11, అక్టోబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*447వ నామ మంత్రము* 11.10.2021


*ఓం శాంత్యై నమః*


కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనబడు అరిషడ్వర్గములను నశింపజేసి, సాధకులకు శాంతిని అనుగ్రహించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శాంతిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం శాంత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారిలోని కామక్రోధలోభమోహమద మాత్సర్యములనబడు అరిషడ్వర్గములను నశింపజేసి, వారిని శాంతస్వరూపులుగా పరివర్తింపజేయును. 


*ఆణవాది మలములు (కల్మషములు)*


1. *ఆణవము* (పరబ్రహ్మమును గూర్చి అప్పుడప్పుడు కలిగెడి జ్ఞానమును మఱుగుపఱచునది),


 2. *కార్మికము* (గురువు బోధించిన పరమార్థమున బుద్ధి చొరనీయనిది), 


3. *మాయికము* (పరతత్త్వ జ్ఞానవాసన నెప్పుడును కలుగనీయనిది), 


4. *మాయేయము* (సాపకార్యములందు మాత్రమే బుద్ధిని జొన్పునది), 


5. *తిరోధానము* (పరబ్రహ్మ మనిత్యమను బుద్ధిని కల్గించి జనన మరణాది దుఃఖములను కలుగజేయునది). 


జగన్మాత తనను ఆరాధించు సాధకులలో ఇటువంటి మలములను (కల్మషములను) నశింపజేసి సత్త్వగుణ ప్రధానమైన శాంతిని ప్రసాదించును గనుక ఆ తల్లి *శాంతిః* అని యనబడినది. ఈ ఆణవాది మలములు అనునవి మలమాయావికారములు. వీటిని నశింపజేయునదియే శాంతికళ. అటువంటి శాంతికళా స్వరూపిణియైన పరమేశ్వరి *శాంతిః* అని యనబడుచున్నది. ఈ కళ వాయుసంబంధమైనది. ఈ శాంతి యనునది ఏర్పడుటనే ఉన్నత స్థితియని శైవాగమనమందు చెప్పబడినది.


నాసికకు (ముక్కునకు) పదునైదు అంగుళముల బాహ్యస్థానమును వ్యాపించి మలములను పారద్రోలి జీవుని శుద్ధిచేయు కళాస్థానముగలదు. అదియే షోడశీకళ అని యనబడును. ఈ కళనే శాంతి అని అంటారు. షోడశకళారూపిణియైన పరమేశ్వరి ఈ శాంతిస్వరూపిణియగుటచే, ఆ అమ్మ *శాంతి* అని యనబడినది.


*శాంతమె భూషణంబు* అని ఒక కవీశ్వరులు అని యుంటిరి. అనగా శాంతము అనునది ఆభరణముల కన్నిటికన్నను అపురూపమైన ఆభరణము. శాంతి యను సాధనముతో ఎంతటి క్లిష్టసమస్యనైనను జయించవచ్చును. 


*తన కోపమె తనశత్రువు తనశాంతమె తనకురక్ష, దయ చుట్టంబౌ* అని మరొక కవి అన్నారు. ఎవరే మన్నా, అనుభవపూర్వకముగా చెప్పబడినది ఈ సూక్తి. 


మహావిష్ణువును *శాంతాకారం* అన్నారు. పాలకడలిలో, శేషతల్పశయనుడైన ఆ పరమాత్మ అత్యంత శాంతమూర్తిగా గోచరిస్తాడు. 


లలితా పరమేశ్వరిని తదేకంగా వీక్షిస్తే ఆ తల్లి వదనారవిందము మందస్మితముగా, అత్యంత శాంతస్వభావంతో కనిపిస్తుంది. అందుకే అమ్మవారు *శాంతిః* అని యనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శాంత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: