11, అక్టోబర్ 2021, సోమవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *11.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*


*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఉద్ధవ ఉవాచ*


*14.1 (ప్రథమ శ్లోకము)*


*వదంతి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః|*


*తేషాం వికల్పప్రాధాన్యముతాహో ఏకముఖ్యతా॥12729॥*


*ఉద్ధవుడు ప్రశ్నించెను* శ్రీకృష్ణా! వేదవేత్తలు పెక్కు శ్రేయస్సాధనములను గూర్చి పేర్కొనిరి. వారి, వారి దృష్టిని అనుసరించి అవన్నీ ముఖ్యమైనవేనా? లేక ఏదో ఒక్కటే ముఖ్యమైనదా? దయతో తెలుపుము.


*14.2 (రెండవ శ్లోకము)*


*భవతోదాహృతః స్వామిన్ భక్తియోగోఽనపేక్షితః|*


*నిరస్య సర్వతః సంగం యేన త్వయ్యావిశేన్మనః॥12730॥*


స్వామీ! భక్తియోగము స్వతంత్రసాధనమని నీవు ఉపదేశించితివి. భక్తిద్వారా అన్ని విధములగు ఆసక్తులు తొలగిపోయి, మనస్సు నీయందే లగ్నమగుననియు తెల్పితివికదా.


*శ్రీభగవానువాచ*


*14.3 (మూడవ శ్లోకము)*


*కాలేన నష్టా ప్రలయే వాణీయం వేదసంజ్ఞితా|*


*మయాఽఽదౌ బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకః॥12731॥*


*14.4 (నాలుగవ శ్లోకము)*


*తేన ప్రోక్తా చ పుత్రాయ మనవే పూర్వజాయ సా|*


*తతో భృగ్వాదయోఽగృహ్ణన్ సప్త బ్రహ్మమహర్షయః॥12732॥*


*14.5 (ఐదవ శ్లోకము)*


*తేభ్యః పితృభ్యస్తత్పుత్రా దేవదానవగుహ్యకాః|*


*మనుష్యాః సిద్ధగంధర్వాః సవిద్యాధరచారణాః॥12733॥*


*14.6 (ఆరవ శ్లోకము)*


*కిందేవాః కిన్నరా నాగా రక్షః కింపురుషాదయః|*


*బహ్వ్యస్తేషాం ప్రకృతయో రజఃసత్త్వతమోభువః॥12734॥*


*శ్రీకృష్ణభగవానుడు నుడివెను* ఉద్ధవా! వేదవాఙ్మయము ప్రళయకాలమున లుప్తప్రాయమైనది. మరల నేను సృష్టియొక్క ప్రారంభసమయమున సంకల్పమాత్రముచే బ్రహ్మదేవునకు ఈ వేదజ్ఞానమును తెలిపితిని. ఇందులో బ్రహ్మదేవుడు తన జ్యేష్ఠపుత్రుడైన స్వాయంభువ మనువునకు ఈ వేదజ్ఞానమును అందించెను. ఆయననుండి భృగువు మొదలగు సప్తర్షులు దానిని గ్రహించిరి. ఆ సప్తర్షులనుండి వారి కుమారులును, దేవదానవులును, యక్షులును, మానవులు, సిద్ధ, గంధర్వ, విద్యాధరులు, చారణులు, కిందేవులు, కిన్నరులు, నాగులు, రాక్షసులు, కింపురుషులు మొదలగు పెక్కుజాతులవారు ఈ వేదవాఙ్మయమును పొందిరి. వీరు అందరును ప్రకృతి సంబంధమైన సాత్త్విక, రాజస, తామస గుణములతో జన్మించినవారు.


*14.7 (ఏడవ శ్లోకము)*


*యాభిర్భూతాని భిద్యంతే భూతానాం పతయస్తథా|*


*యథాప్రకృతి సర్వేషాం చిత్రా వాచః స్రవంతి హి॥12735॥*


ఆయా జాతులవారు తమ ప్రకృతిబుద్ధి భేదములను అనుసరించి ఈ వేదార్థములను వేర్వేరుగా గ్రహించిరి. ఈ వాఙ్మయము అలౌకికమగుటవలన అందు భిన్నభిన్నార్థములు వెలువడుట సహజమే.


*14.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ఏవం ప్రకృతివైచిత్ర్యాద్భిద్యంతే మతయో నృణామ్|*


*పారంపర్యేణ కేషాంచిత్పాఖండమతయోఽపరే॥12736॥*


ఇట్లు స్వభావములయందును, పరంపరాగతములైన ఉపదేశముల యందును భేదములు ఉండుటవలన మనుష్యుల బుద్ధులలో భిన్నత్వము ఏర్పడెను. కొందరు ఏ మాత్రమూ ఆలోచింపక వేదవిరుద్ధములైన పాషండ మతములను అవలంబించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: