పరిచయమున్న వారిలాగానే అనిపిస్తున్నది . కానీ ఎంత ప్రయత్నించినా , వారెవరు ? ఎక్కడ చూచినాను ? అన్నది జ్ఞాపకమే రావడము లేదు . అయినా , దేవరాతుడు తన గృహస్థ ధర్మానికి తగినట్టు వారికి అర్ఘ్య పాద్యాదులన్నిటినీ ఇచ్చినాడు . మధుపర్కమును ఇవ్వవలెనని ఆత్రపడుతున్నాడు . ఆలంబి వంటింట్లో ఎక్కడో ఏదో సిద్ధము చేస్తూ ఉన్నట్లుంది . తనకవసరమని , ఆమెను పిలిచి ఆమె పనులకు ఆటంకము కలిగించుట ఇష్టము లేదు . ఇలాగ సతమతమగుచుండగా , వారిలో జ్యేష్ఠుడు నవ్వుతూ అన్నాడు , " మేము మీ ఇంటి వారమే . మాకు మధుపర్కము వద్దు . మేమిప్పుడు నీకు ఏదో చెప్పాలని ఈ రూపములో వచ్చినాము . ఇలా రా " అని పిలచి , తమతో పాటు అతడినీ కూర్చోబెట్టుకున్నారు . అలాగే , కొంటెతనపు నవ్వొకటి నవ్వి , ’ మేమెవ్వరమో గుర్తు తెలిసిందా ? " అంటాడు .
ఆచార్యుడు లేదనలేడు , పరిచయపు జ్ఞాపకమూ రాదు . ఇలాగే అతడు సంకట పడుతుండగా " సరే , నీ సంకటము మాకు అర్థమైనది . మేము ఎప్పటికీ పరోక్షప్రియులము . కాబట్టి ఇలాగ తెలిసీ తెలియకుండా ఉండటములో విచిత్రమేమీ లేదు . మేమే చెప్పెదము , విను . మీ దంపతులు నిత్యమూ సేవించు అగ్నులు మేమే . నేను గార్హపత్యాగ్నిని . ఇతడు దక్షిణాగ్ని . అతడు ఆహవనీయాగ్ని . మేము మీరు ఉంచిన కుండములలో మాత్రమే ఉన్నామని భావించవద్దు . మీ దేహములోనూ ఉన్నాము . మా అనుగ్రహము వల్లనే మీ దంపతులకు నిన్నటి దినము మీ గర్భమునకు వచ్చిన మహానుభావుడి దర్శనమైనది . "
ఆచార్యులు లేచి నిలుచున్నారు . ప్రవర చెప్పి వారందరికి కలిపి ఒకసారి నమస్కారము చేసినాడు . ప్రత్యేకముగా కూడా ఒక్కొక్కరికీ నమస్కారము చేసినాడు . " మీ అనుజ్ఞ కావలెను , మీరు చెప్పుదానిని వినుటకన్నా ముందే , ఇదే ఎక్కువన్నట్లు నమస్కారములు చేయుట అపరాధమైతే క్షమించవలెను . " అని నమస్కరించి అన్నాడు .
ముగ్గురూ నవ్వినారు . పెద్దవాడు అన్నాడు , " మాకూ మీకూ సామరస్యము ఉన్నది . నువ్వేమి చేసినా అది మాకు అపరాధముగా తోచదు . అదలా ఉండనీ , విను, నిన్నటి దినము నీకు మా అనుగ్రహము వల్లనే ఆ దర్శనము అయినది . అయితే , దానిని సుఖముగా తీసుకొనుటకు బదులు , నువ్వు దానిని ప్రమాదపు కారణము చేసుకున్నావు . నువ్వు ఈ దినము ఉదయము నుండీ పడుతున్న సంకటము నీ దేహములోనున్న మమ్ములను కూడా బలముగా దుఃఖింపజేస్తున్నది . కాబట్టి అది వద్దు అని చెప్పుటకు మేమే వచ్చినాము ... హా! హా! , ’ మీరే నాకు తెలియ కుండానే దానిని నివారించ వచ్చును కదా..అనబోతున్నావు , ఔను , అది మాకు సాధ్యమే . నీ ఎదురుగా రాకుండానే నీ మనసును తిప్పుటకు మాకు సాధ్యమే , కానీ నువ్వు భక్తుడవు , కావలసిన వాడవు , సఖుడవు అని నీకు ప్రత్యక్షముగా ముఖతః చెప్పి నిన్ను సంతోష పరచవలెనని వచ్చినాము . నువ్వు సంతోషముగా ఉంటే మాకు సంతోషము . నువ్వు దుఃఖ పడుతూ ఉంటే మాకూ దుఃఖము . కాబట్టి మేము చేయుపని బహుశః స్వార్థమన్నా అనవచ్చు . స్వార్థము లేని లోక వ్యవహారము ఉంటుందా ? స్వార్థము , పరార్థము అని మనసులో ఉన్నంత వరకూ అది కర్మ కాండ. ఆ భేదము చెరగిపోతే అదే జ్ఞాన కాండ . అర్థమైనదా ? "
దేవరాతునికి మహాశ్చర్యమైనది. వీరు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండలను గురించి మాట్లాడుతూ నా భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారే ? కానీ వీరు త్రేతాగ్నులు . " నీ సంతోషమే మా సంతోషము , నీ దుఃఖమే మా దుఃఖము " అంటున్నారు . కాబట్టి మారు మాట్లాడక , తాను చెప్పాలనుకున్నది ఒక ’ సరే ’ తో ముగించాడు .
మాట్లాడుతున్న ఆ జ్యేష్టుడు చిరునవ్వు నవ్వుతూ తాను చెప్పాలనుకున్న దానిని కొనసాగించినాడు . :" రెండు నదులు వచ్చి చేరుతాయి . రెండూ ఒకటగు వరకూ ఆ నీరు , ఈ నీరు అనవచ్చు . రెండూ ఒకటైన తర్వాత వాటిలో ఏది తాను కరగి పోయానని ఏడవాలి ? "
దేవరాతుడు మనసులోనే గుణకారము చేసినాడు . " నేను ఏదో చెబుతున్నారు అనుకున్నాను , వీరు చెప్పేది కర్మ కాండ , జ్ఞాన కాండ లకు సంబంధించినదేనా ? అలాగైతే రెంటికీ భేదము లేదా ? "
జ్యేష్టుడు ఇతడి మనసులో ఉన్నది తెలిసినట్లే అన్నాడు , " ఔను , రెంటికీ భేదము లేదు . భేదమున్నదని నువ్వు భావించుకొని పొద్దుటినుండీ దుఃఖ పడుతున్నావు . జాతవేదుడనని ప్రఖ్యాతి పొందిన నన్ను ( అలా అనేటప్పటికి మిగిలిన ఇద్దరూ అంతర్థానమై అతడొక్కడే ఉన్నాడు ) ’ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే ’ అని అహర్నిశలూ నమస్కారము చేయు నువ్వు దాని అర్థమునెందుకు గమనించలేదు ? నీకున్న సంశయాన్ని వదలు . ఎలాగా ? ఇంకా పరిహారము కాలేదే అంటావా ? సీమంతమగు వరకూ తాళు . సీమంతమైన తర్వాత గర్భస్థుడై యున్న జీవుడిని మాట్లాడించు . అతడు నీకు తృప్తి యగునట్లు సమాధాన మిచ్చును . మా దేవతలము , కర్మ కాండపు ఋషులు , నీ వంశపు పితృ దేవతలు అందరూ కలిసి నీ వంశమును మాత్రమే కాదు , లోకమునే ఉద్ధరించ గల మహా పురుషుడిని నీకు కొడుకగునట్లు అనుగ్రహిస్తాము చూడు , నీకు నిదర్శనము కావాలని చెపుతున్నాను , రేపు నీకు రాజ భవనము నుండీ సోపస్కరములు ( సంభారములు ) వస్తాయి కదా , వాటితో పాటు కుండెడు పాలనిచ్చు రెండు ఆవులు కూడా వస్తాయి . ఒకటి ఎర్రది , ఇంకోటి నల్లది . నీకు రాజ పురోహితుడు చెప్పినవాటిలో ఆవులు లేవు , నిజమా కాదా ? "
" ఔను , ఆవులున్నట్లు చెప్పలేదు "
" నేనే నీకు అంతటినీ చెప్పగలను , కానీ నీకు నేను చెప్పుటకన్నా , గర్భస్థ శిశువే చెప్పిన , ఎక్కువ నమ్మకము కాగలదని అతని ద్వారానే చెప్పిస్తాను . ఇకనైనా దుఃఖమును వదలి స్వస్థుడవు కమ్ము . నువ్వు సంకట పడినంతా మాకది జ్వరమని మరవద్దు . "
దేవరాతుడికి ఏదో ఒక తెర తనపైనుండి జారి కింద పడినట్లాయెను . వాక్కు అతని ప్రయత్నము లేకనే " అనుజ్ఞ , దుఃఖాన్ని వదలినాను " అన్నది .
యజ్ఞేశ్వరుడు , " చూడు , నువ్వు ఎంత దుఃఖ పడుతుంటివో చూడు " అని తన చేతిని బార్లా చాచినాడు . అక్కడ ఒక నల్లటి గుట్ట ఉంది . అది సుమారు ఒకటిన్నర మనిషి ఎత్తు . అది అంటుకొని మండుతున్నది .
ఇంకొకసారి చెవిలో మోగింది , " ఆచార్యా , మరవద్దు , ఈ దేహము నీది కాదు . నీకు దాన్ని ఇచ్చిన మేము అందులో ఉన్నాము . నువ్వు నీవియని అనుభవించు సుఖ దుఃఖములన్నీ మాకు కూడా కలుగుతాయి . కాబట్టి నువ్వు ఎల్లపుడూ సంతోషముగానే ఉండవలెను . "
ఆచార్యుడు అదివిని సిగ్గు పడ్డాడు . తమ ఆజ్ఞ అని తిరిగి చూసే వేళకు అక్కడ ఎవరూ లేరు . మనసు , " అట్లయిన , మేము సుఖ దుఃఖముల అనుభవములో కూడా స్వతంత్రులము కామా ? వాటిలో కూడా మేము దేవతలకు అంకితులై ఉండవలెనేమి ? అని పుంఖాను పుంఖములుగా ప్రశ్నలు వస్తుండగానే మెలకువ అయ్యింది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి