🌹 *రామాయణానుభవం_ 146*
హనుమ సీత సంభాషణ....
"అమ్మా! నీవిక్కడ ఎంత బాధపడుతున్నావో, రామలక్ష్మణులు కూడ నీ కొరకు అంత బాధపడుతున్నారు. నీవు ఉన్న ఈ లంక గురించి తెలియగానే తక్షణమే దండెత్తి వచ్చి లంకలోని రాక్షసులను కోపాగ్నితో మాడ్చివేసి నిన్ను తీసికొని అయోధ్యకు వెళ్లుతారు. వాళ్లిద్దరికి ఏమి చెప్పుమంటావమ్మా?" అని హనుమ అడిగాడు.
"హనుమా! లోకభర్త అయిన రాముని కన్న మనస్విని కౌసల్యాదేవి. ఆమె కన్నకొడుకైన రాముని కుశలమడిగానని, తలవంచి నమస్కరించానని తెలుపు.
అన్న, వదినలను అనుసరించడానికి అన్ని సంపదలను వదులుకొని అడవికి బయలుదేరిన లక్ష్మణుడు మా దంపతులను తల్లిదండ్రులుగా భావించి సేవలు చేశాడు. సౌమిత్రి మా మామగారికి తగిన తనయుడు. నా భర్తకు నీడవంటి వాడు. నాకు మిగుల ఇష్టమైన వాడు. ఆయన వెంట ఉండి పరిచర్యలు చేయడం వలన మాకు అడవి కూడ అయోధ్య లాగే అనిపించింది. సౌమ్యుడు, సమర్థుడు, పవిత్రుడైన సౌమిత్రి క్షేమాన్ని అడిగినట్లు తెలుపు.
*త్వమస్మిన్ కార్యనిర్యోగే॥ ప్రమాణం హరి సత్తమ। రాఘవస్త్వత్సమారంభాత్। మయ యత్న పరోభవేత్*
(సుందరకాండలో మంత్రరూపమైన శ్లోకాలలో ఇది కూడ ఒకటి. దీనిని భక్తితో పఠిస్తే హనుమ ద్వారా రామానుగ్రహం లభిస్తుంది.)
హనుమా! అంతా నీ చేతిలోనే ఉంది. నీవే ఈ పనిని సాధించగల వాడివి. రాఘవుడు వెంటనే బయలుదేరి వచ్చే రక్షించేలా చూచే బాధ్యత నీదే సుమా!"
"హనుమా శూరుడగు రామునితో మళ్లీ ఈ మాట చెప్పు సుమా! ఇక నేను బ్రతికేది నెల రోజులే. ఆ తరువాత రావణుడు నన్ను బ్రతుకు నీయడు. వృత్రాసుర సంహార పాపం కారణంగా ఇంద్రుని వదలి పాతాళంలో దాగి ఉన్న శ్రీని, శ్రీమహావిష్ణువు బయటకు తెచ్చి కాపాడినట్లు రావణునిచే బంధింపబడిన నన్ను రక్షించుమని చెప్పు.
*తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్*
*ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ*
ఇదిగో నా గుర్తును కూడ నీకు ఇస్తున్నాను. ఇది రామునికి అందిస్తే నన్ను నీవు చూచినట్లు నమ్మి, నీ మాటను బట్టి వెంటనే ఆయన బయలుదేరుతాడని చెప్పి తన చూడామణి (చూడామణిని) తన చీరముడి నుండి బయటకు తీసి, రామునికి సమర్పించుమని హనుమకు ఇచ్చింది" హనుమ దానిని కళ్లకు అద్దుకొని తన వేలికి పెట్టుకొన్నాడు.
ఇంతకుముందు హనుమ సీతాదేవి అనుమానం తీర్చడానికే పర్వతమంత ఎత్తు పెరిగాడు. సీతాదేవి తనను నమ్మిన తరువాత ఇప్పుడు మళ్లీ సాధారణ రూపం. ధరించాడు.
ఆ చూడామణిని వేలుకు పెట్టుకొని, వెంటనే తాను రాముని సన్నిధికి చేరుకొన్నట్లు దానిని శ్రీరామునికి అందించినట్లే భావించాడు.
సీతాదేవి బాధను చూచి సుడిగాలికి వణకిపోయిన వృక్షము వలె చలించిన హనుమ ఇప్పుడు కొంత తేరుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు......
[*త్వమస్మిన్ కార్యనిర్యోగే॥ ప్రమాణం హరి సత్తమ। రాఘవస్త్వత్సమారంభాత్। మయ యత్న పరోభవేత్*
(సుందరకాండలో మంత్రరూపమైన శ్లోకాలలో ఇది కూడ ఒకటి. దీనిని భక్తితో పఠిస్తే హనుమ ద్వారా రామానుగ్రహం లభిస్తుంది.)]
**
హనుమను సీతాదేవి తొందరిపెట్ట సాగింది.
వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా! ఈ కార్యమును నమకూర్చుట యందు నీవే వ్యవస్థాపకుడవు; ప్రయత్నమును పూని (నా) దుః ఖనాశమును చేయుము ఆలోచించి చేసిన వాని యొక్క ప్రయత్నము దుఃఖనాశమును చేయును.....
హనుమ సీతాదేవికి అంజలి ఘటించి "తల్లీ! రామభద్రుడు నేను వెళ్లి నీ విషయము తెలుపగానే తక్షణమే నీ రక్షకై బయలు దేరుతాడు. శ్రీరాముని బాణాల వాడిని, దాడిని ఎదుర్కోవడం నరులకే కాదు సురశ్రేష్ఠులైన సూర్య, పర్జన్య, యమాదులకు కూడ సాధ్యము కాదు. శ్రీరాముని విజయానికి నీవే కారణమవుతావు".
హనుమ యొక్క ఓదార్పు మాటలు సీతాదేవికి కొంత ప్రశాంతత కలిగించాయి. ఆమె హనుమను ఒక్క రోజైనా, రాక్షసులకు కనబడకుండా రహస్యంగా ఉండి వెళ్లుమని కోరింది. ఆయన ఉనికి వలన మరొక్కరోజు తాను ప్రశాంతంగా ఉండగల్గుతాను అంది.
ఆమెకు ఒక అనుమానము ఆమె మనస్సులో మెదలసాగింది. దానిని తీర్చుకోవాలని, "హనుమా! నీవంటే దైవ వరప్రసాదివి. వాయుపుత్రుడివి. నీవు గరుత్మంతునితో, వాయుదేవునితో సమానవేగంగా వెళ్లగల్గినవాడివి. నీకు ఈ సముద్రాన్ని దాటడం ఒక లెక్క కాదు.
"కాని మిగిలిన వానరులు సముద్రాన్ని ఎలా తరించగల్గుతారు? రామ లక్ష్మణులెలా దాటి రాగల్గుతారు? వారు నన్ను ఎలా కాపాడగల్గుతారు?" అనే అనుమానము నన్ను బాధిస్తున్నది. "దీనికి తగిన సమాధానము తెలిపి, నా మనస్సుకు శాంతిని కలిగించవా? రాముడు ఇక్కడికి రావాలి. లంకనంతా రామబాణమయం కావించాలి. రావణాసురుని సపరివారంగా సంహరించాలి. నన్ను గౌరవంగా తనతో తీసికవెళ్లాలి. అది ఆయనకు, నాకు తగినట్లుగా ఉంటుంది" అని తెలిపింది.
సీతాదేవికి విశ్వాసం కలిగించేలా హనుమ ఇలా బదులిచ్చాడు.
*మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః*
*మత్తః ప్రత్యవరః కశ్చిత్। నాస్తిసుగ్రీవ సన్నిధౌ*
*అహం తావదిహ ప్రాప్తః*
*కిం పునస్తే మహాబలాః* | *నహిప్రకృష్టాః* *ప్రేష్యంతే ప్రేష్యంతేహీతరాజనాః*
అమ్మా! సుగ్రీవుని సన్నిధిలో అందరికంటే (చిన్న) తక్కువ వాడిని నేనే. నా కంటే ఎందరో పెద్దవారు, కొందరు నాతో సమానులు ఉన్నారు.
ఇంత చిన్నవాడిని నేనే సులభంగా సముద్రం దాటి లంకకు వచ్చాను. ఇక నాకంటే పెద్దవాళ్ల గురించి వేరే చెప్పాలా? చూడమ్మా! ఎవ్వరైనా అందరికంటే చిన్నవారికే కదా పని చెప్పేది. పెద్దవారికి ఎవ్వరు పనులు చెప్పరు కదా!
*నాస్మిన్ చిరం వత్స్యసి దేవి దేశే* *రక్షోగణైధ్యుషితే తిరౌద్రే|*
*నతే చిరాదగమనం ప్రియస్యః క్షమస్వ* *మత్సంగ కాల మాత్రమ్*
రాక్షసులకు నిలయమై, అతి రౌద్రమైన ఈ లంకా నగరంలో ఇక ఎంతో కాలము నీవు ఉండబోవమ్మా! నేను రాముని కలుసుకొనే దాకా ఓర్చుకో. వెంటనే నీ ప్రియుడు నీ దగ్గరికి వచ్చి రావణుని సంహరించి నిన్ను తీసుకునివెళ్తాడు......
[05/10, 8:54 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 147*
హనుమ పలుకులు సీతాదేవి మనస్సులో తాపాన్ని తగ్గించాయి. ఆమె మళ్లీ హనుమతో
"వాయునందనా! సగము మొలకెత్తిన పైరు పొలములో, వర్షము పడి, పైరు మరింత పైకి వచ్చినట్లు నా మనస్సులో నీ మాటలు మరింత హర్షాన్ని కలిగించాయి. శ్రీరామునితో నా కలయిక జరిగేలా అనుగ్రహించు. కాకాసుర వృత్తాంతాన్ని జ్ఞాపకం చేయి. ఈ చూడామణిని భద్రంగా రామభద్రునికి అప్పగించు". ఇంత కాలము ఈ చూడామణి ని రామచంద్రుని జ్ఞాపకంగా భద్రంగా దాచుకొన్నానని తెలుపు.
"ఒకనాడు చెమటతో నా బొట్టు కరిగిపోయింది. అప్పుడు నా భర్త నన్ను దగ్గరకు తీసికొని స్వయంగా మణిశిలతో నాకు బొట్టు పెట్టాడు". ఈ విషయం కూడ మా భార్యా భర్తలిద్దరికే తెలుసు. ఈ బొట్టు గురించి కూడ నా రామునికి జ్ఞాపకం చేయి.
*మనశ్శిలాయాస్తిలకో గణ్డపార్శ్వే నివేశితః*
*త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి*
"రాముని కొరకే ఈ రాక్షస బాధలను అనుభవిస్తున్నాను. ఆయన కొరకే నాప్రాణాలను కాపాడుకొంటున్నాను. నేను బ్రతుకాలనుకొన్నా నెల రోజులకు మించి
రావణుడు నన్ను బ్రతుకనీయడు. ఆ లోపు నా పతి రాకున్నా. నన్ను రక్షింపకున్నా, ఆ
తరువాత నేను ప్రాణాలతో ఉండను.
రావణుడు క్రూరుడు. ఆయన నన్ను తన వశం చేసికోవడానికి అన్ని రకాల బెదిరిస్తున్నాడు. నెల తరువాత కూడా తనకు నేను వశం కాకపోతే నన్ను చంపి, తనకు ఆహారముగా పంపుమని పాచకులకు తెలిపాడు" అని కన్నీటితో అంది.
అప్పుడు హనుమ, "అమ్మా! రాముని విడిచి నీవెంత దుఃఖిస్తున్నావో, నిన్ను విడిచి రామలక్ష్మణులు కూడ అంత దుఃఖిస్తున్నారు. నిన్ను నేను చూచి వెళ్తున్నాను కదా! నేను వెళ్లగానే రామలక్ష్మణులు అత్యంత పరాక్రమోపేతులై ఇక్కడికి వచ్చి ఈ లంకను భస్మము చేసి నిన్ను తీసుకొని వెళ్తారు.
ఇక హనుమ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
[ఇంతవరకు సుందరకాండలో రెండు ముఖ్యఘట్టాలు పూర్తి అయ్యాయి.
1,అన్వేషణము 2.దర్శనము
(1) రామాజ్ఞతో సముద్రం దాటి వచ్చి సీతను లంకలో వెతుకడం.
(2) అశోకవనంలో రాక్షసుల మధ్య సీతాదేవిని చూడడం.
ఇక మిగిలిన పని
(3) విరోధినిరసనము: సీతాదేవికి విరోధులైన రావణుని సైనికులను తనకు వీలైనంత మందిని నశింపజేసి రావణుని బలాబలాలు తెలుసుకోవడం.]
**
హనుమ తన ఉనికిని రావణునికి తెలియజేసి, అయన బలాన్ని స్వయంగా తెలుసుకోవాలనుకుంటాడు. అందుకు రావణునికి ప్రమాదాన్ని కలిగించే (అశోకవనాన్ని) ప్రమదావనాన్ని ధ్వంసం చేయాలని అనుకొని.....
సీతాదేవి దుఃఖం తలుచుకుని కోపం. తెచ్చుకుని కాళ్ళతో తొక్కి అశోకవనాన్ని ధ్వంసం చేసాడు. అందమైన మహావృక్షాలు విరిచేసాడు. జలాశయాల గట్లు తెగొట్టాడు. పర్వత శిఖరాలను నలగగొట్టాడు. లతాగృహాలు, చిత్రగృహాలు చిందరవందర చేసాడు. రాతి కట్టడాలు పడగొట్టాడు. వనమంతా భీభత్సం చేసాడు.
అశోకలతలతో నిండి ఉండి రావణుడి స్త్రీలకు ఆనందం కలిగించే ఆ వనం క్షణకాలంలో నాశనమై శోకలతలు అల్లుకున్న పందిరిలా అయిపోయింది. అలా వనాన్ని నాశనం చేసి వనానికి ఉన్న ముఖద్వారం దగ్గర నిల్చున్నాడు.
పెళపెళలాడుతూ మహావృక్షాలు విరిగిన ధ్వనీ; చెదిరిన మృగాలూ, పక్షులూ భయంతో చేసిన శబ్దాలూ లంకలో మారుమోగాయి. ఆ శబ్దాలకు మగత నిద్రలో ఉన్న రాక్షస స్త్రీలు ఉలిక్కి పడి లేచారు.....
కొందరు రాక్షసస్త్రీలు సీతకు కాపలా ఉండగా, మరికొందరు పరుగెత్తి రావణుడి వద్దకు వెళ్ళి జరిగినది విన్నవించారు.
"మహారాజా! అమిత పరాక్రమవంతుడైన వానరుడొకడు భయంకరాకారంతో అశోక వనం మధ్యలో ఉన్నాడు. అతడు సాధారణ వానరుడిలా లేడు. ఏ కుబేరుడో, దేవేంద్రు పంపినవాడు అయి ఉండాలి. లేక సీతను వెదకటానికి రాముడు పంపినవాడు అయి ఉండాలి.
రాగానే సీతతో మాట్లాడి తరువాత నిర్భయంగా అందమైన నీ ఉద్యానవనం అంతనీ ధ్వంసం చేసాడు. సీత కూర్చున్న శింశుపావృక్షం ఒక్కటే వదిలిపెట్టాడు.! సీతను రక్షించడానికే ఆ వృక్షాన్ని వదిలేసాడు.
*న తత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః*
*యత్ర సా జానకీ సీతా స తేన న వినాశితః*
రాజా! నువ్వు కోరుకుంటున్న సీతతో మాట్లాడాడంటే వాడు ప్రాణాలమీద ఆశ వదులుకొన్నవాడే. వాడిని కఠినంగా దండించు.”
ఆ మాటలు విని రావణుడి కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి. ఎర్రని కళ్ళలోంచి వెలుగుతున్న దీపం నుంచి జారిన మరుగుతున్న తైలబిందువులవంటి నీటిబొట్లు రాలాయి.
తనతో సమానులైన ఎనభైవేల
మంది కింకరులు అనే క్రూరరాక్షసులను తక్షణం హనుమంతుణ్ణి పట్టుకోమని ఆజ్ఞాపించాడు.
వాళ్ళు యినుముతో చేసిన కూటాలు, ముద్గరాలూ తీసుకుని సమరోత్సాహంతో అశోకవనం చేరారు. వాళ్లను చూస్తూనే హనుమంతుడు తోక నేలకు వేసి కొట్టి, జబ్బ చరిచి లంకా పట్టణమంతా వినిపించేలా యిలా ప్రకటించాడు.
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః,*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః.*
*దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః,*
*హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః.*
*న రావణసహస్రం మే*
*యుద్ధ ప్రతిబలం భవేత్,*
*శిలాభిస్తు ప్రహరతః*
*పాదపైశ్చ సహస్రశః*
*అర్ధయిత్వా పురీం లఙ్కామభివాద్య చ* *మైథిలీమ్, సమృద్ధార్థో గమిష్యామి* *మిషతాం సర్వరక్షసామ్*
**
(ఈ శ్లోకాలు జయమంత్రాలు. వీటిని శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తే శత్రుజయము, దారిద్ర్యము, వ్యాధి, బాధలు తొలగుతాయి.)
[05/10, 8:55 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 148*
*జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః*
*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః*
*దాసోఽహం కోసలేంద్రస్య* *రామస్యాక్షిష్టకర్మణః*
*హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా* *మారుతాత్మజః*
*న రావణసహస్రం మే యుద్ధ ప్రతిబలం* *భవేత్*, *శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః*
*అర్ధయిత్వా పురీం లఙ్కామభివాద్య చ మైథిలీమ్*, *సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్*.
అతిబలవంతులైన రామలక్ష్మణులు విజయులై వర్ధిల్లుతున్నారు. రాముడి రక్షణలో మహారాజు సుగ్రీవుడు విజయుడై వర్ధిల్లుతున్నాడు. రాముడు ఏ కార్యాన్నైనా (ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా) అవలీలగా సాధిస్తాడు. నేను, ఆ రాముడికి దాసుడిని, వాయుపుత్రుణ్ణి నా పేరు హనుమంతుడు. (నేనొక్కడినే) శత్రుసైన్యాలను నిర్మూలించ గలను.
నేను యుద్ధం చేస్తే వెయ్యిమంది రావణులు ఏకమై వచ్చినా నా ముందు నిలువలేరు. (నేనేమీ ఆయుధాలు తెచ్చుకు రాలేదు.) నాకేమీ ఆయుధాలు అక్కర్లేదు. మీ ఊళ్ళో ఉన్న రాళ్ళూ, చెట్లూ చాలు, వాటితోనే కొట్టి మిమ్మల్మి చంపుతాను.
మీ లంకను పీడించి, మీరంతా చూస్తూండగానే సీతకు నమస్కరించి, వచ్చిన పని
పూర్తిచేసుకుని వెడతాను.” అన్నాడు.
రాక్షసులు ఒక్క క్షణం భయపడి, అంతలోనే తేరుకుని విజృంభించారు. హనుమంతుణ్ణి చుట్టుముట్టి బాణాలూ, అనేకరకాల ఆయుధాలూ ప్రయోగించారు.
హనుమంతుడు ముఖద్వారానికి ఉన్న పెద్ద యినుప గడియను ఊడపీకి, ఆకాశంలోకి ఎగిరి, గిర్రున తిరుగుతూ ఎనభైవేల మందినీ ఆ గడియతో కొట్టి చంపాడు.
ఎనుభై వేల మంది రాక్షస కింకరులను అవలీలగా హతమార్చిన హనుమను చూచి భయకంపితులైన కొందరు సేవకులు రావణుని ముందువెళ్లి ఈ వార్తను తెలిపారు. పగవాడి పరాక్రమాన్ని విని సహించలేక రావణుడు ప్రధానమంత్రి అయిన ప్రహస్తుని కుమారుడని జంబుమాలివైపు తన తీక్షములైన చూపులను ప్రసరింపజేశాడు. జంబుమాలి సర్వ సైన్య సమేతంగా సమరానికి బయలుదేరాడు.
అయితే జంబుమాలివచ్చేదాక కూడ హనుమ ఆగ దలచుకోలేదు. అశోకవనంలో ఒక్క చైత్య ప్రాసాదము మిగిలి ఉంది. దానిని కూడ ధ్వంసము చేస్తే మరికొంత పని జరుగిపోతుందని ఆయన భావించాడు.
ఆ ప్రాసాదము మేరు పర్వత శిఖరమువలె ఉన్నతంగా ఉంది. ఆ భవనముపైకి తన బలాన్నంతా ఉపయోగించి దుమికాదు. హనుమ యొక్క అపారమైన బలాన్ని ఆ భవనము తట్టుకోజాలలేదు. అది ముక్కలు ముక్కలుగా కూలిపోయింది. మళ్లీ ఒకసారి తన విజయమంత్రాన్ని బిగ్గరగా చదువుతున్నాడు.
*అస్త్ర విజ్ఞయతాం రామోలక్ష్మణశ్చ* *మహాబలు రాజా జయతి సుగ్రీవో* *రాఘవేణాభిపాలితః*
సకలాస్త్రవిదుడైన రాముడు జయించుగాక! మహాబలుడైన లక్ష్మణుడు జయించుగాక! రాఘవుని చేత పాలింపబడుతున్న సుగ్రీవుడు జయించుగాక!
(తాను జయించాలని హనుమ ప్రత్యేకంగా కోరుకోలేదు. వాళ్ల విజయమే తన విజయము.)
ఆ భవనాన్ని కాపలాకాచే వందమంది రాక్షస వీరులు ఆగ్రహావేశాలతో హనుమ పై బడ్డారు.
హనుమ ఆ మేడ యొక్క సువర్ణ స్థంభాన్ని ఊడబెరికి దానిని గిర గిర త్రిప్పసాగాడు. స్థంభం యొక్క తాకిడికి ఆ భవనం నుండి అగ్ని భయంకరంగా కలిగింది. ఆ అగ్ని భవనాన్ని అంతటిని తగుల బెట్టింది. ఆ స్థంభంతో హనుమ నూరుమంది కాపలాదారులను కాటికి పంపాడు.
హనుమ శ్రీమంతుడై ఆకాశంలోనే నిలిచి, మేఘ గంభీర ధ్వనితో "మహా పరాక్రమ సంపన్నుడైన సుగ్రీవుని ఆజ్ఞకు లోబడి వేలాది వానరవీరులు మహాగజబలులై భూమండల మంతా సంచరిస్తున్నారు. వారందరితో కలసి సుగ్రీవుడు, సహజ బలపరాక్రమ సంపన్నుడైన రామభద్రుడు లంకపై దండెత్తి వస్తున్నారు. అచిరకాలంలో లంకా నగర మంతా రాముని వైరాగ్నికి ఆహుతి అవుతుందని” ఉచ్ఛైస్వరంతో హెచ్చరించాడు.
**
రావణుని కనుచూపుల సైగలను గ్రహించిన జంబుమాలి ఇంద్ర ధనుస్సుతో సమానమైన, సమున్నత చాపాన్ని గ్రహించి, రక్త నేత్రాలతో దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనిని చేస్తూ గాడిదలు పూన్చిన రథంపై బయలుదేరాడు.
జంబుమాలి వస్తూనే తోరణముపై కూచొన్న హనుమ ముఖముపై, బాహువులపై బాణాలతో కొట్లాడు. ఆ బాణము దెబ్బలతో రక్తముతో ఎఱ్ఱనైన హనుమ ముఖము పూచిన మోదుగుపూవు వలె కనబడింది.
హనుమ జంబుమాలి బాణప్రయోగ చాతుర్యానికి సంతోషించి, ఒక విశాల శిలను భూమిపై నుండి పెకిలించి జంబుమాలిపై విసిరాడు. అయితే జంబుమాలి దానిని పది బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు.
హనుమ ప్రక్కలో ఉన్న ఒక మహా వృక్షాన్ని పెకిలించి జంబుమాలిపైకి విసిరాడు. దానిని ఆయన నాలుగు బాణాలతో ఖండించాడు.
అంతేకాదు హనుమ భుజాలను, గుండెను, రొమ్మును తీవ్ర బాణాలతో బాధించాడు. దానితో ఆగ్రహించిన హనుము - తాను కూచొన్న తోరణము యొక్క పరిఘను పెకిలించి తీసికొని, మహావేగముతో జంబుమాలి గుండెలపై కొట్టాడు. రాక్షసుని శరీరమంతా ముక్కలు ముక్కలైంది. శిరస్సు ఉండవలసిన స్థానంలో లేదు. బాహువులు విరిగాయి. మోకాళ్లు పగిలాయి. శరీరమంతా పొడి అయింది. ధనుస్సు, రధము, గాడిదలు అన్ని వాటి వాటి రూపాన్ని కోల్పోయాయి.
*తస్యచైవ శిరోనాస్తి న బాహూ, నచ జానున్నీ*
*న ధనుర్నరధోనాశ్వాః తత్రాదృశ్యంత నేషనః*
హనుమ పరఘాతానికి జంబు మాలి యొక్క తలయే లేదు, బాహువులు లేవు; మోకాళ్ళు కూడ లేవు, ధనుస్సు లేదు; రథములేదు; గుఱ్ఱములు లేవు; అచ్చట బాణములు కూడ కనబడలేదు రూపం లేకుండా ఒకే ముద్ద గా పడిపోయాయి.
జంబుమాలి విరిగిన శరీర భాగాలవలె, వాటిని వేర్వేరుగా ముక్కలు ముక్కలుగా వాల్మీకి వర్ణించడం అద్భుతం గా ఉంటుంది....
[05/10, 8:55 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 149*
జంబుమాలి చనిపోయాడనే వార్తను విన్న రావణాసురుడు ఏడుగురు మంత్రుల పుత్రులను మహా బలులను ససైన్యంగా హనుమపైకి పంపాడు.
మేఘ గంభీర ధ్వనిగల మహారథాల నెక్కి, కనకమయ ధనువులను ధరించి వారు హనుమపైకి వెళ్లారు. వారు హనుమపై శరవర్షాన్ని కురిపించారు.
అయితే అందరు మూకుమ్మడిగా శరప్రయోగం చేసినా, ఒక్క బాణం కూడ తనకు తగులకుండా హనుమ విచిత్రంగా తన శరీరాన్ని అమిత వేగంగా త్రిప్పుతూ తప్పించుకొన్నాడు.
ఒకవైపు ఆ ఏడుగురు భయంకర బాణ ప్రయోగంతో ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే హనుమ విలాసంగా వాటిని తప్పించుకొంటూ ఆడుకోసాగాడు.
అరచేతి దెబ్బలతో, పాదాఘాతాలతో, పిడికిలి గ్రుద్దులతో, పదును గోళ్లతో, గుండె తాకుడులతో, తొడల రాపిడులతో హనుమ ఆ సప్త మంత్రి సుతులను ససైన్యంగా మట్టుపెట్టాడు.
మిగిలిన సైన్యము అన్ని దిక్కుల వైపు చీలి పారిపోయింది. ఆ విధంగా మంత్రి కుమారులు, సైన్యము మృతికి కారణమైన హనుమ మళ్లీ తోరణముపైకి ఎగిరి ఠీవిగా కూచొన్నాడు.
**
మంత్రి సుతులు హనుమ చేత నిహతులైనారని విని, రావణుడు శూరాగ్రేసరులైన సేనాధిపతులను హనుమపైకి పంపుటకు నిశ్చయించుకొని,
"సేనా నాయకులారా! మీరు మహావీరులు. మీ సహాయంతోనే నాగులను, యక్షులను, గంధర్వులను, దేవతలను, మహర్షులను ఓడించాను. వాళ్లందరు కలసి మనను ఓడించాలని ఉవ్విళ్లూరుతుంటారు. వారందరు కలసి ఈ వానరుని సృష్టించి ఉంటారు. ఆయన వానరుడో, మహాభూతమో తెలియదు.
*న హ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్*
*సర్వథా తన్మహద్భూతం మహాబలపరిగ్రహమ్*
మీరు రథ, గజ, తురగ, పదాతుల బలంతో వెళ్లి, అప్రమత్తంగా ఉండి, ఆయనను ఎదుర్కొండి.
ఇదివరకెందరినో మహావీరులైన వానరులను చూచాను. ఈయనలోని తేజో, బల,
పరాక్రమ, మహోత్సాహాలు మరెవ్వరికి లేవు. జయము దైవాధీనము!!.
రావణుని ప్రబోధముసేనాగ్రేసరులను అప్రమత్తం చేసింది. సూర్య సమాన తేజుడైన హనుమను చూచి వారందరు మూకుమ్మడిగా తమ ఆయుధాలతో ఎదుర్కొన్నారు.
దుర్ధరుడు అయిదు పదను బాణాలను హనుమ శిరస్సుపై ప్రయోగించాడు. ఆయనపై
వందలాది బాణాలను వేశాడు. హనుమ మహాగ్రహంతో ఆకాశంలోకి ఎగిరి తన
బలమంతటితో దుర్ధరుని రథముపై పిడుగు వలె పడ్డాడు. ఆయన మహా బలాన్ని
తట్టుకోలేక రథము, గుఱ్ఱాలు ధ్వంసమయ్యాయి. దుర్ధరుడు మృతుడై నేల వాలాడు.
దుర్ధరుని మృతికి ఆగ్రహించిన విరూపాక్ష, యూపాక్షులిద్దరు తమ తమ ఆయుధాలతో హనుమపైకి ఉరికారు. వాళ్ల ఆయుధాల తాకిడిని ఎదుర్కొంటూ, హనుమ అక్కడ ఉన్న ఒక మహా సాలవృక్షాన్ని మహావేగంగా ఆ ఇద్దరివైపు విసిరాడు. ఆ మహాసాలము వారిద్దరి మరణానికి కారణమైంది.
ప్రఘసుడు, భాసకర్ణుడు ఇద్దరు రెండువైపుల నుండి తమ పట్టస శూలా యుధాలతో హనుమ నెదుర్కొన్నారు. వారి దెబ్బలకు హనుమ శరీరము రక్తసిక్తమైంది. అయినా అప్పుడే ఉదయిస్తున్న ఆదిత్యునివలె ఆయన ప్రకాశిస్తూ ఒక మహాపర్వత శిఖరాన్ని పెకిలించి వారిద్దరిపై ప్రయోగించాడు. ఆ కొండ వారిద్దరి గుండెలను చీల్చింది. తరువాత వారి రథగజ, తురగ, పదాతి బలాలను హనుమ ధ్వంసము చేశాడు.
ఈ విధంగా ఆ అయిదుగురు మహావీరులైన సైన్యాధిపతులను హనుమ ప్రళయకాల సూర్యునివలె మాడ్చి మసి చేశాడు. విజయ ధ్వనులను చేస్తూ ఆయన మళ్లీ తోరణంపై అధిష్ఠించాడు.
అయిదుగురు మహావీరులైన సేనా నాయకుల మరణ వార్త రావణాసురునికి పిడుగుపాటు వలె కంపనాన్ని కలిగించింది.
[05/10, 8:55 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 150*
సాధారణమైన సైన్యము, మంత్రి కుమారులు, సేనానాయకులు అందరు హనుమను ఎదుర్కొని నేరుగా అమరలోకానికి ప్రయాణమయ్యారు.
ఇక రావణుడు తన కుటుంబము వైపు దృష్టి సారించాడు. ఆయన చిన్న కుమారుడు. అక్ష కుమారుడు, బాలభానునివలె పరాక్రమంతో వెలిగిపోతున్నాడు. అమరవీరులు కూడ ఆయన ముందు నిలువలేరు. ఆయన సకలాయుధ సంపన్నుడు, శస్త్రాస్త్రకోవిదుడు. తపస్సు చేసి దివ్యరధాన్ని వరంగా పొందాడు. రావణుడు అక్ష కుమారుని వైపు చూశాడు.
*సేనాపతీన్పఞ్చ స తు ప్రమాపితాన్* *హనూమతా సానుచరాన్సవాహనాన్*
*సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం* *కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః*
ఆయన రత్నఖచిత పతాకంతో, వాయువేగ, మనోవేగ సంపన్నాలైన అష్టాశ్వాలతో కట్టబడిన దివ్యరథంపై బయలుదేరాడు. ఆయన వెంట చతురంగ బలాలు కదిలాయి. వాళ్ల రథ, గజ, తురగ ధ్వనులు భూమ్యాకాశాలను దద్దరిల్ల జేశాయి.
హనుమ తోరణంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయనను చూడగానే అక్ష కుమారునికి ఆశ్చర్య, గౌరవాలు కలిగాయి. ఆయన హనుమ బలాన్ని, తన బలాన్ని ముందుగానే బేరీజు వేసికొన్నాడు. సువర్ణ గళాభరణంతో, అంగదాలతో, కుండలాలతో విరాజమానుడైన అక్షయ కుమారుడు తన ధనుర్భాణాలతో హనుమను ఎదుర్కొన్నాడు.
వారిద్దరి యుద్ధము భయంకరంగా జరిగింది. సురాసురులు ఆశ్చర్యంతో ఆ సమరాన్ని అవలోకించారు.
పంచభూతాలు పనిచేయడం మానివేశాయి. బాణప్రయోగ పారీణుడైన అక్షకుమారుడు హనుమ శిరస్సుపై క్రూర సర్పాల వంటి మూడు శరాలను వేశాడు. వాటి తాకిడికి హనుమ శిరస్సు నుండి రక్తము రాసాగింది.
అక్షకుమారుని పరాక్రమానికి హనుమకు హర్షం కలిగింది. ఆయన గట్టిగా గర్జించాడు. అక్ష కుమారుని శరవర్షాన్ని ఆకాశంలో విహరిస్తూ అవలీలగా హనుమ ఎదుర్కొన్నాడు. అయితే బాలభాస్కరుని వంటి అక్షకుమారుని హతం కావించడానికి హనుమ మనస్సు అంగీకరించలేదు. కాని ప్రాణాలతో వదలినంత మాత్రాన అక్ష కుమారుడు సమర రంగాన్నుండి వెనుదిరిగి పోయేవాడు కాదు. ప్రజ్వరిల్లే అగ్ని శిఖను ఆర్పివేయక తప్పదు.
*న ఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే*
*ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః*
హనుమ ఒక్కసారి విజృంభించి తన భయంకరమైన అరచేతి దెబ్బలతో రథాన్ని, అశ్వాలను ధ్వంసము కావించాడు.
విరిగిన రథాన్ని వదలి అక్షకుమారుడు ఆకాశంలోకి ఖడ్గధరుడై ఎగిరాడు. ఆయన ఆకసంలో వీర విహారం చేయసాగాడు.
హనుమ చాకచక్యంతో అక్షకుమారుని రెండు కాళ్లు పట్టుకొని గిరగిర త్రిప్పి నేలపై అనేక పర్యాయాలు బలంగా కొట్టాడు. దానివలన అక్షకుమారుని సకలావయవాలు చూర్ణమయ్యాయి. ఆయన మరణించి నేలకూలాడు.
అక్ష కుమారుని మరణానికి అమరులు, మహర్షులు ఆకాశం నుండి పుష్ప వర్షం. కురిపించారు. రక్తనేత్రుడైన హనుమ తిరిగి తన యధాస్థానంలో ఆసీనుడయ్యాడు.
**
తన ప్రియకుమారుడు, చిన్నకుమారుడైన, అక్షకుమారుని వధ వలన రావణాసురుని మనస్సు విషాదగ్రస్తమైంది. కొంచెము సేపు ఆయన స్థబ్దుడయ్యాడు. ఆ తరువాత తన మనస్సును సమాధానపరుచుకొని తనకు ప్రాణప్రియుడైన జ్యేష్ఠ కుమారుని, ఇంద్రజిత్తును చూచాడు.
*తతస్తు రక్షోధిపతిర్మహాత్మా హనూమతాక్షే నిహతే కుమారే*
*మనస్సమాధాయ సదేవకల్పం సమాదిదేశేన్ద్రజితం సరోషః*
"కుమారా! నీవు నాకు అత్యంత ఇష్టుడవు, జ్యేష్ఠుడవు. సకల శస్త్రాస్త్ర కోవిదుడవు. బ్రహ్మదేవుని అమోఘ తపముతో మెప్పించి అమోఘమైన అస్త్ర సంపదను ఆర్జించిన వాడవు.
మూడు లోకాలలో నిన్నెదిరించే మొనగాడే లేదు. దేవేంద్రుడు నూరు అంచుల వజ్రాయుధాన్ని ప్రయోగించి కూడ, అది పని చేయక పోవడం వలన నీకు దాసో2 హమన్నాడు.
ప్రస్తుతము మనకొక భయంకరమైన ఆపద సంభవించింది. ఎనుబై వేల కింకరులు, జంబుమాలి, అమాత్యపుత్రులు, సేనానాయకులు, నీ ప్రియ సోదరుడు అక్ష కుమారుడు హనుమతో యుద్ధం లో హతమయ్యారు. నిన్ను ఈ కార్యానికి పంపకూడదు. కాని నీవు తప్ప ఈ కార్యానుండి గట్టెక్కించే గట్టి వీరుడు లేడు.
నీవు శత్రువులను జయించే పరాక్రమ స్వభావాలు కలవాడివి. స్వంత బలాన్ని,
శత్రుబలాన్ని అంచనా వేసికొని యుద్ధ రంగంలోకి అడుగుపెట్టు,
అమరేంద్రుని వజ్రాయుధము కూడ హనుమ ముందు అల్పమే. సకల సైన్యము మూకుమ్మడిగా హనుమపై బడ్డా, ఆయనకు ఆవగింజంత బాధ కూడ కల్గదు. వాయుదేవుని వేగము కూడ ఈ వానర వేగము ముందు దిగదుడుపే. అందువలన దివ్యాస్త్రాలను స్మరించుకొని సమరానికి సమాయత్తం కావాలి" అని ఉపదేశించాడు.
తండ్రి మాటలను తలదాల్చి, ఇంద్రజిత్తు తన తండ్రి చుట్టు ప్రదక్షిణం చేసి ధైర్యంతో, తండ్రి ఆశీర్బలంతో, ఇష్టులైన అసుర వీరులతో సమరానికి బయలు దేరాడు. ఆయనలో పర్వదినాలలో పొంగిపొరలే సముద్రం వలె సమరోత్సాహము ఉరకలెత్తింది.
భయంకరమైన నాలుగు సింహాలను పూన్చిన దివ్య రథమెక్కి ఆయన యుధ్ధానికి బయలుదేరాడు. ఆయన యొక్క రథ చక్రధ్వని, ధనుస్సు యొక్క నారీటాంకార ధ్వనిని హనుమ విని, తనకు తగిన అరివీరుడు లభించాడని ఆనందించాడు.
ఇంద్రజిత్తు రథరవాన్ని విన్న మృగాలన్ని మౌనం దాల్చాయి. దిక్కులన్ని మసక బారాయి. పక్షి సంఘాలు నలువైపుల పారిపోయాయి.
ఇంద్రజిత్తు అత్యంత కౌశలంతో శరవర్షం కురిపించినా, ఒక్క బాణం కూడ హనుమను బాధించలేదు. ఇంద్రజిత్తును పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా హనుమకు వీలు కల్గలేదు.
ఇద్దరు సమర విశారదులే. ఇద్దరు వాయు సమవేగులే.
ఎంత భయంకరంగా యుద్ధం చేసినా, ఎన్ని శస్త్రాస్త్రాలను ప్రయోగించినా హనుమ తనకు చిక్కడని తెలిసికొన్న ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అతనిని బంధించాలని ఆలోచించాడు. హనుమపై చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాడు.
బ్రహ్మాస్త్రము అమోఘమైన దివ్యాస్త్రము. ఆ అస్త్రము ముందు ఏ శస్త్రము, ఏ అస్త్రము పనిచేయజాలవు. సురాసురులలో, నరులలో వానరులలో ఎంతటి వీరులైనా బ్రహ్మాస్త్రము బంధింపబడవలసినవారే.
అంతటి మహాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ఇంద్రజిత్ ప్రయోగించాడు. ఆ మహాస్త్రము హనుమ యొక్క బల, వీర్య తేజస్సులను అపహరించింది. హనుమ విధిలేక ఆ అస్త్రానికి వశుడయ్యాడు......
*తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన స వానరః*
*అభవన్నిర్విచేష్టశ్చ పపాత స మహీతలే*
[05/10, 8:55 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 151*
హనుమ తనలో ఈ విధంగా అనుకోసాగాడు: "ఈ దివ్యాస్త్రము మహా ప్రభావ భరితమైనది. దీనినెదుర్కోవడానికి నాకే కాదు మరెవ్వరికి కూడ శక్యము కాదు.
అయితే నాకు బ్రహ్మ వరప్రసాదము ఉంది. అందువలన ఈ మహాస్త్రము వలన నాకు మరణ భయం లేదు. ఈ అస్త్రం నుండి విడుదల పొందడం కూడ బ్రహ్మదేవుని దయవలననే లభిస్తుంది.
ఇంతటి భయంకరాస్త్రానికి బద్ధుడనైనా నన్ను, బ్రహ్మదేవుడు, మహేంద్రుడు, నా తండ్రి వాయుదేవుడు కాపాడుతున్నారు. అందువలన ఈ అస్త్రాన్ని అనుసరించడమే మేలు" అనుకొని వేరే ఏ ప్రయత్నం చేయకుండా అస్త్రబద్ధుడయ్యాడు.
అయితే అసురవీరులందరు అస్త్రబద్ధుడైన హనుమను నమ్మలేదు. ఎప్పుడు ఏ క్షణంలో మళ్లీ ఆ వానరవీరుడు తమపై విరుచుక పడుతాడో అనే భయంతో అక్కడ ఉండే చెట్లవారలతో, త్రాళ్లతో హనుమను మరింత బలంగా కట్టారు.
ఇలా ఇంకో తాడుతో కట్టడం వలన బ్రహ్మాస్త్రం విడబడింది.
*స బద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్*
*అస్త్రబన్ధః స చాన్యం హి న బన్ధమనువర్తతే*
"హనుమ కూడ రావణుని సభా భవనంలో దర్శించాలని, ఆయనకు అమోఘమైన రామబాణ బలాన్ని తెలుపాలని, సీతాదేవిని రామచంద్రస్వామికి అప్పగించుమని సలహా ఇవ్వాలని, తన మాట వినకపోతే రావణాసురునికి సర్వనాశనము తప్పదని హెచ్చరించాలని" అనుకొన్నాడు.
అందువలన హనుమ బ్రహ్మాస్త్ర బద్ధుడుగానే ఉండాలని నిర్ణయించుకొన్నాడు. ఇంద్రజిత్తుకు తప్ప మిగిలిన రాక్షసులకు హనుమకు బ్రహ్మాస్త్రబంధం వదలి పోయిందని తెలియదు. అందువలన వారు తాళ్లతో హనుమను బంధించి రావణుని ముందుకు ఈడ్చుక వెళ్లారు. బలమైన త్రాళ్లతో బంధింపబడిన భద్రగజమువలె హనుమ కనబడ్డాడు.
హనుమ పరాక్రమాన్ని, రాక్షసుల సంహారాన్ని విన్న రాక్షసులందరు రావణ సభలో హనుమను 'ఆశ్చర్యంతో చూడసాగారు.
"ఎవ్వరు ఈయన? ఎవ్వరు పంపితే వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అని వారిలో వారు మాట్లాడుకోసాగారు.
"కొట్టండి, చంపండి" అని కొందరు హనుమవైపు చూస్తూ ఆగ్రహంతో అరవసాగారు. తేజోబల సంపదలతో సూర్యునివలె ప్రకాశిస్తున్న రావణుని చూచి హనుమ ఆశ్చర్య చకితుడయ్యాడు.
*రాక్షసాధిపతిం చాపి దదర్శ కపిసత్తమః*
*తేజోబలసమాయుక్తం తపన్తమివ భాస్కరమ్*
అత్యద్భుత వీర్యతేజో బలసంపన్నుడైన హనుమను చూచి రావణుడు తన మంత్రులు వైపు తిరిగి "హనుమ గురించి తెలిసికొనమని ఆదేశించాడు.
అప్పుడు వారు ఆ వానరవీరునితో.....
నీ వెవ్వరు?
ఎందుకు వచ్చావు?
నిన్ను ఎవ్వరు పంపారు?" అని అడిగారు. దానికి సమాధానంగా హనుమ "నేను వానర వీరుడైన సుగ్రీవుని దగ్గర నుండి రామ దూతగా వచ్చాను" అని తెలిపాడు.......
**:¹
రావణప్రభువు మంచి ముత్యాలు వ్రేలాడుతున్న బంగారు కిరీటంతో, రత్న ఖచితమైన సువర్ణాభరణాలతో మహేంద్రవైభవముతో ప్రకాశిస్తున్నాడు. తెల్లని పట్టుధోవతిని ధరించి, రక్తచందనాన్ని పూసుకొని, పదిశిఖరాలు గల మందర పర్వతంవలె తన పది శిరస్సులతో వెలిగిపోతున్నాడు.
నల్లని ఆయన మేనులో తెల్లని ముత్యాల హారాలు నీలాకాశంలో ఎగురుతుండే కొంగలబారును తలపిస్తున్నాయి. ఆయన సింహాసనం ప్రక్కలో ఇద్దరు సువర్ణాలంకృత సుందరీమణులు విసనకరలతో
ఆయనను సేవిస్తున్నారు.
రావణునికి క్రింది భాగంలో చతుస్సముద్రాలవలె దుర్దరుడు ప్రహస్తుడు, మహాపార్వుడు, నికుంభుడు అనే నలుగురు మంత్రులు కొలువై ఉన్నారు.
హనుమ తనను బాధిస్తున్న రావణకింకరులను పట్టించుకోక రావణునే చూడసాగాడు.
రావణుని అద్భుత రూప ధైర్యబలాలు హనుమను ఆశ్చర్యచకితుని చేశాయి.
*అహో రూపమహోధైర్యం అహో* *సత్వమహోద్యుతిః అహో రాక్షస రాజస్య* *సర్వలక్షణ యుక్తతా*
ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నా వీటన్నింటిని నశింపజేసే అధర్మము రావణునిలో నిండుగా ఉంది. ఒకవేళ ఆ అధర్మమే లేకపోతే ఆయన మహేంద్రునితో సహా మూడు లోకాలకు అధిపతి అయ్యేవాడే కదా!
*యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః*
*స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా*
ఈయన తన అధర్మంతో మూడు లోకాలను బాధిస్తున్నాడు.
హనుమ ఆలోచనలు ఇలా ఉంటే రావణుని ఆలోచనలు మరొక రీతిగా ఉన్నాయి. 'ఏమి ఈ హనుమ రూపము! నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా? లేక నన్ను సాధించడానికి బాణాసురుడే ఈరూపంలో వచ్చాడా? ఇంతటి పరాక్రమ వంతుడు ఒక సామాన్య వానరుడు కాదు.
రావణుడు హనుమ వైపు నుండి తన కళ్ళను మరల్చి ప్రధానమంత్రి అయిన ప్రహస్తుని వైపు చూచి 'ఈయన ఎవ్వరు? ఎందుకు వచ్చాడు? ఎవ్వరు పంపారు? ఎవ్వరుకాలు పెట్టడానికి వీలులేని లంకకు ఎట్లా వచ్చాడు? రాక్షసులను ఎందుకు సమరంలో సంహరించాడో కనుక్కొమ్మని ఆయనను ఆదేశించాడు.
ప్రహస్తుడు హనుమను, "నీ రూపానికి నీ తేజస్సుకు పోలిక లేదు. నీవు దేవేంద్రుని రాయబారివా? యమ వరుణ కుబేరుల చారుడివా?విష్ణుదేవత దూతవా? నిర్భయంగా నిజము చెప్పుమ"ని ప్రశ్నించాడు.
*న హి తే వానరం తేజో రూపమాత్రం తు వానరమ్*
*తత్త్వత: కథయస్వాద్య తతో వానర మోక్ష్యసే*
హనుమ ప్రహస్తుని సరకు చేయక రావణుని వైపు తిరిగి, 'రాక్షసాధిపా నేను ఇంద్ర వరుణ కుబేరుల దూతను కాను. మహవిష్ణువు కూడా నన్ను పంపలేదు.
*యథాక్రమం తైస్స కపిర్విపృష్టః కార్యార్థమర్ధస్య చ మూలమాదౌ*
*నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతోస్మి*
నేను సుగ్రీవ సచివుడైన వానరుడను. నిన్ను వ్యక్తిగతంగా కలవాలని నీ వనాన్ని ధ్వంసము చేశాను. ఆత్మరక్షణ కొరకు నన్ను ఎదిరించిన రాక్షసులను సంహరించాను. సురాసురులు నన్ను సమరంలో ఎదుర్కోలేరు. శస్త్రాస్తపాశాలు నన్ను బంధించజాలవు. 'బ్రహ్మాస బద్ధుడివి కాలేదా" అంటావా? నేను ఆ అస్త్రానికి కావాలనే పట్టుబడ్డాను. నిన్ను సభలో చూడాలని, కలువాలని, నీతో మాట్లాడాలని కటుబడ్డాను......
[05/10, 8:56 am] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 152*
రావణుడితో హనుమ సంభాషణ......
'రథ, గజ, తురగ పదాతి దళాలు అసంఖ్యాకంగా ఉన్న దశరథ సార్వభౌముని తనయుడు శ్రీరామచంద్రుడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి రాజ్యాధికారాన్ని వదలుకొని అడవులకు సతీ, సోదర సమేతంగా వచ్చాడు.
రాముడు ధర్మాత్ముడు. సీతాదేవి మహా పతివ్రత. రామ లక్ష్మణులు ఇంట్లో లేనప్పుడు రామపత్నిని అపహరించి తెచ్చావు. ఆమె జాడను కనుక్కోవాలని రామ లక్ష్మణులు కిష్కింధానగరానికి వచ్చారు. ఋష్యమూక పర్వతముపై రామ సుగ్రీవుల సఖ్యము సమకూరింది. నీకు మహాబలి అయిన వాలి తెలుసుకదా! అంతటి మహాపరాక్రమ వంతుడైన వాలిని ఒకే కోలతో నేలగూల్చి రామభధ్రుడు సుగ్రీవునికి రాజ్యాధికారాన్ని కలిగించాడు.
సుగ్రీవుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, సీతాదేవిని అన్వేషించడానికి నలు దిక్కులలో అసంఖ్యాక వానర వీరులను పంపాడు. వారందరు గరుడవేగులు. పర్వత దేహులు, ప్రచండ బలులు. వారు భూమిపై, సముద్రాలలో, ఆకాశంలో కూడ స్వేచ్ఛగా సంచరింపగల్గుతారు.
*అహం తు హనుమాన్నామ మారుతస్యౌరసస్సుతః*
*సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతమ్*
*సముద్రం లఙ్ఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః.*
నేను దక్షిణ దిశకు బయలు దేరిన వానర దళ సభ్యుడిని. సముద్రం దాటి, లంకలోకి వచ్చాను. సీతాదేవిని చూచాను. ఆమెతో మాట్లాడాను.
రావణప్రభూ! నీవు సర్వశాస్త్రకోవిదుడివి. ధర్మార్ధ జ్ఞానివి. అమోఘ తపస్సంపదను ఆర్జించినవాడివి. పరభార్యాపహరణము అధర్మమని నీకు తెలుసు. అది సామాన్యమైన అధర్మము కాదు. అపహరించిన వాడిని సమూలంగా సర్వనాశనము చేయగలది.
ఇక రామభద్రుని పరాక్రమము గురించి చెప్పమంటావా? ఆయన బాణాలు దెబ్బల రుచిని నీవు చూడలేదు. కనుక ఇంత నిశ్చింతగా ఉన్నావు.
*బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా* *రుద్రస్త్రినేత్రస్తిపురాంతకోవా*
*ఇంద్రో మహేంద్ర స్సుర నాయకోవా త్రాతుం నశక్తా యుధిరామవధ్యం*
దేవతలుగాని, దైత్యులుగాని, గంధర్వ విద్యాధర నాగయక్షులుగాని, లోక త్రయనాయకుడగు రామునకు యుద్ధములో ఎదుట నిలువజాలరు. ఈ సామాన్యదేవతలే కాదు; ఆ దేవతలకు ప్రభువులగు ఇంద్ర రుద్ర బ్రహ్మలు కూడ రామునిచే చంపబడెడివానిని రక్షింపలేరు"
విడివిడిగా కాదు; కలిసివచ్చినను రాముని ఎదిరింపలేరు. రాము నిచే చంపబడునపుడు నిన్ను రక్షించువాడుండడు.అని హనుమ హెచ్చరిస్తుండగా.....
రావణుడు తనకు అప్రియమైన మాటలు మాటలు అధికమైన కోపముతో కన్నులు త్రిప్పుతూ.... ఈ వానరుణ్ణి చంపండి అని ఆజ్ఞాపించెను.
*తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః*
*ఆజ్ఞాపయద్వధం తస్య రావణః క్రోధమూర్ఛితః*
**
రావణుడి లోని ముఖ కవళికలు గమనించిన హనుమ చివరి ప్రయత్నం గా....
*సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్* | *పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశాః* ॥
పంచమహాభూతములతో కూడిన, చరాచరములతో కూడిన భూమి మొదలైన సమస్త లోకములను పూర్తిగా సంహరించి, మరల పూర్వమున్నట్లే సృజించుటకు గొప్పకీర్తిగలవాడైన శ్రీరాముడు శక్తిగలవాడు;
సభూతాన్ = భూమి నీరు నిప్పు గాలి ఆకాశములనెడు పంచభూతములతో కూడినవి
సచరాచరాన్ = చతుర్ముఖుని ద్వారా సృష్టింపబడిన స్థావర జంగమములతో కూడినవి; అయిన,
సర్వాన్ = సమస్తమైన,
లోకాన్ = భూర్భువస్సువరాది లోకములను;
సుసంహృత్య = ప్రళయావసానమునందు రుద్రుని ద్వారా, స్వయముగాను పూర్తిగా సంహరాంచి;
పునః = మరల, కల్పాదియంది, కల్పప్రారంభమునందు-
తథా+ఏవ = తధైవ = "ధాతాయధా పూర్వమకల్పయత్ = పరమాత్మ పూర్వ పూర్వ కల్పములందు ఎట్లెట్లు సృష్టించేనో అట్లట్లే ఇప్పటి కల్పమునందు కూడ సృష్టించెను -, అని శ్రుతియందు చెప్పబడిన ప్రకారముగా,
స్రష్టుం = సృష్టిచేయుటకు;
రామః శ్రీరామచంద్రుడు;
శక్తః = సమర్థుడు
మహాయశాః = గొపకీర్తిశాలి;
*నతస్యేశే కశ్చన, తస్యనామ మహద్యశః*- (ఏ పురుషుడు కూడ ఆపరమాత్మను నియమించుటకు సమర్థుడు కాడు; అందువలననే ఆపరమాత్మకు మహద్యశః = (గొప్పకీర్తిగలవాడు) అను పేరు వచ్చింది అని వేదము చెప్పుచున్నది; కావున,
శ్రుతి స్మృతులయందు మహాయశుడని ప్రసిద్ధమైనవాడు - అని అర్ధము.
ఈ శ్లోకం లో “యతో వా ఇమాని భూతాని జాయంతే - యేనజాతాని జీవంతి యత్ త్యభిసంవిశంతి-తద్భహ్మేతి- యను శ్రుతి భావాన్ని హనుమ చెబుతున్నట్టు ఉంది.
సృష్టించు కార్యం బ్రహ్మది, సంహరించు కార్యం రుద్రునిది కదా కానీ ఇక్కడ రామకార్యం గా హనుమ ఎందుకు చెబుతున్నాడు?
అనేక కోటి బ్రహ్మాండముల కంతటికీ ప్రథమకారణము, ప్రథమాధికారి భగవంతుఁడొక్కఁడే
‘ఏక మేవాద్వితీయం బ్రహ్మ' యన్నట్లు పరబ్రహ్మ మొక్కఁడే కాని యాయనకు సమానుఁడు మఱియొకఁడు లేఁడు. అధికుఁడు లేఁడు. గడ్డిపోచ కదలుటకుఁ గూడ నాయనయే కారణము. కాని సృష్టికని యొక యధికారి, సంహారమున కని యొక యధికారి స్వతంత్రించి లేఁడు. ఆ భగవంతుఁడే బ్రహ్మయం దంతర్యామియై ప్రవేశించి సృష్టి కార్యము చేయును. ఆయనయె రుద్రునియందు బ్రవేశించి సంహార కార్యము చేయును. భారత యుద్ధ మం దర్జునుఁడు నిమి త్తమైనట్లు బ్రహ్మ రుద్రులు నిమి త్తమాత్రులు. వీరు భగవంతుఁడగు నారాయణుని విభూతులు.
(ఈ ప్రపంచమంతా తన యేకాంశమున నిలువఁబడియున్న దాని కదా శ్రీకృష్ణ భగవానుఁడు చెప్పెను.
“విష్టభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్" భ.గీ. .10 వ అధ్యాయం, 42 వ శ్లోకం.)
భగవంతుఁడగు విష్ణువు రజో గుణము విశేషముగఁ గల జీవులయందుఁ బ్రవేశించి వారిచే సృష్టి కార్యమును తమోగుణము గలవారి యందుఁ బ్రవేశించి సంహార కార్యమును, సత్వగుణము గలవారి యందుఁ బ్రవేశించి రక్షణమును జేయుచుండును. కావున సమస్తమునకు వా స్తవ ప్రయోజక కర్త భగవంతుఁ డనియు నైమిత్తిక ప్రయోజ్యక ర్తలు జీవులని తెలుసుకొన వలెను.....
మహాయశ్శశాలియైన శ్రీరాముడు లోకాలను సంహరించి మరల యథా విధముగానే సృష్టించుటకు సమర్థుడు " - అని యనుటచే శ్రీరాముడే పరమాత్మయని హనుమంతుడు సూచించినాడు అని భావము.
[06/10, 1:01 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 161*
సీతాదేవి మనస్సుకు ఆనందోత్సాహాలను కలిగించడానికి హనుమ "అమ్మా! వానర సమ్రాట్టు అయిన సుగ్రీవుడు మహా పరాక్రమ సంపన్నుడు. నిన్ను, శ్రీరామునిని కలుపాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఆధిపత్యంలో బల, పరాక్రమ వరిష్ఠులైన వానరులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక్క విషయాన్ని నేను నీకు స్పష్టం చేయాలనుకొంటున్నాను.
మా సుగ్రీవ మహారాజు సన్నిధిలో నాకంటే చిన్నవాడెవ్వడు లేదు. బలపరాక్రమాలలో నాతో సమానులు, నాకంటె అధికులు మాత్రమే ఉన్నారు.
*మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సన్తి తత్ర వనౌకసః*
*మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవసన్నిధౌ*
ఎక్కడైనా, ఎవ్వరైనా ఏదైనా ఒక పని మీద పంపాలంటే అందరికంటే చిన్నవాడిని చూచే కదా పంపుతారు. చిన్నవారు ఉండగా, వారిని వదలి పెద్దవారిని పనిమీద పంపడం మనము ఎక్కడా చూడం కదా!
*అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః*
*న హి ప్రకృష్టాః ప్రేత్యన్తే ప్రేష్యన్తే హీతరే జనాః*
అందరికంటే అల్పశక్తుడనైన నేనే అనంతమైన సముద్రాన్ని దాటి వచ్చానంటే, మిగిలిన వానరుల శక్తి పరాక్రమాల గురించి వేరే చెప్పాలా?
తల్లీ! నీవు దుఃఖింపకు! వానర వీరులు ఒకే అంగలో ఈ మహార్ణవాన్ని ఆకాశ మార్గంలో దాటి రాగలుగుతారు. సింహవక్షులైన శ్రీరామ లక్ష్మణులను లిప్తకాలములో అతి సునాయాసంగా నా భుజాలపై ఎక్కించుకొని తీసికునివస్తాను..
సూర్యచంద్రుల వలె తేజస్సంపన్నులైన రామలక్ష్మణులిద్దరు లంకలో ప్రవేశించి తమ ప్రచండ ప్రతాపంతో రావణాసురుని, ఆయన పరివారాన్ని చీల్చి చెండాడుతారు. గోళ్లు, కోరలు గల వానర మహా వీరులు లంకానగరంలో వీర విహారం చేస్తారు.
*నివృత్త వనవాసంచ త్వయాసార్ధమరిందమం। అభిషిక్త మయోధ్యాయాం। క్షిప్రంద్రక్ష్యసి రాఘవం!*
తల్లీ! శ్రీరామచంద్రస్వామి అతి త్వరలో రావణాసురుని ససైన్యంగా అంతం చేసి, అయోధ్యకు నీతో కలసి వెళ్లి, వనవాస నియమాలను పూర్తి చేసికొని, మహా వైభవంగా సుర, నర, వానర, సమక్షంలో సామ్రాజ్య పట్టాభిషేకం చేసికోవడం నీవు త్వరలోనే నీ కనులారా కాంచగల్గుతావు" అని నేను ఆమెకు ప్రియకరములు, శుభకరములైన మాటలను చెప్పి, ఆమెను ఓదార్చి ఆమెకు ధైర్యాన్ని కల్గించాను.
*తతోమయా వాగ్భిరదీన భాషిణా।
శివాభిరిష్టాభిరభి ప్రసాదితా! జగామ శాంతిం మమ మైధిలాత్మజా తవాఽపి శోకేన తదాభి పీడితా*
నా మాటలతో ఆమె శాంతించింది. సంతోషించింది. ఆమె శోకము అంతమైంది. అయితే నీవు ఆమె కొరకు అమితంగా దుఃఖిస్తున్నావని తెలిసి మాత్రము ఆమె విచారిస్తున్నది. అంతకంటే ఆమెకు ఇతర దుఃఖము లేదు.
*
శ్రీమాన్ చలమచర్ల వేంకటశేషాచార్య స్వామి వారి ఆచార్య ముఖేన పొందిన జ్ఞానము మేరకు వాల్మీకి శ్రీ రామాయణము సుందర కాండము శ్రీరామ చరణ సేవగ రాసిన సరళ తెలుగు భావం ఇంతటి తో సమాప్తం.
**
*యుద్ధ కాండ ప్రారంభం.*
*శ్రుత్వా హనుమతో వాక్యం।* *యథావదభిభాషితం।*
*రామః ప్రీతి సమాయుక్తో।* *వాక్యముత్తరమబ్రవీత్*
*కృతం హనుమతాకార్యం। సుమహద్భువి దుర్లభం।*
*మనసాఽపియదన్యేన। న శక్యం ధరణీ తలే*
హనుమవలన సీతాదేవి మనశ్శాంతిని పొందిందని శ్రీరాముడు విన్నాడు. ఇప్పుడు హనుమ చేసిన మహత్కార్యాన్ని రాముడు ప్రశంసిస్తున్నాడు.
హనుమ సముద్రాన్ని దాటడం చాల గొప్ప (సుమహత్) కార్యము.
రాక్షసుల్ని వధించి లంకా నగరాన్ని దహించడం దుష్కరము. మళ్లీ లంకలో నుండి బయలుదేరి క్షేమంగా తిరిగి రావడం మనస్సు తో
ఊహించడానికి కూడ అసాధ్యమైన పని.
అంత అసాధ్యమైన పని చేయాలంటే గరుడుడు, వాయువు కలసి చేస్తే చేయవచ్చు. హనుమ ఒక్కడే చేయగలిగాడు.
భృత్యులు మూడు రకాలు:
1) చెప్పిన పనినే పూర్తిగా చేయలేని వాడు (అధముడు)
2) చెప్పిన పనిని మాత్రము పూర్తి చేసేవాడు (మధ్యముడు).
3) స్వామిపట్ల అనురాగంతో చెప్పిన పనే కాకుండా యుక్తి యుక్తంగా ఆ పనికి సంబంధించి మరింత అధికంగా యత్నము చేసేవాడు (ఉత్తముడు)
భృత్యుడు చేసి వచ్చిన పనిని బట్టి అతనిని స్వామి సమ్మానించాలి. ఉత్తమోత్తముడైన హనుమ చేసిన ఘనకార్యానికి తగిన పారితోషికం శ్రీరాముడు తన దగ్గర లేనే లేదంటాడు. తన దేహాన్నే బహుమతిగా ఇవ్వాలనుకొని హనుమను గాఢంగా కౌగిలించుకొన్నాడు ఆ భక్త సులభుడు. *పరిష్వంగో హనూమతః*
హనుమకు అంతకంటే కావలసింది మరేది లేదు. శ్రీరాముని శరీరము ఆయన సంకల్పానుసారము గ్రహించినది. హనుమ మొదటినుండి రాముని శరీరాన్నే ప్రేమించాడు.
*స్నేహోమే పరమో రాజన్। త్వయినిత్యం ప్రతిష్ఠితః*
శ్రీరాముడు తన కౌగిలి కాక మరేది ఇచ్చినా అమృతము కావాలనుకొన్న వాడికి గడ్డిపరక దొరికినట్లు ఉండేది.
భగవంతుని దివ్య మంగళవిగ్రహమే అందరికి ఆశ్రయాన్నిస్తుంది.
సీతారాముల రెండు శరీరాలను రక్షించిన మహోదారుడైన హనుమకు శ్రీరాముని కౌగిలి శ్రీరామునికే కాదు హనుమకు కూడ సర్వస్వము అయినది. మహాత్ముడైన హనుమంతుని పట్ల మనస్సులో ప్రీతి కలిగి, తన శరీరము కూడ పులకరిస్తుండగా శ్రీరాముడు హనుమను బిగ్గరగా కౌగిలించాడు.
ఆ తరువాత శ్రీరామునికి విచారమావేశించింది. హనుమంతుడు సీతాదేవిని చూచి వచ్చాడు సరే. కాని ఆమె దగ్గరికి వెళ్లడమెలా? ఆమెను పొందడమెలా?
[06/10, 1:01 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 162*
*తంతు శోక పరిధ్యూనం* *రామందశరథాత్మజం*
*ఉవాచ వచనం శ్రీమాన్ సుగ్రీవశ్శోక* నాశనం*
మిత్రగుణ సంపన్నుడైన సుగ్రీవుడు శ్రీరామునికి ధైర్యాన్ని కల్పిస్తున్నాడు: "రామభద్రా ఇంకా సీతాదేవి విషయంలో విచారమెందుకు? ఆమె క్షేమ వార్త తెలిసింది. ఆమె ఉన్నచోటు తెలిసింది కదా!
మోక్షం కోరేవాడు సంసార వ్యామోహాన్ని వదిలినట్లు నీవు పిరికిదనాన్ని వదలిపెట్టు. సముద్రము దాటి, లంకలో ప్రవేశించి, రావణుని సంహరించడానికి మేము తోడుగాలేమా? మనకు శత్రువుపై దాడి చేయడానికి ఒక్క సముద్రమే అడ్డు. బుద్ధిలో బృహస్పతివైన నీవు దానిని దాటే మార్గము చూడు. ఒక్కసారి లంక కనపడిందో, ఈ వానరులు లంకను పెకిలించి, రావణునితో సహా రాక్షసులందరిని నీ పాదాలపై పడగొడతారు.
కాకపోతే సేతువును నిర్మించకుండా సముద్రాన్ని దాటి వెళ్లడం ఇంద్రసమేతులైన దేవతలకు కూడ అసాధ్యమే.
*సేతుర్బద్ధః సముద్రే చ యావల్లంకాసమీపీతః*
*సర్వం తీర్ణం చ మేసైన్యాం జితమిత్యుపధారయ* |
*ఇమే హి సమరే వీరా హరయః కామరూపిణః*
ఇదంతా ఎందుకు? నీవు రావణుని
సంహరించి విజయాన్ని పొందుతావు. అటువంటి శుభశకునాలు కనబడుతున్నాయి.
అందువలన దైన్యాన్ని వదలి నీ పరాక్రమాన్ని స్మరించుకో! నీ ముందు నిలిచే వీరుడే ఉండడు.
సుగ్రీవుని సహేతుకమైన సత్యవాక్కులను విని శ్రీరాముడు హనుమతో ధైర్యంగా అన్నాడు.
"హనుమా! నాలో తపోబలాలు పుష్కలంగా ఉన్నాయి. తపశ్శక్తితో సేతుబంధనం చేస్తాను. పరాక్రమంతో సముద్రాన్ని నా బాణాలతో ఎండగొట్టుతాను.
అయితే లంకా పరిస్థితిని వివరించు. అక్కడ దుర్గాల ప్రాకారాల నిర్మాణం గురించి తెలుపు సైన్యబలమెంత? ఆయుధ సంపద ఎంత? ఇళ్లెలా ఉన్నాయి? వీటిని గురించి తెలుపమని" అడిగాడు......
**
రామచంద్రస్వామి ప్రశ్నలకు సమాధానంగా ఆంజనేయుడు లంకానగరాన్ని వర్ణిస్తున్నాడు:
"రామచంద్రా! లంకానగరము ఎప్పుడు సంతోషంతో కోలాహలంగా ఉంటుంది. మదగజాలతో, మహారథాలతో నిండి ఉంటుంది. అశ్వబలాలతో, పదాతిదళాలతో దట్టంగా ఉంటుంది.
దుర్గాలు ఇనుపమొలలు కొట్టబడిన దృఢకవాటాలను కల్గి ఉంటాయి. వాటి చుట్టు లోతు నీళ్లు గల కందకాలు ఉంటాయి. ఎత్తైన విశాలములైన ద్వారాలు కోటకు నాల్గు వైపులు ఉంటాయి. వాటిలో బాణాలను, శిలలను వర్షించే యంత్రాలు అమర్చబడి ఉన్నాయి.
అక్కడ ప్రాకారాలు బంగారు రంగుతో ప్రకాశిస్తు ఉంటాయి. ఎక్కడానికి వీలు ఎత్తుగా ఉంటాయి. వాటిని పగడాలతో, మణులతో, ముత్యాలతో అలంకరించారు.
ఆ ప్రాకారాలకు చుట్టు కూడ మొసళ్లతో కూడిన లోతైన చల్లని నీరుగల అగడ్తలు ఉన్నాయి. ఆ ప్రాకారాలలోనికి వెళ్లడానికి అగడ్తలపై పలకలను వంతెనలుగా యంత్రాలు వేసి తీస్తాయి. ఆ వంతెనలను భయంకరులైన రాక్షస వీరులు రక్షిస్తుంటారు.
శత్రువులు వచ్చినపుడు పలకలు లేపబడుతాయి. అప్పుడు ఆ పెద్ద పెద్ద కందకాలను దాటలేక శత్రువులు అందులో పడి మరణిస్తారు.
*త్రాయన్తే సంక్రామాస్తత్ర పర సైన్య ఆగమేసతి* |
*యంత్రైస్తైర్ అవకీర్యన్తే పరిఖాసు సమన్తతః*
ద్వారాలను దాటి నగరంలోకి ప్రవేశించాక సైనికుల గృహపంక్తులు నిర్మించబడ్డాయి. అందులో ఉండే సైనికులు ద్వారాలను, వంతెనలను కాపాడుతుంటారు.
ఆ నాలుగు ద్వారాలను రావణుడు చూడాలనుకొన్నప్పుడు సుదృఢమైన కాంచన
స్థంభాలపై నిర్మించబడిన వేదికపైకి వస్తాడు.
లంకానగరము త్రికూట పర్వత శిఖరముపై నిర్మించబడింది. దానికి చుట్టు ప్రక్కల అపారమైన సముద్రము కందకమువలె ఉంది. అందువలన ఎంతటి బలవంతులైన శత్రువులైనా సముద్రము దాటనిదే లంకలోకి వెళ్లజాలరు.......
[06/10, 1:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 163*
లంకా నగరం లో నాలుగు రకాల కోటలున్నాయి.
(1) నాదేయాలు:- చుట్టు నదులు కలవి.
(2) వన్యములు:- చుట్టు అడవులు కలవి.
(3) పార్వతాలు: చుట్టు గుట్టలు కలవి.
(4) కృత్రిమాలు:- కొత్తగా కట్టబడ్డవి.
లంకా నగరమే త్రికూట శిఖరముపై నిర్మింపబడింది. కనుక అమరావతీ నగరము వలె అది ఒక గిరి దుర్గము.
ఇక నాలుగు ద్వారాల విషయము.
(1) తూర్పు ద్వారము:- పదివేల రాక్షసులు శూలాలు, కత్తులు ధరించి కాపలాఉంటారు.
(2) దక్షిణ ద్వారము:- లక్ష సంఖ్యలో చతురంగ సైన్యాలు రక్షిస్తాయి.
(3) పశ్చిమ ద్వారము:- పది లక్షల సైనికులు చర్మ ఖడ్గధరులై ఉంటారు.
(4) ఉత్తర ద్వారము:- ఒక కోటి సైనికులు కాపలా ఉంటారు. నగరం మధ్య ద్వారంలో ఒక కోటి సైన్యము ఉంటుంది.
అయితే నేను వంతెనలను (సంక్రమాలను) ధ్వంసం చేసి వచ్చాను. పరిఘలు లేక కందకాలు ఎండిపోయాయి. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి.
లంక దహనమైంది. సైన్యంలో పావు భాగము (బలైక దేశము) నాచే సంహరింపబడింది.
*తే మయా సంక్రమా భగ్నాః పరిఖాఃచ అవపూరితాః* |
*దగ్ధాచ నగరీ లంకా ప్రాకరఃచ అవసాదితాః*
రామభద్రా! రావణుని మరణం తప్పక జరిగి తీరుతుంది. దాని కొరకు ఇందరు వానర వీరులు, మీరిద్దరు సోదరులు కూడ అవసరము లేదు. అంగద, మైంద, ద్వివిద జాంబవత, పనస, నల, నీలులు చాలు.
వీరు అందరు సేతువు అవసరం లేకుండా సముద్రం దాటగల్గుతారు. అందువలన ఆ విచారము కూడ అక్కర లేదు. నీ ఆజ్ఞ అయితే చాలు.
కనుక మహావీరా! నీవు వెంటనే ఆజ్ఞ నివ్వు దండ యాత్రకు అనువైన ముహూర్తాన్ని చూడు. నీవు చెప్పిన వెంటనే సర్వ వానర బలాలు దండెత్తడానికి సంసిద్ధంగా ఉన్నాయి."......
**
హనుమ మాటలు విని శ్రీరాముడు..
"హనుమా! నీవు చెప్పిన విషయాలను బట్టి లంకానగరాన్ని వెంటనే నాశనం చేయగల్గుతాము."
ఈ మధ్యాహ్నం సమయమే శుభముహూర్త సమయం. మా వంశ మూల పురుషుడు అయిన సూర్యుడు అత్యున్నత స్థానంలో ఉన్నాడు. సర్వ విఘ్నాలను పోగొట్టే అభిజిన్ముహూర్తమిది. ఈ విజయ ముహూర్తంలో మనము బయలుదేరితే రావణుడు. మననుండి తప్పించుకోజాలడు.
ఈ మన విజయ యాత్రా వార్త త్రిజటాదుల వలన సీతాదేవికి తెలిస్తే "విషం త్రాగి చావబోయేవాడు అమృతపానంతో బ్రతికి బయటపడ్డట్లు" ఆశతో ఆమె జీవిస్తుంది.
ఈ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రము. నాకు సాధనతార. ఈ రోజే సర్వ సైన్యాలతో బయలు దేరుదాము."
*జీవితాన్తే అమృతం స్పృష్ట్వా పీత్వా విషమివాతురహః* |
*ఉత్తరా ఫల్గునీ హి అద్య స్వస్తు హస్తేన యేక్ష్యతే*
అభిజిన్ముహూర్తము దక్షిణ దిశ ప్రయాణానికి మంచిదికాదని జ్యోతిషరత్నాకరం తెలుపుతున్నది. అయితే కిష్కింధకు లంకా నగరం (దక్షిణ పూర్వంలో) ఆగ్నేయంలో ఉంది. కనుక ఆ ముహూర్తము విజయప్రదమే.
"సుగ్రీవా! నాకు ఈ సమయంలో అనేక శుభశకునాలు కనబడుతున్నాయి. నా కన్నుపై భాగము కదులుతున్నది.
*ఉపరిస్టాద్హి నయనం స్పురమాణమిదం మమ*
*విజయం సమనుప్రాప్తం శంసతి ఇవ మనోరథం*
_నేత్ర స్యోర్ధ్వం హరతి సకలం మానసం దుఃఖజాతం_ కన్నుపై భాగము అదరడం విజయాన్ని సూచిస్తుంది.
[06/10, 1:06 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 164*
"సుగ్రీవా! వానరసైన్యాధిపతి నీలుడు లక్ష వానర సేనతో ముందు నడవాలి. ఫలమూలములు, మధురఫలాలు ఉండే వన మార్గంగా నడవాలి.
*ఫల మూలవతా నీల శీత కానన వారిణా* |*పథా మధుమతా చ ఆశు సేనాం సేనాపతే నయ*
దుర్మార్గులు మార్గంలో జలాలను కలుషితం చేస్తారు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా
ఉండాలి.
అయితే హనుమ తెలిపినట్లు వన, జల, గిరి, దుర్గాలలో కొన్ని రంధ్ర స్థానాలలో శత్రువులు ఆయుధాలతో ఉంటారు. వాటిని కూడ జాగ్రత్తగా గమనించాలి. నీలుని వెనుక గజ, గవయ, గవాక్షులు నడవాలి.
దక్షిణ దిశలో ఋషభుడు, ఎడమవైపు గంధమాదనుడు ఉండాలి. మధ్యలో మేమిద్దరము సోదరులము అంగద హనుమల నెక్కి "సార్వభౌమము" అనే ఉత్తర దిగ్గజాన్ని అధిరోహించి కుబేరుడు వస్తున్నట్లు" (మేము) వస్తాము.
సేన యొక్క కుక్షి భాగాన్ని జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి రక్షిస్తారు" అని శ్రీరాముడు నిర్దేశించాడు.
శ్రీరాముని నిర్దేశం మేరకు సుగ్రీవుడు వానరసైన్యాన్ని ముందుకు నడవడానికి అజ్ఞాపించాడు....
వానర వీరులు ఎగురుతూ, దుముకుతూ, మేఘాల వలె గర్జిస్తూ, సింహనాదాలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు.
"రావణుడు, ఆయన రాక్షస సైన్యము చావాలి" అంటున్నారు. ముందు మార్గాన్ని చూపిస్తూ ఋషభ, నీల, కుముదులు వెళ్లుతున్నారు. మధ్యలో సుగ్రీవ లక్ష్మణులతో కలసి శ్రీరాముడు ప్రయాణిస్తున్నాడు.
దారిలో మధుర ఫలాలను తింటూ, తేనెను త్రాగుతూ, చెట్లను పట్టుకొని ఊగుతూ, |ఒకరినొకరు సంతోషంతో త్రోసుకొంటూ, పడగొట్టుకొంటూ మహోత్సాహంతో గర్వంతో 'వానరవీరులు పెళ్లికి వెళ్లుతున్నట్లు వెళ్లుతున్నారు.
సహ్యపర్వతము వారికి అగుపించింది. నగరాలకు, పల్లెలకు దూరంగా రామాజ్ఞా భయంతో నదీ, తటాక, వనమార్గాల్లో వెళ్లుతున్నారు.
రామలక్ష్మణులు శుభగ్రహ సంయుతులైన రవి, చంద్రులవలె ప్రకాశిస్తున్నారు.
**
రామ లక్ష్మణులకు మార్గమంతా శుభశకునాలే అగుపిస్తున్నాయి. ఆ విషయాన్ని లక్ష్మణుడు శ్రీరామునికి తెలుపుతూ
"అన్నా! నీవు వదినను తీసికొని అయోధ్యకు వెళ్లడానికి తగిన ఈ శుభశకునాలను గమనించు -
(1) గాలి మెల్లగా, సుఖంగా చల్లగా వీస్తున్నది.
(2) మధుర స్వరాలతో మృగాలు అరుస్తున్నాయి.
(3) దిశలు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నాయి. సూర్యుడు విమలంగా వెలుగుతున్నాడు.
(4) (ఉశనుడు) ధృవుడు ప్రకాశిస్తూ నీ జన్మరాశి వెనుక ఉన్నాడు. సప్తర్షులు ఆయన చుట్టు కాంతివంతంగా ఉన్నారు.
ఫాల్గుణ మాసారంభంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రం యుద్ధ యాత్రారంభానికి ప్రశస్తంగా ఉంది.
ఇక మనకు విజయసూచకం జలాలు స్వచ్ఛంగా మధురంగా ఉన్నాయి. వృక్షాలు ఋతుకుసుమ గంధాలతో గాలి వీస్తున్నాయి.
తారకాసుర యుద్ధంలో, తార కొరకు జరిగిన యుద్ధంలో దేవతాసైన్యాలు ప్రకాశించి నట్లు ఇప్పుడు కపి వీరుల వ్యూహాలు ప్రకాశిస్తున్నాయి" అని వివరించాడు.
లక్ష్మణుని మాటలు శ్రీరాముని మనస్సును రంజింపజేశాయి.
వానర వీరుల కోలాహలము, వారి పాదధూళి ఆకాశాన్నంటుతున్నట్లు ఉంది.
వానర వీరులు ఎగురుతూ ముందుకు ఉరుకుతూ, కిలకిలధ్వనులు చేస్తూ, భుజాలు చరుచుకొంటూ, తోకలను భూమికి కొడుతూ భుజాలతో చెట్లను, గుట్టలను పడగొడుతూ మహా గర్వంగా ముందుకు సాగుతున్నారు.
వారందరు సహ్యపర్వత ప్రాంతానికి చేరుకొన్నారు. పూలచెట్లు వానరుల తలలపై పూల వర్షాన్ని కురిపించాయి.
అక్కడ అనేక జలాశయాలు ఉన్నాయి. పక్షులు, ఆనందంగా కిలకిలారావాలను చేస్తున్నాయి.
ఆ జలాశయాలలో (చెరువులలో) వానరులు మునుగుతున్నారు. మిత్రులను ముంచెత్తు తున్నారు. స్నానాలు చేస్తున్నారు. తీయని చల్లని నీళ్లను త్రాగుతున్నారు. అక్కడ లభించే అమృత ఫలాలను ఆరగిస్తున్నారు.......
[06/10, 1:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 165*
రాజీవలోచనుడైన శ్రీరామభద్రుడు మహేంద్రపర్వతము పైకి ఎక్కి అనంతమైన మహా సముద్రాన్ని చూచాడు.
పర్వతము దిగివచ్చి అలలచే కడుగబడిన చైలియలికట్టను (సముద్ర తీరాన్ని) చూచాడు. సుగ్రీవునితో "మనమిక్కడ ఆగాలి. ఈ సముద్రాన్ని ఎలా దాటాలో తరువాత విచారిద్దామ"న్నాడు. సైన్యము రహస్య స్థలంలో విడిది చేసింది. శత్రువుల కదలికలను గుర్తించడానికి కొంతమంది వానర వీరులు అంతట సంచరిస్తున్నారు.
అక్కడ సముద్రమొకటి కాదు, రెండు ఉన్నాయి. ఒక దానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. (1) బాగా తేనెను త్రాగి మదించిన వానర సేనా సముద్రము (2) అలలతో మదించిన లవణ సముద్రము.
సముద్రము నురుగుతో నవ్వుతున్నట్లు, తరంగాలతో నృత్యము చేస్తున్నట్లు ఉదయించే
చంద్రబింబ ప్రతిబింబంతో ప్రకాశించింది.
అక్కడ సముద్రము ఆకాశంతో పోటీ పడింది. రాత్రి పూట సాగర జలము యొక్క తుంపరలు ఆకాశంలోని నక్షత్రాల వలె అగ్ని కణాలుగా ఉన్నాయి. చంద్రకిరణాల వలె తెల్లనైన నీరు ఉంది. మహోరగాలు సంచరించడానికి ఆకాశము సముద్రము రెండు అవకాశమిస్తున్నాయి. సముద్రము పాములకు నిలయమైనట్లు ఆకాశము రాహువుకు నిలయంగా ఉంది. సురారులైన రాక్షసులకు సముద్రాకాశాలు రెండు నివాసాలుగా ఉన్నాయి. పాతాళం వలె రెండు గంభీరంగా ఉన్నాయి. "సాగరమే అంబరమా”, "ఆకాశమే సాగరమా" అన్నట్లు సముద్రాకాశాల మధ్య తేడా లేకుండా పోయింది.
అంతేకాదు అంబరము (ఆకాశము) అర్జవము (సముద్రము) రెండు నీల వర్ణంతో ప్రకాశిస్తున్నాయి. ఆకాశంలోని తారలు సముద్రంలోని రత్నాలను తలపిస్తున్నాయి. ఆకాశంలోని మేఘమాలలు సముద్రంలోని తరంగాల వలె ఉన్నాయి...
నభము సముద్రము రెండు మహాధ్వనులచే కొట్టబడుతున్నాయి. ఆకాశంలోని మేఘగర్జనలు సముద్రంలోని తరంగ శబ్దాలు ఆ రెండు కూడ ఆహవ (యుద్ధ) రంగంలో మహా భేరులను (నగరాలను) తలపిస్తున్నాయి.
విధంగా అనంతము, అతిగంభీరమైన ఆ సేన లోనైంది. గంధరమైన ఆ మహా సముద్రాన్ని (సముద్రాన్ని) చూచి వానర
శ్రీరామచంద్రుడు సీతావిరహ శోకాన్ని నెమరువేసి కొంటున్నాడు. "లోకంలో కాలం గడచినా కొద్ది దుఃఖము తగ్గిపోతుంది. కాని నాకు రోజురోజు మరింత పెరిగి పోతున్నదే! ఓ గాలీ! నీవు ముందుగా సీతను తాకి, తరువాత నన్ను తాకు. చంద్రబింబాన్ని చూచి సీతాదేవి ముఖము అనుకొన్నట్లు సీతను తాకి నన్ను తాకితే, నన్ను సీతాదేవే తాకుతున్నట్లు అనుకొంటాను.
లక్ష్మణా! నా వియోగాగ్నిని భరించలేక నిన్ను విడిచి నేను సముద్రంలో ప్రవేశిస్తాను. అయినా నా పిచ్చిగాని, సముద్రము నా విరహాగ్నిని మరింత పెంచదని ఏమి నమ్మకము?
సీతాదేవి, నేను ఇద్దరము ఒకే భూమిపై జీవించి ఉన్నాము కదా! ఈ భూమినే శయ్య అనుకొని ఒకే శయ్యపై మేము ఇద్దరము పడుకొన్నట్లు భావించుకొంటాను. నీరు ఉన్న పొలము ప్రక్క నీరు లేని పొలము ఉన్నా ప్రక్క పొలములోని నీటి తేమవలన నీరులేని పొలము ఎండిపోదు. అలాగే "సీతాదేవి జీవించి ఉంది" అన్న వార్త నన్ను కూడ జీవింపజేస్తుంది.
నేనెన్నడు సీతాదేవితో కౌగిలి సుఖాన్ని పొందగలుగుతానో? నిజానికి "సీతను రాక్షసుడపహరించాడని" కాని, "ఆమె దూరంగా ఉందని కాని” నాకు దుఃఖము లేదు. ఈ విరహంతో చాల కాలము గడచిపోతున్నదే అని నా విచారము......
**
శ్రీరామచంద్రస్వామి సమస్త వానరసేనా సమేతంగా సముద్ర ప్రాంతానికి చేరినట్లు
రావణునికి వార్త అందింది. ఆయన తాము తీసుకోవలసిన చర్యలను గురించి విచారించ డానికి మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు.
నిర్ణయాలు తీసికొనేవారు మూడు రకాలుగా ఉంటారని ఆయన తెలిపాడు.
(1) ఉత్తములు:- హితులతో ఆలోచించి పనులు చేసేవారు.
(2) మధ్యములు:- ఎవ్వరిని సంప్రదించకుండా స్వయంగా పనులు చేసేవారు.
(3) అధములు:- మంచి చెడులను స్వయంగా కూడ విచారించక అధర్మ కార్యాలను చేసేవారు.
అలాగే నిర్ణయాలు కూడ మూడు రకాలుగా ఉంటాయి.
(1) శాస్త్ర దృష్టితో ఆలోచించి అందరు ఏకాభిప్రాయంతో తీసికొన్న నిర్ణయాలు "ఉత్తమాలు".
(2) అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా. చివరకు ఐకమత్యంతో తీసికొన్న నిర్ణయాలు "మధ్యమాలు".
(3) ఐకమత్యానికి రాలేక భిన్న నిర్ణయాలు "అధమాలు".
రావణుని అనుచరులు శత్రువుల బలాబలాలు తెలియని వారు. తమ బలాబలాలు కూడ తెలియనివారు. నీతి నియమాలు లేనివారు. స్వయంగా ఆలోచించే బుద్ధిలేని వారు.
అందరు రావణునితో ముఖప్రీతి కొరకు మాట్లాడేవారు. వారు ఇలా అన్నారు:
మహారాజా! భోగవతీ నగరానికి వెళ్లి నాగులను జయించావు.
కుబేరుని జయించి పుష్పకవిమానాన్ని తెచ్చుకొన్నావు.
మయుడు నీకు భయపడి ఆయన కూతురు మండోదరిని నీకు భార్యగా సమర్పించాడు.
దానవేంద్రుడైన మధు నీకు లోబడి నీ చెల్లెలు కుంభీనసను పెండ్లాడాడు. వాసుకి, తక్షకుడు, జట, శంఖాది నాగరాజులు నీకు వశమయ్యారు.వరబలులైన కాలకేయాదులు ఒక సంవత్సరము నీతో పోరాడి ఓడారు.
ఇంద్రునితో సహా దిక్పాలకులందరు నీతో ఓడిపోయారు. వరుణ పుత్రులను సేనాబలసమేతులను వశపరచుకొన్నావు.
కాలపాశ, మృత్యుదండాయుధాలు కలిగిన యముని, ఆయన
కింకరులతో
సహా వశం చేసికొన్నావు.
నీతో సమానులు, ఈ భూమండలంలోనే కారు స్వర్గ పాతాళాలలో కూడా లేదు. నీ దాకా ఎందుకు? ఒక్క ఇంద్రజిత్తే వాసర సేనను రామలక్ష్మణులను మట్టి
కరపిస్తాడు. యముని నిగ్రహించిన మహాదేవుని పూజించి మహా వరాలను పొందాడు. యుద్ధంలో "దేవతల బలమనే సముద్రాన్ని" ఎండ గొట్టాడు.
శంబరాసురుని పుత్రులను చంపిన దేవేంద్రుని బంధించి తెచ్చి, బ్రహ్మ దేవుని మాట వలన ఆయనను విడిచిపెట్టాడు. ఆయన ఒక్కడు చాలడా నీ ఆజ్ఞ ప్రకారము సమస్త వానర సేనా సంహారానికి?
ఒక సామాన్యుని వలె ఇంత చిన్న విషయానికి విచారం దేనికి?"
అప్పుడు సేనాధిపతి అయిన ప్రహస్తుడు లేచి - "మహారాజా! సమస్త దేవ, దానవ, గంధర్వ విజేతవు. నీకు కోతులు, మనుష్యులు ఒక లెక్కా?
మనం అజాగ్రత్తగా ఉండడము చూచి హనుమ మనను ఆట పట్టించి వెళ్లాడు. నీ
ఆజ్ఞతో కోతిజాతినే లేకుండా చేస్తాను."
దుర్ముఖుడు:- హనుమ చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవలసిందే. నేనొక్కడినే
వానర జాతిమొత్తాన్ని సంహరిస్తాను.
వజ్రదంష్ట్రుడు:- రక్తమాంసాలు అంటుకొన్న తన పరిఘాయుధాన్ని చూపి దీనితో రామలక్ష్మణులను చంపి వస్తాను. అంతేకాదు మాలో కొందరము మానవ రూపాలతో వెళ్లి, మేము భరతుడు పంపగా వచ్చిన సైనికులమని నమ్మిస్తాము. మిగిలిన వాళ్లము. ఆకాశంపై నుండి శిలలను, శరాలను ప్రయోగిస్తాము.
కుంభుడు:- పెద్దనాన్నా! నేను మా తండ్రి కుంభకర్ణుడి అంత బలం గలవాడినే. నేనొక్కడినే వెళ్లి వానరులందరిని చంపుతాను.
వజ్రహనువు:- తన పర్వతమంతటి శరీరములో లేచి తన నాలుకను త్రిప్పుతూ, మీ అందరు ఎందుకు? నేనొక్కడినే వెళ్లి సర్వ వానరులను సంహరించి వారి రక్తము త్రాగుతాను.....
ఇలా ఒక్కక్కరు వారి అభిప్రాయాల్ని తెలియ జేస్తూ ఉండగా.....విభీషణుడు మాట్లాడ సాగాడు.....
[06/10, 1:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 166*
రాక్షస మహావీరులు తమ ఆయుధాలనెత్తి, రామలక్ష్మణులపై, వానర సేనపై దండయాత్రకు లేచారు. వారిని వారించి విభీషణుడు రావణునికి హితాన్ని ఉపదేశించాడు. (విభీషణుడు అంటే "భయంకర స్వభావము లేనివాడు .విగతభీషణుడు "దుర్మార్గుల విషయంలో విశేషంగా భయంకరుడు". ఈషణ త్రయాన్ని భయపెట్టిన వాడు" వి+భీ+ఈషణ)
"మహారాజా! శత్రువు దగ్గరకు వచ్చాడనగానే యుద్ధానికి పూనుకోవడం మంచిదికాదు. ముందు సామదాన భేదోపాయాలను ప్రయోగించాలి.
బాగా మదించిన వాళ్ల విషయంలో, విరాగుల విషయంలో, దురదృష్టవంతులు విషయంలో బాగా ఆలోచించి దండ ప్రయోగం చేస్తే అది ఫలిస్తుంది. కాని శత్రువులు అప్రమత్తులు, బలవంతులు, ఆగ్రహంతో ఉన్నవారు. వాళ్ల విషయంలో దండోపాయము పనిచేయదు. ఒక్క హనుమంతుడే ఘోరమైన సముద్రం దాటి లంకలోకి వచ్చి వేలాది సైన్యాన్ని చంపి, లంకను కాల్చి వెళ్లాడు. ఇప్పుడు శత్రుసైన్యంలో హనుమతో సమానబలులు అనేకులు ఉన్నారు. వాళ్లను తక్కువగా అంచనా వేయవద్దు.
రాక్షసరాజు ఒంటరిగా ఉన్న సీతాదేవిని అపహరించి శ్రీరామునికి గొప్ప అపకారం చేశాడు. శూర్పణఖ చేసిన తప్పును సమర్ధించి, ఖరదూషణాదులు రామునిపైకి దండెత్తి వెళ్లి తనపై దండెత్తివచ్చిన వాళ్లను చంపడం రాముని తప్పా?
పరుల భార్యలను అపహరించడం, ఆయుష్యాన్ని, కీర్తిని, అర్ధ బలాన్ని నశింపజేస్తుంది. ఇప్పుడు సీతాదేవే మన భయానికి, యుద్ధానికి కారణము. ఆమెను ఇప్పుడు శ్రీరామునికి అప్పగిస్తే యుద్ధంతోనే అవసరము లేదు.
రామభద్రుడు లంకా నగరముపై దాడిని ప్రారంభించకముందే సీతాదేవిని అప్పగిస్తే మంచిది. లేకపోతే సర్వరాక్షస సమేతంగా లంకా వినాశము తప్పదు.
అందువలన మహారాజా! నీ ప్రియ సోదరుని మాటను మన్నించి రామునికి జానకిని అప్పగించు
అన్నా! సుఖాన్ని, ధర్మాన్ని నశింపజేసే నీ కోపాన్ని వదలి ఆ రెండింటిని పెంచే మార్గాన్ని అవలంబించు. మనము అందరము ఇలాగే ఎప్పటికి పుత్ర, మిత్ర బాంధవ సమేతంగా సుఖించే విధంగా సీతాదేవిని వెంటనే శ్రీరామునికి అప్పగించు".
- విభీషణుని హితవచనాలు రావణునికి రుచించలేదు. ఆయన అమితంగా కోరుకొనే సీతాదేవిని అప్పగించడం ఆయనకు ఏ మాత్రము ఇష్టం కాలేదు. అందువలన మౌనంగా సభను చాలించి వెళ్లాడు.
**
తెల్లవారి ఒంటరిగా రావణుని కలసి మంచి మాటలు చెప్పాలనుకొని విభీషణుడు రావణ భవనానికి వెళ్లాడు..
రావణ భవనము మహాపర్వతమంత ఎత్తుగా ఉంది. అనేక వీధులు ఉన్నాయి. అనేక వేల రాక్షస సైన్యము కాపలా ఉంది. మతిమంతులైన మహామాత్యులు అనేకులు ఉన్నారు. అయితే వారందరు రావణభయంతో ఆయనకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుప లేదు.
ఆ భవన వీధులలో రథ, గజ, తురగ పదాతిబలాలు ఉన్నాయి. గుఱ్ఱాల ఘోషాధ్వనులు, గజఘీంకారాలు, శంఖనాదాలతో, తూర్య ఘోషలతో వీధులన్ని సమ్మర్ధంగా ఉన్నాయి.
అమరావతి, భోగవతి, గంధర్వ, వరుణ నగరాల వలె లంకానగరము మహావైభవంతో నిండుగా ఉంది.
విభీషణుడు అన్నగారి ఇంటికి వెళ్లుతూ వేదవిదుల పుణ్యాహవాచనాలను వింటున్నాడు. పెరుగు, నెయ్యి పాత్రలతో అందమైన అక్షతలను ధరించి, మంత్రవేత్తలైన బ్రాహ్మణోత్తములను దర్శించాడు.
భవనంలోపలికి వెళ్లి, రాక్షస పరివారముతో నమస్కారాలు అందుకొంటూ, తేజస్సుతో
వెలిగిపోతూ, సింహాసనాసీనుడైన రావణునికి వందనం చేసి ప్రశాంతచిత్తంతో:
*యదా ప్రభృతి వైదేహీ సంప్రాప్తేహ పరంతప*
*తదాప్రభృతి దృష్యన్తే నిమిత్తాన్యశుభానినః*
"అన్నా! సీతాదేవి లంకకు వచ్చినప్పటి నుండి అనేక అపశకునాలు అగుపడు తున్నాయి. పొగతో అగ్ని కప్పబడుతున్నది. ఎంత నేయివేసినా, ఎన్ని మంత్రాలతో ఆహ్వానించినా అగ్నిహోత్రుడు జ్వలించడం లేదు. వంట ఇండ్లలో, అగ్నిశాలలో, దేవాలయాలలో పాములు తిరుగుతున్నాయి. హోమశాలల్లో చీమలు నిండాయి. గోవులు చక్కగా పాలివ్వడం లేదు. మహాగజాలు మదం కలిగి లేవు. గుఱ్ఱాలు గ్రాసాన్ని ముట్టడం. లేదు. ఊరికే అరుస్తున్నాయి. గాడిదలు, ఒంటెలు ఏ కారణం లేకుండానే కన్నీరు కారుస్తున్నాయి.
అంతటా కాకులు అరుస్తున్నాయి. ఇండ్లపై భాగాలపై కాకులు గద్దలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ప్రొద్దున, సాయం సమయాలలో నక్కలు అశుభంగా కూస్తున్నాయి. కుక్కలు, ఇతర లు ఇండ్ల ముందు అరుస్తున్నాయి.
ఈ ఘోరాలు తగ్గాలంటే అన్నా! సీతాదేవిని శ్రీరామునికి అప్పగించడమే మంచిమార్గము.
అన్నా! నేనేదో నీపై కోపంతోనో, అసూయతోనో, యుద్ధభయంతోనో అనడం లేదు.
ఈ అపశకునాలు నగరమంతట, అంతఃపురంలో కూడ అగుపడుతున్నాయి. ప్రహస్తాదులందరు వీటిని గమనిస్తునే ఉన్నారు. నీ భయంతో నీకు చెప్పడం లేదు. నీ తమ్ముడిని కనుక చొరవతో నీకు ఈ విషయాలను తెలుపుతున్నాను.
*ప్రాపణో చాస్య మన్త్రస్య నివృత్తాః సర్వమన్త్రిణః*
*అవస్యం చ మయవాచ్యం యదృష్టంథవా శృతం*
*సంవిధాయ యథాన్యాయం తద్భవాన్కర్తుమర్హతి*
నీవు ఈ అన్ని విషయాలను ఆలోచించి సరియైన నిర్ణయం తీసికో” అని మంత్రులు వింటుండగా విభీషణుడు తన అభిప్రాయాన్ని విజ్ఞాపనము చేశాడు.
అప్పుడు రావణుడు: "విభీషణా! నీవేవో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు. నాకు యుద్ధము వలన ఏ భయము లేదు. రాముడెంత ప్రయత్నించినా సీతను చేరజాలడు. ఆయన వానర సేనతోనే కాదు, ముప్పై మూడు కోట్ల దేవతలతో కూడిన మహేంద్రునితో కలసి వచ్చినా నా ముందు నిలువజాలడు. ఇక నిశ్చింతగా నీవు వెళ్లుమ"ని విభీషణుని పంపించాడు.......
[06/10, 1:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 167*
రావణుడు ప్రశాంతంగా లేడు. సీతాదేవి పట్ల కామము ఆయనను పీడిస్తున్నది. ఆప్తులయిన విభీషణాదులు తన పట్ల భయం లేక హితోపదేశం చేస్తున్నారు. "తాను చేసింది పాపమేనేమో" అనే ఆలోచన ఆయనలో కలుగడం మొదలైంది. అయితే ఆయన వీటిని లక్ష్యపెట్టుతాడా?
ఆ రోజు కూడ మహాసభను పిలిచాడు. అందులో అమాత్యులను, మిత్రులను, పుత్రులను, బాంధవులందరిని రమ్మన్నాడు.
సింహాలు గుహలలోకి చేరుకొన్నట్టు క్షణంలో సభాసదులందరు సభకు వచ్చారు. విభీషణుడు కూడ సభకు స్వర్ణరథంపై వచ్చి, అన్నపాదాలకు అభివందనం చేశాడు. సభ అంతా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. అప్పుడు రావణుడు ప్రహస్తుని "సర్వ సైన్యాలను సమాయత్తం చేయుమని" ఆజ్ఞాపించి సభాసదులను ఉద్దేశించి ప్రసంగించ సాగాడు.
"వీరవరులారా! నా ప్రియాప్రియాలను, సుఖదుఃఖాలను, లాభాలను, నష్టాలను, ధర్మార్ధ కామాలన్నిటి గురించి మీకు ఈ రోజు సభలో స్పష్టపరుచాలనుకొంటున్నాను. రాక్షస వీరులారా మీతో సంప్రదించి, నేను చేసిన ప్రతి పని విజయవంతమైంది. కుంభకర్ణుడు ఇంత వరకు నిద్రలో ఉండి, ఈ రోజే సభకు వచ్చాడు. ఆయనకు, ఆయనతో పాటు మీ అందరికి అన్ని విషయాలు తెలుపాలనుకొంటున్నాను.
రాక్షసులు సంచరించే దండకారణ్యానికి రామలక్ష్మణులు సీతాదేవితో వచ్చారు. వారు ఋషులకు అభయమిచ్చి మన కోపానికి పాత్రులయ్యారు. మా చెల్లెలు శూర్పణఖను అవమానపరిచారు. ఆమెకు సహాయంగా వెళ్లిన ఖరదూషణాదులను పదునాల్గువేల రాక్షస బలాన్ని సంహరించారు.
*ఇయం చ దన్డకారన్యాయాద్రామస్య మహిషీ ప్రియా |
*రక్షోభిశ్చరితోద్దేశాదానీతా జనకాత్మజా*
దానికి ప్రతీకారంగా రాముని భార్య అయిన సీతాదేవిని అపహరించి లంకకు తెచ్చాను..
ఆమెకు రాముని కన్న, నాకున్న వైభవాన్ని ఎంతగా వివరించినా, ఆమె నా ప్రేమను అంగీకరించలేదు.
చాల మార్గము పయనించిన గుర్రము అలసిపోయినట్లు ఇంత కాలము ఎదిరి చూచిన నా మనస్సు కామబాధతో అలసిపోయింది.
నిజానికి అగాధము, జలచరమయము, భయంకరము, అనంతమైన మహాసముద్రాన్ని అల్పులైన మానవులు రామలక్ష్మణులు కాని వానరులు కాని ఎలా దాటగల్గుతారు?
అయితే “పోనీ" అని తేలికగా తీసికొందామంటే ఒక్క కోతి వచ్చి చేసిన అల్లరిని, సృష్టించిన ప్రళయాన్ని మరువడానికి వీలుకావడం లేదు.
ఇప్పుడేమి చేయాలో బాగా ఆలోచించి సలహా చెప్పండి. ఎవ్వరి అభిప్రాయాలు వారు నిర్భయంగా స్పష్టంగా చెప్పండి.
నాకైతే విభీషణుడు చెప్పినట్లుగా అల్పమానవులైన రామలక్ష్మణులతోగాని, కోతిమూకలతో గాని ఏ మాత్రం భయం లేదు. అయినా మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలుపండి. దైవాసుర సమరంలో మీ సహాయంతోనే నాకు విజయాలు కలిగాయి. ఇప్పుడు కూడ మీ సహాయ సహకారాలు అందించండి. ఇప్పుడు సముద్రము యొక్క అవుతలి వైపు సుగ్రీవాది వానర కోటితో రామలక్ష్మణులు వచ్చి ఉన్నారని తెలిసింది.
సీతాదేవిని తిరిగి ఇవ్వకుండా, రామలక్ష్మణులను సంహరించడానికి తగిన సూచన లివ్వండి. ఇంతవరకు నరవానరులెవ్వరు సముద్రము దాటి రాలేదు. వీరు కూడ ఎలా వస్తారు? విజయం మనదే" అని ముగించాడు......
*
[రావణుని ప్రసంగంలో ఎక్కడా రాక్షసులు దోషము లేనే లేదన్నట్లు మాట్లాడాడు. “తనకు రామలక్ష్మణుల వలన భయం లేదంటాడు. శత్రువులెవ్వరు సముద్రం దాటి రాలేరంటాడు. విజయము తమదే అంటాడు. అయినా హనుమంతుని వలన కలిగిన _భయము మరువరానిదే అంటాడు. సీతాదేవిని తిరిగి ఇవ్వనంటాడు. విజయంలో అందరి సహాయం కావాలంటాడు.” ఆయన ప్రసంగమంతా చాతుర్యంతో కూడుకొన్నది.]
**
అప్పుడే ఆరునెలలు నిద్ర ముగించుకొని సభకు క్రొత్తగా వచ్చిన కుంభకర్ణునికి రావణునిపై క్రోధం ముంచుకొచ్చింది.
*సర్వమేతన్మహారాజా కృతమ ప్రతిమం తవ*
*విధీయేత సహస్మాభిరాదావేవాస్య కర్మణః*
"అన్నా! ఇంతవరకు అన్ని ఎవ్వరిని విచారించి చేశావు? సీతాదేవిని అపహరించి తెచ్చేప్పుడు ఎవ్వరినైనా అడిగావా? "యమునా నది వరదలతో పొంగి మీద పడకముందే పర్వతాన్ని అడ్డంవేసినట్లు" నీవప్పుడే అందరితో ఆలోచించవలసి ఉండాలి. అప్పుడు మంచైనా చెడైనా అందరికీ సమానబాధ్యత ఉండేది.
అప్పుడేమో సీతాదేవి పట్ల కామంతో ఆమెను అపహరిస్తావా? చేతులు కాలాకఆకులు పట్టుకొన్నట్లు ఇప్పుడు అందరి సహాయం కావాలంటావా? ఆలోచించకుండా చేసిన పని "చిలుము పట్టిన పాత్రలో నేయి పోసినట్లు" ఉంటుంది.
శత్రువులు బలవంతుడైన శత్రువు బలహీనతలను గమనించి పైబడుతారు. హంసలు ఎత్తైన క్రౌంచ పర్వతముపైకి ఎక్కలేక, కుమారస్వామి బాణాలతో చేసిన రంధ్రాలను వెతుకుకొని వాటి ద్వారా పైకి వెళ్లుతాయి.
విషంతో కూడిన మాంసము ముద్ద తిన్నవాడిని తక్షణమే వధించినట్లు ఇంత దుష్కార్యం చేసినా ఇంతవరకు రాముడు నిన్ను పట్టుకొని వధించలేదు.
అయినా అన్నా! ఆపదలో నిన్ను వదలను. నీవు చేసిన ఈ దుష్కర కర్మను నేను ఫలవంతం చేస్తాను. నీ శత్రువులైన రామలక్ష్మణులు సూర్యేంద్రులైనా, అగ్నివాయువు లైనా, వరుణ కుబేరులైనా వారిని వధించి తీరుతాను.
పర్వతమంత ఎత్తు దేహంతో, పరిఘాయుధాన్ని ధరించి, సింహము వలె గర్జిస్తు బయలుదేరిన నా భయంకర కోరలను చూచి దేవేంద్రుడైనా కాలికి బుద్ధి చెప్పవలసిందే.
*పునర్మాంస ద్వితీయేన శరేణ నిహనిష్యతి*
*తతోఅహం తస్య పాశ్యామి రుధిరం కామమాశ్వస*
నేను శ్రీరాముని బాణమెంత భయంకరమైనా, మొదటి దానితో చావను. ఆయన రెండవ బాణము వేసేలోగా ఆయనపైపడి ఆయన రక్తాన్ని పీల్చి త్రాగుతాను. నీవు నిశ్చింతగా ఉండు. శ్రీరాముని వధించి నీకు సుఖము కలిగించే విజయాన్ని సంపాదించి పెడతాను. సర్వవానరకోటిని భక్షిస్తాను.
నీవు నిశ్చింతగా ఉండు. కావలసినంత వారుణిని త్రాగు. ఆనందించు. నీకిష్టమైన పనులన్ని నిర్విచారంగా చేయి.
రాముడు నా చేతిలో చచ్చాక సీత కూడ నీకు వశమవుతుంది.
*
రావణుని దోషాన్ని తీవ్రంగా నిందించాడు. ఆయన దోషానికి తాను బలి అయినా అన్నను రక్షిస్తానని తెలిపాడు. అంటే రావణునికి తానే దిక్కైనట్లు మాట్లాడాడు....
[06/10, 1:07 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 168*
కుంభకర్ణుని మాటలకు రావణుని ముఖం కోపంతో కందగడ్డలా ఎఱ్ఱగా జేవురించింది. ఆయన ఆగ్రహాన్ని చూచి మహా పార్శ్వుడు చేతులు జోడించి, "అయ్యా! పాములు, తేళ్లు, భయంకర మృగాలు ఉంటాయని అడవులకు వెళ్లి కూడ మధువును త్రాగనివాడు మూర్ఖుడే కదా. ఆలాగే ఆపాయమో, ఉపాయమో సీతాదేవిని ఎలాగు తెచ్చావు. తెచ్చిన తరువాత ఆమెను భోగించకుండా ఎందుకు ఉన్నావు?
*ఈశ్వరస్యేశ్వరః కోఅస్తి తవ శత్రునిబర్హణా*
*రామస్వ సహ వైదేహ్యా శత్రునాక్రమ్య మూర్ధసు*
*బలాత్ కుక్కుటవృత్తేన ప్రవర్తస్వ మహాబలా*
*అక్రమాక్రమ్య సీతాం వై తథా భుంక్ష్వ రామస్వ చ*
ఆమెను అనుభవించాక పాపము వస్తే రానీ, దానిని ఎలాగో ఓర్చుకోవచ్చు. లేదా దానిని తీర్చుకోవచ్చు.
కుంభకర్ణ, ఇంద్రజిత్తులు తలచుకొంటే వజ్రహస్తుడు (ఇంద్రుడు) కూడ తలవంచు తాడు.
అసమర్థులైన వాళ్లు కార్యసాధనలో సామదాన భేదాలను వాడుతారు. ప్రతాప వంతుడవైన నీకు సర్వదా దండమే సాధనము"..
మహాపార్శ్వుని మాటలు రావణుని సంతోషపరిచాయి. ఆయనను చూచి, రాక్షస ప్రభువు "మహాపార్శ్వా! సీతాదేవితో నేను బలవంతంగా సుఖించక పోవడానికి ఒక రహస్య కారణముంది. దానిని జాగ్రత్తగా విను!
"పూర్వము ఒకప్పుడు "పుంజిక" అనే అప్సరస సర్వాలంకారభూషితురాలై బ్రహ్మ సభకు వెళ్లుతున్నది. ఆమెను చూడగానే నా మనస్సు మనస్సులో లేదు. ఆమెను నేను మధ్యలోనే ఆపి బలవంతంగా వివస్త్రను చేసి అనుభవించాను. ఆమెను వివస్త్రగానే బ్రహ్మ సభకు పంపాను. ఆమెను అలా చూచిన బ్రహ్మదేవుడు ఆగ్రహంతో "రావణా! ఈ రోజు నుండి నీవు ఏ స్త్రీ నైనా బలాత్కరిస్తే నీ తల వేయి ముక్కలు అవుతుంది. ఈ శాపము తప్పదు" అని శపించాడు.
*అద్యప్రభృతి యామన్యాం బాలాన్నారీం గమిస్యసి*
*తదా తే శతధా మూర్ధా ఫలిష్యతి న సంశయః*
ఆ శాపభయంతోనే నేను సీతను బలాత్కరించలేదు.
*ఇత్యహం తస్య శాపస్య భీతః ప్రసభమేవ తామ్*
*నారోహయే బలాత్సీతాం వైదేహీం శయనే శుభే*
బ్రహ్మ శాపభయమే నా సహనానికి కారణము" అని మహాపార్శ్వునితో తెలిపాడు.
పర్వత గుహలో పడుకొన్న సింహాన్ని లేపి కవ్వించినట్లు రాముడు నన్ను కవ్విస్తున్నాడు. ఆయన కు నా బాణరుచిని చూపుతాను" అని విరమించాడు.
**
అన్న అయిన రావణుని చర్యను మొదట నిందించినా, తాను ఆయనకు అండగా ఉంటానని కుంభకర్ణుడు పలికాడు. మహాపార్శ్వుడు ఎటువంటి పరిస్థితులలో కూడ తాము రావణుని పక్షములోనే ఉంటామని హామీనిచ్చాడు. "వీరి వ్యర్ధపు హామీల వలన రావణుడు మరింత మూర్ఖుడవుతాడేమో?" అని భయపడి, ఆయనను మరొకసారి హెచ్చరిద్దామని విభీషణుడు లేచి నిలబడ్డాడు.
"అన్నా! సీతాదేవి రాముని పట్ల చింతతో నిస్సహాయంగా ఉంది. ఆమె ఎలాగైనా నీకు కామ సుఖాలను అందిస్తుందని అనుకొంటున్నావు. కాని ఆమె నిన్ను కామించక పోవడమే కాక నిన్ను కాటువేయడానికి సిద్ధంగా ఉన్న "కాలనాగు” అని గ్రహించు.
"సీతాదేవి వక్షస్థలమే విశాలమైన పడగచోటు. రామవిరహ చింతే విషము. ఆమె చిరునవ్వే విషపు కోర. ఆమె అయిదు వేళ్లే ఆమె అయిదు తలలు.
ఆ నాగుబాము నీ దగ్గర ఉంటే, ఒక్క నీకే కాదు, రాక్షస జాతికంతటికి వినాశమే.” ఆమె కొరకు కొండంత శరీరాలతో, వజ్రాల వంటి గట్టి కోరలతో, చేతి గోళ్లే ఆయుధాలుగా గల్గిన వేలాది వానరులు ఆమెను రక్షించడానికి లంకను ముంచెత్త బోతున్నారు. అంతకముందే సీతాదేవిని శ్రీరామునికి సమర్పించు. శ్రీరాముని బాణాలు వజ్ర కఠినాలు, వాయువువలె వేగ వంతాలు. అవి రాక్షసులు తలలను ముక్కలు చేయక ముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించు.
"ప్రహస్తా! శ్రీరాముడు ప్రయోగించిన క్రూర బాణాలు నీ తలను నరకే దాకా నిన్ను నీవు పొగడుకొంటూనే ఉంటావా?
కుంభకర్ణ, ఇంద్రజిత్, మహాపార్శ్వ, మహోదర, కుంభ, నికుంభ, అతికాయ, మహాకాయులే కాదు, వీరందరితో కలసి రావణ ప్రభువైనా రాముని ముందు నిలువ జాలడు.
*న కుంభకర్ణేంద్రజితౌ చ రాజమ్*
*స్తథా మహాపార్శ్వమహోదరౌ వా*
*నికుంభకుంభౌ చ తథాటికాయః*
*స్థాతుం సమర్థా యుధి రాఘవస్య*
ప్రహస్తా! సూర్యమండలంలో దాగినా, మరుత్తుల అండ నీకు లభించినా, స్వయంగా ఇంద్రుడే నిన్ను తన తొడపై కూచోబెట్టుకొన్నా, ఆకాశంలో దాగినా, పాతాళంలోనికి దిగినా నీవు రాముని బాణాగ్ని ముందు భస్మము అవుతావు" అని విభీషణుడు సత్యాన్ని తెలిపాడు.
అప్పుడు ప్రహస్తుడు బింకంతో "విభీషణా! దేవ దానవులనుండే కాదు. మరెవ్వరి వలన కూడ మాకు ఎంత మాత్రము భయం లేదు. ఒక సామాన్య రాముని నుండి మాకు భయమా" అని అడిగాడు. ఆయన మాటలను మధ్యలోనే త్రుంచి, "నీవు, మహారాజు, కుంభకర్ణ, మహోదరులు పలికిన పలుకులన్నీ పుణ్యం చేయని వాడు స్వర్గం వెళ్లజాలనట్లే వ్యర్ధాలు, మహాసముద్రాన్ని నావలేకుండా దాట దలచినట్లు అసంభవాలు. శ్రీరాముడు ధర్మబలుడు. మహారథుడు, జన్మసిద్ధమైన ఇక్ష్వాకు బలసంపన్నుడు. ఆయన సకల ప్రాణి రంజకుడు.
ఆయన కావించిన వాలి వధ, కబంధాది భయంకర రాక్షస సంహారము దేవతలకే అర్ధము కాలేదంటే మనమెంత?
సకల దేవతా సార్వభౌముడైన మహేంద్రుడు, సకల రాక్షస సార్వభౌముడైన రావణుడు ఇద్దరు కలిసి కూడ రాముని ఎదిరింపజాలరు....."
[06/10, 1:08 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 169*
విభీషణుని బోధ కొనసాగుతోంది.....
రాజు వ్యసనపరుడు. వాస్తవానికి మిత్రులు కాకున్నా. విధిలేక మిత్రుల వలె నటించే మీ అందరితో కలసి ఉన్నాడు. ఆయన భయంకర స్వభావముతో తనకు తోచినది చెడు అయినా నిరంకుశంగా దానిని ఆచరిస్తాడు.
రామద్వేషమనే విషాన్నుండి, సహస్ర శిరస్సులతో మహాకాయుడైన లక్ష్మణుడనే
ఆదిశేషుని పట్టు నుండి మన మహారాజును మీరెలా విడిపించగల్గుతారు?
రాజు ద్వారా అన్ని కోరికలను తీర్చుకొన్న మీరందరు మహాప్రమాదంలో కూరుకొన్న మహారాజును, శత్రువులు తలవెండ్రుకలను పట్టుకొని తమ వైపు లాక్కొనక ముందే (మీరు) పైకి తీయండి. సీతాపహరణమనే మహాసాగరంలో పడి రామబాణమనే పాతాళంలో మహారాజు పడక ముందే కాపాడండి. నా మాట ఒక్కటే. "సీతను రామునికి అప్పగించ వలసిందే.”
బుద్ధిలో బృహస్పతి అయిన విభీషణుని హితోక్తులు వయస్సు రక్తంతో ఉన్న ఇంద్రజిత్తుకు రుచించలేదు. ఆయన రావణుని వైపు తిరిగి, "నాన్నా, నీ తమ్ముడి మాటలు చాల తప్పు. అవి పిరికిపందలు అనవలసినవి. మన వంశంలో పుట్టిన వాని నోటినుండి రావలసినవి కావు.
*సత్త్వేన వీర్యేన పరాక్రమేనా*
*ధైర్యేనా శౌర్యేనా చ తేజసా చ*
*ఏకః కులే అస్మిన్ పురుసో విముక్తో*
*విభీషణస్తాత కనిష్ఠ ఏషః*
మన కులంలో వీర్య, ధైర్య, పరాక్రమాలు సంపదలు. అవి ఏ మాత్రము లేని మీ తమ్ముడు మన వంశంలో పుట్టవలసినవాడు కాడు" అని ఆయన విభీషణుని వైపు తిరిగి "పిరికిపందా! రామలక్ష్మణులెంతవారు? ఒక సామాన్య రాక్షసుడు చాలు వారిని నమిలి మ్రింగడానికి. అటువంటి అతి సామాన్య మానవులను చూపి మమ్మే భయపెడుతున్నావా?
త్రిలోక సార్వభౌముడైన దేవేంద్రుని నేను భూమిపై పడగొట్టాను. మిగిలిన దేవతలంతా దిక్కు కొకరు పారిపోయారు.
ఐరావతమునే దాని దంతాలను ఊడబెరికి భూతలంపై పడగొట్టాను.
నేను దేవదానవుల దర్బాన్ని అణచిన వాడను. నాకు రామలక్ష్మణులొక లెక్కా కోతిమూకలు లెక్కా" అని గర్జించాడు.
శత్రు భయంకరుడైన ఇంద్రజిత్తును చూచి వివేక బలసంపన్నుడైన విభీషణుడిలా అన్నాడు:
"నాయనా! నీవు చిన్న పిల్లవాడివి. బుద్ధి పరిపక్వం కాని వాడివి. మంత్రాంగం తెలియని వాడివి. అందువలన నీవు ప్రగల్భాలు పలుకుతున్నావు. అవి అనర్ధాన్ని కలిగిస్తాయి.
*న తాత మంత్రే తవ నిశ్చయోఅస్తి*
*బాలస్త్వమద్యాప్య విపక్వబుద్ధిః*
*తస్మాత్త్వయాప్యాత్మ వినాశనాయ*
*వచోఅర్థీనం బహు విప్రలప్తం*
ఇంద్రజిత్తూ! నీవు శత్రుభయంకరుడవే! కాదనను. కాని యుద్ధాన్ని నిర్ణయించే వయస్సులో లేవు. యుద్ధము ఇంతవరకు నిర్ణయింపబడలేదు. ఇతరోపాయాల గురించి కూడ చర్చ జరుగుతున్నది.
నీ ప్రగల్బాలు బలవంతంగా యుద్ధానికి దారితీస్తున్నాయి. నీవు కొడుకువే. కాని హితాన్ని చెప్పక శత్రువు అయినావు. యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నావు..
మీ తండ్రికి రాముని వలన కలిగే ప్రమాదాన్ని గుర్తించే స్థితిలో లేవు. తండ్రి వధకు కారణమవుతున్న నీవే చంపబడవలసిన వాడవు. నీవు మూర్ఖుడివి.
రాముని బాణాలు బ్రహ్మదండంతో, యమదండంతో సమానంగా అగ్నివలె మండుతు, శత్రువులకు మృత్యువును కలిగిస్తాయి" అని తీవ్రంగా మందలించాడు.
మహారాజువైపు తిరిగి, “ధన, కనక, వస్తు, వాహనాలతో, సువర్ణ మణి భూషణాలతో సీతాదేవిని శ్రీరామునికి ఇప్పుడైనా అప్పగిస్తే మనకే ప్రమాదము లేక ఎల్లప్పుడు ఇలాగే సుఖ శాంతులతో ఉండవచ్చు. అన్నా! నా మాట మన్నించు" మని కోరాడు.
*ధనాని రత్నాని విభూషణాని*
*వాపామపి దివ్యాని మాణీంశ్చ చిత్రాన్*
*సీతాం చ రామాయ నివేద్యా దేవీమ్*
*వసేమ రాజన్నిహ వితశోకాః*
**
ఇంతవరకూ రాక్షసవీరుల ప్రతాపాలనూ విభీషణుడి హితోపదేశాలనూ మౌనంగా వింటున్న రావణాసురుడు
కాలపురుషప్రచోదితుడై కఠినాతికఠినంగా పలికాడు.
విభీషణా! శత్రువుతో కాపురం చెయ్యవచ్చు. బుసకొడుతున్న విషసర్పంతో కలిసి ఉండవచ్చు. కానీ మిత్రుడుగా ఉంటూ శత్రువును సేవించేవాడితో కలిసి జీవించలేం సుమా !
*వసేత్ సహ సపత్నేన క్రుద్ధేన ఆశీ విసేషణ వా*
*న తు మిత్ర ప్రవాదేన సంవసేశ్చత్రుసేవినా*
*విద్యతే గోషు సంపన్నం* *విద్యతే బ్రాహ్మణే దమః* , *విద్యతే స్త్రీషు చాపల్యం* *విద్యతే జ్ఞాతితో భయమ్.*
"గోవులందు సంపద యున్నది. బ్రాహ్మణునియందు ఇంద్రియనిగ్రహ మున్నది. స్త్రీలయందు చాంచల్యమున్నది. జ్ఞాతులవల్ల నట్లే భయమున్నది"
నిత్యమూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కష్టాలలో మాత్రం ఆదుకోరు. దొంగబుద్ధి కలిగిన ఈ దాయాదులు చాలా భయంకరమైన వ్యక్తులు, అగ్ని కానీ శస్త్రాస్త్రాలు కానీ భయావహాలు కాదు. స్వార్ధపరులైన జ్ఞాతులే భయంకరులు. శరత్కాలమేఘంలో నీరు ఉండనట్టే దాయాదుల గుండెల్లో స్నేహమూ ఉండదు. విభీషణా! నువ్వు కాక మరొకడెవడయినా సమయంలో ఇలా మాట్లాడి ఉంటే ఈపాటికి ఏమయ్యేవాడో. ఛీఛీ! రాక్షసవంశంలో చెడబుట్టావు నువ్వు.
ఈ పరుషవాక్యాలు విన్న విభీషణుడు గదాపాణియై మరొక నలుగురు రాక్షసులతో ఆకాశానికి ఎగిరి ఓ "రాక్షసాధిపా! నీవు నాకు అన్నగారివి. పైగా రాజువు. కాబట్టి నీ ఇష్టంవచ్చినట్టు మాట్లాడవచ్చు. ధర్మమార్గంలో నడిచేట్టయితే అన్నగారు. పితృసమానుడు. కానీ నీవు ఆధర్మమార్గంలో పయనిస్తున్నావు. ఈ నీ పరుషవాక్కులను నేను క్షమించను.
*సులభాః పురుషా రాజన్* ! *సతతం ప్రియవాదినః* । *అప్రియస్య చ పథ్యస్య* *వక్తా శ్రోతా చ దుర్లభః* ॥
మహారాజా! ఎప్పుడు మనకు ప్రియాన్ని పలికేవారు కోకొల్లలుగా ఉంటారు. ప్రియమైన దెప్పుడు హితము కాదు. హితమై, అప్రియము అయిన విషయాన్ని తెలుపడానికి ఎవ్వరు ముందుకు రారు. ఒకవేళ అప్రియమైన హితాన్ని చెప్పేవారు ఎవ్వరైనా ఉన్నా, దానిని విని ఆదరించేవారు లోకంలో దుర్లభం.
సర్వభూతాలకు మరణాన్ని కలిగించే యమపాశంలో చిక్కుకొన్నవాడివి, కాలుతున్న ఇంటివలె ప్రమాదానికి గురి అవుతున్న నిన్ను వదలి వెళ్లుతున్నాను.
ఇక్కడే ఉంటూ, అగ్నిలా మండుతూ, బంగారంతో అలంకరింపబడిన రామబాణాలకు గురి అయి, మృత్యువు నోటిలో పడిన నిన్ను నాకంటితో చూడలేను. లంకలోని శూరులు, బలవంతులు, శస్త్రాస్త్రవిదులైన రాక్షసులందరు మృత్యువు నోటికి చిక్కినవారే.
ఇసుకతో కట్టిన ఆనకట్ట, నదీ ప్రవాహంలో కొట్టుక పోయినట్లే. రాక్షస వీరులందరు రామబాణ ప్రవాహంలో కొట్టుక పోక తప్పదు.
రామబాణాలతో నీవు సంహరింపబడడం చూడలేక లంకావినాశం భరించలేక ఇంతగా హితవు చెప్పాను. సరే. నిన్ను నీవు రక్షించుకో. రాక్షసులతోపాటు లంకను కాపాడుకో. నీకు శుభమగుగాక ! నేను వెళ్ళిపోతున్నాను. ఇంక సుఖంగా ఉండు."
*
[*సులభాః పురుషా* ....ఇదే మాట (ఇదే శ్లోకం ఒక్క మాట కూడా తేడా లేకుండా )వాల్మీకి మహర్షి మారీచుడు కూడా అరణ్యం లో రావణాసురుడికి తెలిపాడు.
అప్పుడు వినలేదు.ఇప్పుడూ వినలేదు.
*
విభీషణుని వెంట వెళ్లిన నలుగురు మంత్రులు అనలుడు, శరభుడు,సంపాతి,ప్రఘసుడు
అన్నట్టుగా ఇదే యుద్ధ కాండ 37 వ సర్గ లో ఉన్నది.]
[06/10, 1:08 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 170*
విభీషణుడు నలుగురు మంత్రులతో కూడి శ్రీ రాముడు ఉన్న సముద్ర (ఉత్తర) తీరంలోకి వచ్చి, ఆకాశంలో నిలబడి ఉండగా వానర వీరులందరు వాళ్లను చూచారు.
అయిదుగురు మేఘాలవలె నల్లగా ఎత్తుగా ఉన్నారు. అందరు ఆయుధాలను దివ్యాభరణాలను ధరించారు.
విభీషణుడు మేరు శిఖరంవలె ఎత్తుగా రత్నకాంతులతో మెరుస్తున్నాడు. ఆకాశంలో వారు కదులుతున్న విద్యుత్తువలె ఉన్నారు." మహా పరాక్రమవంతుడైన సుగ్రీవుడు వారిని చూచి, అనుమానించి హనుమదాదులతో ఇలా అన్నాడు.
"ఈ రాక్షసుడెవ్వడో సర్వాయుధాలను ధరించి, నల్గురు రాక్షసులతో మనను చంపడానికి వస్తున్నాడు.” ఒక్కొక్కరు అనేకాయుధాలను ధరించి ఉండవచ్చు. లేదా ఒక్కొక్కరు ఒక ఆయుధాన్ని ధరించి ఉండవచ్చు అయినా రాముని పట్ల ప్రేమతో ఒక్కొక్కరు అనేకాయుధాలను ధరించినట్లు సుగ్రీవునికి అగుపడి ఉండవచ్చు.
సుగ్రీవుని మాటలను విని వానరులందరు మహాశిలలు, మద్దిచెట్లు ధరించి ఆయనతో అన్నారు. "మహారాజా! మీ ఆజ్ఞ అయితే ఈ దుర్మార్గులను, అల్ప ప్రాణులను ఇప్పుడే హరిస్తాము."
వానరుల మాటలను విని ఆకాశంలోనే ఆగి పోయారు విభీషణాదులు. “ఎలాగు రాముడున్న చోటికి రానే వచ్చాము కదా! తొందరెందుకు?” అనుకొన్నారు. అంతేకాదు వారిభయము తీరేలా తమ విషయాన్ని తెల్పుదామనుకొన్నారు.
*రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః* | *తస్యాహమనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః* ||
"రావణుడనే దుర్మార్గుడు రాక్షసులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన తమ్ముడిని విభీషణుడను నేను.
రావణుడు జనస్థానంలో జటాయువును సంహరించి సీతను అపహరించాడు. ఆమె దీనంగా విలపిస్తూ లంకలో రాక్షస స్త్రీల మధ్య "పెద్దపులుల మధ్య లేడిపిల్లలా” ఉంది.
రావణుని నేను ఎన్నో మారులు అనునయించి 'సీతాదేవిని శ్రీరామునికి అప్పగించు మ"ని తెలిపాను. ఆయన వస్తువును ఆయనకు అప్పగిస్తే రామునితో రణము చేయాల్సిన పనిలేదని చెప్పాను.
మరణమాసన్నమైన వానికి మందులు రుచించనట్లు, మృత్యుచోదితుడైన మా అన్నకు నా మాటలు రుచించలేదు. ఆయన నన్ను నీచంగా నిందించాడు.
*సోహం పరుషిత స్తేన*
*దాసవ చ్చావమానితః*
*త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ* *రాఘవం శరణం గతః*
ఆయనతో ఇక కలిసి ఉండడము వినాశానికి దారి తీస్తుందని గ్రహించి నాభార్యా పిల్లలను, బంధుమిత్రులను అందరిని వదులుకొని శ్రీరామచంద్రస్వామిని ఆశ్రయించ డానికి వెంటనే వచ్చాను.
*సర్వలోకశరణ్యాయ రాఘవాయ మహాత్మనే* , *నివేదయత మాం క్షిప్రం విభీషణ ముపస్థితమ్*
సర్వలోకాలకు శరణునిచ్చేవాడు, మహాత్ముడైన శ్రీరామునికి విభీషణుడు శరణుకోరి వచ్చాడని నివేదించండి"
**
విభీషణుని మాటలు విన్న సుగ్రీవుడు వెంటనే లక్ష్మణ సమేతుడైన రాముని దగ్గరకు వెళ్లి "రావణాసురుని తమ్ముడు విభీషణుడట నలుగురు మంత్రులతో సర్వాయుధాలు ధరించి ఆకాశంలో ఉన్నాడు. ఆయన మిమల్ని శరణువేడడానికి వచ్చాడట".
మీరు ఏదో ఉపాయంతో, ఏదైనా ఆలోచనతో చారులను పంపో, పరీక్షించి విభీషణుని గురించి నిర్ణయము తీసికోవాలి" అని చెప్పి ముందుగా తన ఆలోచన రాముని ముందు ఉంచుతున్నాడు.
"వచ్చినప్పటి నుండి విభీషణాదులు ఆకాశంలోనే నిలిచి ఉన్నారు. వారు కామరూపులు. వారు శత్రువు దగ్గరి నుండి వచ్చారు. వారు కపట వీరులు. మన మధ్యలో చేరి, మనకే ప్రమాదం కల్పిస్తారు.
వారు రావణుని వదలి నిన్ను శరణు కోరి వచ్చామంటున్నారు. కాని వారిని అలా నటించమని రావణుడే పంపి ఉండవచ్చు. రాక్షసులు పాపబుద్ధులు. వారిని విచారించకుండా మన మధ్యకురానిస్తే అవకాశం చూచి గుడ్లగూబ, కాకి పిల్లలను పొట్ట పెట్టుకున్నట్లు" మనలో కొందరు అల్పబలులైన వారిని సంహరించవచ్చు. అందువలన ఆయనను తీవ్రంగా దండించి వధించాలి" అని వాక్యజ్ఞుడైన సుగ్రీవుడు' వాక్యకుశలుడైన శ్రీరామునితో పలికి మౌనం దాల్చాడు.
మహాకీర్తిమంతుడైన శ్రీరాముడు సుగ్రీవుని పలుకులను శ్రద్ధగా పూర్తిగా విని హనుమదాదులతో అన్నాడు.
"విభీషణుని గురించి వానరరాజు యొక్క యుక్తియుక్తాలైన మాటలను మీరందరు వినే ఉంటారు. ఆయన నా శ్రేయస్సును కోరి ఈ మాటలను పలికాడు.
"అయితే ఇంతమందిలో ఆయన అత్యంత సమర్థుడైనప్పటికీ ఆయన ఒక్కని మాటలను మాత్రమే వినడం కాక మీ అందరి అభిప్రాయాలను వినాలను కొంటున్నాను. మీమీ అభిప్రాయాలను స్పష్టంగా మొగమాటం లేకుండా తెలుపండి".
*సుహృదా హ్యర్థ కృచ్ఛేసు యుక్తం బుద్ధిమతా సతా*
*సమర్థేన అపి సందేష్టుం శాశ్వతీం భూతిం ఇచ్ఛాతా*
అప్పుడు వానర ప్రముఖులు తమ అభిప్రాయాలను శ్రీరాముని హితము కోరి జాగ్రత్తగా తెలుపసాగారు.
"రామచంద్రా కృత, అకృత, అకృతాకృతా"లనే మూడు లోకాలలో నీకు తెలియనది లేదు. నీకన్ని తెలిసి కూడ మాపై ప్రేమతో మా అభిప్రాయాలను అడుగుతున్నావు..
రామభద్రా! నీవు సత్యవ్రతుడవు, మహాశూరుడవు, ధార్మికుడవు, దృఢపరాక్రముడవు, చక్కని విమర్శకుడవు అయినా మిత్రులు అభిప్రాయాలకు చాల విలువ ఇచ్చి అడుగు తున్నావు. అందువలన ఈ వానరులలో ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను స్పష్టము చేయండి " అని సుగ్రీవుడు పలికాడు.......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి