11, అక్టోబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం

 *10.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*13.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఏవం విమృశ్య గుణతో మనసస్త్ర్యవస్థా మన్మాయయా మయి కృతా ఇతి నిశ్చితార్థాః|*


*సంఛిద్య హార్దమనుమానసదుక్తితీక్ష్ణజ్ఞానాసినా భజత మాఖిలసంశయాధిమ్॥12719॥*


ఈ విధముగ చక్కగా విచారించుటవలన మనస్సు యొక్క ఈ మూడు అవస్థలను గుణములద్వారా నా మాయచే నా అంశస్వరూపుడగు జీవునియందు కల్పింపబడినదనియు, ఇవన్నియును ఆత్మయందు ఎంతమాత్రమూ లేవనియు, ఇవి అసత్యములనియు స్పష్టమగును. కావున మీరు అనుమాన ప్రమాణముల ద్వారా, సత్పురుషులద్వారా బోధింపబడిన ఉపనిషత్తుల జ్ఞానము చక్కగా శ్రవణము చేయుటచే వివేకమనెడు ఖడ్గమునకు వాడియైన పదును లభించును. అట్టి వాడియైన జ్ఞానఖడ్గముతో సంశయము లన్నింటి మూలమైన అహంకారమును ఛేదింపుడు. అంతట మీ హృదయములందు విరాజిల్లుతున్న పరమాత్మయగు నన్ను భజింపుడు.


*13.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం దృష్టం వినష్టమతిలోలమలాతచక్రమ్|*


*విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయా స్వప్నస్త్రిధా గుణవిసర్గకృతో వికల్పః॥12720॥*


ఈ జగత్తు అంతయును మనఃకల్పితము. అలాతచక్రమువలె చంచలమై, చూచుచుండగనే ఇది నష్టప్రాయమగును. ఇది భ్రమగొలుపునట్టిది అని ఎఱుంగవలెను.ఈ స్థూలశరీరము, ఇంద్రియములు, అంతఃకరణము - అనునవి త్రిగుణముల యొక్క వికల్ప పరిణామములే. ఇది స్వప్నమువలె మాయావిలాసము, అజ్ఞానకల్పితము.


*13.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*దృష్టిం తతః ప్రతినివర్త్య నివృత్తతృష్ణస్తూష్ణీం భవేన్నిజసుఖానుభవో నిరీహః|*


*సందృశ్యతే క్వ చ యదీదమవస్తుబుద్ధ్యా త్యక్తం భ్రమాయ న భవేత్స్మృతిరానిపాతాత్॥12721॥*


సాధకుడు శబ్దాది విషయములనుండి తన విషయాభిలాషను (తృష్ణను) మానసికముగా వీడవలెను. విషయములచే ఆకర్షింపబడకుండునట్లుగా కర్మేంద్రియములను నియంత్రింపవలెను. అతడు అంతర్ముఖుడై, ఎట్టి వాంఛలును లేనివాడై, ఆత్మానందమగ్నుడు కావలెను. అప్ఫుడప్పుడు విషయములు ఏవైనను తన దృష్టికి వచ్చినప్పుడు 'ఇవి అన్నియును మాయ. వీటితో నాకు ఏమి పని?' అని భావించి, ఆత్మ వస్తువునకు అతిరిక్తములగు వాటిని త్యజించివేయును. అంతట అతని భ్రమ తొలగిపోవును. శరీరము ఉండునంతవఱకును కేవలము పూర్వసంస్కారముయొక్క స్మృతి మిగిలి ఉండును.


*13.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*దేహం చ నశ్వరమవస్థితముత్థితం వా సిద్ధో న పశ్యతి యతోఽధ్యగమత్స్వరూపమ్|*


*దైవాదపేతముత దైవవశాదుపేతం వాసో యథా పరికృతం మదిరామదాంధః॥12722॥*


మద్యపానముచే శరీరస్పృహ కోల్పోయి యున్నవానికి 'తన శరీరముపై వస్త్రము ఉన్నదా, జారిపోయినదా!' అను విషయమే పట్టదు. సిద్ధపురుషుడు తనకు ప్రారబ్ధవశమున వచ్చిన నశ్వరమైన శరీరమును ఆధారము చేసికొని సాధన చేయుటద్వారా స్వస్వరూపసాక్షాత్కారమును పొందును. ఆ స్థితిలో ఆ శరీరము కూర్చొనియున్నను, నిలబడియున్నను, ఎచ్చటికైనా వెళ్ళినను, వచ్చినను అతడు సచ్చిదానందస్వరూపమునందు నిలిచియుండుటవలన శరీరముపై ఏమాత్రమూ ధ్యాసయే యుండదు.


*13.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*దేహోఽపి దైవవశగః ఖలు కర్మ యావత్ స్వారంభకం ప్రతిసమీక్షత ఏవ సాసుః|*


*తం స ప్రపంచమధిరూఢసమాధియోగః స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః॥12723॥*


ప్రాణములతో, ఇంద్రియములతో గూడియున్న ఈ దేహము జీవికి తన పురాకృతకర్మఫలముగా ఏర్పడును. ఆ కర్మఫలములను అనుభవించునంతవరకును (కర్మఫలములు తీరునంతవరకునూ) ప్రాణములు నిలిచియేయుండును. కాని ఆత్మసాక్షాత్కారమును పొంది, సమాధిస్థితుడైయున్న యోగికి దారాపుత్రధనాది ప్రాపంచిక విషయములు నిద్రనుండి మేల్కొనిన వానికి స్వప్నదృశ్యములవలె భాసిల్లును. అతడు లౌకిక విషయములతో మరల ఎట్టి సంబంధమునూ కలిగియుండడు.


*13.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*మయైతదుక్తం వో విప్రా గుహ్యం యత్సాంఖ్యయోగయోః|*


*జానీత మాఽఽగతం యజ్ఞం యుష్మద్ధర్మవివక్షయా॥12724॥*


బ్రాహ్మణులారా! సాంఖ్యయోగములను గూర్చి శాస్త్రములలో పేర్కొనిన విషయములను (స్వస్వరూపజ్ఞాన విషయములను, సమాధిస్థితికి చేరిన యోగియొక్క లక్షణములను) మీకు వివరించితిని. ఇవి మిగుల గోప్యములు. మోక్షధర్మమును గూర్చి మీకు తెలుపుటకై యజ్ఞస్వరూపుడనైన నేను హంసరూపమున ఇచటికి వచ్చితినని ఎఱుంగుము.


*13.39 (ముప్పది తొమ్మిదివ శ్లోకము)*


*అహం యోగస్య సాంఖ్యస్య సత్యస్యర్తస్య తేజసః|*


*పరాయణం ద్విజశ్రేష్ఠాః శ్రియఃకీర్తేర్దమస్య చ॥12725॥*


భూసురోత్తములారా! నేను సాంఖ్యయోగములకునూ, సత్యమునకును, ఋతమునకునూ (యుక్తభాషణమునకును), తేజస్సునకును, సంపదలకును, కీర్తికిని, దమమునకును (ఇంద్రియ నిగ్రహమునకును) ఆశ్రయుడను.


*13.40 (నలుబదియవ శ్లోకము)*


*మాం భజంతి గుణాః సర్వే నిర్గుణం నిరపేక్షకమ్|*


*సుహృదం ప్రియమాత్మానం సామ్యాసంగాదయోఽగుణాః॥12726॥*


నేను నిర్గుణస్వరూపుడను, స్వార్థచింతన లేకుండ ఇతరుల దుఃఖములను పారద్రోలువాడను, అందరికిని హితమును గూర్చువాడను. అట్టి నన్ను సమత్వము, అనాసక్తి మొదలగు శ్రేష్ఠగుణములు సేవించుచుండును. ఈ సద్గుణములు అన్నియును ఎట్టిమార్పును చెందకుండా నిత్యము నాయందే స్థిరముగ నిలిచియుండును.


*13.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ఇతి మే ఛిన్నసందేహా మునయః సనకాదయః|*



*సభాజయిత్వా పరయా భక్త్యాగృణత సంస్తవైః॥12727॥*


*13.42 (నలుబది రెండవ శ్లోకము)*


*తైరహం పూజితః సమ్యక్ సంస్తుతః పరమర్షిభిః|*


*ప్రత్యేయాయ స్వకం ధామ పశ్యతః పరమేష్ఠినః॥12728॥*


ఉద్ధవా! నేను హంసరూపములో ఈ విధముగా ఉపదేశించిన పిదప, సనకాది మహామునుల సందేహములు అన్నియును తొలగిపోయినవి. అంతటవారు భక్తిశ్రద్ధలతో నన్ను ఆరాధించి స్తుతింపసాగిరి. ఆ సనకాది మహర్షులు త్రికరణశుద్ధిగా నన్ను స్తుతించి పూజించిన పిమ్మట బ్రహ్మదేవుడు చూచుచుండగనే నేను వైకుంఠధామమును చేరితిని.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే త్రయోదశోఽధ్యాయః (13)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట* అను పదమూడవ అధ్యాయము (13)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: