11, అక్టోబర్ 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*448వ నామ మంత్రము* 11.10.2021


*ఓం స్వస్తిమత్యై నమః*


క్షేమము, పుణ్యము, మంగళము, శుభములు అను స్వస్తి శబ్దవాచక స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *స్వస్తిమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం స్వస్తిమత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపూరితమైన హృదయంతో ఆరాధించు భక్తులకు సకలము క్షేమకరము, మంగళకరము, పుణ్యప్రదము మరియు శుభప్రదమై జీవనమంతయు ఆనందమయమై కొనసాగును.


స్వస్తిమతీ యనగా శుభప్రదము, క్షేమకరము, మంగళదాయకము, పుణ్యప్రదము. అమ్మవారిని మనోనేత్రములతో వీక్షిస్తే శుభప్రదము, క్షేమకరము, మంగళదాయకము, పుణ్యప్రదము. అందుచే ఆ తల్లి *స్వస్తిమతీ* యని అనబడినది. పరబ్రహ్మస్వరూపిణి యైన పరమేశ్వరి పరమ సత్యము. ఎంత సత్యమంటే పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు - అంత. ఎందుకంటే పంచప్రాణాలు, పంచఉపప్రాణాలు ఉన్నాయి గనుకనే హృదయస్పందన, రక్తప్రసరణ, ఆకలి దప్పులు, త్రిగుణములు, ఇంద్రియకార్యములు, మనోవికారములు ఏర్పడుతున్నాయి. గనుక పరమేశ్వరి సత్యమేగదా. 


స్వస్తిమతి అంటే చక్కని ఉనికి గలిగినది. ఎందుకంటే మూలకూటత్రయ స్వరూపిణి. అనంతకోటి జీవరాశులలో పరమాత్మగా విలసిల్లునది. ఆ తల్లి యథార్థతగలిగి యున్నది అన్నారు. అంటే ఆ యథార్థత ఏమిటి? వీచేగాలి, జ్వలించే అగ్ని, కురిసే వాన, ప్రవహించే గంగ. అంతేనా? సుగంధభరితమైన మలయమారుతము. త్రికాలములందు ఒకటే రూపమున చక్కగా ఉన్నది యనుటనే *స్వస్తిమతీ* యని అనదగును. సృష్టికి పూర్వము, స్థితియందు, లయమందు కూడా ఆ తల్లి ఆదిపరాశక్తియే. ప్రాణములుండుట సత్యమేగదా. ప్రాణమున్న శరీరము శివమయితే, ప్రాణములేని శరీరము శవము. ప్రాణములుండుట ఎంత సత్యమో, పరమాత్మ యనునది సత్యమునకే సత్యము. దీనినే సత్యసత్యము పారమార్థిక సత్యము, సుసత్త అని చెప్పారు. స్వస్తియను శబ్దమునకు పారమార్థిక కోశమునందు ఆశీర్వాదము, క్షేమము, నిష్పాపము, పుణ్యము, మంగళము అను అర్థములు గలవు. ఈ అర్థములు అన్నియును పరమేశ్వరికి అన్వయించవచ్చును గనుకనే, ఆ తల్లి *స్వస్తిమతీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం స్వస్తిమత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: