11, అక్టోబర్ 2021, సోమవారం

పార్వతీప రమేశ్వరౌ

 పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ 'వాగర్థా వివసంపృక్తౌ 'శ్లోకాన్ని వల్లె వేస్తూ ఉండగా ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వచ్చి 'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే ఏమిటో తెలుసా?' అడిగారు.


 “ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని అర్థం" అంటూ జవాబిచ్చారు. సుందర్రామూర్తి.


 "పితరౌ అంటే తల్లిదండ్రులు అనే ఎందుకనుకోవాలి!? పితః అంటే తండ్రికి ద్వివచనంగా తండ్రులు అని అర్థం వచ్చేట్టుగా పితరౌ అని వాడి ఉంటారనుకో వచ్చుగా" అని అన్నారు ప్రభాకరశాస్త్రి. 


 దాంతో ఆలోచనలో పడ్డారు సుందర్రామ్మూర్తి. 


"కాళిదాసు శివభక్తుడు. కనుక శివపార్వతులను ఉద్దేశించే అయి ఉంటుంది" అని అన్నారు సుందర్రామ్మూర్తి. 


 దానికి ప్రభాకర శాస్త్రి గారు -" కానీ కాళిదాసు ఈ శ్లోకాన్ని రాసింది రఘువంశంలో .అది విష్ణువు అవతారమైన రామునికి సంబంధించిన కావ్యం. అంచేత విష్ణువునే స్తుతించాలి. నువ్వన్నట్టు తను సహజంగా శివభక్తుడు కావటం చేత శివుడు, విష్ణువూ ఇద్దరూ ఈజగతికి తండ్రులు అని అన్నాడు" అంటూ వివరించారు. 


“మరి పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు కదా!?" అంటూ తన మనసులోని సందేహాన్ని ముందుంచారు సుందర్రామ్మూర్తి.


 "దాన్ని ఇలా విడదీసుకుని చూడు. 'పార్వతీప' అంటే పార్వతి భర్త అయిన శివుడు అని, రమేశ్వరౌ అంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు అని అనుకుంటే సరిపోతుందిగా” అంటూ విశ్లేషిస్తూ విపులీకరించారు ప్రభాకర శాస్త్రి,


 పదాల్ని విడదియ్యటంలోనూ కలపడంలోనూ ఎంతటి రసజ్ఞత వెల్లివిరుస్తుందో, అర్థాల్ని స్థూలదృష్టితో కాకుండా సూక్ష్మదృష్టితో చూస్తే ఎంతటి విజ్ఞత కలుగుతుందో అప్పుడర్థమయింది వేటూరి సుందర్రామూర్తికి.(హాసం పత్రిక సౌజన్యం 15-31 అక్టోబర్ 2001 21 వపుట)

కామెంట్‌లు లేవు: